సరబ్‌జోత్ సింగ్: యుద్ధంలో చేయిని పోగొట్టుకున్న హంగేరీ షూటర్ నుంచి ఎలా ప్రేరణ పొందారు, పారిస్‌లో పతకం ఎలా సాధించారు?

ఫొటో సోర్స్, ANI/GETTY
- రచయిత, సౌరభ్ దుగ్గల్
- హోదా, బీబీసీ కోసం
పారిస్ ఒలింపిక్స్ షూటింగ్ ఈవెంట్‌లో మను భాకర్‌తో కలిసి సరబ్‌జోత్ సింగ్ పతకం సాధించాడు. భారత్‌కు ఇది రెండో పతకం.
మంగళవారం జరిగిన 10మీ. ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో సరబ్‌జోత్ సింగ్-మను భాకర్‌లతో కూడిన భారత జట్టు 16-10తో లీ-జియెన్ (దక్షిణ కొరియా)పై గెలుపొంది కాంస్య పతకాన్ని అందుకుంది.
దీంతో షూటింగ్ టీమ్ ఈవెంట్‌లో భారత్‌కు తొలి ఒలింపిక్ పతకం లభించినట్లయింది.
ఈ పతకంతో ఓవరాల్‌గా అన్ని ఒలింపిక్స్‌లలో కలిసి షూటింగ్‌లో భారత్ సాధించిన పతకాల సంఖ్య 6 కు చేరింది.
పారిస్ ఒలింపిక్స్2024: పతకాల పట్టిక కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.


ఫొటో సోర్స్, Getty Images
ఎవరీ సరబ్ జోత్
సరబ్‌జోత్ స్వస్థలం హరియాణాలోని అంబాలా జిల్లా ధీన్ గ్రామం. ఆయన వయస్సు 22 ఏళ్లు.
సరబ్‌జోత్ తాజా విజయానికి హంగేరియన్ సైనికుడు, షూటర్ కరోలి టాకాక్స్ నుంచి పొందిన స్ఫూర్తి కారణమని ఆయన కోచ్ అభిషేక్ రానా తెలిపారు.
అంబాలాలో పుట్టిన సరబ్‌జోత్‌కు హంగేరీ సైనికుడు ఎలా స్ఫూర్తిగా నిలిచారన్నది ఆయన వివరించారు.
మహేశ్వర్ అనే మోటివేషనల్ స్పీకర్ ద్వారా హంగేరియన్ షూటర్ కరోలి టాకాక్స్ గురించి తాను తెలుసుకున్నానని అభిషేక్ చెప్పారు.
‘‘యుద్ధంలో ఒక గ్రనేడ్ దాడిలో కరోలి టాకాక్స్ తన కుడి చేతిని కోల్పోయారు. అయినప్పటికీ ఎడమ చేతితో ఎలా షూట్ చేయాలో ప్రాక్టీస్ చేసి టాకాక్స్ ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించారని నేను తెలుసుకున్నాను. అతని విజయం నాలో ఎంతో స్ఫూర్తి రగిల్చింది.
ఎంత పెద్ద అవరోధాన్నైనా ఎదుర్కొని, అంకిత భావంతో, పట్టుదలతో లక్ష్యాలను సాధించుకోవచ్చని టాకాక్స్ నిరూపించారు. అందుకే టాకాక్స్ విజయగాథను సరబ్‌జోత్‌కు ట్రైనింగ్‌లో ఎప్పడూ చెప్పేవాడిని. అలా మేమిద్దరం ఒలింపిక్స్ మెడల్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం.’’ అని కోచ్ అభిషేక్ రానా వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
‘హంగేరి షూటర్ విజయగాథ సరబ్‌కు స్ఫూర్తి’
పురుషుల 10మీ. ఎయిర్ పిస్టల్ ఈవెంట్ వ్యక్తిగత విభాగంలో ఫైనల్‌కు అర్హత సాధించకపోవడంతో సరబ్ జోత్ చాలా నిరాశ చెందాడు.
అతని ముఖంలో నవ్వు మొత్తం ఆవిరైపోయిందని కోచ్ అభిషేక్ రానా అన్నారు.
‘‘కానీ, ఆ రోజు సాయంత్రం ఆయనకు మళ్లీ తాను హంగేరియన్ షూటర్ కథను గుర్తు చేశా. మర్నాడు జరిగిన మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో మెరుగ్గా రాణించి ఫైనల్‌లో అడుగుపెట్టాడు. కాంస్య పతక పోరుకు ముందు కూడా అన్నీ మర్చిపోయి కేవలం ఆటపైనే దృష్టి సారించాలని సరబ్‌కు చెప్పాను.’’ అని అభిషేక్ తెలిపారు.
2016లో అంబాలాలో అభిషేక్ రానా ఒక షూటింగ్ అకాడమీని ఏర్పాటు చేశారు.
అప్పుడే సరబ్ అకాడమీలో చేరారు. ఏడాదిలోగా 2017లో జూనియర్ నేషనల్ చాంపియన్ షిప్‌లో సరబ్ కాంస్య పతకం సాధించారు. సరబ్‌కు ఆ విజయం ఈ క్రీడలో మరింత ముందుకెళ్లేందుకు కావాల్సిన స్ఫూర్తిని ఇచ్చిందని అభిషేక్ చెప్పారు.
‘‘ఆ తర్వాత సరబ్ జోత్ వెనుదిరిగి చూడలేదు. జాతీయ స్థాయి టోర్నీల్లో సరబ్ ఆధిపత్యం సాగింది. కఠిన శ్రమ, మానసిక దృఢత్వమే అతని విజయాలకు కారణం.’’ అని అభిషేక్ అన్నారు.

ఫొటో సోర్స్, ANI
‘చాలా ఆనందంగా ఉంది’
సరబ్‌జోత్ పతకం సాధించడం పట్ల ఆయన తండ్రి జితేందర్ సింగ్ సంతోషం వ్యక్తం చేశారు.
‘‘మను, సరబ్‌జోత్‌లకు పతకం రావడం చాలా సంతోషంగా ఉంది. అన్నింటి కంటే ముందుగా నేను ఇప్పుడు గురుద్వారాకు వెళ్తున్నాను. ఆ తర్వాత మా గ్రామంలో ఈ విజయాన్ని వేడుకగా జరుపుకుంటాం.’’ అని ఆయన చెప్పారు.
సరబ్‌జోత్ మ్యాచ్‌ను తాను, తన భార్య చూడలేదని ఆయన తెలిపారు.
‘‘ఈరోజు మా అబ్బాయి ఒలింపిక్ పతకం సాధించడంతో చాలా ఆనందంగా ఉంది’’ అని ఆయన అన్నారు.
సరబ్‌జోత్ సింగ్, మను భాకర్‌ల విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా అభినందనలు తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
సరబ్‌జోత్ సింగ్ షూటింగ్ పతకాలు
సరబ్‌జోత్ తొలిసారి ఒలింపిక్స్‌లో పాల్గొన్నాడు. తొలి ఒలింపిక్స్‌లోనే పతకాన్ని అందుకున్నాడు.
మ్యూనిక్ వేదికగా జూన్ 6న జరిగిన ప్రపంచకప్ షూటింగ్ టోర్నీ 10మీ. ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో చాంపియన్‌గా నిలిచిన సరబ్ జోత్ అదే ఆత్మవిశ్వాసంతో ఒలింపిక్స్‌కు వెళ్లాడు.
ఒలింపిక్స్ కాకుండా సీనియర్, జూనియర్ స్థాయిలో ఆడిన ప్రధాన టోర్నీల్లో ఆయన మొత్తం 13 పతకాలు సాధించాడు. ఇందులో ప్రపంచకప్‌లు, ప్రపంచ చాంపియన్‌షిప్‌లు, ఆసియా చాంపియన్‌షిప్ పతకాలు ఉన్నాయి.
సీనియర్ కేటగిరీలో రెండు ప్రపంచ చాంపియన్‌షిప్ స్వర్ణాలు, మూడు ప్రపంచకప్ స్వర్ణాలు, ఆసియా చాంపియన్‌షిప్‌లో ఒక రజతం, కాంస్యం ఆయన ఖాతాలో ఉన్నాయి.
గత రెండేళ్లుగా సరబ్ నిలకడగా విజయాలు సాధిస్తున్నాడు.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














