షూటింగ్‌లో భారత్‌కు మరో కాంస్యం - ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన భారతీయ ప్లేయర్‌గా మను భాకర్

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, శారద మియాపురం
- హోదా, బీబీసీ ప్రతినిధి
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండో పతకం లభించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో మను భాకర్, సరబ్‌జోత్‌లతో కూడిన భారత జట్టు కాంస్యాన్ని గెలుచుకుంది.
కాంస్య పతక పోరులో భారత్ 16-10తో దక్షిణ కొరియా జట్టుపై నెగ్గింది.
ఈ పతకంతో భారత షూటర్ మను భాకర్ ఒలింపిక్స్‌లో ఇప్పటివరకు ఏ భారతీయ ప్లేయర్ సాధించలేని అరుదైన ఘనత సాధించారు.
తద్వారా, ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన ఏకైక భారత ప్లేయర్‌గా, మహిళా షూటర్‌గా మను భాకర్ చరిత్ర సృష్టించారు.
ఆదివారం మహిళల 10మీ. ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లోనూ ఆమె కాంస్య పతకాన్ని గెలిచారు.
దీంతో ఆమె ఖాతాలో రెండు ఒలింపిక్స్ పతకాలు చేరాయి.
మంగళవారం జరిగిన 10మీ. ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో మను భాకర్- సరబ్‌జోత్‌లతో కూడిన భారత జట్టు 16-10తో దక్షిణ కొరియా ద్వయం లీ-యెజిన్‌పై గెలుపొందారు.
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఇది రెండో పతకం. ఈ రెండు పతకాలు షూటింగ్‌లోనే వచ్చాయి. ఒలింపిక్స్‌లో 10మీ. ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో భారత్ గెలిచిన తొలి పతకం ఇదే.
ఓవరాల్‌గా అన్ని ఒలింపిక్స్‌లలో కలిసి షూటింగ్ ఈవెంట్‌లో భారత్ సాధించిన పతకాల సంఖ్య ఆరుకు చేరింది.
షూటింగ్ టీమ్ ఈవెంట్‌లోనూ ఇది భారత్‌కు తొలి ఒలింపిక్ పతకం.
పారిస్ ఒలింపిక్స్2024: పతకాల పట్టిక కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

BBC ISWOTY ఎమర్జింగ్ ఉమన్ ప్లేయర్ అవార్డు
2021లో మను భాకర్ బీబీసీ ‘ఎమర్జింగ్ ఉమన్ ప్లేయర్- 2020’ అవార్డును అందుకున్నారు.
దేశం కోసం మరిన్ని పతకాలు సాధించేందుకు బీబీసీ అవార్డు ప్రేరణ ఇస్తుందని అప్పుడు ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఫైనల్ మ్యాచ్ ఎలా సాగిందంటే?
10మీ. ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్ క్వాలిఫయింగ్ రౌండ్‌లో భారత జట్టు మూడో స్థానంలో, దక్షిణ కొరియా జట్టు నాలుగో స్థానంలో నిలిచి కాంస్య పతక పోరుకు అర్హత సాధించారు.
ఇందులో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు స్వర్ణ, రజతాలకు పోటీపడ్డాయి.
కాంస్య పతక పోరులో మొదటగా 16 పాయింట్లు సాధించిన జట్టు పతకాన్ని గెలుస్తుంది.
భారత్, దక్షిణ కొరియా జట్లు పోటీపడిన కాంస్య పతక పోరు 13 షాట్ల పాటు సాగింది. ప్రతీ షాట్‌కు 2 పాయింట్లు లభిస్తాయి.
మొదటి షాట్‌లో భారత ప్లేయర్లు ఇద్దరూ కలిసి 18.8 పాయింట్లు స్కోరు చేయగా, దక్షిణ కొరియా ద్వయం 20.5 పాయింట్లు సాధించింది. దీంతో దక్షిణ కొరియా ఖాతాలో 2 పాయింట్లు చేరాయి.

ఫొటో సోర్స్, Paris Olympics Website
తర్వాత పుంజుకున్న భారత జోడీ వరుసగా 4 షాట్లలో ఆధిపత్యం ప్రదర్శించి 8 పాయింట్లను సాధించింది.
దీంతో అయిదో షాట్ ముగిసేసరికి భారత్ 8-2తో దక్షిణ కొరియాపై ఆధిక్యంలో నిలిచింది.
ఒక దశలో భారత్ స్కోరు 10 ఉండగా, దక్షిణ కొరియా 6 పాయింట్లతో కాస్త పుంజుకుంది.
అయితే, వరుసగా రెండు షాట్లలో ఆధిపత్యం ప్రదర్శించిన మను, సరబ్ 14-6తో దూసుకెళ్లారు.
తర్వాత కాస్త ఒత్తిడికి గురయ్యారు. ఈ దశలో దక్షిణ కొరియా మరో 4 పాయింట్లు సాధించి పుంజుకునేందుకు ప్రయత్నించింది.
కానీ, వెంటనే భారత జంట 2 పాయింట్లు స్కోర్ చేసి పతకాన్ని సాధించింది.

ఫొటో సోర్స్, Getty Images
మను భాకర్ ఎంతటి ఘనత సాధించారంటే...
పారిస్ ఒలింపిక్స్‌లో మను భాకర్ రికార్డుల మీద రికార్డులు నెలకొల్పారు.
మొదట ఒలింపిక్ పతకం గెలిచిన భారత తొలి మహిళా షూటర్‌గా ఘనత సాధించిన ఆమె, 10మీ. ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో దేశానికి మెడల్ అందించిన మొదటి షూటర్‌గా మరో రికార్డు నెలకొల్పారు.
ఇప్పుడు, ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన ఏకైక భారత ప్లేయర్‌గా, ఏకైక భారత షూటర్‌గా చరిత్ర సృష్టించారు.
తమ కెరీర్‌లో వేర్వేరు ఒలింపిక్స్‌ల్లో రెండు పతకాలు సాధించిన భారత అథ్లెట్లు ఉన్నారు.
బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, రెజ్లర్ సుశీల్ కుమార్ రెండు చొప్పున ఒలింపిక్ పతకాలు సాధించినా అవి వేర్వేరు ఒలింపిక్స్‌లో వచ్చినవి.
అయితే, భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చాక, ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి ప్లేయర్‌గా మను భాకర్ చరిత్రలో నిలిచిపోతారు.
స్వాతంత్ర్యానికి పూర్వం 1900 పారిస్ ఒలింపిక్స్‌లో బ్రిటిష్-ఇండియన్ అథ్లెట్ నార్మన్ ప్రిచర్డ్ రెండు రజత పతకాలు సాధించారు. 200మీ. హర్డిల్స్, 200మీ. పరుగులో ఆయన రన్నరప్‌గా నిలిచారు.
ప్రిచర్డ్ తర్వాత ఇంతవరకు ఏ భారత అథ్లెట్ ఇలా ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలవలేదు.
అయితే, ఆ ఒలింపిక్స్‌లో ప్రిచర్డ్ ప్రాతినిధ్యంపై వివాదం ఉంది.
ప్రిచర్డ్ భారత్‌లో పుట్టిపెరిగారని, భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించారని భారత ఒలింపిక్ చరిత్రకారుడు గులు ఎజెకీల్‌ను ఉటంకిస్తూ పారిస్ ఒలింపిక్స్ వెబ్‌సైట్‌లో రాశారు.
అదే సమయంలో ప్రిచర్డ్ బ్రిటిషర్ అని , ఆయన లండన్ ఏఏఏ (అమెచ్యూర్ అథ్లెటిక్స్ అసోసియేషన్) టీమ్ తరఫున ప్రాతినిధ్యం వహించారని బ్రిటన్‌కు చెందిన ఒలింపిక్స్ చరిత్రకారుడు ఇయాన్ బుచానన్‌ను ఉటంకిస్తూ ఇదే వెబ్‌సైట్‌లో రాశారు.
ఒలింపిక్స్‌కు ముందు ఆయన ఇంగ్లండ్‌కు తరలి వెళ్లారని, ఏఏఏ చాంపియన్‌షిప్‌లో ప్రదర్శన ఆధారంగా ఒలింపిక్స్‌కు అర్హత సాధించారనే వాదనలు ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
భారత్ నుంచి రెండు ఒలింపిక్ పతకాలు సాధించింది ఎవరు?
2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో రెజ్లర్ సుశీల్ కుమార్ కాంస్య పతకం సాధించారు.
ఆతర్వాత 2012 లండన్ ఒలింపిక్స్‌లో సుశీల్ రజతం అందుకున్నాడు.
పీవీ సింధు 2016 రియో ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో రజతాన్ని, టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యాన్ని గెలుచుకున్నారు.
భారత్ ఖాతాలో ఆరో ఒలింపిక్ షూటింగ్ పతకం
ప్రస్తుత పారిస్ ఒలింపిక్స్‌లో వచ్చిన రెండు పతకాలతో ఒలింపిక్స్ చరిత్రలో భారత షూటర్లు సాధించిన పతకాల సంఖ్య ఆరుకు చేరింది.
2004 ఏథెన్స్ క్రీడల్లో రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ పురుషుల డబుల్ ట్రాప్ ఈవెంట్‌లో రజతాన్ని సాధించి భారత్‌కు షూటింగ్‌లో తొలి పతకాన్ని అందించారు.
తర్వాత, 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో అభినవ్ బింద్రా పురుషుల 10మీ. ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో విజేతగా నిలిచి వ్యక్తిగత విభాగంలో ఒలింపిక్స్ స్వర్ణం సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు.
2012 లండన్ క్రీడల్లో భారత షూటర్లు మరింత మెరుగైన ప్రదర్శన చేశారు. ఈసారి ఇద్దరు షూటర్లు పతకాలు సాధించారు.
పురుషుల 10మీ. ఎయిర్ రైఫిల్ విభాగంలో గగన్ నారంగ్ కాంస్య పతకాన్ని, పురుషుల 25మీ. ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్‌లో విజయ్ కుమార్ వెండి పతకాన్ని సాధించారు.
తాజా ఒలింపిక్స్‌లో మహిళల వ్యక్తిగత 10మీ. ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో మనుభాకర్ ఒక కాంస్యాన్ని, మిక్స్‌డ్ టీమ్ విభాగంలో మనుభాకర్-సరబ్‌జ్యోత్‌లతో కూడిన భారత జట్టు మరో కాంస్యాన్ని గెలిచింది.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















