గోలన్ హైట్స్ : హిజ్బుల్లా, ఇజ్రాయెల్‌లను యుద్ధం అంచున నిలిపిన ‘రాకెట్ దాడి’

ఫొటో సోర్స్, EPA
- రచయిత, మార్క్ లోవెన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
గత ఏడాది అక్టోబర్ నుంచి జరిగిన దాడుల్లో లెబనాన్‌లో 450 మంది మరణించారు. అదే సమయంలో తమ దేశంలో 23 మంది పౌరులు,17 మంది సైనికులు మరణించారని ఇజ్రాయెల్ అంటోంది.
ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో జరిగిన ఘర్షణలు నియంత్రణలోనే ఉన్నప్పటికీ గత వారం చివర్లో గోలన్ హైట్స్‌పై జరిగిన దాడితో అంతా మారిపోయింది.
ఇజ్రాయెల్ - లెబనాన్ సరిహద్దు ప్రాంత ప్రజల్లో ఇప్పుడు యుద్ధ భయం పెరిగింది.
లెబనాన్ సరిహద్దు నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైఫా యూనివర్సిటీ ఎలాంటి రిస్క్ తీసుకోవాలనుకోవడం లేదు.
ఇజ్రాయెల్ ఆక్రమిత గోలన్ హైట్స్‌లోని సాకర్ మైదానంలో శనివారం జరిగిన రాకెట్ దాడిలో 12 మంది పిల్లలు, యువకులు మరణించడంతో ఆ యూనివర్సిటీ జాగ్రత్త చర్యలు చేపట్టింది. 30 అంతస్తులున్న వర్సిటీ భవనంలోని అయిదో అంతస్తు నుంచి ఆ పైన అంతస్తుల్లోని సిబ్బంది అందరూ ఇంటి నుంచే పని చేయాలని వర్సిటీ అడ్మినిస్ట్రేషన్ చెప్పింది.
లెబనాన్‌కు చెందిన మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లా నుంచి తమకు ప్రమాదం పొంచి ఉందని అక్కడివారిలో ఆందోళన ఉంది.
‘2006లో హిజ్బుల్లాతో యుద్ధం జరిగిన సమయంలో వారి ఆయుధాలు హైఫా వరకు వచ్చాయి’ అని వర్సిటీ సిబ్బందిలో ఒకరైన ఇష్తార్ పర్పారా చెప్పారు.
‘ఇది చాలా ప్రమాదకరమైన సమయం. కిండర్ గార్టెన్ స్కూళ్లను పర్యవేక్షించడానికి పోలీసులకు, గార్డులకు తల్లిదండ్రులు సహాయం చేస్తున్నారు. నేను రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లడం లేదు. మేం యుద్ధం కోరుకోవడం లేదు, కానీ హిజ్బుల్లా ఇజ్రాయెల్‌ను, యూదులను నాశనం చేయాలనుకుంటోంది’ అని ఇష్తార్ అన్నారు.


ఫొటో సోర్స్, Reuters
ఇజ్రాయెల్ వైపు గురిపెట్టిన రెండు గ్రూపులు..
అక్టోబరు 8 నుంచి ఇజ్రాయెల్, లెబనాన్ సరిహద్దులలో కాల్పుల ఘటనలు పెరిగాయి. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేసిన ఒక రోజు తర్వాత హిజ్బుల్లా ఇజ్రాయెల్ వైపు రాకెట్లను ప్రయోగించింది.
ఈ రెండు గ్రూపులు ఇజ్రాయెల్ నాశనం కోసం పిలుపునిస్తున్నాయి.
హిజ్బుల్లా తరచూ ఉత్తర ఇజ్రాయెల్, గోలన్ హైట్స్‌పై దాడి చేస్తుంటుంది. (ఇజ్రాయెల్ 1967 యుద్ధంలో సిరియా నుంచి గోలన్ హైట్స్‌ను స్వాధీనం చేసుకుంది, 1981లో అది ఇజ్రాయెల్‌లో భాగమైంది).
దక్షిణ లెబనాన్, ఇతర ప్రాంతాలపై విమానాలు, క్షిపణులతో ఇజ్రాయెల్ ప్రతి దాడులు చేస్తుంటుంది.
గత అక్టోబర్ నుంచి జరిగిన దాడుల్లో లెబనాన్‌లో 100 మంది పౌరులు సహా 450 మంది మరణించారు.
మరోవైపు ఇజ్రాయెల్ కూడా తమ దేశంలో 23 మంది పౌరులు,17 మంది సైనికులు మరణించారని తెలిపింది.

ఫొటో సోర్స్, REUTERS
‘మూల్యం చెల్లించాల్సిందే’
అయితే శనివారం నాటి ఘటన తర్వాత ఇజ్రాయెల్ ఎంత దూరం వెళ్తుందన్నది ఇప్పుడు ప్రశ్న.
నిరుడు అక్టోబరు 7 దాడి తర్వాత శనివారం నాటి దాడే ఇజ్రాయెల్ సరిహద్దులో అతిపెద్ద దాడి.
గోలన్ హైట్స్ దాడిలో చనిపోయిన చిన్నారులకు సంతాపం తెలిపేందుకు వేలాది మంది బారులు తీరారు. తెల్లవారుజామున చిన్న శవపేటికల్లో మృత దేహాలను తీసుకెళ్తుండగా చేతులలో పూలతో రోడ్డుపక్కన నిల్చుని వీడ్కోలు పలికారు.
మనుషుల ప్రాణాలు తీసేంత భయంకరమైన రాకెట్‌ను ప్రయోగించలేదని హిజ్బుల్లా చెబుతోంది, అయితే వారు అబద్దాలు చెబుతున్నారని ఇజ్రాయెల్ అంటోంది.
ఇజ్రాయెల్ భారీ దాడికి పాల్పడొచ్చని భావించిన లెబనాన్ మిలిటెంట్లు, ముందు జాగ్రత్తగా లెబనాన్‌కు దక్షిణాన, తూర్పు బెకా లోయలోని కీలక స్థావరాలను ఖాళీ చేసినట్లు తెలుస్తోంది.
హిజ్బుల్లా దాడి చేసిన సమయంలో అమెరికా పర్యటనలో ఉన్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వెంటనే తిరిగొచ్చారు.
భద్రత సమావేశాన్ని ఏర్పాటుచేసి హిజ్బుల్లా దాడులను గట్టిగా తిప్పికొట్టాలని తన దేశ అధికారులకు సూచించారు.
హిజ్బుల్లా భారీ మూల్యం చెల్లించక తప్పదని నెతన్యాహు హెచ్చరించారు.
ఇజ్రాయెల్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ మాట్లాడుతూ.. హిజ్బుల్లా నాయకుడు హసన్ నస్రల్లా ఈ దాడికి మూల్యంగా తన తలను చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఇజ్రాయెల్‌కు ఇరాన్ ముప్పు
హిజ్బుల్లాతో యుద్ధం జరిగితే రెండు వైపులా నష్టం తప్పదని ఇజ్రాయెల్‌కు తెలుసు.
మొత్తం మధ్యప్రాచ్యంలో హిజ్బుల్లా అత్యంత శక్తిమంతమైన సాయుధ గ్రూప్. వారి దగ్గర 1,50,000 రాకెట్లు, క్షిపణులు ఉన్నాయి.
మిడిల్ ఈస్ట్‌లో ఇరాన్‌కు హిజ్బుల్లా అత్యంత ముఖ్యమైన భాగస్వామి కూడా. ఇజ్రాయెల్ ఈ గ్రూప్‌పై దాడి చేస్తే ఇరాన్ వారికి సహాయం చేయొచ్చు.
ఇప్పటికే ఇరాన్... లెబనాన్‌లో ఎలాంటి సాహసం చేసినా అనూహ్య పరిణామాలు ఎదుర్కోక తప్పదని నేరుగా ఇజ్రాయెల్‌ను హెచ్చరించింది.
మరోవైపు, ఇజ్రాయెల్ ఇప్పటికే గాజాలో బిజీగా ఉండడంతో హిజ్బుల్లాతో తలపడడం సులభం కాకపోవచ్చు.
లెబనాన్ సరిహద్దు వైపు నివసించే 60,000 మంది ఇజ్రాయెలీలు ఇప్పటికే నిరాశ్రయులయ్యారు. వారంతా తమకు హిజ్బుల్లా నుంచి బెదిరింపులు లేకుండా ఇజ్రాయెల్ ప్రభుత్వం పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
నెతన్యాహుపై విమర్శలు
ఇజ్రాయెల్‌లో నెతన్యాహుకు ప్రజాదరణ తగ్గుతోంది, దీంతో ఆయన తన రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి చేయగలిగినదంతా చేస్తున్నారనేది తరచూ వినిపిస్తున్న ఆరోపణ.
గాజా యుద్ధాన్ని నెతన్యాహు పొడిగించాలనుకుంటున్నారని విమర్శకులు ఆయనపై ఆరోపణలు చేస్తున్నారు. దీని కోసం, ఆయన హమాస్ ముందు కాల్పుల విరమణ కోసం చాలా కఠినమైన డిమాండ్లను ఉంచుతున్నారని ఆరోపిస్తున్నారు. యుద్ధం ఆగిన వెంటనే ఇజ్రాయెల్‌లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని, ఆ తర్వాత తన రాజకీయ జీవితం ముగిసిపోవచ్చని నెతన్యాహుకు తెలుసని విమర్శకులు అంటున్నారు.
దూకుడుగా ఉన్న ఫార్-రైట్ మినిస్టర్ల కారణంగా నెతన్యాహు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని, దేశంపై ఆయనకున్న పట్టు కూడా సన్నగిల్లుతుందని వారు భయపడుతున్నారు.
స్వదేశంలో రాజకీయ ప్రయోజనాల కోసం నెతన్యాహు ఇప్పుడు లెబనాన్ సరిహద్దులకు యుద్ధాన్ని విస్తరించొచ్చు.
ఇది ప్రమాదకర సమయం. రెండు వర్గాలు సంయమనం పాటించాలని అంతర్జాతీయంగా విజ్ఞప్తులు వస్తున్నాయి. కానీ గోలన్ హైట్స్‌పై రాకెట్ దాడి భారీ యుద్ధానికి దారితీస్తుందా అనేదే ఇప్పుడున్న పెద్ద ప్రశ్న.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















