హాథ్‌రస్ తొక్కిసలాట: పక్కనే ఉన్న ప్రభుత్వాసుపత్రికే సమాచారం లేదు.. ఒక్క అంబులెన్స్ తప్ప ఇంకేమీ సిద్ధం చేయలేదు - బీబీసీ గ్రౌండ్ రిపోర్టులో విస్తుపోయే వాస్తవాలు

హాథ్‌రస్‌ తొక్కిసలాటలో తమవాళ్లను పోగొట్టుకున్న బాధితుడు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, హాథ్‌రస్‌ తొక్కిసలాటలో తమవాళ్లను పోగొట్టుకున్న బాధితుడు
    • రచయిత, జుగల్ పురోహిత్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

పెద్ద సంఖ్యలో భక్తులు పోగయిన ఆధ్యాత్మిక కార్యక్రమం, కానీ.. సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు ఆ సమాచారమే తెలియని వైనం. స్థానిక ప్రైవేట్ ఆసుపత్రులను సహాయక చర్య నుంచి మినహాయించడం, కుంటుపడిన ప్రజారోగ్య వ్యవస్థ.

ఇదీ, మీరిప్పుడు చదవబోతున్న, ఇంతవరకు ఎవరూ చెప్పని కథ. పైన చెప్పిన నాలుగు అంశాలు జులై 2 నాటి హాథ్‌రస్ తొక్కిసలాటలో 120 మందికిపైగా చనిపోవడానికి ఎలా దారి తీశాయనేది చదవండి.

ఈ కథనాన్ని కొన్ని ప్రాథమిక అంశాలతో ప్రారంభిద్దాం.

ఉత్తరప్రదేశ్‌లోని హథ్‌రస్‌లో జీటీ రోడ్ హైవేకి ఆనుకుని నిర్వహించిన ‘భోలే బాబా’ సత్సంగ్ కార్యక్రమానికి అధికారుల అనుమతి ఉంది.

దాదాపు 80,000 మందితో కార్యక్రమం జరపడానికి నిర్వాహకులు అధికారుల సహకారం కోరారని, అయితే హాజరైనవారి సంఖ్య దానికి మూడు రెట్లు ఎక్కువగా ఉందని పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ పేర్కొంది.

నిర్దేశించిన షరతులను నిర్వాహకులు ఉల్లంఘించారని, పరిస్థితి అదుపుతప్పినప్పుడు భక్తులకు సహాయం చేయలేదని ఫిర్యాదులో ఆరోపించారు.

అయితే పోలీసుల వాదనతో తాము ఏకీభవించడంలేదని ఆర్గనైజర్లు బీబీసీతో చెప్పారు.

‘ఆధ్యాత్మిక కార్యక్రమం’ జరిగిన ప్రాంతం నుంచి దాదాపు 6 కిలోమీటర్ల దూరంలో (సికంద్రారావు పట్టణం వద్ద) ప్రభుత్వం నిర్వహించే కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ) ఉంది. అది 30 పడకల ఆసుపత్రి. ప్రమాదం జరిగిన ప్రాంతానికి దగ్గరగా ఉన్న పబ్లిక్ హెల్త్ ఫెసిలిటీ ఇదే.

జులై 2న మృతులు, క్షతగాత్రులతో ఆ ఆసుపత్రి ప్రాంగణం నిండిపోయింది. మొదటి ప్రాణనష్టం ప్రకటన ఇక్కడి నుంచే వచ్చింది.

వాట్సాప్
మోహన్ ఝా
ఫొటో క్యాప్షన్, డాక్టర్ మోహన్ ఝా

‘సెలవుల్లో ఉన్నవారినీ పిలిచాం’

హాథ్‌రస్‌ సహా నాలుగు జిల్లాల్లో ప్రజారోగ్యాన్ని పర్యవేక్షిస్తున్న అదనపు డైరెక్టర్ (ఆరోగ్యం) డాక్టర్ మోహన్ ఝాను మేం శుక్రవారం కలిశాం.

“సికంద్రారావుకు మొదట ముగ్గురు పిల్లల మృతదేహాలను తేవడం చూసి, ఏం జరిగిందని పోలీసులను మా వైద్యులు అడిగారు. ఏం జరిగిందో పోలీసులు చెప్పడంతో వెంటనే మా వాళ్లు వైద్యులు, నర్సులు సెలవులో ఉన్న వైద్య సిబ్బందిని అందరినీ పిలిచారు’’ అని ఝా తెలిపారు.

వైద్య కేంద్రంలో ఉన్నవారితో బీబీసీ మాట్లాడింది. ఆ రోజు ఘటన తమను కదిలించిందని సిబ్బంది చెప్పారు.

‘మృతదేహాలు, అపస్మారక స్థితిలో పడిపోయినవారి మధ్య తిరుగుతూ వారిలో ఎవరు ఊపిరితో ఉన్నారో చూసి వెంటనే వారికి వైద్యం అందించాం. అలాంటి పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి" అని అక్కడి వైద్య సిబ్బందిలో ఒకరు చెప్పారు.

ఆ రోజు సిబ్బంది సమస్యను చూసి పక్కనే ఉన్న ప్రైవేట్ క్లినిక్‌ల వైద్యులు సాయం చేయడానికి వచ్చారు.

సికంద్రారావు దగ్గర ఉన్న ఆసుపత్రి
ఫొటో క్యాప్షన్, సికంద్రారావు దగ్గర ఉన్న ఆసుపత్రి

అక్కడ నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి అంత పెద్దసంఖ్యలో జనం వస్తున్నట్లు తమకు ముందస్తు సమాచారం లేదని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సిబ్బంది చెప్పారు.

తమకు ముందే తెలిస్తే కనీస ఏర్పాట్లు చేసి ఉండేవాళ్లమన్నారు.

"మేం మా వంతు కృషి చేశాం, నిజం చెప్పాలంటే మేం ఏమాత్రం సిద్ధంగా లేం. మా ఫెసిలిటీ కూడా ఇంత పెద్ద విషాదాన్ని హ్యాండిల్ చేసే స్థాయిలో లేదు” అని సిబ్బందిలో ఒకరు చెప్పారు.

ఆ రోజు మధ్యాహ్నం ఈ సీహెచ్‌సీ క్షతగాత్రులకు సరిపోదని గ్రహించి, పక్కనున్న ప్రభుత్వ ఆసుపత్రులకు అధికారులు ఫోన్ చేయడం ప్రారంభించారు. మృతులు, క్షతగాత్రుల కోసం సిద్ధం కావాలని చెప్పారు.

అంతకుముందు హాథ్‌రస్‌ జిల్లా ఆసుపత్రి సహా ఈ ఆసుపత్రులలో దేనికి కూడా ఇంత పెద్ద ‘సత్సంగ్’ కార్యక్రమం జరుగుతుందనే సమాచారం లేదు.

“మాకు ఎలాంటి ముందస్తు సమాచారం లేదు. తొక్కిసలాట జరిగిన తర్వాతే మాకు తెలిసింది” అని హాథ్‌రస్‌ జిల్లా ఆసుపత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సూర్య ప్రకాశ్ తెలిపారు.

హాథ్‌రస్‌ జిల్లా ఆసుపత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సూర్య ప్రకాశ్
ఫొటో క్యాప్షన్, హాథ్‌రస్‌ జిల్లా ఆసుపత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సూర్య ప్రకాశ్

బాధితులకు చికిత్స అందించాం: నిర్వాహకులు

నిర్వాహకులు విఫలమయ్యారని ఓ వైపు పోలీసుల నివేదిక చెబుతున్నప్పటికీ, వారు మాత్రం బాధితులకు అవసరమైన వైద్య సహాయం అందించామని చెప్తున్నారు.

“మేం బాధితులకు చికిత్స అందించాం, అయితే గాయాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆసుపత్రులకు పంపించాం. నా దగ్గర కచ్చితమైన లెక్క లేదు కానీ మాకు వైద్యులు, నర్సులు ఉన్నారు’’ అని సూరజ్ పాల్ జాటవ్‌ అనుచరుడు ఏపీ సింగ్ తెలిపారు.

ఒకవేళ ఈ సభ రాజకీయ ర్యాలీయో, వీఐపీల సందర్శనో అయితే ఈ ఆసుపత్రులలో ముందస్తు జాగ్రత్తలు తీసుకునేవారా? అని మేం అడిగాం.

ఈ ప్రశ్నకు అలీగఢ్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌లో మెడికల్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ప్రొఫెసర్ వసీమ్ రిజ్వీ సానుకూలంగా బదులిచ్చారు.

ప్రొఫెసర్ వసీమ్ రిజ్వీ
ఫొటో క్యాప్షన్, ప్రొఫెసర్ వసీం రిజ్వీ

'ఒక్క అంబులెన్స్ అడిగారు'

"పొరుగు జిల్లాల్లో అలాంటిదేదైనా జరిగితే సాధారణంగా మాకు ముందుగానే సమాచారం అందుతుంది. కానీ ఈ విషయంలో అలాంటిది జరగలేదు" అని రిజ్వీ అన్నారు. జులై 2న అధికారులు తనకు కాల్ చేశారని ఆయన చెప్పారు.

“15 మృతదేహాలను మీ మార్చురీకి పంపుతున్నామని, ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు’’ అని గుర్తుచేసుకున్నారు.

మరి ఆ ‘సత్సంగ్’ గురించి ఎవరికి తెలుసు? అని అడిగితే.. తొక్కిసలాట జరిగేంత వరకు ఆ కార్యక్రమం గురించి తనకు తెలియదని డాక్టర్ ఝా చెప్పారు.

"సత్సంగ్ రోజున అంబులెన్స్ ఏర్పాటుచేయాలని హాథ్‌రస్‌ చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సీఎంవో)కి మాత్రమే సమాచారం ఉంది, ఆయన పంపించారు" అని ఝా చెప్పారు.

“కార్యక్రమంలో ఎవరైనా గాయపడినా లేదా అనారోగ్యం పాలైనా చికిత్స చేయడానికి ఆ అంబులెన్స్ సిద్ధంగా ఉంచారు. అంతేకానీ, అంతమంది కోసం కాదు. భవిష్యత్తులో ఎప్పుడైనా ఇలా జనం పెద్దసంఖ్యలో చేరుతున్నట్లు తమకు తెలిస్తే డిపార్ట్‌మెంట్, సమీపంలోని ప్రభుత్వ వైద్య కేంద్రాలను అప్రమత్తం చేస్తాం’’ అని చీఫ్ మెడికల్ ఆఫీసర్ అన్నారు.

మేం హాథ్‌రస్ సీఎంవో డాక్టర్ మంజీత్ సింగ్ వద్దకు వెళ్లాం, ఇతర ఆసుపత్రులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదో తెలుసుకోవడానికి ప్రయత్నించాం. కానీ, ఆయన మా ప్రశ్నలకు సమాధానమివ్వకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు.

వసీం రిజ్వీతో బీబీసీ ప్రతినిధి జుగల్ పురోహిత్
ఫొటో క్యాప్షన్, వసీం రిజ్వీతో బీబీసీ ప్రతినిధి జుగల్ పురోహిత్

వైద్యుల కొరత

ఇలాంటి భారీ కార్యక్రమాల క్రమబద్ధీకరణకు ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్(ఎస్ఓపీ) రూపొందిస్తున్నట్లు ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ అధికారులు తెలిపారు.

నాలుగు జిల్లాలున్న ఈ డివిజన్‌లో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే వైద్య కేంద్రాలు అన్నిట్లో కలిపి 2,500కు పైగా పడకలు ఉన్నాయి.

అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHCలు) వంటి హెల్త్ ఫెసిలిటీల కొరత చాలా ఉంది.

ఉత్తర్ ప్రదేశ్‌లో జనాభాతో పోల్చినప్పుడు ప్రజారోగ్య సదుపాయాల కొరత 45 శాతం ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గ్రామీణ ఆరోగ్య గణాంకాల (2021-22) నివేదిక చెప్తోంది.

''డాక్టర్ల కొరత ఉంది. ఆరోగ్య కేంద్రాలు కొన్ని కేవలం ఇద్దరు వైద్యులతోనే నడుస్తున్నాయి. సికంద్రారావు ఆసుపత్రిలో అయిదారుగురు డాక్టర్లు ఉండటం అదృష్టం. ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది” అని డాక్టర్ ఝా తెలిపారు.

శిఖా సోదరుడు సునీల్, బీబీసీ ప్రతినిధి జుగల్
ఫొటో క్యాప్షన్, శిఖా సోదరుడు సునీల్‌తో మాట్లాడుతున్న బీబీసీ ప్రతినిధి జుగల్

‘అరిస్తేనే డాక్టర్లు వస్తున్నారు’

వైద్య సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని గాయపడిన రోగులు అంటున్నారు. తొక్కిసలాట తర్వాత తాను స్పృహ కోల్పోయానని హాథ్‌రస్‌ జిల్లా ఆసుపత్రిలో కోలుకుంటున్న శిఖా కుమారి తెలిపారు.

"నేను సికంద్రారావు సెంటర్‌లో పడిపోయాను, ఎలాగోలా నా సోదరుడితో ఫోన్‌లో మాట్లాడగలిగాను" అని ఆమె చెప్పారు. అయితే, శిఖాకు అందుతున్న చికిత్సపై ఆమె సోదరుడు సునీల్ అసంతృప్తి వ్యక్తంచేశారు.

“మేం గట్టిగా మాట్లాడితేనే వైద్యులు వచ్చి చూస్తున్నారు, లేకపోతే రావడం లేదు. ఘటన జరిగిన మరుసటి రోజు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వస్తున్నారని అన్ని ఏర్పాట్లూ చేశారు. ఆయన వెళ్లిపోయాక కరెంటు కోతలు మొదలయ్యాయి. రాత్రిపూట ఉండే వైద్యులు మా బీపీ చెక్ చేసే పని ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులకు అప్పగించేస్తున్నారు. మేం ఇక్కడి నుంచి వెళ్లిపోతాం’’ అని సునీల్ చెప్పారు.

మరి ఎక్కడికి వెళతావు? అని అడిగితే.. “ఆమె బాగుపడాలంటే అప్పులు చేసి ప్రైవేట్ హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ చేయించాలి, ఇంకెక్కడడి వెళ్తాం?” అని సునీల్ బదులిచ్చారు.

జులై 2న తొక్కిసలాట తరువాత ఆ ప్రదేశానికి, రోగులు చికిత్స పొందుతున్న ప్రభుత్వ ఆసుపత్రులకు మధ్య రాకపోకలకు పట్టే సమయం ట్రాఫిక్ కారణంగా పెరిగింది.

"ట్రాఫిక్ జామ్ కారణంగా బాధితులు ఆలస్యంగా మా వద్దకు వస్తున్నారని మేం తెలుసుకున్నాం" అని అలీగఢ్‌లోని పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ కంబైన్డ్ హాస్పిటల్‌ చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎంకే మాథుర్ అన్నారు.

అక్కడ అత్యవసర పరిస్థితుల కోసం 300 పడకలను ఏర్పాటుచేశారు.

డాక్టర్ ఎంకే మాథుర్
ఫొటో క్యాప్షన్, డాక్టర్ ఎంకే మాథుర్

ప్రైవేట్ ఆసుపత్రులకు ఎందుకు తీసుకెళ్లలేదు?

బాధితులకు చికిత్స అందించిన ప్రభుత్వ ఆసుపత్రులు, ఘటన జరిగిన ప్రాంతం మధ్య మాకు అనేక ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌లు, ఆసుపత్రులు కనిపించాయి.

సికంద్రా రావు తరహాలో ఆ సౌకర్యాలు అంతంతమాత్రంగానే ఉండటంతో పేషెంట్లు ఆ ఆసుపత్రుల వైపు పరుగులు తీశారని తెలుసుకున్నాం.

“రోగి అడిగితే తప్ప మేం ప్రైవేట్ క్లినిక్‌కి తీసుకెళ్లబోం. మేం సాధారణంగా ప్రభుత్వ ఆసుపత్రికే డ్రైవ్ చేస్తాం” అని ఒక అంబులెన్స్ డ్రైవర్ తెలిపారు.

ప్రాణాలను కాపాడే విషయంలో ప్రైవేట్ ఆసుపత్రులకు ఎందుకు తీసుకెళ్లకూడదు? అని మేం డాక్టర్ ఝాను ప్రశ్నించాం.

“మీరు చెప్పింది నిజమే. ఈ సందర్భంలో మేం ఎవరినీ ప్రైవేట్ ఆసుపత్రులకు తీసుకెళ్లనివ్వలేదు. అయితే భవిష్యత్తులో అలాంటివి జరగవు”అని ఆయన బదులిచ్చారు.

ఈ ఘటన నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నామని, వాటిని అమలు చేస్తామని ఆయన చెప్పారు.

హైవేపై ట్రామా సెంటర్
ఫొటో క్యాప్షన్, హైవేపై ట్రామా సెంటర్

సాయంత్రం కావొస్తోంది. సూర్యుడు అస్తమించబోతున్నాడు.

ఆ ప్రాంతం నుంచి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో అదే జీటీ రోడ్డులో జష్రత్‌పూర్ వద్ద ప్రభుత్వం నిర్వహించే మరొక ట్రామా సెంటర్‌ కనిపించింది.

ఇది కొంత చిన్నదైనప్పటికీ సికంద్రా రావు ఏరియా వద్ద ఉన్నట్లుగానే ఉంది. ఈ ట్రామా సెంటర్లో డాక్టర్ అందుబాటులో లేరు. ఇద్దరు నర్సులు మాత్రమే కనిపించారు. ఇప్పుడేమయినా జరిగితే డాక్టర్ ఎలా? అని వారిని అడిగాను.

వారు కాసేపు మౌనంగా ఉండి.. ఆ తరువాత “మేం పిలుస్తాం, డాక్టర్ ఆయన ఇంటి నుంచి వస్తారు. అందుకు కొంత సమయం పడుతుంది” అని చెప్పారు.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)