కరోనమ్మ, దగ్గులమ్మ పేరుతో కూడా దేవతలు ఎలా పుట్టారు, ఈ నమ్మకాలకు మూలమేంటి?

- రచయిత, ప్రవీణ్ శుభం
- హోదా, బీబీసీ కోసం
నిర్మల్ జిల్లా కుబీర్ గ్రామంలో దగ్గులవ్వ దేవత ఆలయం ఉంది. పిల్లలు, పెద్దలు ఎవరైనా దీర్ఘకాలిక దగ్గుబారినపడినప్పుడు దగ్గులవ్వకు ముడుపు కడతారు. దగ్గు తగ్గిన తరువాత దేవతను దర్శించుకుని ధూపం వేసి, పుట్నాలను నైవేద్యంగా సమర్పిస్తారు.
అదే ఊరిలో కండ్ల పోచమ్మ అనే మరో దేవత ఉంది. పెద్దకళ్ళు చెక్కిన ఓ రాయినే కండ్ల పోచమ్మగా కొలుస్తుంటారు. ఊళ్ళో ఎవరైనా కళ్ళకలకకు గురైతే, అమ్మవారిని మొక్కుకుని నైవేద్యం సమర్పిస్తారు. కళ్ల కలక తగ్గితే వెండితో చేసిన కళ్లను దేవతకు సమర్పించడం ఆచారంగా వస్తోంది.
కండ్ల పోచమ్మ కళ్ల కలక వ్యాధి వ్యాపించకుండా నిరోధిస్తుందని గ్రామస్తుల నమ్మకం.
కేవలం దగ్గు, కళ్లకలకే కాదు, ప్లేగు, కలరా, మశూచీ లాంటి వ్యాధులకు సంబంధించి, గ్రామదేవతలకు మొక్కుకోవడం, ముడుపులు చెల్లించుకోవడం తెలుగురాష్ట్రాల్లో కనిపిస్తుంటుంది.


గ్రామదేవతారాధన ఎలా మొదలైంది?
విపత్తులు, అంటురోగాల వెనుక, అప్పటికింకా తనకు అంతుపట్టని అతీంద్రీయశక్తుల ఆగ్రహమే కారణమని ప్రాచీన మానవులు నమ్మారు. వీటి నుండి గట్టెక్కేందుకు ఆత్మలు, ప్రకృతిశక్తుల ఆరాధనకు పూనుకున్నారు.
వేట దశనుండి గ్రామీణదశలోకి మారే క్రమంలో అది గ్రామదేవతల (Mother Godess) ఆరాధనగా పరిణామం చెందింది.
దక్షిణ భారతదేశంలో.. ప్లేగు,కలరా,మశూచీ వంటి అంటువ్యాధులు, కరువు, అతివృష్టి లాంటి ప్రకృతి విపత్తులనుండి బయటపడేందుకు పోచమ్మ, మైసమ్మ, మారి(తమిళ దేవత), గంగానమ్మ, పైడమ్మ, నూకాలమ్మ వంటి ‘దేవతలను’ పూజించడం ఈ కోవలోకి వస్తుంది.
ప్రపంచ వ్యాప్తంగా అనేక సంస్కృతుల్లో ‘ఆరోగ్య దేవతలు’కనిపిస్తారు.
బౌద్ధ మతంలో ‘హరితి’(Hariti) ని సంతానసాఫల్య దేవతగా, గ్రీకు, రోమన్ సంస్కృతిలో అపోలో (Apollo) ను వ్యాధులను నయం చేసే దేవతగా ఆరాధించారు.

‘కరోనమ్మ, ప్లేగమ్మ’ దేవతలు
జనన మరణాలు, విపత్తులు, వ్యాధులు దైవాధీనాలని నమ్మి వాటి వెనుక కారణాలను ఒక్కో దేవతకు ఆపాదించారు. సాధారణంగా వీరంతా మహిళా దేవతలే. అంటు వ్యాధులనే దేవతలుగా కొలిచిన సందర్భాలున్నాయి.
కోవిడ్‌ను కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో ‘కరోనమ్మ’ పేరుతో దేవత రూపంలో పూజించిన సందర్భం ఇటీవలి కాలానిదే.
1920లో ప్రచురించిన 'ది విలేజ్ గాడ్స్ ఆఫ్ సౌత్ ఇండియా' పుస్తకంలో.. ప్లేగు వ్యాధి వ్యాప్తి సమయంలో 'ప్లేగమ్మ' పేరుతో ఆలయాలు నిర్మించారని రచయిత హెన్రీ వైడ్ హెడ్, ప్రస్తావించారు. (పేజీ21)
‘గ్రామ దేవతల సాధారణ పని గ్రామాన్ని రక్షించడమే అయినా వారిలో కొందరు వ్యాధులు, ప్రకృతి విపత్తుల నుండి రక్షిస్తారని భావించారు. అలాంటి సందర్భాల్లో ఈ దేవతలకు నిర్వహించే తంతులను ఆరాధన అనడం కంటే వారి ఆగ్రహాన్ని చల్లార్చడం అనవచ్చు’’ అని హెన్రీవైట్ హెడ్ వివరించారు. (పేజీ 46)
‘’అమ్మతల్లులను తృప్తి పరిస్తే గ్రామం, పిల్లలు చల్లగా ఉంటారని నమ్మడమనేది భయంతో వచ్చిన పూజా పద్దతి’’ అని తెలుగు చరిత్రకారుడు పరవస్తు లోకేశ్వర్ బీబీసీతో అన్నారు.

‘గుడి లేని దేవతలు’
గ్రామీణ ప్రజాజీవితంపై గట్టి ప్రభావం ఉండే గ్రామ దేవతలకు సాధారణంగా గుడి వంటి ప్రత్యేక నిర్మాణమేమీ ఉండదు.
ప్రసిద్ద తెలుగు చరిత్ర పరిశోధకుడు నేలటూరి వెంకట రమణయ్య తన సిద్దాంత గ్రంథం ‘ఎస్సే ఆన్ ది ఆరిజిన్ ఆఫ్ ది సౌత్ ఇండియన్ టెంపుల్’ (పేజీ : 7677)లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ.. “చాలా గ్రామాల్లో గ్రామదేవతలు చెట్టు నీడన ఉంటారు. సాధారణంగా అది వేప చెట్టు అయి ఉంటుంది. దేవతకు ఒక రూపం అంటూ ఉండదు. చెట్టునే దేవతా స్వరూపంగా భావిస్తారు.’’ అని పేర్కొన్నారు.
గ్రామ దేవతలకు గుళ్లు కట్టకూడదనే నియమాలు కూడా కొన్ని ప్రాంతాల్లోని గ్రామాల్లో ఉన్నాయి. రాయలసీమలో వానదేవతగా పూజించే ‘కప్పాలమ్మ’ విషయంలో ఇలాంటి ఆచారం కనిపిస్తుంది.
“కప్పాలమ్మ ఎండకు ఎండి, వానకు తడవడం ఆచారమని ప్రజల నమ్మకం. గ్రామ పొలిమేరలోని పొలంలో ఒక రాతి రూపంలో దిబ్బపై కప్పాలమ్మ ఉంటుంది.’’ అని ఎస్వీ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ పేట శ్రీనివాసులు రెడ్డి అన్నారు.

ఫొటో సోర్స్, Pillalamarri Srinivas
‘ఆరోగ్య దేవతలు’
ప్రాంతాలను బట్టి గ్రామ దేవతల పేర్లు, పూజాపద్దతులు ప్రత్యేకంగా ఉన్నా వారివల్ల పరిష్కారమవుతాయనే సమస్యల విషయంలో సారూప్యం కనిపిస్తుంటుంది.
పోచమ్మ, ఎల్లమ్మ, పోలేరమ్మ,పెద్దమ్మ, మైసమ్మ, ముత్యాలమ్మ, నూకాలమ్మ, గంగానమ్మ ఇలా తెలుగు రాష్ట్రాల్లో అనారోగ్యం, విపత్తుల బాధలు తప్పిస్తారని ప్రజలు నమ్మే అనేక దేవతా రూపాలు కనిపిస్తాయి.
తమిళనాడులో మారి జల దేవతను, అనారోగ్యాలను రూపుమాపే దేవతగా ఆరాధిస్తారు. కర్ణాటకలో మారమ్మను కలరా దేవతగా పూజిస్తారు.
పశువులకు వ్యాధులు సోకకుండా బంజారాలు శీత్లా దేవతను కొలుస్తారు.
ఈ దేవతలకు ఒకే గ్రామంలో కులాల వారిగా వేర్వేరు పేర్లు,వేర్వేరు గుళ్లు కూడా కనిపిస్తాయి.
“కొన్ని గ్రామాల్లో ఒకే దేవతకు రెండు, మూడు గుళ్లు ఏర్పాటు చేస్తారు. ఉదాహరణకు ముత్యాలమ్మ దేవతకు ఊర ముత్యాలమ్మ, మాదిగ ముత్యాలమ్మ, మాల ముత్యాలమ్మ అని ఉన్నట్లుగానే ఎల్లమ్మ, మైసమ్మలు కూడా ఇద్దరు ముగ్గురు వుంటారు’’ అని ‘తెలంగాణ దళితోద్యమ చరిత్ర’ గ్రంథం లో తెలంగాణ చరిత్ర పరిశోధకుడు డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు.

‘మందులు వేసుకోవడం తప్పనుకునేవారు’
శ్రామిక వర్గానికి చెందిన దళిత, బహుజన ప్రజలు ఎక్కువగా గ్రామ దేవతలను పూజిస్తారు. వైదిక సంప్రదాయానికి భిన్నంగా జానపద పద్దతుల్లో ఈ వర్గాలకు చెందిన వారి ఆధ్వర్యంలోనే తంతులు కొనసాగుతాయి.
“పూజారి అవసరం లేకుండానే ప్రజలు పోచమ్మ దగ్గరికి పోతారు. వారి ప్రార్థనలు మనుషులు రోజూ నిత్య జీవితంలో భాగంగా పరస్పరం మాట్లాడుకునే మాటల మాదిరి ఉంటాయే తప్ప అసాధారణంగా ఉండవు.’’ అని ‘నేను హిందువునెట్లయిత?’ పుస్తకంలో కంచ ఐలయ్య షెపర్డ్ రాశారు.
“వారసత్వంగా ఆస్తులే కాదు విశ్వాసాలు, దేవతలూ వచ్చారు. మశూచీ రోగాన్ని దేవతగా భావిస్తూ ‘అమ్మతల్లి’ అని పిలిచారు. మందులు మింగితే దేవతకు కోపం వస్తుందని భావించేవారు. వ్యాధి తగ్గితే పోచమ్మ కు వెండి కళ్లు సమర్పించేవారు. ఆ తర్వాత కాలంలో టీకాల వల్ల మశూచీ పోయింది’’ అని చరిత్ర పరిశోధకుడు శ్రీరామోజు హరగోపాల్ బీబీసీతో అన్నారు.

జంతు బలి
గ్రామ దేవతలను ప్రసన్నం చేసుకునే తంతుల్లో జంతుబలి ప్రధానంగా కనిపిస్తుంది. గ్రామం పై దుష్టశక్తుల ప్రభావం పడకూడదని, ప్రజలు, పశువులకు అంటువ్యాధులు సోకకుండా నిర్వహించే ‘గ్రామకట్టడి’లో భాగంగా ఇతర గ్రామాలవారిని ఊళ్ళోకి రాకుండా కట్టడి చేస్తారు.
కాలక్రమంలో బలి ఇచ్చే సంప్రదాయాల్లో మార్పులు వచ్చాయి. దున్నపోతు లాంటి పెద్ద జంతువుల స్థానంలో మేకలు, గొర్రెలను బలివ్వడం మొదలైంది. ఒకప్పుడు మనుషులను బలి ఇచ్చేవారని, స్వయంగా దేవతకు ఆత్మార్పణ చేసుకునే సంప్రదాయం ఉండేదని చరిత్రకారులు తమ రచనల్లో ప్రస్తావించారు.
“ఈ దేవతలు పూర్వ కాలం నుండి ఉన్నా వీరిలో కొందరు ఇటీవలి కాలంలో పుట్టిన దేవతలే. అకాలమరణం, అన్యాయంగా హత్యకు గురైన కొంతమంది మహిళలు స్థానికంగా దేవతలుగా ప్రసిద్దులై పూజలందుకున్నారని హెన్రీవైట్ హెడ్ ‘ది విలేజ్ గాడ్స్ ఆఫ్ సౌత్ ఇండియా’ లో వివరించారు.( Page-20)
సమాజహితం కోరి గ్రామ పశుసంపద, స్త్రీల రక్షణలో ప్రాణాలు కోల్పోయిన వారు, సతీసహగమనం చేసిన మహిళలు, దేవతలకు ఆత్మర్పణ చేసిన వారికోసం నెలకొల్పిన స్మారక శిలలైన వీరగల్లులు, సతీశిలలు, పేరంటాండ్రు చేసిన త్యాగాలు కీర్తిని పొంది, కాలక్రమంలో ప్రజల సమస్యలను తీర్చే దేవతలయ్యారని శ్రీరామోజు హరగోపాల్ అన్నారు.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














