‘కులం వేరని నా భర్తను చంపేశారు, కత్తిపోట్ల తరువాత నా చేయి పట్టుకొని ఏడుస్తూ చనిపోయారు’

విద్య, అమిత్‌

ఫొటో సోర్స్, SUMIT SALUNKE

ఫొటో క్యాప్షన్, విద్య, అమిత్‌
    • రచయిత, శ్రీకాంత్ బంగాలే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

“నా భర్త నా చేయి పట్టుకుని ఏడుస్తూ, నా కళ్ల ముందే చనిపోయారు. నా జీవితం ముక్కలైపోయింది’’ అని విద్యా సాలుంకే కన్నీరు పెట్టుకుంటూ తన బాధను వ్యక్తం చేశారు. రెండు నెలల కిందటే ఆమెకు వివాహమైంది.

మహారాష్ట్రలో ఛత్రపతి శంభాజీనగర్‌లోని ఇందిరానగర్ ప్రాంతంలో విద్య ఉంటున్నారు. భర్త మృతితో తీవ్రంగా రోదిస్తున్న విద్యను బంధువులు ఓదారుస్తున్నారు.

జులై 26న ఆమె భర్త అమిత్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. పెళ్లి సమయంలో ఇంటి బయట వేసిన మండపం కూడా ఇంకా అలాగే ఉంది.

విద్యా కీర్తి షాహి, అమిత్ సాలుంకేలు 2024 మే 2న ప్రేమ వివాహం చేసుకున్నారు.

"మా పెళ్లిని మా అమ్మానాన్నలు, కజిన్స్ వ్యతిరేకించారు. మా కులం వేరు, అమిత్ కులం వేరు. అందుకే వ్యతిరేకించారు" అని విద్య చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
విద్య, అమిత్

ఫొటో సోర్స్, SUMIT SALUNKE

ఫొటో క్యాప్షన్, విద్యా కీర్తి షాహి, అమిత్ సాలుంకేలు 2024 మే 2న ప్రేమ వివాహం చేసుకున్నారు.

అసలేం జరిగింది?

కుటుంబ సభ్యులు కాదనడంతో విద్య, అమిత్‌లు పుణె వెళ్లి పెళ్లి చేసుకున్నారు.

వారిద్దరూ పెళ్లి తరువాత నెల రోజులు పుణేలోనే ఉన్నారు. ఆ సమయంలో తమకు బెదిరింపులు కూడా వచ్చాయని విద్య తెలిపారు.

"మీరు ఎక్కడ కనిపిస్తే అక్కడే ఇద్దరినీ చంపేస్తామని బెదిరించారు. అందుకే దూరంగా ఉన్నాం. అయితే, అక్కడ మాకేమైనా జరిగితే ఎవరికీ తెలియదు కాబట్టి ఇక్కడికి వచ్చాం’’ అని చెప్పారు విద్య.

విద్యా సాలుంకే, ఛాయా సాలుంకే, మురళీధర్ సాలుంకే

ఫొటో సోర్స్, KIRAN SAKALE

ఫొటో క్యాప్షన్, మురళీధర్ సాలుంకే, ఛాయ, విద్య

ఆన్‌లైన్ గేమ్ ఆడడానికి పిలిచారు.. లైట్లు ఆపి పొడిచి చంపేశారు

వివాహం అయిన నెల తర్వాత అమిత్, విద్య శంభాజీనగర్‌కు తిరిగి వచ్చారు. ఇద్దరినీ అమిత్ కుటుంబ సభ్యులు స్వాగతించారు.

అనంతరం సాలుంకే కుటుంబం అమిత్, విద్యలకు మళ్లీ వివాహం చేసింది.

కొన్నిరోజుల వరకు అంతా సాఫీగానే ఉంది. అయితే జులై 14న అమిత్ ఇంట్లో ఉన్నప్పుడు అతని స్నేహితుడి నుంచి ఒక కాల్ వచ్చింది, ఆ తర్వాత అంతా మారిపోయింది.

“అమిత్ స్నేహితుడొకరు ఆన్‌లైన్ గేమ్ ఆడటానికి ఆయన్ను రావి చెట్టు దగ్గరకు రమ్మన్నారు. ఆయన అక్కడకు వెళ్లారు, తరువాత లైట్ ఆర్పేశారు. అప్పుడు అప్పాసాహెబ్ కీర్తిషాహి వెనుక నుంచి వచ్చి అమిత్ కడుపులో కత్తితో పొడిచారు. ఆయనను మొత్తం 8 సార్లు పొడిచారు. అమిత్ కింద పడ్డాక కూడా వాళ్లు వదల్లేదు’’ అని చెప్పారు విద్య.

“నా భర్త రక్తపు మడుగులో పడిపోయారు. వెంటనే ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాం’’ అని అన్నారు.

అమిత్ ఇంటి నుంచి కొన్ని అడుగుల దూరంలోనే సంఘటన జరిగిన ప్రాంతంలో రావి చెట్టు ఉంది. అమిత్ 12 రోజుల పాటు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందారు. జులై 25న మృతి చెందారు.

ఇందిరానగర్

ఫొటో సోర్స్, KIRAN SAKALE

ఫొటో క్యాప్షన్, అమిత్‌ను ఈ రావిచెట్టు దగ్గరే హత్య చేశారు.

పోలీసులు ఏమంటున్నారు?

ఛత్రపతి శంభాజీనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

‘’జులై 14న హత్యాయత్నం కేసు నమోదు చేశాం, తర్వాత అమిత్ మృతితో హత్య కేసుగా మార్చాం. దీని వెనుక ఇద్దరు నిందితులు ఉన్నారు, వారిని పట్టుకునేందుకు రెండు బృందాలు పనిచేస్తున్నాయి’’ అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ నవనీత్ కవంత్ తెలిపారు.

“ఈ కేసులో యువకుడు, యువతి కులాంతర వివాహం చేసుకున్నారు. వారి కుటుంబాల మధ్య విభేదాలు ఎంతవరకు ఉన్నాయనేదీ విచారణ చేస్తున్నాం’’ అని డీసీపీ అన్నారు.

“ప్రభుత్వం మాకు మద్దతుగా నిలవకపోతే, మేం ఎవరికి ఫిర్యాదు చేయాలి? న్యాయం ఎవరిని అడగాలి? మేం అతన్ని కోల్పోయాం” అని అమిత్ తల్లి ఛాయా సాలుంకే అన్నారు.

‘’చట్టం ప్రకారం ప్రేమ వివాహం చెల్లుతుంది. ఎవరినైనా పెళ్లి చేసుకునే హక్కు అతనికి ఉంది. ఈ హక్కును వేరేవాళ్లు కాదంటే ప్రభుత్వం వల్ల ఉపయోగం ఏమిటి?’’ అని ఆమె ప్రశ్నించారు.

ఈ కేసులో నిందితులకు మరణశిక్ష విధించాలని సాలుంకే కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

“నా భర్తను చంపినవాళ్ళు స్వేచ్ఛగా తిరిగితే అర్థం ఏమిటి? నా భర్త చనిపోయారు. నిందితులు బహిరంగంగా తిరుగుతుంటే ఇక ప్రేమ పెళ్లి చేసుకునేందుకు ఎవరూ సాహసించరు' అని విద్య అన్నారు.

జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్

ఫొటో సోర్స్, SHRIKANT BANGALE

'పోలీసులే ఆశ్రయం కల్పించాలి’

కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్లు, పరువు హత్యలకు భయపడే జంటలకు పోలీసులు అండగా ఉంటూ ఆశ్రయం కల్పించాలని అంధశ్రద్ధ నిర్మూలన్ సమితి (ఏఎన్ఐఎస్) సూచించింది.

“ప్రభుత్వం త్వరలో అటువంటి సురక్షిత గృహాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఆరు నెలల వరకు, జంటకు అతి తక్కువ ధరలకు వసతి, ఆహారం అందిస్తారు. బంధువులకు కౌన్సెలింగ్‌ ఇస్తారు’’ అని జాట్ పంచాయత్ మూత్మతి అభియాన్‌కు చెందిన కృష్ణ చంద్‌గూడే తెలిపారు.

“శంభాజీనగర్‌లో నియో-బౌద్ధ వర్గానికి చెందిన ఒక అమ్మాయి, గాంధారి వర్గానికి చెందిన అబ్బాయి ప్రేమ వివాహం చేసుకున్నారు. దీంతో ఆగ్రహించిన యువతి బంధువులు యువకుడిని హత్య చేశారు. డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ కులాంతర వివాహమే కుల నిర్మూలనకు పరిష్కారమని చెప్పారు. కానీ సమాజం అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తోంది” అని చంద్‌గూడే అన్నారు.

అమిత్ ఇల్లు

ఫొటో సోర్స్, KIRAN SAKALE

ఫొటో క్యాప్షన్, అమిత్ సాలుంకే ఇల్లు

‘కులానికి అతీతంగా ఆలోచించడం లేదు’

“కులం అనేది మన మనస్సులలో పాతుకుపోయింది. మనం కులానికి అతీతంగా ఆలోచించడం లేదు. అందుకే ఇలాంటివి జరుగుతున్నాయి" అని ఛత్రపతి శంభాజీనగర్‌కు చెందిన సామాజిక కార్యకర్త మంగళ్ ఖివాన్‌సారా అన్నారు.

"చట్టం కఠినంగా ఉంది, కానీ ప్రజలు భయపడటం లేదు. ఎందుకంటే సంఘటన జరిగిన వెంటనే శిక్ష పడదు. అప్పటికి, మరొక సంఘటన జరుగుతుంది. మొదటిది మర్చిపోతారు’’ అని ఖివాన్‌సారా అన్నారు.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)