పారిస్ ఒలింపిక్స్ 2024: ‘ఫొటో ఆఫ్ ద పారిస్ ఒలింపిక్స్’ ఇదేనా?

గాబ్రియేల్ మెడీనా ఫొటో

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గాబ్రియేల్ మెడీనా

పారిస్ ఒలింపిక్స్‌ సందర్భంగా తీసిన ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో ఉన్నది బ్రెజిలియన్ సర్ఫర్ గాబ్రియేల్ మెడీనా.

దీనిని ఫ్రెంచ్ ఫోటోగ్రాఫర్ జెరోమ్ బ్రౌలెట్‌ తన కెమెరాలో బంధించారు.

పోటీలలో భాగంగా, మెడీనా భారీ అలపై ఒకదానిపై సర్ఫింగ్ చేస్తున్నప్పుడు, బ్రౌలెట్‌కు ఆ రోజు తనకు ఏదో ఒక ప్రత్యేకమైన యాంగిల్ దొరుకుతుందని అనిపించింది.

"పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉన్నాయి. అలలు మేము ఊహించిన దానికంటే పైకి లేస్తున్నాయి. అలా ఈ చిత్రం నా కెమెరాకు చిక్కింది" అని బ్రౌలెట్ వివరించారు.

బ్రౌలెట్ తన కెమెరాలోని ఫొటోలను పరిశీలిస్తున్నపుడు, తాను ఊహించని గొప్ప ఫొటోను తన కెమెరాలో బంధించానని ఆయనకు తెలియదు.

వాట్సాప్ చానల్
గాబ్రియేల్ మెడీనా ఫొటో

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అతి పెద్ద అలపై మెడీనా సయ్యాటలు

మెడీనా సర్ఫింగ్‌ను ముగించి, సరిగ్గా అలపై నుంచి నిష్క్రమిస్తున్న క్షణాన్ని బ్రౌలెట్ తన కెమెరాలో బంధించగలిగారు.

ఈ పోటీలో మెడీనా 9.9 స్కోర్ సాధించారు.

బ్రౌలెట్ ఈ దృశ్యాన్ని కెమెరాలో బంధించిన ఆ క్షణంలో, మెడీనా భూమ్యాకర్షణ శక్తిని ధిక్కరిస్తూ, గాలిలో తేలుతున్నట్లు కనిపిస్తోంది. దానికి తోడు ఆయన సర్ఫింగ్ బోర్డు సైతం మెడీనాకు తోడుగా నిలబడినట్లు ఉంది.

"నిజానికి నేను ఫొటో తీసే సమయానికి అతను అల వెనుక ఉన్నాడు. నాకు అతను కనిపించలేదు. సరిగ్గా అతను కనిపించే ముందు నేను వెంటవెంటనే నాలుగు ఫొటోలు తీశాను, వాటిలో ఇది అత్యుత్తమమైనది" అని బ్రౌలెట్ చెప్పారు.

"ఈ ఫొటోను తీయడానికి నేను పెద్దగా కష్టపడలేదు. కానీ కష్టమైన విషయం ఏమిటంటే, గాబ్రియేల్ ఎప్పుడు అల నుంచి నిష్క్రమిస్తాడు అనేదాన్ని ఊహించడం. అతనికి ఆ అలపై ఉన్నప్పుడే తాను అత్యంత ఎత్తైన అలలలో ఒకదానిపై ఉన్నానని తెలుసనుకుంటా. ఈ ఫొటో అతడు ‘నేను 10 పాయింట్లు సాధించాను’ అని గాలిలోకి ఎగిరినట్లు ఉంది" అని బ్రౌలెట్ అన్నారు.

గాబ్రియేల్ మెడీనా ఫొటో

ఫొటో సోర్స్, Getty Images

బ్రౌలెట్ ఫొటోకు ఆన్‌లైన్‌లో విపరీతమైన స్పందన వచ్చింది.

"ఫొటోలు తీసిన కొద్ది సేపటి తర్వాత నేను విరామంలో నా ఫోన్‌ని చూసుకుంటే, సోషల్ మీడియాలో నాకు చాలా నోటిఫికేషన్‌లు వచ్చాయి. దాంతో నా ఫొటో ఏదో సంచలనం సృష్టించిందని అర్థమైంది" అని బ్రౌలెట్ చెప్పారు.

"ఇది చాలా మంచి షాట్. ఇది చాలా మందికి నచ్చుతుంది. ఇది ఒక సర్ఫింగ్ ఫొటో కాదు కాబట్టి ఇది ఇంకా ఎక్కువ మందిని ఆకర్షిస్తుంది" అని ఆయన అన్నారు.

మెడీనా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేయగా లక్షల లైక్‌లు వచ్చాయి.

అనేక మంది ఇది ‘ఫొటో ఆఫ్ ది పారిస్ ఒలింపిక్స్’ అని కామెంట్ చేశారు.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)