భీకరదాడులు చేసే హిజ్బొల్లాను నడిపేది ఎవరు, ఇజ్రాయెల్‌తో ఆ సంస్థ యుద్ధానికి దిగుతుందా?

షేక్ హసన్ నస్రల్లా

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, 1992 నుంచి హిజ్బొల్లాకు నాయకత్వం వహిస్తున్న షియా మత గురువు షేక్ హసన్ నస్రల్లా

లెబనాన్‌ రాజధాని బేరూత్‌ నగరానికి దక్షిణం వైపున శివారు ప్రాంతంపై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. ఈ దాడిలో హిజ్బొల్లాకు చెందిన సీనియర్ కమాండర్ చనిపోయారని, పలువురు గాయపడ్డారని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది.

అంతకుముందు, ఇజ్రాయెల్ ఆక్రమిత గోలన్‌హైట్స్‌ ప్రాంతంలో హిజ్బొల్లా చేసిన రాకెట్ దాడిలో 12 మంది మరణించినట్లు ఇజ్రాయెల్ ఆరోపించింది. మృతుల్లో అత్యధికులు చిన్నారులేనని తెలిపింది.

ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దు, దాని చుట్టుపక్కల ప్రాంతాలలో గత తొమ్మిది నెలల్లో జరిగిన అత్యంత తీవ్రమైన దాడి గోలన్‌హైట్స్‌ ప్రాంతంలో జరిగిందేనని చెబుతున్నారు. అయితే, ఆ దాడితో తమకు సంబంధం లేదని హిజ్బొల్లా చెప్పింది.

గోలన్‌హైట్స్‌‌‌పై దాడికి ప్రతీకారంగానే తాము లెబనాన్‌లోని హిజ్బొల్లా స్థావరంపై దాడి చేశామని ఇజ్రాయెల్ సైన్యం చెప్పింది. గోలన్‌హైట్స్‌‌‌పై దాడి వెనకున్న ఫౌద్ షుకుర్‌ను లక్ష్యంగా చేసుకుని పక్కా నిఘా సమాచారంతో తమ ఫైటర్ జెట్లు దాడి చేశాయని ఇజ్రాయెల్ సైనిక అధికారులు తెలిపారు.

ఇజ్రాయెల్ దాడిని లెబనాన్ ప్రధానమంత్రి నజిబ్ ఖండించారు.

ఈ వరుస పరిణామాలతో ఇజ్రాయెల్, హిజ్బొల్లా మధ్య భీకర యుద్ధం జరుగుతుందేమోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

లెబనాన్ శివారు ప్రాంతం

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, లెబనాన్ శివారు ప్రాంతంపై ఇజ్రాయెల్ దాడి చేసింది

హిజ్బొల్లా అంటే ఏమిటి?

హిజ్బొల్లా అనేది షియా ముస్లిం సంస్థ. లెబనాన్‌లో రాజకీయంగా చాలా ప్రభావవంతమైనది. లెబనాన్‌లోని అత్యంత శక్తిమంతమైన సాయుధ దళం దీని నియంత్రణలో ఉంది.

ఇది 1980ల ప్రారంభంలో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా, ఈ ప్రాంతంలోని ఆధిపత్య షియా శక్తి అయిన ఇరాన్ ‌దీనిని స్థాపించింది.

అప్పుడు లెబనాన్ అంతర్యుద్ధం సమయంలో ఇజ్రాయెల్ దళాలు దక్షిణ లెబనాన్‌ను ఆక్రమించాయి.

హిజ్బొల్లా 1992 నుంచి లెబనాన్ జాతీయ ఎన్నికలలో పాల్గొంటూ, ప్రధాన రాజకీయ శక్తిగా మారింది.

దాని సాయుధ విభాగం లెబనాన్‌లోని ఇజ్రాయెల్, అమెరికా దళాలపై తీవ్రమైన దాడులు చేసేది.

2000 సంవత్సరంలో లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ వైదొలిగినప్పుడు, తామే వారిని తరిమి కొట్టామని హిజ్బొల్లా చెప్పుకుంది.

అప్పటి నుంచి హిజ్బొల్లా దక్షిణ లెబనాన్‌లో వేలాది మంది ఫైటర్లు, క్షిపణులతో సహా అనేక రకాల ఆయుధాలను సమకూర్చుకుంటూ, వివాదాస్పద సరిహద్దు ప్రాంతాల్లో ఇజ్రాయెల్ ఉనికిని వ్యతిరేకిస్తూ వస్తోంది.

పాశ్చాత్య దేశాలు, ఇజ్రాయెల్, గల్ఫ్ అరబ్ దేశాలు, అరబ్ లీగ్ హిజ్బొల్లాను ఉగ్రవాద సంస్థగా గుర్తించాయి.

2006లో హిజ్బొల్లా సరిహద్దులు దాటి దాడి చేసినప్పుడు హిజ్బొల్లా, ఇజ్రాయెల్ మధ్య పూర్తిస్థాయి యుద్ధం జరిగింది.

హిజ్బొల్లాను నిర్మూలించడానికి ఇజ్రాయెల్ దళాలు దక్షిణ లెబనాన్‌పై దాడి చేసినా, అది నిలదొక్కుకుని అప్పటి నుంచి తన ఫైటర్ల సంఖ్యను పెంచుకుని, మరింత మెరుగైన ఆయుధాలను సమకూర్చుకుంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్

హసన్ నస్రల్లా ఎవరు?

షేక్ హసన్ నస్రల్లా 1992 నుంచి హిజ్బొల్లాకు నాయకత్వం వహిస్తున్న షియా మత గురువు.

దానిని రాజకీయంగా, సైనిక దళంగా మార్చడంలో ఆయనదే కీలక పాత్ర.

ఆయనకు ఇరాన్‌తోనూ, ఆ దేశ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీతో సన్నిహిత సంబంధాలున్నాయి.

1981లో ఇరాన్ మొదటి సుప్రీం లీడర్ ఆయతొల్లా రుహొల్లా ఖొమైనీ, లెబనాన్‌లో ఆయనను తన వ్యక్తిగత ప్రతినిధిగా నియమించిన నాటి నుంచి ఈ సంబంధాలు కొనసాగుతున్నాయి.

ఇజ్రాయెల్ తనను చంపేస్తుందనే భయంతో నస్రల్లా చాలా సంవత్సరాలుగా బయట కనిపించడం లేదు.

అయినప్పటికీ, ఆయనను హిజ్బొల్లాలో అందరూ గౌరవిస్తారు. ప్రతి వారం ఆయన టీవీలో ప్రసంగిస్తారు.

మంటలు

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, జులై మొదటి వారంలో ఇజ్రాయెల్‌పై 200లకు పైగా రాకెెట్లను హిజ్బొల్లా ప్రయోగించింది

హిజ్బొల్లా దళాలు ఎంత శక్తిమంతమైనవి?

ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన ప్రభుత్వేతర సాయుధ దళాలలో హిజ్బొల్లా ఒకటి. దీనికి ఇరాన్ నిధులు, ఆయుధాలను సమకూరుస్తోంది.

షేక్ హసన్ నస్రల్లా తమ వద్ద 1,00,000 మంది ఫైటర్లు ఉన్నారని చెప్పుకుంటున్నారు. కానీ, వాస్తవ అంచనాల ప్రకారం ఈ సంఖ్య 20,000 - 50,000 ఉండవచ్చని తెలుస్తోంది.

వీరిలో అనేక మంది సాయుధ శిక్షణ పొందినవాళ్లు, సిరియన్ అంతర్యుద్ధంలో పోరాడిన వాళ్లు ఉన్నారు.

సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ అనే సంస్థ ప్రకారం, వీరి వద్ద 1,20,000 నుంచి 2,00,000 రాకెట్లు, క్షిపణులు ఉన్నాయని అంచనా.

హిజ్బొల్లా ఆయుధాలలో ఎక్కువ భాగం చిన్న, అన్-గైడెడ్ సర్ఫేస్-టు-సర్ఫేస్ ఆర్టిల్లరీ రాకెట్‌లు. అయితే హిజ్బొల్లా వద్ద యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్, యాంటీ-షిప్ క్షిపణులు, ఇజ్రాయెల్ భూభాగంపై దాడి చేయగల గైడెడ్ క్షిపణులూ ఉన్నాయని భావిస్తున్నారు.

ఇవి గాజా స్ట్రిప్‌లోని హమాస్ వద్ద ఉన్న వాటికంటే అత్యంత అధునాతన ఆయుధాలు.

హిజ్బొల్లా ప్రపంచంలోని ప్రభుత్వేతర, అత్యంత సాయుధ దళాలలో ఒకటి

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, హిజ్బొల్లా రాకెట్లకు ప్రతిస్పందనగా లెబనీస్ పౌరుల ఇళ్లపై ఇజ్రాయెల్ దాడులు

హిజ్బొల్లా ఇజ్రాయెల్‌తో యుద్ధం చేస్తుందా?

2023 అక్టోబర్ 8న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి జరిగిన తర్వాత, పాలస్తీనియన్లకు సంఘీభావంగా ఇజ్రాయెల్ స్థావరాలపై హిజ్బొల్లా కాల్పులు జరిపాక ఇరుపక్షాల మధ్య పోరు తీవ్రమైంది.

అప్పటి నుంచి హిజ్బొల్లా ఉత్తర ఇజ్రాయెల్, గోలన్ హైట్స్‌లోని ఇజ్రాయెల్ స్థావరాలపై రాకెట్లను, సాయుధ వాహనాలపై యాంటీ-ట్యాంక్ క్షిపణులను ప్రయోగించి, డ్రోన్‌లతో సైనిక లక్ష్యాలపై దాడి చేసింది.

దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ రక్షణ దళం (ఐడీఎఫ్) లెబనాన్‌లోని హిజ్బొల్లా స్థావరాలపై వైమానిక దాడులు, కాల్పులతో ప్రతీకారం తీర్చుకుంది.

ఇజ్రాయెల్ దాడుల్లో దాదాపు 100 మంది పౌరులు, 366 మంది హిజ్బొల్లా యోధులు మరణించడంతో లెబనాన్‌లో 90,000 మందికి పైగా ప్రజలు తమ ఇళ్లను విడిచిపెట్టారని ఐక్యరాజ్య సమితి పేర్కొంది.

అదే సమయంలో హిజ్బొల్లా దాడుల కారణంగా ఇజ్రాయెల్‌లో 60,000 మంది పౌరులు తమ ఇళ్లను విడిచిపెట్టాల్సి వచ్చిందని, 10 మంది పౌరులతో సహా 33 మంది మరణించారని అధికారులు తెలిపారు.

పోరు సాగుతున్నా, ఇప్పటి వరకు ఇరుపక్షాలు హద్దు దాటి, పూర్తి స్థాయి యుద్ధానికి వెళ్లకుండా, పరిస్థితిని అదుపులో ఉంచడమే లక్ష్యంగా పెట్టుకున్నాయని పరిశీలకులు అంటున్నారు.

అదే సమయంలో, ఏదైనా అనుకోని ఘటన జరిగితే పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)