కొండచరియలు అంటే ఏమిటి? అవి విరిగిపడే ముందు సంకేతాలేంటి? ప్రాణాలు కాపాడుకోవడం ఎలా

landslide

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కొండచరియలు విరిగిపడడంతో చనిపోయిన తమవారి కోసం రోదిస్తున్నవారు. ఇథియోపియాలో 2024 జులైలో కొండచరియలు విరిగిపడి 260 మందికిపైగా మరణించారు
    • రచయిత, లూయిస్ బరూచో
    • హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్

కేరళలోని వయనాడ్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున కొండచరియలు భారీగా విరిగిపడ్డాయి.

ఈ విపత్తు కారణంగా పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.

ఒక వంతెన కూలిపోయిందని, పరిస్థితి ప్రమాదకరంగా ఉందని కాంగ్రెస్ ఎంపీ కె.సురేష్ చెప్పారు.

కొండచరియలు విరిగిపడడంతో రాళ్లు, మట్టిపెళ్లల కింద కొందరు చిక్కుకుపోయారు.

కాగా ప్రపంచవ్యాప్తంగా కొండచరియలు విరిగిపడి ఏటా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

కొద్దిరోజుల కిందటే ఆఫ్రికా దేశం ఇథియోపియాలో కొండచరియలు విరిగిపడి 260 మందికిపైగా మరణించారు.

ఈ ఏడాది ఇథియోపియా, టాంజానియా, పపువా న్యూగినీ, ఇండోనేసియా, నేపాల్‌లలో కొండచరియలు విరిగిపడిన కారణంగా వందల మంది ప్రాణాలు కోల్పోయారు.

వాతావరణ మార్పుల కారణంగా ఇలాంటి విపత్తులు తరచూ జరుగుతున్నాయని నిపుణులు చెప్తున్నారు.

అసలు కొండచరియలు అంటే ఏమిటి? అవి ఎన్ని రకాలు? ఎందుకు విరిగిపడతాయి? ఆ సమయంలో మిమ్మల్ని మీరు రక్షించుకోవడంతో పాటు ఇతరులను ఎలా రక్షించాలి?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
కొండచరియలు విరిగిపడిన ప్రాంతం

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడుతుంటాయి.

కొండచరియలు విరిగిపడడం అంటే ఏమిటి?

కొండలు వంటి ప్రకృతి సిద్ధమైన భౌగోళిక స్వరూపాల నుంచి రాళ్లు, మట్టి కిందకు జారిపడడాన్ని కొండచరియలు విరిగిపడటం అంటారు. సాధారణంగా ఏటవాలుగా ఉన్న ప్రాంతాలలో ఇలా జరుగుతుంది.

ఇది హఠాత్తుగా జరగొచ్చు లేదా దీర్ఘ కాలంలో క్రమంగా జరుగుతుండొచ్చు.

వాలుగా ఉండే ప్రదేశాలలోని పదార్థాన్ని(ఇక్కడ రాళ్లు, మట్టి వంటివి) పట్టి ఉంచే చుట్టూఉన్న పదార్థ బలం కంటే అది కిందకు జారడానికి కారణమైన బలం(గురుత్వాకర్షణ శక్తి కారణంగా) ఎక్కువగా ఉన్నప్పుడు వేగంగా కిందకు చేరుతాయని(కొండచరియలు విరిగిపడతాయని) బ్రిటిష్ జియోలాజికల్ సర్వే వెబ్‌సైట్ తెలిపింది.

కొండచరియల శిథిలాలు

ఫొటో సోర్స్, Getty Images

కొండచరియలు ఎందుకు విరిగిపడతాయి?

కొండచరియలు విరిగిపడటానికి అనేక కారణాలు ఉంటాయి.

‘వర్షపాతం, మంచు కరగడం, నీటిమట్టాలలో మార్పులు, ప్రవాహాల కారణంగా కోత, భూగర్భ జలాలలో మార్పులు, భూకంపాలు, అగ్నిపర్వతాలు, మానవ కార్యకలాపాల కారణంగా కొండచరియలు విరిగిపడతాయి’ అని యూఎస్ జియోలాజికల్ సర్వే (యూఎస్‌జీఎస్) పేర్కొంది.

నీటి అడుగున కూడా కొండచరియలు విరిగిపడతాయి. వీటిని సబ్‌మెరైన్ ల్యాండ్‌స్లైడ్స్ అంటారు.

భూంకపాలు, తుపాను ధాటికి అలల ఉద్ధృతి పెరగడం వల్ల సముద్రగర్భంలో ఇలా జరుగుతుంది. కొన్నిసార్లు ఇది సునామీకి దారితీసి తీరప్రాంతాలకు నష్టం కలిగిస్తుంది.

ఏ ప్రాంతాలలో కొండచరియలు ఎక్కువగా విరిగిపడే అవకాశాలున్నాయో ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

అవి:

  • నిటారుగా ఉండే కొండలు, లోయల దిగువ భాగాలు
  • కార్చిచ్చులలో కాలిపోయిన భూములు
  • అడవుల నిర్మూలన, నిర్మాణాలు తదితర మానవ కార్యకలాపాల వల్ల స్వరూపం మారిన ప్రాంతాలు
  • నీటిలో ఎక్కువకాలం తీవ్రంగా నానిన ప్రాంతాలు
  • వాగులు/నదుల ప్రవాహ మార్గాలలో..
Types of lanslides

ల్యాండ్‌స్లైడ్స్ రకాలు

రాళ్లు, మట్టి పెళ్లలు హఠాత్తుగా విరిగిపడటం నుంచి భారీ కొండచరియలు విరిగిపడటం వరకు ల్యాండ్‌స్లైడ్స్‌గా పరిగణించవచ్చు.

కొండచరియలు అనే పదం ఐదు రకాలుగా అవి కిందకు పడడాన్ని సూచిస్తాయి.

పతనం(ఫాల్స్): తక్కువ కొండ వాలు(దాదాపుగా నిటారుగా ఉండే) నుంచి రాళ్లు, మట్టి హఠాత్తుగా కిందకు పడడం.

కూలడం(టోపెల్స్): పదార్థం(రాళ్లు, మట్టి) ఉన్నచోటి నుంచి పట్టువదలి కిందకు కూలడం.

దొర్లడం(స్లైడ్స్) : రాళ్లు, మట్టి కిందకు దొర్లుకుంటూ వెళ్లడం

జారడం(స్ప్రెడ్స్): మట్టి, బురద వంటివి కింద ఆధారంగా ఉన్నప్రాంతం వదులుగా మారినప్పుడు కిందకు జారుకుంటూ వెళ్లడం.ప్రకంపనల వల్ల ఇలా జరగొచ్చు.

కొట్టుకుపోవడం(ఫ్లోస్): ద్రవం తరహా కదలిక. బురద వంటి వదులుగా ఉన్న పదార్థాలు కిందకు కొట్టుకుపోవడం.

రాళ్లు జారిపడి దెబ్బతిన్న ఇళ్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రాళ్లు కదులుతున్న చప్పుడు కొండచరియలు విరిగిపడటానికి సంకేతమని నిపుణులు చెబుతున్నారు.

తప్పించుకోవడం ఎలా?

కొండచరియలు విరిగిపడటం వల్ల 1998 నుంచి 2017 మధ్య సుమారు 18 వేల మంది మరణించారని, 48 లక్షల మందిపై ఆ ప్రభావం పడిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కలు చెప్తున్నాయి.

ప్రమాదం జరిగే అవకాశం ఉందనిపిస్తే వెంటనే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని.. వీలున్నంత త్వరగా అధికారులు సహా ఇరుగుపొరుగు వారికి సమాచారం ఇవ్వాలని అమెరికన్ రెడ్ క్రాస్ సూచిస్తోంది.

చెట్లు పడిపోతున్న శబ్దం, రాళ్లు దొర్లుతున్న శబ్దాలు వినిపిస్తే అప్రమత్తం కావాలని సూచించింది.

నీటి ప్రవాహాల సమీపంలో నివసించే వారైతే.. ‘‘నీటి మట్టం హఠాత్తుగా పెరగడం, లేదంటే తగ్గడం, అంతవరకు తేటగా ఉన్న నీరు బురదలా మారడం వంటి మార్పులు కనిపిస్తే అప్రమత్తం కావాలి. ఇవి కొండచరియలు విరిగిపడుతున్నాయని చెప్పడానికి సంకేతాలు కావచ్చు. వెంటనే అక్కడి నుంచి ఖాళీ చేయడం ఉత్తమం’’ అని అమెరికన్ రెడ్ క్రాస్ పేర్కొంది.

కొండచరియలు విరిగిపడే సందర్భాలలో ప్రజలు తమ ప్రాణాలు ఎలా కాపాడుకోవాలనే విషయంపై అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ అధ్యయనం చేసింది.

ప్రజలు నివసించే భవనాలకు నష్టం కలిగించిన 38 కొండచరియల ఘటనలను పరిశోధకులు విశ్లేషించారు.

ఇందులో ఎక్కువ అమెరికాకు చెందినది అయినప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా జరిగిన కొండచరియల ప్రమాదల వివరాలు కూడా ఉన్నాయి.

కొండచరియలు విరిగిపడే ఘటనల నుంచి ప్రజల ప్రాణాలు కాపాడటానికి సమర్థమైన, తక్కువ ఖర్చుతో కూడుకున్న చర్యలు ఉన్నాయని జోసెఫ్ వార్ట్‌మాన్ చెప్పారు.

ఆయన సివిల్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్‌.

ఉన్నచోటి నుంచి ఎగువ ప్రాంతాలకు వెళ్లడం వల్ల ప్రజలు ప్రాణాలు కాపాడుకునే అవకాశం 12 రెట్లు ఎక్కువగా ఉంటుందని ఆయన చెప్పారు.

తలుపులు, కిటికీలు తెరిచి ఉంచడం మంచిదని సూచించారు.

శిథిలాల్లో చిక్కుకుంటే కదలడం, శబ్దాలు చేయడం వంటివి చేయాలని చెప్పారు.

విరిగిపడ్డ కొండచరియలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2020 ఆగస్ట్ 10న కేరళ రాష్ట్రంలో కొండచరియలు విరిగిపడగా రాళ్లు, మట్టిపెళ్లల కింద చిక్కుకున్న వారిని రక్షిస్తున్న సహాయ బృందాలు(పాత ఫొటో)

ఎంత ప్రమాదకరం?

‘కొండచరియలు విరిగిపడి రాళ్లు దొర్లేటప్పుడు అవి మనిషి పరుగెత్తగలిగే వేగం కంటే ఎక్కువ వేగంతో వెళ్తాయి. కొన్నిసార్లు కొండచరియలు రోజులు, వారాల తరబడి విరిగి పడుతూనే ఉంటాయి’ అని యూఎస్‌జీఎస్ తెలిపింది.

కొండచరియలు విరిగిపడే సమయంలో నీటి ప్రవాహాలు, శిథిలాలు కారణంగా పెద్ద సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

ఈ ఘటనలలో చనిపోవడానికి ప్రధాన కారణం చిక్కుకుపోవడం లేదంటే ఊపిరాడకపోవడమని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది.

కొండచరియలు విరిగిపడిన తరువాత పరిణామాలు కూడా ప్రమాదకరమే.

‘‘కొండచరియలు విరిగిపడటం వల్ల వైద్య వ్యవస్థ, నీరు, కరెంట్, సమాచార వ్యవస్థ లాంటి అత్యవసర సేవలపై తీవ్ర ప్రభావం పడుతుంది’’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

తెగిపోయిన కరెంట్ తీగలు విద్యుదాఘాతానికి కారణమవుతాయి. నీరు, గ్యాస్, మురుగునీటి పైపులైన్లు దెబ్బతింటాయి. అపరిశుభ్ర వాతావరణం ఏర్పడి వ్యాధులకు కారణమవుతాయి.

‘‘కొండచరియలు విరిగిపడిన ఘటనలలో కుటుంబాలు, ఆస్తులు, పశుసంపద, పంటలు కోల్పోవడం వల్ల ప్రజలకు మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి’’ అని తెలిపింది.

ల్యాండ్ స్లైడ్స్

ఫొటో సోర్స్, Getty Images

వాతావరణ మార్పులకు సంకేతమా?

ఉష్ణోగ్రతల పెరుగుదల, వాతావరణ మార్పులు కొండచరియలు విరిగిపడే అవకాశాలను మరింత పెంచుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

‘వాతావరణ మార్పులు తీవ్ర వర్షపాతానికి దారితీస్తుండగా, అవి కొండచరియలు విరిగిపడటానికి కారణమవుతాయి’’ అని యూఎస్‌జీఆర్ తెలిపింది.

ఈ పరిస్థితి ప్రత్యేకించి మంచుతో కూడిన పర్వతప్రాంతాలలో ఎక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

మంచుకరిగి రాతివాలు అస్థిరంగా మారిపోయి కొండచరియలు విరిగిపడటానికి కారణమవుతోందని డబ్ల్యుహెచ్‌ఓ పేర్కొంది.

వాతావరణ మార్పుల కారణంగా కార్చిచ్చులు పెరుగుతాయని యూఎస్‌జీఆర్ తెలిపింది.

‘‘ఇటీవల కాలిపోయిన ప్రాంతాలు, అక్కడి మట్టి, వృక్షసంపదను దెబ్బతీయడం వల్ల కొండచరియలు విరిగిపడే ప్రమాదాన్ని పెంచాయి’’ అని తెలిపింది.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)