పారిస్ ఒలింపిక్స్ 2024 ప్రారంభ వేడుకలకు కొన్ని గంటల ముందు హైస్పీడ్ రైల్వే లైన్లపై దాడులు, అసలేం జరిగిందంటే..

ఫొటో సోర్స్, Reuters
విశ్వక్రీడా సంబరం పారిస్ ఒలింపిక్స్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్న వేళ ఫ్రాన్స్‌లో హైస్పీడ్ రైళ్ళను లక్ష్యంగా చేసుకుని పలుచోట్ల దాడులు జరిగాయి. పలు రైలు మార్గాలలో మంటలు చెలరేగాయి.
రైల్వే లైన్లను ధ్వంసం చేయడమే లక్ష్యంగా పథకం ప్రకారం ఈ దాడులు జరిగాయని ఫ్రాన్స్ ప్రధాని గాబ్రియెల్ అట్టల్ చెప్పారు.
ఈ దాడుల వల్ల రెండున్నర లక్షల మంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారని ఫ్రాన్స్ ప్రభుత్వ రైలు కంపెనీ ఎస్ఎన్‌సీఎఫ్ తెలిపింది.
దుండగులు రైల్వే నెట్‌వర్క్ వైర్లను కత్తిరించారని, దీనివల్ల రైళ్ళ రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని, కత్తిరించిన వైర్లకు మరమ్మతులు చేస్తున్నామని అధికారులు చెప్పారు.
పారిస్ ఒలింపిక్స్ ఈ రోజు (26.07.2024) నుంచి ఆగస్టు 11వరకు జరగనున్నాయి.


ఫొటో సోర్స్, Reuters
తమ హైస్పీడు రైల్వే నెట్‌వర్క్‌ను లక్ష్యంగా చేసుకోవడం వల్ల వ్యవస్థ స్తంభించిపోయిందని ఎస్ఎన్‌సీఎఫ్ పేర్కొంది. పారిస్‌కు పశ్చిమ, ఉత్తర, తూర్పు ప్రాంతాలలోని పలు ఇంటర్‌సిటీ హైస్పీడ్ రైల్ నెటవర్క్‌లను దుండగులు లక్ష్యంగా చేసుకున్నారని ఆ సంస్థ తెలిపింది.
గత రాత్రి కూడా అట్లాంటిక్, ఉత్తర, తూర్పు హైస్పీడ్ రైల్వే లైన్లలో విధ్వంసం జరిగిందని ఎస్ఎన్‌సీఎఫ్ పేర్కొంది.
ఈ చర్యలను ఫ్రాన్స్ రవాణా మంత్రి పాట్రిడ్జ్ వెర్జెరైట్ తీవ్రంగా ఖండించారు. ‘‘గతరాత్రి అనేక టీజీవీ (ఇంటర్‌సిటీ రైల్ లైన్స్ లక్ష్యంగా) లైన్లలో దురుద్దేశపూరిత ఘటనలు జరిగాయి, దీని ప్రభావం వల్ల వారాంతపు రైళ్ళ రాకపోకలపై పడుతుంది’’ అని తెలిపారు.
‘‘ఈ దుశ్చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను’’ అని వెర్జెరైట్ చెప్పారు. ‘‘ఇది అనేక మంది ఫ్రెంచ్ ప్రజల ప్రయాణ ప్రణాళికను దెబ్బతీస్తుంది. సాధ్యమైంత త్వరగా సర్వీసులను పునరుద్ధరించేందుకు ఎస్ఎన్‌సీఎఫ్ సిబ్బంది కృషి చేస్తున్నారు’’ అని చెప్పారు.

ఫొటో సోర్స్, Courtesy of Vald’Yerre municipality

ఫొటో సోర్స్, Getty Images
పారిస్‌లోని సెంట్రల్ పార్ట్స్‌ను దిగ్బంధించారు. మెట్రో స్టేషన్లను మూసివేశారు. ఒలింపిక్ గేమ్స్ ప్రారంభం వేళ భద్రతపై భరోసాను ఇవ్వడానికి వేలాది మంది పోలీసులు, భద్రతాదళాలను మోహరించారు.
అయితే, దుండగులు ఫ్రాన్స్ రైల్ నెట్‌వర్క్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. రాజధాని పారిస్‌కు దూరంగా ఐదు ప్రాంతాల్లో దాడులు జరిగాయని అధికారులు చెప్పారు.
దుండగులు కనీసం ఐదు సిగ్నల్ బాక్సులను, ఎలక్ట్రికల్ వైరింగ్‌ను శుక్రవారం ఉదయం 1 గంట నుంచి సాయంత్రం 5.30 గంటల నడుమ ధ్వంసం చేశారని ఫ్రెంచ్ రైల్ కంపెనీ ఎస్ఎన్‌సీఎఫ్ తెలిపింది.
ఒలింపిక్స్ ప్రారంభానికి ముందు రైల్వే లైన్లను లక్ష్యంగా చేసుకోవడాన్ని క్రీడాకారులు, క్రీడలపై జరిగిన దాడిగా ఫ్రాన్స్ క్రీడా మంత్రి అభివర్ణించారు.
పారిస్‌ను ఉత్తర, తూర్పు, నైరుతి వైపు కలిపే రైలు మార్గాల్లో సిగ్నల్ బాక్సులకు నిప్పు పెట్టినట్లు ఎస్ఎన్‌సీఎఫ్ తెలిపింది.
దెబ్బతిన్న కేబుళ్ళను ఒకదాని తరువాత ఒకటి బాగుచేస్తామని ఎస్ఎన్‌సీఎప్ తెలిపింది.
దాడులకు బాధ్యులను గుర్తించి శిక్షించేందుకు పోలీసులు, ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రయత్నిస్తున్నట్టు ఫ్రెంచ్ ప్రధానమంత్రి గాబ్రియెల్ అట్టల్ చెప్పారు.
దాడుల కారణంగా ఏర్పడిన అంతరాయాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని ఎస్ఎన్‌సీఎఫ్ అనుబంధ సంస్థ అధిపతి క్రిస్టోఫ్ ఫినిచెట్ తెలిపారు.
రైల్వే నెట్‌వర్క్‌లో అంతరాయం వల్ల ఒక్క రోజులోనే 2.5 లక్షల మంది ప్రయాణికులపై ప్రభావం పడిందని, ఈ సంఖ్య ఈ వారాంతానికి 8 లక్షలకు చేరుకోవచ్చని చెప్పారు.
మరోవైపు, రైల్వే వ్యవస్థపై జరిగిన దాడులపై అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు స్పందించారు. ఈ సందర్భంగా మీడియాతో థామస్ బాచ్ మాట్లాడుతూ.. ‘‘నేను దేని గురించి బాధపడటం లేదు. ఫ్రెంచ్ ప్రభుత్వంపై మాకు పూర్తి నమ్మకం ఉంది’’ అని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఒలింపిక్స్‌తో సంబంధం ఉందా?
ఈ దాడులకు ఒలింపిక్స్‌తో సంబంధం లేదంటే నమ్మడం కష్టమని పారిస్‌లోని బీబీసీ ప్రతినిధి హగ్ షోఫీల్డ్ అన్నారు.
ఈ దాడులకు బాధ్యత వహిస్తున్నట్లు ఇప్పటిదాకా ఏ గ్రూపు ప్రకటించుకోలేదు. కానీ వీటిని ఒలింపిక్స్ నుంచి వేరు చేసి చూడలేం.
‘‘రైల్ నెట్‌వర్క్‌ను ధ్వంసం చేయాలనే లక్ష్యతో రాత్రంతా అనేక ప్రాంతాలలో దాడులు జరిగాయి’’ అని ఎస్ఎన్‌సీఎఫ్ పేర్కొంది.
పారిస్ తూర్పు, పడమర, ఉత్తర ప్రాంతాలలోని టీజీవీ రైల్ మార్గంలో మూడుచోట్ల మంటలు చెలరేగాయి.
అయితే లియోన్‌కు వెళ్ళే మార్గంలో నాలుగవ దాడి విఫలమైంది.
ఈ దాడుల కారణంగా టీజీవీ రైళ్ళను మరో మార్గంలోకి మళ్ళించారు. దీనివల్ల అనేక రైళ్ళు రెండు గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరికొన్ని రైళ్ళను రద్దు చేశారు.
ఈ వారాంతంలోగా మరమ్మతులు పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు.

ఫొటో సోర్స్, Getty Images
ఓ పక్క ఒలిపింక్ ప్రారంభ వేడుకకు హాజరయ్యేందుకు, మరోపక్క వేసవి సెలవుల వల్ల బయటి ప్రాంతాలకు వెళ్ళేవారితో రైల్వేస్టేషన్లు కిక్కిరిసిపోయాయి.
సెన్ నదిలో జరిగే ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలో 10 వేల మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు.
వీరితోపాటు 30 వేల మంది ప్రేక్షకులు వస్తారని అంచనా వేస్తున్నారు.
వీరిలో వీఐపీలు, ఇతర ప్రముఖులు కూడా ఉన్నారు.
భారత కాలమానం ప్రకారం ఒలింపిక్స్ ప్రారంభ వేడుక రాత్రి (26.07.2024) 11గంటలకు మొదలవుతుంది.
ఈ వేడుకను 45 వేల మంది భద్రతా సిబ్బంది పర్యవేక్షిస్తారు.
వీరితోపాటు మరో 10 వేల మంది సైన్యం, 22 వేల మంది ప్రైవేటు సెక్యూరిటీ గార్డులను కూడా నియమించారు.
ప్రస్తుత గందరగోళ పరిస్థితుల నడుమ అవకాశం ఉంటే ప్రయాణికులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని ఫ్రెంచ్ ప్రభుత్వ రవాణా కంపెనీ ఎస్ఎన్‌సీఎఫ్ కోరింది.
రద్దయిన ప్రయాణాలకు సంబంధించిన టిక్కెట్ల డబ్బును తిరిగి ఇస్తామని తెలిపింది.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














