యూపీ, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్: కావడి యాత్ర మార్గంలో ధాబాలు, హోటళ్లపై యజమానుల పేర్లు ప్రదర్శించాలనే ప్రభుత్వ ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే

ధాబా బ్యానర్ మీద యజమానులు, వర్కర్ల పేర్లు

ఫొటో సోర్స్, SHAD MIDHAT/BBC

ఫొటో క్యాప్షన్, ముజఫర్‌నగర్‌లోని దుకాణాల బోర్డులపై యజమానుల పేర్లు పెద్ద అక్షరాలతో రాస్తున్నారు.
    • రచయిత, దిల్‌నవాజ్ పాషా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కావడి యాత్ర మార్గంలో ఉండే హోటళ్లు, ధాబాలు, తోపుడు బండ్లపై యజమానుల పేర్లను ప్రదర్శించాలన్న ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వులపై సుప్రీం కోర్టు స్టే విధించింది.

ఈ ఉత్తర్వులకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం విచారించింది. వీటి మీద స్పందించాలంటూ ఆయా రాష్ట్రాలకు నోటీసులు పంపింది.

దుకాణాల మీద యజమానుల పేర్లు, సిబ్బంది పేర్లను రాయాలని ఆహార విక్రయదారులను ఒత్తిడి చేయకూడదని ఆదేశించింది.

తదుపరి విచారణను జులై 26కు వాయిదా వేసింది.

ఈ నేమ్‌ప్లేట్స్‌కు సంబంధించి యూపీలోని ముజఫర్‌నగర్ పోలీసులు ఇచ్చిన ఆదేశాలు వివాదానికి దారి తీశాయి.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

అసలేం జరిగింది?

ముజఫర్‌నగర్ సమీపంలో బఝేడీ-బాగోవాలీ బైపాస్ రోడ్డు ఉంది. ఈ రోడ్ హరిద్వార్ వైపు వెళ్తుంది. ఇక్కడ పంజాబీ ధాబా ఒకటి ఉంది. దీని యజమానుల్లో ఒకరు ముస్లిం, మరొకరు హిందువు. ఈ ధాబా బోర్డుపై యజమానుల పేర్లే కాకుండా అక్కడ పనిచేసే వారి పేర్లూ రాశారు. అంతేకాదు, అందులో పనిచేస్తున్న ఏకైక ముస్లిం వర్కర్ షారుఖ్‌ అక్కడ పని మానేశారు.

'ఇప్పుడు ధాబాలో హిందూ ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. వివాదం పెద్దది కావడంతో తన వల్ల ఇతర వర్కర్లు, యజమానులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదని షారుఖ్ స్వయంగా పని వదిలేశారు’’ అని ఆ ధాబా మేనేజర్ ప్రవీణ్ అన్నారు.

పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో కన్వర్ యాత్ర(కావడి యాత్ర) సందర్భంగా ధాబాలు, రెస్టారెంట్లు, పండ్లు, స్వీట్ షాపుల యజమానులు తమ దుకాణాల బోర్డులపై తమ పేర్లు, అక్కడ పనిచేస్తున్నవారి పేర్లు పెద్ద అక్షరాలలో రాయాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

అయితే, ఇది స్వచ్ఛందంగా పాటించడానికి ఉద్దేశించిన ఉత్తర్వులే కానీ బలవంతమేమీ లేదని పోలీసులు చెబుతున్నారు.

వాట్సాప్
కన్వర్ యాత్ర

ఫొటో సోర్స్, SHAD MIDHAT/BBC

ఫొటో క్యాప్షన్, కావడ్ యాత్రికులు

'భక్తుల మనోభావాలు దెబ్బతినకూడదనే'

కన్వర్ యాత్ర అనేది మతపరమైన కార్యక్రమమని, అందులో ఎలాంటి గందరగోళం జరగకూడదని, భక్తుల మనోభావాలు దెబ్బతినకూడదనే ఉద్దేశంతో ఈ ఉత్తర్వులు జారీచేసినట్లు పోలీసులు తెలిపారు.

అయితే ఈ ఉత్తర్వు ముస్లింలను 'మిగతా సమాజం నుంచి వేరు చేసే ప్రయత్నంలో భాగం' అని ఆ ప్రాంతంలోని కొందరు దుకాణ యజమానులు ఆరోపిస్తున్నారు.

ఈ ఉత్తర్వు కారణంగా ఇప్పుడు రోడ్డుపక్కన తెరిచిన చాలా హోటళ్లు, ధాబాల్లో ముస్లింలెవరూ పనికి వెళ్లడం లేదు. కొందరు ఉద్యోగాలు వదిలేశారు, మరికొందరిని తొలగించారు. అయితే 'శ్రావణ మాసంలో ముందు జాగ్రత్త కోసమే ఇలా చేశాం' అని కొన్ని యాజమాన్యాలు చెబుతున్నాయి.

మరోవైపు తాము ఏ షాపులోకి వెళ్లలేదని, అక్కడి ముస్లిం ఉద్యోగిని తొలగించాలని యజమానిని ఒత్తిడి చేయలేదని పోలీసులు చెబుతున్నారు.

ముజఫర్ నగర్

ఫొటో సోర్స్, SHAD MIDHAT/BBC

ఫొటో క్యాప్షన్, ముజఫర్ నగర్

అసలేం జరిగింది?

ఏటా శ్రావణ మాసంలో లక్షలాది కావడ్ యాత్రికులు హరిద్వార్ వెళ్లి అక్కడ గంగా నది నుంచి నీటిని తీసుకొని తిరిగొస్తారు. ఆ క్రమంలో ముజఫర్‌నగర్ మీదుగా కాలి నడకన వెళ్తారు.

ఈ యాత్ర సందర్భంగా శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్తగా దుకాణాలపై యజమానుల, ఉద్యోగుల పేర్లను బయట బోర్డులపై రాయాలని కోరినట్లు పోలీసులు చెబుతున్నారు.

పోలీసుల ఆదేశాలతో ఇక్కడి దుకాణాదారులు వర్కర్లు, యజమానుల పేర్లను బోర్డులు, బ్యానర్లపై పెద్ద అక్షరాలతో రాశారు. చాలామంది దుకాణదారులు స్వచ్ఛందంగానే ఆ విధంగా పేర్లను రాశారని పోలీసులు అంటున్నారు. వారిని బలవంతం చేయలేదన్నారు.

హరిద్వార్ నుంచి వచ్చే ప్రధాన రహదారి మదీనా చౌక్ మీదుగా ముజఫర్‌నగర్‌లోకి ప్రవేశిస్తుంది. ఈ దారిలో దాదాపు ప్రతి దుకాణం బయట తెల్లటి బోర్డులపై ముస్లిం యజమానుల పేర్లు ఎర్ర రంగులో పెద్ద అక్షరాలతో రాసి ఉన్నాయి. దిల్లీ- హరిద్వార్ హైవే, నగరంలోని ఇతర ప్రాంతాలు, రోడ్లపైనా ఇలాగే ఉంది.

దుకాణదారులు స్వచ్ఛందంగా బోర్డులపై తమ పేర్లను రాయాలని సూచించినట్లు ముజఫర్‌నగర్ సీనియర్ పోలీస్ అధికారి అభిషేక్ సింగ్ చెప్పారు.

అహ్మద్ టీ షాపు

పోలీసులు చెబుతున్నది నిజమేనా? అందరూ స్వచ్ఛందంగానే రాస్తున్నారా

అయితే క్షేత్ర స్థాయిలో పరిస్థితులు మరోలా ఉన్నాయి. పోలీసులు పైకి చెబుతున్నట్లుగా వాస్తవ పరిస్థితులు లేవు.

‘లవర్స్ టీ పాయింట్’ పేరుతో గత పదేళ్లుగా ఖతౌలీలో నడుస్తున్న టీ స్టాల్ పేరు ‘వకీల్ సాబ్ చాయ్’గా మార్చేశారు. అయినప్పటికీ పోలీసులు అభ్యంతరం చెప్పారని షాపు యజమాని వకీల్ అహ్మద్ అన్నారు.

"పోలీసుల సూచనల మేరకు నా దుకాణం పేరును వకీల్ సాబ్‌గా మార్చాను. అయితే, పోలీసులు మళ్లీ వచ్చి ఈ పేరు మీరు ముస్లిం అని సూచించడం లేదని.. వకీల్ అహ్మద్ అని పూర్తి పేరుతో సైన్ బోర్డు పెట్టాలని బలవంతం చేశారు" అని చెప్పారు.

పదేళ్లుగా తన దుకాణానికి ఉన్న పేరును మార్చినందుకు అహ్మద్ విచారం వ్యక్తం చేశారు.

"ఇది స్పష్టంగా ముస్లింలను ఒంటరిగా చేసి, మత వివక్షను పెంచే ప్రయత్నం. కానీ మేం వ్యాపారం చేయాలి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం చేయగలం?" అని ఆయన అన్నారు.

ఆసిఫ్ ముజఫర్‌నగర్‌లోని భాంగెలా గ్రామంలో హైవేపై టీ స్టాల్ నడుపుతున్నారు.

తన దుకాణంపై పోలీసులు చెబుతున్నట్లుగా సైన్‌బోర్డ్ పెట్టబోనని చెబితే బలవంతంగా స్టేషన్‌కు తీసుకెళ్లారని.. జైల్లో వేస్తామని బెదిరించారని ఆసిఫ్ ఆరోపించారు.

"స్థానిక ఎంపీ హరేంద్ర మాలిక్ జోక్యంతో నన్ను పోలీస్ స్టేషన్ నుంచి విడుదల చేశారు. అయితే నన్ను విడుదల చేయడానికి ముందు పోలీసులు నా దుకాణం వద్ద నా పేరుతో పెద్ద బ్యానర్‌ కట్టారు" అని ఆసిఫ్ చెప్పారు.

వసీం అహ్మద్

ఫొటో సోర్స్, SHAD MIDHAT/BBC

ఫొటో క్యాప్షన్, వసీం అహ్మద్ తొమ్మిదేళ్లు గణపతి పేరుతో ధాబా నిర్వహించారు.

'ముస్లిం ఉద్యోగులను తొలగించాలని ఆదేశాలు'

బఝేడీ గ్రామానికి చెందిన వసీం అహ్మద్ తొమ్మిదేళ్లు గణపతి పేరుతో ధాబాను నడిపారు.

"నా పేరు వసీం అహ్మద్. ఈరోజుల్లో కొంతమంది తమ రాజకీయాల కోసం మాలాంటి వారిపై దుష్ప్రచారం చేస్తున్నారు. నేను 2014 నుంచి గణపతి ధాబా నడుపుతున్నాను. గత సంవత్సరం పోలీసులు నా వద్దకు వచ్చారు. నా పేరు అడిగి ధాబాకు గణపతి పేరు పెట్టే హక్కు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. దేశ రాజ్యాంగం నాకు వ్యాపారం చేసే హక్కు ఇచ్చిందని చెప్పాను’’ అని ఆయన అన్నారు.

తన ధాబా గురించి సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభించారని, ఆ తర్వాత ధాబాను అమ్మేయాల్సి వచ్చిందని వసీం అహ్మద్ అన్నారు.

ధాబాలకు పోలీసులు వచ్చి అందులో పనిచేస్తున్న ముస్లిం ఉద్యోగులను తొలగించాలని ఆదేశించారని కొంతమంది యజమానులు ఆరోపించారు.

ఆ ఏరియాలో ఉన్న ఒక ధాబాకు చెందిన హిందూ యజమాని ఈ ఘటనలపై స్పందించారు.

"కొన్నిరోజుల క్రితం పోలీసులు వచ్చి, ఇక్కడ ఎవరైనా ముస్లింలు పనిచేస్తున్నారా? అని అడిగారు. మా దగ్గర ఎవరూ లేరని చెప్పాను. నేను ఏ ముస్లింని పనిలో పెట్టుకోబోనని చెప్పిన తర్వాతే వారు వెళ్లిపోయారు" అని అన్నారు.

గతంలో ఈ ధాబా యజమాని ఒక ముస్లిం. అయితే గత ఏడాది ఓ వివాదం తర్వాత తన ధాబాను ఆయన మూసివేశారు. ఇప్పుడు హిందూ వ్యక్తి దానిని నడుపుతున్నారు.

మేనేజర్‌తో సహా నలుగురు ముస్లిం ఉద్యోగులను తన ధాబా నుంచి తొలగించిన ఓ యజమాని స్పందిస్తూ ‘’దయచేసి మా పరిస్థితిని అర్థం చేసుకోండి. మాకు ఎలాంటి వివాదం అక్కర్లేదు’’ అని అన్నారు.

పోలీసులు ఏం చెబుతున్నారు?

ఈ ఆరోపణలపై ముజఫర్‌నగర్ ఎస్‌ఎస్‌పీ అభిషేక్ సింగ్‌తో బీబీసీ మాట్లాడేందుకు ప్రయత్నించగా ఆయన ‘పోలీసులు ప్రకటన ఇచ్చారు, అంతకుమించి నేను చెప్పేది ఏమీ లేదు’ అని అన్నారు.

నగరంలోని ఖతౌలీ ప్రాంతంలో తమ షాపుల నుంచి ముస్లిం ఉద్యోగులను బలవంతంగా తొలగించారని పలువురు దుకాణ యజమానులు చేస్తున్న ఆరోపణలపై ఎస్‌హెచ్‌వో కూడా స్పందించారు.

“పోలీసులు ఏ దుకాణం వద్దకు వెళ్లలేదు, ముస్లిం ఉద్యోగులను తొలగించాలంటూ ఎవరినీ బలవంతం చేయలేదు" అని ఆయన అన్నారు.

హిందూ దేవుళ్ల పేర్లతో ముస్లింల ధాబాలు

హిందూ దేవతల పేరుతో ముస్లిం యజమానులు నిర్వహిస్తున్న ధాబాలను మూసివేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక హిందూ మతానికి చెందిన 'స్వామి' యశ్‌వీర్ గత సంవత్సరం ప్రచారం ప్రారంభించడంతో ఈ వివాదం మొదలైంది.

'స్వామి' యశ్‌వీర్ డిమాండ్ తర్వాత హిందువుల పేర్లతో ముస్లిం యజమానులు నడుపుతున్న అనేక హోటళ్లపై అధికారులు ఆంక్షలు విధించారు.

"హిందువుల విశ్వాసాలను అనుగుణంగా అక్కడ భోజనం ఉండదు. దీనిపై గతేడాది మేం గొంతు విప్పినపుడు హిందూ పేర్లతో ఉన్న ముస్లిం ధాబాలు మూతపడ్డాయి. ముస్లింలతో మాకు ఎలాంటి సమస్య లేదు, వారు తమ పేర్లను పెద్ద అక్షరాలతో రాయాలి. తద్వారా హిందూ యాత్రికులు అక్కడకు వెళ్లాలో వద్దో నిర్ణయించుకుంటారు’’ అని స్వామి యశ్‌వీర్ చెప్పారు.

ఈ ప్రచారం సమాజంలో వివక్షకు కూడా దారితీస్తుందనే ప్రశ్నకు యశ్‌వీర్ స్పందిస్తూ “తినడానికి వెళ్లే దుకాణం, దాని యజమాని పేరు తెలుసుకోవడం హిందువుల హక్కు. మా డిమాండ్‌తో అధికారులు కదిలారు. ఇది మొత్తం ఉత్తరప్రదేశ్, దేశంలోనూ జరగాలని కోరుకుంటున్నాం. తద్వారా ఫుడ్ షాపులను నడుపుతున్న వారి పేర్లు బహిరంగ పరుస్తారు" అని అన్నారు.

అదే సమయంలో ముస్లిం వ్యాపారులకు తాను వ్యతిరేకం కాదని యశ్‌వీర్ అంటున్నారు.

"కన్వర్ యాత్రికులు ఎవరి నుండి వస్తువులను కొనుగోలు చేస్తున్నారో తెలుసుకోవాలి. ముస్లింల దుకాణాలకు హిందువులు వెళ్లకపోవడం వల్ల జీవనోపాధి దెబ్బతింటుందంటే, అలాగే కానివ్వండి. దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మన మతం పవిత్రతను మనం చూసుకోవాలి" అని ఆయన అన్నారు.

ఈ నిబంధనతో ముస్లిం ధాబా యజమానుల భాగస్వామ్యంతో వ్యాపారం నిర్వహిస్తున్న హిందూ యజమానులు కూడా ఆర్థికంగా నష్టపోతున్నారు.

"గత సంవత్సరం వివాదంతో భారీగా నష్టం వచ్చింది. మేం తిరిగి సంపాదించాలనుకున్నాం. కానీ, ఈ ఆదేశాలు వచ్చాయి" అని పంజాబ్ తడ్కా దాబా యజమాని నజీమ్ త్యాగి ఆవేదన వ్యక్తంచేశారు.

"మా ధాబాపై మతపరమైన చిహ్నం లేదు. కానీ చాలాసార్లు ఓనర్ ముస్లిం అని తెలిస్తే కస్టమర్లు వెళ్లిపోతున్నారు. నాకప్పుడు చాలా బాధేసింది. కానీ, ఎవరు, ఎక్కడ తినాలనుకుంటే అక్కడ తింటారు. మనకు దక్కాల్సింది మనకు దక్కుతుంది అని ఓపికగా చూస్తున్నాను’’ అని ఆయన అన్నారు.

హిమాన్షు

ఫొటో సోర్స్, SHAD MIDHAT/BBC

ఫొటో క్యాప్షన్, కావడ్ యాత్రికుడు

కావడ్ యాత్రికులు ఏమంటున్నారు?

ఈ ఏడాది కన్వర్ యాత్ర జులై 22 నుంచి ప్రారంభం కానుంది.(దక్షిణ భారతదేశంలో పాటించే సంప్రదాయంతో పోల్చితే ఉత్తర భారతదేశంలో పదిహేను రోజుల ముందు అంటే పౌర్ణమి నుంచి హిందూ మాసాలు మొదలవుతాయి)

కానీ కావడి ఎక్కువ దూరం మోయాల్సిన వారు, భారీ కావళ్లు మోసే యాత్రికులు ఇప్పటికే నడక ప్రారంభించారు. ఆకాశ్ సుమారు 200 కిలోల కావడి, విశాల్ సుమారు 100 కిలోల కావడి మోస్తున్నట్లు చెప్పారు.

కుటుంబంలో శాంతి, సంతోషం కోసం ఈ బరువైన కావడి మోస్తున్నానని ఆకాష్ చెప్పారు.

"షాప్ హిందువుదా, ముస్లిందా అనేది మాకు ముఖ్యం కాదు. ఇక్కడ అందరినీ గౌరవిస్తారు. వస్తువులు కొనే సమయంలో ఎవరి పేరునూ చూడం. హిందు-ముస్లిం అనే ఈ చర్చ కేవలం రాజకీయాల కోసమే. ఏది హిందువు రక్తం, ఏది ముస్లిందో ఎవరైనా చెప్పగలరా?’’ అని విశాల్ ప్రశ్నించారు.

అదే మార్గంలో కావడ్ యాత్రికుల బృందానికి తోడుగా వస్తున్నారు సోనూ శర్మ.

"మాతో ఎవరికీ ఇబ్బంది లేదు, ఎవరితోనూ సమస్య లేదు. మేం కావడ్ తీసుకొని మంచి స్ఫూర్తితో బయలుదేరాం. ఈ రాజకీయాలలో సామాన్యులు జోక్యం చేసుకోకూడదనుకుంటున్నా’’ అని సోనూ అన్నారు.

బఝేడీ బైపాస్‌లోని ఓ పాకలో రషీద్ అనే వ్యక్తి టీ స్టాల్ నడుపుతున్నారు. బ్యానర్‌ను తయారు చేయడానికి అతని వద్ద డబ్బు లేకపోవడంతో వైట్ చార్ట్‌పై తన పేరును పెద్ద అక్షరాలతో రాసుకున్నారు.

రషీద్ తన కుటుంబంతో కలిసి ఆ పాకలోనే నివసిస్తున్నారు. ఒక డజను మంది యాత్రికులు ఆయన దుకాణం వద్ద ఆగి, టీ తాగుతున్నారు.

"నేను 12 సంవత్సరాల వయస్సు నుంచి భోలాలకు(కావడి యాత్రికులు) సేవ చేస్తున్నాను. నాకు అది సంతోషాన్నిస్తుంది. వారికి నాతో ఇబ్బంది లేదు" అని రషీద్ అన్నారు.

‘వాతావరణాన్ని చెడగొట్టేందుకు’

ముజఫర్‌నగర్‌లో ఏటా కావడి యాత్రికుల కోసం శిబిరాలు ఏర్పాటు చేసే 'పైగామ్-ఇ-ఇన్సానియత్' సంస్థ ఈసారి క్యాంపును ఏర్పాటు చేయడం లేదు.

‘ఏటా శిబిరం ఏర్పాటు చేసి భక్తులకు సాయం చేసేవాళ్లం. దూరప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులు మా వద్ద బస చేసేవారు. శిబిరంలో మేం ముస్లింలమని వారికి తెలుసు, అయినప్పటికీ వారు మాతో కలిసి ఉండేవారు. అయితే ఈసారి శిబిరం ఏర్పాటు చేయడం లేదు. ఈసారి చాలా ఆందోళనలు ఉన్నాయి’’ అని ఆ సంస్థ అధ్యక్షుడు ఆసిఫ్ రాహి అన్నారు.

"ముజఫర్‌నగర్ నుంచి ఈ కొత్త విభజన ప్రారంభమైంది. హిందూముస్లింల సామరస్యాన్ని నాశనం చేస్తున్నారు. రామ్ చాట్ భండార్ నుంచి చాట్ తిని, ఆరిఫ్ నుంచి పండ్లు కొనడమనేది కొనుగోలుదారుడి ఎంపిక. కానీ ఈ కొత్త సంప్రదాయం సమాజానికి మంచిది కాదు’’ అని ఆసిఫ్ రాహి అభిప్రాయపడ్డారు.

(ముజఫర్‌నగర్‌కు చెందిన అమిత్ సైనీ ఈ కథనానికి సహకరించారు)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)