వాలీ నూరీ: ‘బాంబు పేలుడులో రెండు కళ్లు పోయాయి, అయినా క్రీడల్లో 21 పతకాలు సాధించా’

ఫొటో సోర్స్, Wali Noori
అది 2009 సంవత్సరం. వాలీ నూరీ పేలుడు వస్తువు (ఎక్స్‌ప్లోజివ్ డివైజ్)పై కాలు పెట్టిన సమయంలో అఫ్గానిస్తాన్‌లో బ్రిటీష్ ఆర్మీకి ఇంటర్‌ప్రిటర్(అనువాదకుడు)గా పనిచేస్తున్నారు.
20 ఏళ్ల వయసులో జరిగిన ఈ ప్రమాదం వాలీ నూరీని శాశ్వతంగా అంధుడిని చేసింది.
కాబూల్‌లో పర్వతాల మధ్యన పరిగెత్తడమంటే వాలీ నూరీకి చిన్నతనంలో ఎంతో ఇష్టం. కానీ, మళ్లీ పరిగెత్తలేనని వాలీ అనుకున్నారు.
బ్రిటన్‌కు వెళ్లిన తర్వాత ఆయన జీవితం ఎలా మారింది? ఏదీ మధ్యలోనే వదలేయకూడదనే పట్టుదల ఆయనను ఎంత వరకు తీసుకొచ్చింది? అనే విషయాలను ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.


ఫొటో సోర్స్, Wali Noori
‘చనిపోతానని తెలిసీ ఒప్పుకున్నా’
‘‘కాబూల్‌లో పెరిగేటప్పుడు, నేను మంచి బాక్సర్‌ను. దృఢంగా ఉండేందుకు రోజూ పరిగెత్తేవాణ్ని. చదువులు పూర్తి చేసిన తర్వాత, యూనివర్సిటీకి వెళ్లాలనుకున్నా. కానీ, మాది పేద కుటుంబం. కుటుంబానికి సాయంగా నిలవాల్సి ఉంది. వాళ్లు ఆకలితో ఉండేవారు. నాన్న పనిచేయలేకపోయేవారు. నాకు అయిదుగురు అక్కాచెల్లెళ్లు, నలుగురు సోదరులు.
అందుకే, 18 ఏళ్ల వయసులోనే ట్రాన్స్‌లేటర్, కల్చరల్ అడ్వయిజర్‌గా బ్రిటీష్ ఆర్మీలో చేరాను. స్కూల్‌లో ఇంగ్లిష్ చదువుకోవడంతో, దానిలో మంచిప్రావీణ్యం ఏర్పడింది. బ్రిటీష్ ఆర్మీకి, అఫ్గాన్ దళాలకు, స్థానిక పౌర సమాజానికి మధ్య మంచి కమ్యూనికేషన్ ఉండేలా సాయం చేయడమే నా ఉద్యోగం.
హెల్మాండ్ ప్రావిన్స్‌కు వెళ్తావా అని నన్ను అడిగారు. అక్కడికి వెళితే ఏ క్షణంలోనైనా చనిపోతానని తెలిసినా ఒప్పుకోవాల్సి వచ్చింది. అదొక నరకంలాంటిది. ఆకస్మిక దాడులు జరిగేవి. నిత్యం ఎంతోమంది ప్రజలు చనిపోయే వారు. కానీ, నాకు భయం వేసేది కాదు.
పెట్రోలింగ్ సమయంలో నేను ఐఈడీ (ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్-పేలుడు వస్తువు)పై కాలు పెట్టాను. ఒక్కసారిగా గాలిలోకి ఎగిరిపడ్డాను. అసలు చనిపోతానుకున్నా. నా ముఖమంతా పచ్చడి అయిపోయింది. 28 పళ్లు పోగొట్టుకున్నా. శ్వాస తీసుకోలేకపోయా. నా గొంతు కింద చేయి పెట్టుకుని, పేలుడు పదార్థపు ముక్కను బయటికి తీశా. ఆ సమయంలో నాకేమీ కనిపించలేదు. కాబూల్‌లోని ఆర్మీ ఆస్పత్రిలో రెండు వారాలపాటు కోమాలోనే ఉన్నా. అప్పటికి నేను ఆర్మీలో చేరి రెండేళ్లు అయ్యింది.’’ అని వాలీ నూరి వెల్లడించారు.

ఫొటో సోర్స్, Wali Noori
‘నా జీవితం అయిపోయిందనుకున్నా’
‘‘నేను బతుకుతానని డాక్టర్లకు కూడా అనిపించలేదు. కోమాలో నుంచి లేచినప్పుడు, మాట్లాడలేకపోయాను. నా పేరు రాసి చూపించాను. దీంతో, నా స్నేహితుడికి ఫోన్ చేశారు. జరిగిన విషయాన్ని అతను నా కుటుంబానికి తెలిపాడు.
అమ్మానాన్న వచ్చినప్పుడు, వారు నన్ను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎలాగోలా లేచి, వారికోసం కాస్త నవ్వాను. కానీ, వాళ్లను చూడలేకపోయా, మాట్లాడలేకపోయా.
నన్ను బాగ్రామ్ ఆస్పత్రి ఎయిర్‌బేస్‌కు తరలించారు. అక్కడే అమెరికా వైద్యులు నా ముఖం మీద గాయాలకు, దెబ్బలకు చికిత్స చేశారు. మెడ నుంచి పంపించిన ట్యూబ్ ద్వారా శ్వాస తీసుకున్నా. నేను అక్కడే నెల పాటు ఉన్నా. ఆ తర్వాత నా కంటి చూపు వచ్చేందుకు అవసరమైన చికిత్స కోసం భారత్, పాకిస్తాన్‌లోని ఆస్పత్రులకు తిరిగాను. కానీ, సాధ్యం కాలేదు.
ఇదంత తేలిక కాదు. చీకటి రాత్రులను గడిపాను. నాకు పరిగెత్తడం ఇష్టం. కానీ, పరిగెత్తే రోజులు ఇక ఉండవు. నేను ఏకాకిని అనిపించింది. అఫ్గానిస్తాన్‌లో నా కుటుంబంతో కలిసి ఇక నా మిగిలిన జీవితాన్ని ఇలా గడపాల్సిందే. కానీ అది ఎలాగో తెలియదు. నన్నెవరూ పెళ్లి చేసుకోరనే ఆలోచనలు వచ్చేవి.
కానీ, 2012లో నాకు అరేంజ్డ్ మ్యారేజ్ అయింది. తొలి రోజు నుంచే నా భార్య నాకు అన్నివిధాలా తోడుండేది. నేను పట్టుకుని నడిచే కర్రను పక్కన పడేసింది. నేనే మీకు ఊతకర్రను అని చెప్పింది. ఎప్పుడైనా బాధగా అనిపించినప్పుడు, ‘ మీకు నేనున్నా’ అనేది. మాకు ముగ్గురు పిల్లలు. మేమెంతో అదృష్టవంతులం.’’ అని చెప్పారు వాలీ.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, Wali Noori
‘ప్రిన్స్ హ్యారీని కలవడం అదృష్టం’
‘‘అఫ్గానిస్తాన్‌లో నివసిస్తున్నప్పుడు పనిచేయలేకపోయా. బ్రిటీష్ ఆర్మీ నాకు ఏడాది జీతం ఇచ్చింది. కానీ, నేను చాలా ఇబ్బంది పడ్డాను. దివ్యాంగులకు అవసరమైన సౌకర్యాలను ఈ దేశంలో ఏర్పాటు చేయలేదు.
కుటుంబంతో కలిసి యూకేకు వచ్చేందుకు నేను అర్హుడినని 2014లో బ్రిటీష్ ప్రభుత్వానికి తెలిపాను. దీనిపై నిర్ణయం వెలువడేందుకు రెండేళ్లు పట్టింది. ఇంగ్లాండ్‌లోని కోల్చెస్టర్ నగరానికి వెళ్లిన తర్వాత, ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు.
ఇక్కడి ప్రజలు, వాతావరణం నాకెంతో నచ్చింది. నా రన్నింగ్ క్లబ్ కోల్చెస్టర్ హారియర్స్‌లో మంచి స్నేహితులున్నారు. మళ్లీ పరిగెత్తగలనని నాకనిపించింది. ఎందుకంటే, వారి వద్ద గైడ్ రన్నర్స్ ఉన్నారు. నా స్వేచ్ఛ నాకు మానసిక ఆరోగ్యాన్ని తిరిగి ఇచ్చింది. గాయాల వల్ల తీవ్రమైన తలనొప్పి వచ్చేది. కానీ, రన్నింగ్‌కు వెళ్లినప్పుడు, తలనొప్పిని మర్చిపోయేవాడిని.
ఇన్విక్టస్ గేమ్స్‌కు ఎంపిక కావడానికి నేను అయిదేళ్లు వేచిచూడాల్సి వచ్చింది. గత ఏడాది సెప్టెంబర్‌లో యూకే తరఫున ప్రాతినిధ్యం వహించడాన్ని నేను చాలా గర్వంగా భావిస్తున్నా. 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్లు, 1500మీటర్లలో నాలుగు గోల్డ్ మెడల్స్ గెలుపొందాను. ప్రిన్స్ హ్యారీని, మేఘన్‌ను కలిశాను. వారు చాలా ఆప్యాయంగా, కలివిడి గల మనుషులు.
హ్యారీ నా చేతిని పట్టుకున్నారు. ఆయనెవరో నాకు తెలియదు. ఎవరు? అని అడిగాను. ‘నేను ప్రిన్స్ హ్యారీ’ అన్నారు. చాలా సంతోషమేసింది. నా జీవితంలో ఇదొక అద్భుతమైన క్షణం’’ అని అన్నారు వాలీ నూరి.

‘అంధత్వానికి తలొగ్గలేదు’
రన్నింగ్‌లో 21 పతకాలను, స్విమ్మింగ్‌లో 3 పతకాలను గెలిచాను. జీవితంలో ఎప్పుడూ ముందుకెళ్లాలని నేను కోరుకుంటాను. వెనక్కి తిరిగి చూడను.
నన్ను నేను మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తుంటాను. ఏదో ఒకరోజు పారాలింపిక్స్‌లో పాల్గొనాలన్నది నా కల. ఈసారి తుది గడువును మిస్ అయ్యాను. కానీ ఏదో ఒకరోజు కచ్చితంగా పాల్గొంటాను.
2019లో పూర్తి చేసిన ఆరు కీలక మారథాన్లను కూడా ప్రస్తుతం పూర్తి చేయాలనుకుంటున్నా. నా జీవితంపై ఒక పుస్తకం రాశాను. 15 ఏళ్ల కిందట నేను అంధుడిగా మారిన రోజు, అంటే సెప్టెంబర్ 12న దాన్ని ప్రచురిస్తాం.

ఫొటో సోర్స్, Wali Noori
నేను స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లి నా జీవిత కథను వాళ్లకు చెబుతుంటాను. యుక్రెయిన్‌లో గాయపడిన కొందరు సైనికులతో నేను మాట్లాడాను.
ఇలా ప్రసంగించినందుకు డబ్బు వస్తే, వాటిని వితంతువులకు, అనాధలకు సేవ చేసేందుకు అఫ్గానిస్తాన్ పంపిస్తుంటాను.
బ్రిటీష్ ఆర్మీలో పనిచేయడం వల్లే నాకు ఇలా జరిగిందన్న బాధ లేదు. ఒకప్పుడు నా జీవితం ఎంతో కష్టంగా ఉండేది. కానీ, ఇప్పుడు ఎంతో బాగుంది.
నా అంధత్వానికి నేను తలొగ్గలేదు. నేనెప్పుడూ ప్రజలకు స్ఫూర్తిదాయకంగా నిలవాలనుకున్నా. ఉన్నతమైన వాటిని సాధించడానికి అంగవైకల్యం అడ్డంకి కాదని చూపించాలనుకున్నా.’’ అని అన్నారు వాలీ నూరీ.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














