వైపర్: రూ. 3,767 కోట్లు ఖర్చు చేసిన తర్వాత ఈ ప్రాజెక్టును నాసా ఎందుకు నిలిపివేసింది?

ఫొటో సోర్స్, NASA
- రచయిత, సిరాజ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
చంద్రుని దక్షిణ ధ్రువం దగ్గర నీరు, మంచు ఉనికిని నిర్ధరించడానికి వైపర్ అనే ప్రాజెక్టును చేపడుతున్నట్లు నాసా 2021లో ప్రకటించింది. అందులో భాగంగా చంద్రుని పైకి రోవర్‌ను పంపనున్నట్లు తెలిపింది. అయితే, ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఈ ప్రాజెక్ట్‌ను ఇప్పుడు నిలిపివేశారు.
ఈ ప్రాజెక్టు కోసం దాదాపు రూ. 3,767 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత నాసా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా తయారు చేసిన రోవర్‌ను ఏదైనా స్పేస్ ఏజెన్సీలకు ఇవ్వడం లేదా భవిష్యత్తు ప్రాజెక్ట్‌ల కోసం వినియోగించాలని నాసా యోచిస్తోంది.
ఇంతకీ ఈ ప్రాజెక్టును చివరి దశలో ఎందుకు నిలిపివేశారు?


ఫొటో సోర్స్, Getty Images
ఏమిటీ వైపర్ ప్రాజెక్ట్?
వైపర్ (వొలటైల్స్ ఇన్వెస్టిగేటింగ్ పోలార్ ఎక్స్‌ప్లోరేషన్ రోవర్) ప్రాజెక్ట్ ప్రకటించినప్పుడు అది ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.
ఎందుకంటే చంద్రునిపై నీటి ఉనికిని నిర్ధరించడం భవిష్యత్తులో చంద్రునిపై అన్వేషణ, మానవ నివాస ప్రయత్నాలకు ఉపయోగపడవచ్చు.
"చంద్రునిపై మంచు జాడలు ఎక్కడ ఉన్నాయి? ఎన్ని అడుగుల లోతులో నిరు ఉంది? వంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి వైపర్ రోవర్ సహాయం చేస్తుంది" అని నాసా గతంలో చెప్పింది.
చంద్రుని మీద ఉన్న నోబిల్ క్రేటర్ అనే ప్రాంతంలో వైపర్ రోవర్‌ను దింపాలని నాసా ప్లాన్ చేసింది. నోబిల్ క్రేటర్ సుమారు 79.27 కిలోమీటర్ల వ్యాసం కలిగిన బిలం. ఈ ప్రాంతం ఎల్లప్పుడూ సూర్యకాంతి లేకుండా చీకటిలోనే ఉంటుంది.
చంద్రుని దక్షిణ ధ్రువం సమీపంలో ఇలాంటి మరికొన్ని క్రేటర్స్ ఉన్నాయి. ఈ ప్రాంతాలలో బిలియన్ల టన్నుల మంచు ఘనీభవించిందని, వాటిపై సూర్యరశ్మి పడలేదని, ఉష్ణోగ్రత -223 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉండవచ్చని చంద్రునిపై మునుపటి అధ్యయనాలు సూచిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
చంద్రునిపైన ఈ ప్రాంతాలు ఎప్పుడూ చీకటిలో ఉండటంతో పెద్ద మొత్తంలో మంచుతో కప్పి ఉంటాయి. అటువంటి ప్రాంతాల్లో రోవర్‌ను ల్యాండింగ్ చేయడం, దానితో పరిశోధించడం సవాలు.
విపరీతమైన చలి, వేడిని తట్టుకునేలా వైపర్ రోవర్‌ను రూపొందించారు. హెడ్ లైట్లతో నాసా తయారు చేసిన తొలి రోవర్ కూడా ఇదే.
ఈ రోవర్ కోసం అమెరికా ప్రభుత్వం రూ.3,625.18 కోట్లు కేటాయించింది. 2021లో ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. 2023 చివరి నాటికి చంద్రుడిపై రోవర్‌ను దింపాలని నాసా ప్లాన్ చేసింది.
అయితే, రోవర్, ల్యాండర్ తయారీలో జాప్యం కారణంగా ప్రాజెక్ట్ సెప్టెంబర్ 2025 నాటికి పూర్తయ్యేలా ఉంది. దీంతో దీనికి అదనంగా మరో రూ. 1,473.52 కోట్లు అవసరం.
ఓ వైపు ఆలస్యం, మరోవైపు పెరిగిన బడ్జెట్‌ను కారణంగా చూపుతూ ఈ ప్రాజెక్ట్‌ను నిలిపివేస్తున్నట్లు నాసా కొన్ని రోజుల క్రితం ప్రకటించింది.
"ఇది చాలా కష్టమైన నిర్ణయం, అనిశ్చిత ఆర్థిక పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నాం" అని నాసా సైన్స్ ప్రోగ్రామ్ డైరెక్టరేట్ అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్ నికోలా ఫాక్స్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
' చంద్రయాన్-1 డేటాతో'
నాసా వైపర్ ప్రాజెక్ట్‌ను నిలిపివేయడం, ప్రాజెక్టులో భారత ప్రమేయం గురించి బీబీసీతో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ప్రొఫెసర్ డాక్టర్ టీవీ వెంకటేశ్వరన్ మాట్లాడారు.
“సాధారణంగా నీరు అంటే హైడ్రోజన్ డయాక్సైడ్ (H2O). కానీ హైడ్రాక్సిల్ (OH) అని పిలిచే మరొక రకం కూడా ఉంది. చంద్రుని ఉపరితలంపై ఈ హైడ్రాక్సిల్ అణువుల ఉనికిని చంద్రయాన్ 1 గుర్తించింది" అని వెంకటేశ్వరన్ చెప్పారు.
చంద్రయాన్-1ను 2008 అక్టోబర్‌లో భారత్ ప్రయోగించింది. నాసా మూన్ మినరాలజీ మ్యాపర్-M3 కూడా దానితో ప్రయాణించింది. 2009 సెప్టెంబర్ 25న ఈ పరికరం అందించిన డేటాతో చంద్రుని ఉపరితలంపై హైడ్రాక్సిల్ రూపంలో నీటి ఉనికిని నాసా నిర్ధారించింది.
చంద్రుడిపైకి నీరు ఎలా వచ్చిందన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. "ఉల్కలు మంచు రూపంలో ఉంటాయి. ఈ ఉల్కలు, రాళ్లు చంద్రుడిని ఢీకొంటూ ఉంటాయి. దీంతో చంద్రుడి ఉపరితలం పైన క్రేటర్స్ ఏర్పడతాయి. ఈ క్రేటర్స్ ఎక్కువగా చీకటిగా ఉంటాయి. కాబట్టి అక్కడ వేడి ఉండదు, వాటిలోకి చేరిన మంచు కరగదు" అని అన్నారు.
అయితే, ఉల్కలు ఎలా గడ్డకట్టాయి అనేదానికి ఇప్పటికీ సరైన వివరణ లేదని ప్రొఫెసర్ టీవీ వెంకటేశ్వరన్ కూడా చెప్పారు.
వైపర్ ప్రాజెక్టు విజయవంతమైతే భూమిలోకి నీరు ఎలా వచ్చిందన్న ప్రశ్నకు సమాధానం దొరికి ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు.

'ఇంధనంగా చంద్రుని నీరు'
చంద్రునిపై లభించే హైడ్రాక్సిల్‌ను ఆక్సిజన్, హైడ్రోజన్‌గా విభజించే అవకాశం ఉందా అనేది పరిశోధించాలనే లక్ష్యంతో నాసా ఈ ప్రాజెక్టును చేపట్టింది.
హైడ్రాక్సిల్ (OH)ను ఆక్సిజన్, హైడ్రోజన్‌లుగా విడగొట్టొచ్చు. అలా ఉత్పత్తి అయిన హైడ్రోజన్‌ను క్రయోజెనిక్ రాకెట్ ఇంధనంగా ఉపయోగించవచ్చు. చంద్రునిపై అంతరిక్ష వాహనాలకు ఇంధనంగా వినియోగించవచ్చు. ఇది అంతరిక్ష ప్రయాణ ఖర్చునూ తగ్గిస్తుంది.
"నాసా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇపుడు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నాసా కోరిన నిధుల కంటే అమెరికా ప్రభుత్వం అందించే నిధులు 8.5 శాతం తక్కువ" అని ప్రొఫెసర్ వెంకటేశ్వరన్ తెలిపారు.
ఈ ఏడాది నాసాకు అమెరికా ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ దాదాపు రూ. 2 లక్షల కోట్లు. అయితే ఇది గత ఏడాది కేటాయింపు కంటే 2 శాతం తక్కువ, నాసా కోరిన దానికంటే 8.5 శాతం తక్కువ.
యుక్రెయిన్-రష్యా యుద్ధం, పాలస్తీనా-ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా జోక్యం వల్ల పెరిగిన ఖర్చులు నాసా ప్రణాళికలను ప్రభావితం చేశాయని ప్రొఫెసర్ అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, NASA
వైపర్ ప్రాజెక్టును ఇస్రో చేపడుతుందా?
"నాసా వైపర్ రోవర్‌ను పలు భాగాలుగా విడదీసి, మరేదైనా అంతరిక్ష కార్యక్రమానికి ఉపయోగించాలా? లేదా ఇతర దేశాలకు విక్రయించాలా? అని ఆలోచిస్తోంది" అని ప్రొఫెసర్ అన్నారు.
“వారు కూడా ఏదైనా ప్రైవేట్ కంపెనీలతో భాగస్వామి కావాలని చూస్తున్నారు. కానీ ఈ ప్రాజెక్ట్ ఏ దిశగా సాగుతుందో ఇప్పుడే చెప్పలేం’’ అని ఆయన చెప్పారు.
భారత్ కోరుకుంటే ఇస్రో ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టగలదా? అని అడిగితే “చంద్రయాన్ వంటి ప్రాజెక్టులను తక్కువ ఖర్చుతో పూర్తి చేసిన రికార్డు ఇండియాకు ఉంది. అయితే ఈ వైపర్ ప్రాజెక్ట్ బడ్జెట్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఇస్రో దాన్ని చేపట్టకపోవచ్చు. యూరోపియన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్, చైనా, రష్యాలు ఆసక్తి కనబరచవచ్చు’’ అని ప్రొఫెసర్ వెంకటేశ్వరన్ అభిప్రాయపడ్డారు.
అయితే, చంద్రునిపై భారత్ పరిశోధనలు కొనసాగుతాయని, చంద్రుడిపై నీటి ఉనికిపై పరిశోధనలు చంద్రయాన్-4 ప్రాజెక్టులో భాగమవుతాయని ప్రొఫెసర్ అన్నారు.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














