ట్రక్కు క్లీనర్లుగా అవతారమెత్తిన ఏడీజీ, డీఐజీ, అర్ధరాత్రి 1.30 గంటలకు ఏం జరిగిందంటే..

ఫొటో సోర్స్, ANI
- రచయిత, సయిద్ మోజిజ్ ఇమామ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఉత్తరప్రదేశ్ పోలీసులు మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి పోలీసులు పోలీసులపైనే చర్యలు తీసుకున్నారు.
వారణాసి ఏడీజీ, ఆజమ్‌గఢ్ డీఐజీ సంయుక్తంగా బలియా జిల్లాలోని ఓ చెక్‌పోస్ట్ దగ్గర ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నార్హి పోలీసు స్టేషన్‌కు చెందిన పోలీసులు అక్కడ అక్రమంగా నెలకు కోటిన్నర రూపాయల దాకా వసూళ్లు చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది.
ఈ కేసులో ఇద్దరు పోలీసులతో సహా 22 మందిని ఏడీజీ బృందం అరెస్ట్ చేసింది. మరికొందరు పరారీలో ఉన్నారు.
ఈ పోలీసులు ట్రక్కుల డ్రైవర్ల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.
బలియాలోని బరౌలీ సరిహద్దులో పోలీసులతో పాటు చాలా మంది ఏజెంట్లు ట్రక్కులను ఆపి, వాటిని తనిఖీ చేసి, ఆ తర్వాత డబ్బులు తీసుకుని ట్రక్కులను వదిలేస్తున్నారని వెల్లడైంది. దాంతో, ఉత్తరప్రదేశ్ పోలీసులపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు.
‘‘ఉత్తరప్రదేశ్‌లో సరికొత్త ఆట మొదలైంది. ఇన్నిరోజులు ఇది ‘దొంగ-పోలీసు’గా ఉండేది. కానీ, బీజేపీ పాలనలో ‘పోలీసు-పోలీసు’ ఆటగా మారింది’’ అని అన్నారు.
అవినీతిని పారదోలేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర చర్యలు తీసుకోవాలని కోరారు.
తాజా పరిణామాల అనంతరం బలియా జిల్లాకు కొత్త ఎస్పీని నియమించింది ప్రభుత్వం.

ఫొటో సోర్స్, X/ADGZONEVARANASI
బరౌలీ సరిహద్దులో ఏం చేశారు?
బిహార్‌లోని బక్సర్ ప్రాంతం నుంచి వచ్చే ట్రక్కులు బరౌలీ సరిహద్దు దాటి ఉత్తరప్రదేశ్‌లోకి రావాల్సి ఉంటుంది. కానీ, అంతకుముందే పోలీసులు ట్రక్కులను ఆపుతారు.
ఒక్కో ట్రక్కు దగ్గర ఎంత డబ్బు తీసుకోవాలో ముందుగానే నిర్ణయిస్తారు. పోలీసులకు ఈ డబ్బులు చెల్లించిన తర్వాతే ట్రక్కులు సరిహద్దు దాటగలుగుతాయి. ప్రతి రోజూ దాదాపు 1,000 ట్రక్కులు ఈ సరిహద్దు దాటుతాయని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
‘‘బరౌలీ సరిహద్దులో ఈ అక్రమ దందా కొత్త కాదు. వాళ్లు ఇప్పుడు దొరికారు అంతే..’’ అని ఆజమ్‌గఢ్‌కు చెందిన స్థానిక జర్నలిస్ట్ మానవ్ శ్రీవాస్తవ చెప్పారు.
‘‘ఇసుక, మద్యం, జంతువులను ఈ సరిహద్దు గుండా అక్రమంగా రవాణా చేస్తుంటారు. కానీ తొలిసారి పెద్ద సంఖ్యలో అరెస్ట్‌లు జరిగాయి’’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక పోలీసు అధికారి చెప్పారు.
సరిహద్దుల దగ్గర ఉండే పోలీసు స్టేషన్లు ఇప్పటికే అపఖ్యాతి పాలయ్యాయి. ఈ అక్రమ దందా వెలుగులోకి వచ్చిన తర్వాత, వారిపై చర్యలు తీసుకున్నామని ప్రభుత్వం తెలిపింది.

ఫొటో సోర్స్, X/DIGAZAMGARH
క్లీనర్‌గా ట్రక్కు ఎక్కి ఏడీజీ, డీఐజీ ఆకస్మిక తనిఖీలు..
వారణాసి జోన్ ఏడీజీ పీయూష్ మోర్దియా, డీఐజీ వైభవ్ కృష్ణ రాత్రి 1.30 ప్రాంతంలో క్లీనర్లుగా ట్రక్కు ఎక్కి, తమ బృందంతో యూపీ-బిహార్ సరిహద్దులోని బరౌలీ చెక్‌పోస్టు వద్దకు చేరుకున్నారు.
పోలీసులు ఆ ట్రక్కును ఆపి డబ్బులు డిమాండ్ చేశారు. ఆ పోలీసులను, మరికొందరు ఏజెంట్లను ఏడీజీ బృందం పట్టుకుంది.
కొందరు పోలీసులు, ఇన్‌స్పెక్టర్లు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నించారు.
నార్హి పోలీసు స్టేషన్ ఎస్‌హెచ్ఓ తప్పించుకున్నారు. కానీ, కొంతమంది పట్టుబడ్డారు. నార్హి, కోరంటాదిహ్ ఎస్‌హెచ్ఓలను సస్పెండ్ చేశారు.
ఈ అక్రమ దందా నిర్వహిస్తున్న రాకెట్‌ను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ఎన్నో రోజుల నుంచి కసరత్తు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
బక్సర్ వైపు నుంచి వచ్చే ట్రక్కుల డ్రైవర్ల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని డీజీపీ ప్రశాంత్ కుమార్‌కు ఫిర్యాదు వెళ్లింది.
ఆ తర్వాత కింది స్థాయి అధికారులతో జరిపించిన విచారణలో అది నిజమని తెలిసింది. ఆ తర్వాత ఏడీజీ నేతృత్వంలో 24 మంది సభ్యుల బృందం దాడులు జరిపింది.
గత కొన్ని నెలల వసూళ్లకు సంబంధించి కీలక ఆధారాలున్న రెండు నోట్ బుక్‌లు దొరికాయి.
ఈ నోట్ బుక్‌లలోని వివరాలను పూర్తిగా విశ్లేషిస్తే, చాలామంది పేర్లు బయటికి వచ్చే అవకాశం ఉంది.

ఫొటో సోర్స్, ANI
ఇద్దరు పోలీసు అధికారులతో సహా 22 మందిని ఏడీజీ బృందం అరెస్ట్ చేసినట్లు పోలీస్ శాఖ తెలిపింది.
ఈ కేసులో నార్హి పోలీసు స్టేషన్ ఇన్-ఛార్జ్ పన్నెలాల్‌తో సహా 9 మంది పోలీసులు సస్పెండ్ అయ్యారు. వారందరిపై కేసు నమోదైంది.
ఈ దాడులు చేసిన ఏడీజీ బృందంలో ఆజమ్‌గఢ్ డీఐజీ వైభవ్ కృష్ణ కూడా ఉన్నారు.
‘‘సమాచారం అందిన తర్వాత దాన్ని ధ్రువీకరించుకున్నాం. ఈ విషయం నిజమని తెలిసిన తర్వాతనే దాడుల నిర్ణయం తీసుకున్నాం. ఈ నిర్ణయాన్ని మేం గోప్యంగా ఉంచాం’’ అని వైభవ్ కృష్ణ తెలిపారు.
బలియా జిల్లా ఎస్పీకి కూడా ఈ ఆపరేషన్ గురించి ముందుగా చెప్పలేదని, చిన్న క్లూ కూడా ఇవ్వలేదని చెప్పారు.
దాడి అనంతరం స్థానిక ఎస్పీకి సమాచారం అందడంతో, ఆయన అక్కడికి చేరుకున్నారు.
అక్రమ వసూళ్ల కేసులో నిందితులుగా ఉన్న పోలీసుల ఆస్తులపై విజిలెన్స్ విచారణ జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఫిర్యాదుదారుడిగా కాన్పూర్ పోలీసు స్టేషన్‌కు వచ్చిన మాజీ డీజీపీ విక్రమ్ సింగ్
ఇలాంటి దాడులు జరపడం ఇదే తొలిసారి కాదు. పోలీస్ శాఖపై ఓ కన్నేసి ఉంచేందుకు అంతకుముందు కూడా పోలీసు అధికారులు ఇలాంటి ఆకస్మిక దాడులు జరిపారు.
యూపీ పోలీసు విభాగానికి చెందిన మాజీ డీజీపీ విక్రమ్ సింగ్ తన పదవీ కాలంలో ఒకసారి లఖ్‌నవూ నుంచి శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో కాన్పూర్ వచ్చి, ఆటోలో పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారు.
రాతపూర్వక రిపోర్టు ఇచ్చేందుకు ఆయన ప్రయత్నించారు. కానీ, డ్యూటీలో ఉన్న అధికారి రిపోర్టు రాసేందుకు అంగీకరించలేదు. ఆ తర్వాత పలువురు పోలీసు అధికారులపై చర్యలు తీసుకున్నారు.
డీజీపీగా పదవిలో ఉన్న సమయంలో, పోలీసుల్లో అవినీతిని రూపు మాపేందుకు ఆయన పలు చర్యలు తీసుకున్నారు.
మీరట్‌లో కూడా ట్రక్కుల్లో అక్రమంగా డబ్బులు తరలిస్తున్న వారిపై విక్రమ్ సింగ్ చర్యలు తీసుకున్నారు.
ప్రతి సరిహద్దులోనూ ఇలాంటి చర్యలు చేపట్టాలని విక్రమ్ సింగ్ అన్నారు.
సాహిబాబాద్ నుంచి వారణాసిలోని సయిద్ రాజా వరకు ఉన్న ప్రతి సరిహద్దు దగ్గర పోలీసు అధికారులు ఓ కన్నేసి ఉంచాలన్నారు.
తన పదవీ కాలంలో 555 మంది పోలీసులను డిస్మిస్ చేసినట్లు తెలిపారు.
ఏడీజీ దాడులు జరిపిన తర్వాత వారిని సస్పెండ్ చేయడం పోలీసు విభాగపు బలహీనతను తెలియజేస్తుందని, బహిరంగంగా లంచం తీసుకుంటూ పట్టుబడ్డ పోలీసులను వెంటనే డిస్మిస్ చేయాలన్నారు. ఏడీజీనే స్వయంగా ఈ దాడులు జరిపి వారిని పట్టుకున్నారన్నారు.
ఆజమ్‌గఢ్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ కేసులో 16 మంది బ్రోకర్లు అరెస్ట్ అయ్యారు. 14 మోటార్ సైకిళ్లు, 25 మొబైల్స్, 2 నోట్ బుక్‌లు, రూ.37,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల తర్వాత ముగ్గురు పోలీసు అధికారులు పారిపోయారు.
డీజీపీ కూడా దీనిపై కఠిన చర్యలకు ఆదేశించారు. బలియా జిల్లా ఎస్పీ దేవ్‌రంజన్ వర్మ, ఏఎస్పీ దుర్గా శంకర్ తివారిలను తొలగించగా.. సీఓ సదర్ శుభ్ సుచితాను సస్పెండ్ చేశారు.
ఇక్కడ ప్రతి రోజూ రూ.5 లక్షలు వసూళ్లు అవుతుంటాయని, అంటే ఈ మార్గం ద్వారానే నెలకు కోటిన్నర దాకా వసూలు చేస్తున్నారని డీఐజీ చెప్పారు. దీన్ని పోలీసులు, ఏజెంట్లు పంచుకుంటారని తెలిపారు.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














