చార్లెస్ డార్విన్ కప్పలు: తలకిందులుగా సంయోగంలో పాల్గొనే అరుదైన కప్పలు

చార్లెస్ డార్విన్ కప్ప
ఫొటో క్యాప్షన్, అండమాన్‌లో కనిపించే కొన్ని కప్పలను ప్రఖ్యాత ప్రకృతి శాస్త్రవేత్త పేరిట చార్లెస్ డార్విన్ కప్పలు అంటున్నారు
    • రచయిత, సౌతిక్ బిస్వాస్,
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అండమాన్ దీవులలో ఒక జాతి కప్పలు తలక్రిందులుగా వేలాడుతూ సంయోగ క్రియలో పాల్గొంటాయని, గుడ్లు పెడతాయని ఒక కొత్త అధ్యయనం వెల్లడించింది.

మగ, ఆడ చార్లెస్ డార్విన్ కప్పలు (ప్రఖ్యాత జీవ శాస్త్రవేత్త పేరిట వీటికి ఆ పేరు పెట్టారు) రెండూ చెట్ల తొర్రలలో తలక్రిందులుగా వేలాడుతూ సంయోగ క్రియలో పాల్గొంటాయని భారత, అమెరికా దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో వెల్లడించారు.

ఈ క్రమంలో ఉత్పత్తి అయిన గుడ్లు కింద ఉన్న నీళ్లలో పడిపోయి, చిరుకప్పలుగా అభివృద్ధి చెందుతాయి.

“ఇలా తలకిందులుగా పునరుత్పత్తి చేయడం అనేది ఈ కప్పలోని ప్రత్యేకత. పూర్తిగా నీటి బయట, తలకిందులు భంగిమలో, చెట్ల తొర్రలలో ఇలా పునరుత్పత్తి చేసే ఏ కప్పా మనకు ఇంతవరకు తెలియదు.” అని దిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ ఎస్‌డీ బిజు తెలిపారు. ఆయన ప్రస్తుతం హార్వర్డ్ రాడ్‌క్లిఫ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఫెలోగా ఉన్నారు.

"ఈ అధ్యయనం కప్ప జాతులు-పర్యావరణం మధ్య పరస్పర చర్యలను, వాటి మనుగడకు ఏయే ఆవాసాలు అవసరమో అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది." అన్నారు బిజు.

ప్రపంచంలో దాదాపు అన్నీ అంటే 7,708 కప్ప జాతులు నీటిలోను, ఇతర భూసంబంధిత ఆవాసాలలో సంయోగ క్రియ జరిపి, గుడ్లు పెడతాయి. వీటిలో బాహ్య ఫలదీకరణ జరుగుతుంది. సంయోగ సమయంలో ఆడ కప్ప గుడ్లు పెడితే, మగ కప్ప వాటిని ఫలదీకరణం చేయడానికి వీర్యాన్ని విడుదల చేస్తుంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఉష్ణమండల వర్షారణ్యాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అండమాన్ దీవుల్లోని ఉష్ణమండల వర్షారణ్యాలు చార్లెస్ డార్విన్ కప్పలకు నిలయం

యూనివర్శిటీ ఆఫ్ దిల్లీ, జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, హార్వర్డ్ యూనివర్సిటీ, మిన్నెసోటా యూనివర్శిటీకి చెందిన భారతీయ, అమెరికన్ జీవశాస్త్రవేత్తల బృందం మూడేళ్ల పాటు రుతుపవనాల సమయంలో, 55 రాత్రులపాటు మారుమూల అండమాన్ దీవులలో గడిపి, చార్లెస్ డార్విన్ కప్పల పునరుత్పత్తి ప్రవర్తనను అధ్యయనం చేసింది.

ఈ కప్పల విశిష్టత అవి ఎలా జత కడతాయనే దానితోనే పూర్తి కాలేదు. సంయోగ క్రియకు ముందు అవి ఆడకప్పలను ఆకర్షించడానికి చేసే శబ్దాలూ భిన్నంగా ఉంటాయి.

సంయోగ క్రియకు ముందు చాలా కప్పలు సరళమైన శబ్దాలు చేస్తాయి. అవి ఒకే రకంగా ఉంటాయి.

అయితే చార్లెస్ డార్విన్ మగ కప్పలు ఆడకప్పలను ఆకర్షించడానికి చాలా తీవ్రంగా, మూడు రకాల ‘సంక్లిష్టమైన’ శబ్దాలను ఉత్పత్తి చేస్తాయని పరిశోధకులు గుర్తించారు.

ఒకవేళ ఇలాంటి శబ్దాలు వాటితో పోటీ పడే మగ కప్పలను తరిమికొట్టడంలో విఫలమైతే, అవి కాళ్లతో తన్నడం, శరీర భాగాలను కొరకడమూ చేస్తాయని పరిశోధకులు గుర్తించారు.

ఏదైనా మగకప్ప విజయవంతంగా ఆడ కప్ప దగ్గరికి చేరితే, సమీపంలోని మిగతా కప్పలు ఈ జంటతో పోరాటానికి దిగుతాయని, వాటిని వేరు చేయడానికి ప్రయత్నిస్తాయని పరిశోధకులు కనుగొన్నారు.

కప్పలపై పరిశోధన
ఫొటో క్యాప్షన్, చార్లెస్ డార్విన్ కప్పల ప్రవర్తన అధ్యయనానికి శాస్త్రవేత్తలు 55 రాత్రులు అండమాన్ దీవుల్లో గడిపారు

"మా పరిశీలనలో ఈ పోరాటాలు కొన్నిసార్లు కప్పల మరణాలకు దారి తీస్తాయని వెల్లడైంది. శరీర భాగాలను, మొత్తం తలనే కొరికివేయడం వంటి తీవ్రమైన చర్యలు ఈ జాతిలో మాకు కనిపించాయి." అని అధ్యయనానికి నేతృత్వం వహించిన బిజు చెప్పారు.

"మామాలుగా ఇతర జాతులలో బహిరంగ నీటి వనరులలో ఇలాంటి పోరాటాలు జరిగితే, వీటి విషయంలో మాత్రం ఈ పోరాటాలన్నీ వర్షపు నీళ్లతో నిండిన చెట్ల తొర్రలలో జరుగుతున్నాయి. ఈ కప్పలు అలాంటి ప్రత్యేకమైన వ్యూహాలను ఎందుకు అభివృద్ధి చేశాయో అని ఆశ్చర్యంగా ఉంది." అని ఆయన అన్నారు.

మిగతా కప్పలు గుడ్లు పెట్టడానికి అంతరాయం కలిగించకుండా నిరోధించడానికే ఇలా తలక్రిందుల సంయోగ క్రియ ఉద్భవించిందని ఈ అధ్యయనం సూచిస్తుంది.

"ఇది ఆసియాలోని ఉష్ణమండల జీవవైవిధ్య ప్రాంతాలలో, ఇప్పటికీ సైన్స్‌కు తెలియని ఉభయచరాల పునరుత్పత్తిలోని అద్భుతమైన వైవిధ్యానికి ఉదాహరణ." అని అధ్యయనంలో పాల్గొన్న హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన జేమ్స్ హాంకెన్ అన్నారు.

చార్లెస్ డార్విన్ కప్పలు అండమాన్‌లోని కొన్ని దీవులలో తప్ప మరెక్కడా కనిపించవు. కేవలం కొన్ని నిర్దుష్ట అటవీ ఆవాసాలకు పరిమితమైన ఈ కప్పలను అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణా సమితి (ఐయూసీఎన్) అంతరించి పోయే ప్రమాదమున్న జాబితాలో చేర్చింది.

ఈ కప్పలు ఇటీవల మొక్కల నర్సరీలలో నీరు పోసిన ప్లాస్టిక్ సంచులలోను, పారేసిన కంటైనర్లలోనూ సంతానోత్పత్తి చేయడం శాస్త్రవేత్తలు గుర్తించారు.

"సంతానోత్పత్తి కోసం కప్పలు వ్యర్థాలను ఉపయోగించడం చాలా ఆందోళనకరం. మనం దానికి కారణాలను, దీర్ఘకాలిక పరిణామాలను తెలుసుకుని, ఆ జాతుల మనుగడకు వాటి సహజ సంతానోత్పత్తి ప్రదేశాలను పరిరక్షించడానికి మార్గాలను రూపొందించాలి.” అని అధ్యయనంలో పాల్గొన్న హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన సోనాలి గార్గ్ అన్నారు.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)