కలరా: నిర్లక్ష్యం చేస్తే మరణమే, ఈ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి?

ఫొటో సోర్స్, Getty Images
తరచుగా ప్రబలే అంటు వ్యాధుల్లో కలరా ఒకటి. తగిన సమయంలో గుర్తించి, చికిత్స తీసుకుంటే తేలిగ్గా దీన్నుంచి బయటపడవచ్చు.
చికిత్స విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా.. కొన్ని గంటల్లోనే అది ప్రాణాలు తీస్తుంది.
కలరా ఒక బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్. కలరా బారిన పడినవారు తీవ్ర అతిసారానికి (డయేరియా), డీహైడ్రేషన్‌కు గురవుతారు.
సురక్షితమైన మంచి నీళ్లు అందుబాటులో లేకపోవడంతో పాటు కనీస శుభ్రత లేని పరిస్థితుల్లో జీవించే ప్రజలు ఎక్కువగా కలరా బారిన పడుతుంటారు.
ఈ వ్యాధి ఎక్కువగా ఆసియా, ఆఫ్రికా దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అంచనా ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు 13 లక్షల నుంచి 40 లక్షల కలరా కేసులు నమోదవుతున్నాయి.
కలరా బారిన పడి ఏటా మరణిస్తున్న వారి సంఖ్య 21 వేల నుంచి 1,43,000 వరకు ఉంటోంది.


ఫొటో సోర్స్, Getty Images
కలరా సోకడానికి కారణాలేంటి?
వైబ్రియో కలరా అనే బ్యాక్టీరియా వల్ల కలరా సోకుతుంది.
ఈ బ్యాక్టీరియా చిన్న ప్రేగులో విష పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంది.
దీని వల్ల శరీరం నుంచి ఎక్కువగా నీరు బయటకు వెళ్లిపోతుంది. ఇది అతిసారానికి దారితీస్తుంది.
కలరా బారిన పడ్డ వారిలో చాలా మంది శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. శరీరంలో నీటి శాతం, లవణాల శాతం తగ్గిపోతాయి.
ఇన్‌ఫెక్షన్ సోకిన 12 గంటల నుంచి ఐదు రోజుల మధ్య లక్షణాలు కనిపించడం మొదలవుతాయి.
అయితే, ఇన్‌ఫెక్షన్ బారిన పడిన వారిలో 80 శాతం మందికి లక్షణాలు కనిపించవని డబ్ల్యూహెచ్‌ఓ చెబుతోంది.
సాధారణంగా 20 నుంచి 30 శాతం మందికి లక్షణాలు కనిపిస్తాయి.
కొన్నిరోజుల్లోనే వారికి తీవ్ర నీళ్ల విరోచనాలు, శరీరం పొడిబారడం వంటివి జరుగుతాయి.
ఈ లక్షణాలు కనిపించగానే అది కలరాగా గుర్తించి జాగ్రత్త పడాలి. వెంటనే చికిత్స తీసుకోవాలి.
చికిత్స విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా, అది మరణానికి దారితీస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
కలరా లక్షణాలేంటి?
కలరా బారిన పడ్డవారిలో ఎక్కువగా కనిపించే లక్షణాలు:
- నీళ్ల విరేచనాలు, అరుదుగా జిగట విరోచనాలు
- నీరసంగా అనిపించడం (గంటల తరబడి వాంతులు కావడం, కలరా సోకిన ప్రారంభంలో వాంతులు ఎక్కువగా అవుతుంటాయి)
- పొత్తి కడుపు నొప్పి
- కాళ్ల తిమ్మిరి
- కలరా లక్షణాలు కనిపించిన కొన్ని గంటలకే శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. డీహైడ్రేషన్ చిన్నగా మొదలై తీవ్రస్థాయికి చేరుతుంది.
- దీంతో పాటు చిరాకు, అలసట, కళ్లు మూత పడటం, నోరెండిపోవడం, విపరీతంగా దప్పిక కావడం, చర్మం పొడిబారడం, ముడుచుకు పోవడం, చర్మం లాగినప్పుడు తిరిగి అంతేవేగంగా కిందకు వెళ్లకుండా నెమ్మదించడం, మూత్రం కొంచెం రావడం లేదా అసలు రాకపోవడం, లోబీపీ, గుండె అస్తవ్యస్తంగా కొట్టుకోవడం వంటివి జరుగుతాయి.
- డీహైడ్రేషన్ వల్ల రక్తంలో లవణాలు భారీ మొత్తంలో బయటకు వెళ్లిపోతాయి. దీన్ని ఎలక్ట్రోలైట్ అసమతుల్యం అంటారు.
కలరా బారిన పడిన వారిలో అతిసారం తక్కువగా ఉంటే, ఇతర అనారోగ్య లక్షణాలు కనిపిస్తాయి.
ల్యాబ్‌లో పరిశీలించడం ద్వారా మాత్రమే కలరాను గుర్తించగలమని ఘనా వాటర్ ఎయిడ్ హెల్త్ పాలసీ విశ్లేషకులు ఐరీని ఔసు-పొకు తెలిపారు.
అయితే, స్పష్టంగా కనిపించే కలరా లక్షణాలను ప్రతి ఒక్కరూ గమనించగలరని ఆమె అన్నారు.
‘‘తరచుగా టాయ్‌లెట్‌కు వెళ్తుండటం, నీళ్ల వీరోచనాలు, మూడు రోజుల పాటు వాంతులు, పొత్తి కడపు నొప్పి వంటివి కనిపిస్తే, కలరాగా అనుమానించి ఆస్పత్రికి వెళ్లాలి’’ అని సూచించారు.

ఫొటో సోర్స్, Getty Images
కలరా ఎలా వ్యాపిస్తుంది?
వైబ్రియో కలరా బ్యాక్టీరియా కలిసిన నీళ్లు, ఆహారాన్ని తాగినప్పుడు లేదా తిన్నప్పుడు కలరా వ్యాపిస్తుంది.
బ్యాక్టీరియా బారిన పడినప్పటికీ, కలరా లక్షణాలు కనిపించని వారి నుంచే ఇది ఎక్కువగా ఇతరులకు సోకే ప్రమాదముంది.
ఇన్‌ఫెక్షన్ బారిన పడ్డ 1-10 రోజుల లోపు వారి మలం ద్వారా బ్యాక్టీరియా బయటకు వెళ్తుంటుంది.
లక్షణాలు కనిపించని వారి నుంచి కలరా ఎక్కువ మందికి సోకుతుంది.
ముఖ్యంగా ఆరు బయట మల విసర్జన చేసే వారి నుంచి బ్యాక్టీరియా వ్యాపిస్తుంది.
మంచి నీళ్లు, పరిశుభ్రత లేని చోట కలరా వేగంగా విస్తరిస్తుందని ఐరీని వివరించారు.
కలరా బారిన పడి వాంతులు, విరోచనాలతో బాధపడుతున్న వారికి దూరంగా ఉండాలని డబ్ల్యూహెచ్ఓ సూచించింది.
కలరా బారిన పడి మరణించిన వారి శరీరాన్ని తాకేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
మనల్ని మనం ఎలా రక్షించుకోగలం?
కలరా వ్యాపించిన ప్రాంతాల్లో తిరిగేటప్పుడు వ్యాధి బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవడానికి యూకే నేషనల్ హెల్త్ సర్వీస్ కొన్ని సూచనలు చేస్తోంది.
చేతులను సబ్బు, నీళ్లతో తరచుగా కడుక్కోవాలి.
ప్రత్యేకించి టాయిలెట్‌కు వెళ్లి వచ్చిన తర్వాత తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
వంట చేసుకునే ముందు, తినే ముందు చేతులను శుభ్రం చేసుకోవాలి.
సురక్షితమైన మంచినీళ్లు తాగాలి. నీటిని మరిగించుకుని తాగితే మంచిది.
మరిగించిన లేదా బాటిల్ నీళ్లతో పళ్లు తోముకోవాలి.
పచ్చి కూరగాయలు, పళ్లు తినకూడదు. అలాగే మంచినీళ్లు లేదా మరిగించిన నీళ్లతో శుభ్రం చేసుకోని పళ్లు, కూరగాయలు తినకూడదు.
షెల్‌ఫిష్, సీఫుడ్ తినకూడదు. చల్లని నీళ్లు తాగకూడదు.
తోలు వలుచుకుని తినే...అరటి, కమల, అవకాడో వంటి పళ్లే తినాలి.
తోలు తీసి తినలేని ద్రాక్ష, బెర్రీ వంటి పళ్లకు, పళ్లరసాలకు దూరంగా ఉండాలి.

ఫొటో సోర్స్, Getty Images
చాలా తేలిగ్గా నయమయ్యే వ్యాధి
ORSగా పిలిచే ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్‌ను సరైన విధానంలో తీసుకుంటే, కలరా నుంచి తేలిగ్గా బయటపడవచ్చు.
డబ్ల్యూహెచ్‌ఓ మార్గదర్శకాల ప్రకారం ఉండే ORS ప్యాకెట్‌ను ఒక లీటరు పరిశుభ్రమైన నీళ్లల్లో కలిపి తాగాలి.
ఆరోగ్య కార్యకర్తల దగ్గర లభించే ORSను ఉపయోగించవచ్చని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. లేదా ORSను ఇంటి దగ్గరే తయారుచేసుకోవచ్చు. ఒక లీటరు మంచి నీటిలో ఆరు టీ స్పూన్‌ల పంచదార, అర టీ స్పూన్ ఉప్పు కలిపితే ORS తయారవుతుందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.
కలరా బారిన పడి డీహైడ్రేషన్‌కు గురైన పెద్దవాళ్లకు చికిత్స కోసం మొదటిరోజు ఆరు లీటర్ల ORS అవసరమవుతుంది.
కలరా ఎక్కువగా ఉన్న కేసుల్లో రోగికి ORSతో పాటు అదనపు చికిత్స అవసరమవుతుంది. అతిసారం తగ్గించడానికి రోగికి తగిన యాంటీబయోటిక్స్ అందించాలి. సరిపడా ద్రవాలు ఇవ్వాలి.
సరైన జాగ్రత్తలు తీసుకుంటే, కలరా నుంచి వేగంగా కోలుకోవచ్చు. సరైన సమయంలో చికిత్స తీసుకోవడం ద్వారా కలరా రోగులు ఆస్పత్రుల నుంచి మూడు రోజుల్లో డిశ్చార్జ్ అవ్వొచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
కలరాను నిర్మూలించే విధానం
పేద, అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రభుత్వాలు ప్రజలకు సురక్షితమైన మంచినీళ్లు, పారిశుధ్యం, పరిశుభ్రమైన పరిస్థితులు కల్పించడానికి పెద్దఎత్తున నిధులు కేటాయించాలని ఐరీని సూచించారు.
2022లో డబ్ల్యూహెచ్ఓ/యూనిసెఫ్ సంయుక్త నివేదిక అంచనాల ప్రకారం:
ప్రపంచవ్యాప్తంగా 220 కోట్ల మందికి ఇప్పటికీ సురక్షితమైన మంచినీళ్లు అందుబాటులో లేవు.
350 కోట్ల మంది పరిశుభ్రమైన పరిస్థితుల మధ్య జీవించే అవకాశం లేదు.
మరుగుదొడ్లు అందుబాటులో లేవు. 41 కోట్ల మంది ప్రజలకు బహిరంగ మలవిసర్జన తప్పడం లేదు.
200 కోట్ల మంది ప్రజలకు ఇంటి దగ్గర పరిశుభ్రమైన పరిస్థితులు లేవు.
కలరా నియంత్రణ గ్లోబల్ టాస్క్‌ఫోర్స్(GTFCC) ఈ రోగం నియంత్రణ కోసం 2017 అక్టోబరులో ఒక కార్యక్రమం ప్రారంభించింది.
ఈ టాస్క్‌ఫోర్స్‌లో 50కి పైగా సంస్థలు, ఎన్జీవోలు, విద్యాసంస్థలు, ఐక్యరాజ్యసమితి ఏజెన్సీలు భాగస్వాములుగా ఉన్నాయి.
కలరా మరణాలను 90 శాతం తగ్గించాలని, 2030 నాటికి 20 దేశాల్లో కలరాను నిర్మూలించాలని ఈ గ్రూప్ లక్ష్యంగా పెట్టుకుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














