ఇరాన్‌లో చనిపోయిన హమాస్ అగ్రనాయకుడు ఇస్మాయిల్ హనియె, అసలేం జరిగిందంటే..

 ఇస్మాయిల్‌ హనియె

ఫొటో సోర్స్, Reuters

హమాస్‌ అగ్రనేత ఇస్మాయిల్‌ హనియె ఇరాన్‌లో జరిగిన దాడిలో చనిపోయినట్లు హమాస్ గ్రూప్‌ వెల్లడించింది.

ఇరాన్ రాజధాని తెహ్రాన్‌లో ఆయన ఉన్న ఇంటిపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో హనియె ప్రాణాలు కోల్పోయినట్లు బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో హమాస్ పేర్కొంది.

మంగళవారం జరిగిన ఇరాన్ కొత్త అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు హనియె తెహ్రాన్‌ వెళ్లినట్లు ఆ సంస్థ తెలిపింది.

అయితే, ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు ఇప్పటి వరకూ ఎవరూ, ఎలాంటి ప్రకటనా చేయలేదు.

ఈ దాడికి సంబంధించిన వివరాల గురించి స్పష్టమైన సమాచారం లేదని, దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ తెలిపినట్లు వార్తా సంస్థ ఏఎఫ్‌పీ రిపోర్ట్ చేసింది.

''మోసపూరిత యూదు దాడి''లో హనియె చనిపోయారని హమాస్ తెలిపింది.

దీనిపై ఇజ్రాయెల్ ఇప్పటి వరకూ స్పందించలేదు, ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదు.

బీబీసీ న్యూస్ తెలుగు
Ismail Haniyeh

ఫొటో సోర్స్, Reuters

ఎవరీ హనియె.?

పాలస్తీనా శరణార్థుల శిబిరంలో జన్మించిన ఇస్మాయిల్ హనియె, హమాస్ ముఖ్య నాయకుల్లో ఒకరిగా ఎదిగారు.

62 ఏళ్ల హనియె 1980ల చివర్లో హమాస్ ఉద్యమంలో కీలక సభ్యుడిగా మారారు.

1989లో పాలస్తీనా మొదటి తిరుగుబాటు అణచివేత సమయంలో హనియెను ఇజ్రాయెల్ మూడేళ్లపాటు జైల్లో పెట్టింది.

1992లో మరికొంతమంది హమాస్ నాయకులతో పాటు బహిష్కరణకు గురైన హనియె.. ఇజ్రాయెల్ - లెబనాన్ మధ్యనున్న నిర్మానుష్య ప్రదేశంలో ఉండాల్సి వచ్చింది.

ఏడాది బహిష్కరణ తర్వాత గాజాకి తిరిగి వచ్చారు.

1997లో హమాస్ మూమెంట్ మతపెద్ద షేక్ అహ్మద్ యాసిన్ కార్యాలయ అధినేతగా ఆయనను ఎంపిక చేశారు. ఇది ఆయన్ను మరింత శక్తిమంతుడిని చేసింది.

జాతీయ ఎన్నికల్లో హమాస్ అత్యధిక సీట్లు గెలుచుకున్న తర్వాత, అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ 2006లో హనియెను పాలస్తీనా ప్రధాన మంత్రిగా నియమించారు. వారం రోజుల హింసాకాండ కారణంగా ఏడాదికే ఆయన తన పదవిని కోల్పోయారు.

పదవి నుంచి తొలగించడం ''రాజ్యాంగ విరుద్ధం'' అంటూ తిరస్కరించారు. పాలస్తీనా ప్రజల పట్ల తమ బాధ్యతలను, తమ ప్రభుత్వం విస్మరించదంటూ గాజాలో పాలన కొనసాగించారు.

2017 మే 6న హమాస్ పొలిటికల్ బ్యూరోకి అధినేతగా ఎన్నికయ్యారు.

2018లో అమెరికా విదేశాంగ శాఖ ఇస్మాయిల్ హనియెను టెర్రరిస్టుగా పేర్కొంది. ఆయన గత కొన్నేళ్లుగా ఖతార్‌లో నివాసముంటున్నారు.

ఇస్మాయిల్ హనియె

ఫొటో సోర్స్, Reuters

'శిక్ష అనుభవించాల్సిందే'

హనియె హత్యకు తప్పకుండా ప్రతిస్పందన ఉంటుందని హమాస్ సీనియర్ నేత ఒకరు అన్నారు.

'ఈ పిరికిపంద చర్యకు శిక్ష అనుభవించక తప్పదు' అని మౌసా అబు మర్జౌక్ అన్నారని హమాస్ నిర్వహిస్తున్న అల్ అక్సా టీవీ చానెల్ పేర్కొంది.

ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, REUTERS

'నో కామెంట్’ అన్న ఐడీఎఫ్

హనియె మరణంపై విదేశీ మీడియా రిపోర్టులకు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) స్పందించదని సీఎన్ఎన్, న్యూస్‌వైర్ ఏజెన్సీ ఫ్రాన్స్ - ప్రెస్ సహా పలు మీడియా సంస్థలకు ఐడీఎఫ్ తెలిపింది.

హనియె మరణంపై ఇజ్రాయెల్ అధికారికంగా ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకటన విడుదల చేయకపోయినప్పటికీ, ఇజ్రాయెల్ మంత్రి అమిచాయ్ ఎలియాహు వంటి కొందరు రాజకీయ నాయకులు మాత్రం దీనిపై స్పందిస్తున్నారు.

హనియె మరణం ''ప్రపంచాన్ని మరికొంత సురక్షిత ప్రదేశంగా మార్చింది'' అని అమిచాయ్ తన ఎక్స్ ఖాతాలో రాశారు.

''ప్రపంచం నుంచి ఇలాంటి చెత్తను శుభ్రం చేసేందుకు ఇదే సరైన మార్గం. ఇకపై ఎలాంటి శాంతి ఒప్పందాలు/లొంగుబాటు ఒప్పందాలు లేవు. అలాంటి వారిపట్ల ఎలాంటి కనికరమూ ఉండదు'' అని ఆయన రాశారు.

ఇరాన్, ఇజ్రాయెల్

యుద్ధానికి దగ్గరగా మిడిల్ ఈస్ట్

హమాస్ కీలక నాయకుడు ఇస్మాయిల్ హనియె హత్య మిడిల్ ఈస్ట్‌ ప్రాంతాన్ని యుద్ధానికి మరింత చేరువ చేసిందని జార్జ్‌టౌన్ యూనివర్సిటీలో మిడిల్ ఈస్టర్న్ స్టడీస్ ప్రొఫెసర్ నాదర్ హషెమి బీబీసీతో చెప్పారు.

''ఇది చాలా పెద్ద విషయం. లెబనాన్‌ పరిస్థితులను కూడా ప్రభావితం చేస్తుందని భావిస్తున్నా. ఎందుకంటే, కొద్దిగంటల ముందే దక్షిణ బేరూత్‌లో ఒక సీనియర్ హిజ్బొల్లా నాయకుడిని హత్య చేసేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నించింది. ఇరాన్, హిజ్బొల్లాలు ఉద్రిక్తతలు పెంచాలని అనుకోలేదని అనుకుంటున్నా. కానీ, హనియె హత్య ఇప్పుడా పరిస్థితులను తల్లకిందులు చేసింది’’ అని ఆయన చెప్పారు.

''ఇప్పుడు ఈ ఘర్షణను ఇరాన్ మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉంది'' అన్నారు ప్రొఫెసర్ హషెమి.

'పరిస్థితి అంచనావేస్తున్నాం'

హనియె మరణంపై ఇజ్రాయెల్ నుంచి బీబీసీకి ఎలాంటి స్పందన రాలేదు.

కానీ, ఇజ్రాయెల డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) ప్రతినిధి డేనియల్ హగారి మాట్లాడుతూ, ''హోం డిఫెన్స్ పాలసీ(అంతర్గత రక్షణ విధానం)లో ఎలాంటి మార్పులూ లేవు'' అని చెప్పారు.

''ప్రస్తుతం ఐడీఎఫ్ పరిస్థితులను అంచనా వేస్తోంది. విధానాల్లో ఏవైనా మార్పులు ఉంటే, వెంటనే ప్రజలకు తెలియజేస్తాం'' అని ఆయన ఎక్స్‌లో రాశారు.

లాయిడ్ ఆస్టిన్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, లాయిడ్ ఆస్టిన్

'యుద్ధం అనివార్యం కాదు'

మిడిల్ ఈస్ట్‌లో ఘర్షణలు తీవ్రతరం కావడం అనివార్యమని తాను భావించడం లేదని అమెరికా రక్షణ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్ మరోసారి పునరుద్ఘాటించారు.

"యుద్ధం అనివార్యమని నేను అనుకోవడం లేదు. అదే నేను మళ్లీ చెబుతున్నా. దౌత్యపరమైన చర్చల ద్వారా పరిష్కారానికి అవకాశాలు ఇంకా ఉన్నాయని భావిస్తున్నా" అని ఫిలిప్పీన్స్ పర్యటనలో ఉన్న ఆస్టిన్ మీడియాతో అన్నారు.

హనియె మరణంపై ఆయన మాట్లాడలేదు, దాని గురించి తన వద్ద అదనపు సమాచారం ఏమీ లేదని ఆయన చెప్పారు.

ఉద్రిక్తతలు తీవ్రతరమవుతున్న పరిస్థితుల్లో ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు ఎలా ఉండబోతుందని అడిగినప్పుడు, ''ఉద్రిక్తతలను తగ్గించడం, వాతావరణాన్ని చల్లబరచడం'' ఇప్పటికీ తమ లక్ష్యమని ఆయన చెప్పారు.

ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, Reuters

గైడెడ్ మిస్సైల్‌తో దాడి..

తెహ్రాన్‌లోని ఇస్మాయిల్ హనియె ప్రైవేటు నివాసమే లక్ష్యంగా గైడెడ్ మిస్సైల్ (నిర్దేశిత లక్ష్యాలను ఛేదించే క్షిపణి)‌తో దాడి చేసినట్లు సౌదీ వార్తా సంస్థ అల్ హదత్ వర్గాలు తెలిపాయి.

స్థానిక కాలమానం ప్రకారం, సుమారు 2 గంటలకు మిస్సైల్ ఇంటిని తాకినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా కూడా రిపోర్ట్ చేసింది.

తెహ్రాన్‌కి ఉత్తరాన ఉన్న ఇంట్లో ఆయన ఉన్నారని, ఆకాశం నుంచి జరిపిన దాడిలో ఆయన చనిపోయారని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ అనుబంధ వార్తా సంస్థ ఫార్స్ న్యూస్ కూడా తెలిపింది.

వీడియో క్యాప్షన్, హనియె మృతిపై పెదవి విప్పని ఇజ్రాయెల్

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)