చాందీపుర వైరస్: ఇది ఎంత ప్రమాదకరం? గుజరాత్‌లో పిల్లల వరుస మరణాలకు ఇదే కారణమా

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, లక్ష్మీపటేల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
గుజరాత్‌లో చాందీపుర వైరస్ సోకినట్లుగా అనుమానిస్తున్న ఆరుగురు చిన్నారులు మరణించారు. వీరంతా గత రెండువారాల్లో ప్రాణాలు కోల్పోయారు.
మృతిచెందిన చిన్నారుల రక్త నమూనాలను పుణేలోని నేషనల్ ఇన్‌స్టిట్‌ట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించారు.
ఈ మరణాలకు కారణం చాందీపుర వైరస్సేనా కాదా అనేది తేల్చాలని రాష్ట్ర ప్రభుత్వం వైద్యాధికారులను కోరింది.
అయితే, ప్రభుత్వం ఇంతవరకు ఒక మరణాన్ని ధ్రువీకరించింది.
‘సాండ్ ఫ్లై’ అనే ఒక రకం ఈగల వల్ల ఈ వైరస్ వ్యాపిస్తుంది. ఈ వ్యాధి సోకితే 24 గంటల నుంచి 48 గంటల లోపు మరణించే ప్రమాదం ఉంది.
ఈ వ్యాధి సోకిన పిల్లల్లో 85 శాతం మంది చనిపోతారని వైద్యులు చెప్పారు.
వర్షాకాలంలో వానలు కురిసిన తర్వాత అపరిశుభ్ర వాతావరణం, మురుగు నీరు రోడ్డు మీదకు ప్రవహించడం వల్ల అందులో దోమలు, ఈగలు పెరుగుతాయి.
వీటి వల్ల డెంగీ, మలేరియా లాంటి సీజనల్ వ్యాధులతో పాటు ఇతర వైరల్ వ్యాధులూ సోకుతున్నాయి.
చాందీపుర వైరస్ కూడా ఈగల ద్వారా వ్యాపిస్తుంది. గుజరాత్‌లోని అర్వల్లీ, సాబర్‌కాంటా జిల్లాల్లో బయటపడిన కొన్ని కేసుల్లో చాందీపుర వైరస్ సోకినట్లు డాక్టర్లు అనుమానిస్తున్నారు.


ఫొటో సోర్స్, ANKIT CHAUHAN
చాందీపుర వైరస్ ఎలా వ్యాపిస్తుంది?
చనిపోయిన పిల్లల తల్లిదండ్రులకు ఈ వ్యాధి గురించి ఎలాంటి సమాచారం తెలియదు. పిల్లలను ఆసుపత్రికి తీసుకెళ్లినా వారి ప్రాణాలు నిలవలేదు.
పిల్లలకు చాందీపుర వైరస్ సోకి ఉండవచ్చని హిమ్మత్‌నగర్ సివిల్ ఆసుపత్రిలో పీడియాట్రిక్ డిపార్ట్‌మెంట్ హెడ్ డాక్టర్ ఆశిష్ జైన్ అనుమానించారు.
"మొదట ఓ పిల్లవాడిని హై గ్రేడ్ జ్వరం సోకిందని డయేరియా, వాంతులు అవుతున్నాయని ఆసుపత్రికి తీసుకు వచ్చారు. 24 గంటల్లోనే ఆ చిన్నారి మెదడుకి వ్యాధి సోకింది. కిడ్నీలు, గుండె మీద కూడా ప్రభావం కనిపించింది. దీంతో మేం ఇది జపనీస్ ఎన్‌సెఫలైటిస్ కానీ చాందీపుర వైరస్ కానీ కావొచ్చని అనుమానించాం" అని డాక్టర్ ఆశిష్ జైన్ బీబీసీతో చెప్పారు.
"నిరుడు చాందీపుర వైరస్ కేసు ఒకటి వచ్చింది. పైగా ఇప్పుడు వర్షాల సీజన్. ఈ సీజన్‌లో చాందీపుర వైరస్ కేసులు వస్తున్నాయి" అని ఆయన అన్నారు.
"జూన్ నెలాఖరు నుంచి అక్టోబర్ వరకు ఇలాంటి కేసులు ఎక్కువగా వస్తున్నాయి. అందుకే పిల్లల రక్త నమూనాలు పుణేలోని పరిశోధనశాలకు పంపించాం. రక్త నమూనాల పరీక్షల ఫలితాలు త్వరలో వస్తాయని ఆశిస్తున్నాం’ అన్నారాయన.

ఫొటో సోర్స్, ANKIT CHAUHAN
ఇది అంటువ్యాధా?
"సాధారణంగా చాందీపుర వైరస్ పెద్ద ఈగల వల్ల కొన్ని సార్లు దోమల వల్ల వస్తుంది. ఈ పెద్ద ఈగలు మట్టితో కట్టిన ఇళ్లు, సున్నంతో కట్టిన ఇళ్లలో ఉంటాయి. పక్కా ఇళ్లలోనూ నేల మురికిగా ఉన్నచోట ఉంటాయి. వెలుగు తక్కువగా ఉన్నచోట, సూర్యరశ్మి సోకని చోట ఇవి గుడ్లు పెడుతుంటాయి" అని ఆశిష్ జైన్ చెప్పారు.
"ఇది అంటువ్యాధి కాదు. ఇది ఒక పిల్లవాడి నుంచి మరో పిల్లవాడికి సోకదు. అయితే వ్యాధి సోకిన పిల్లవాడిని కుట్టిన ఈగ ఆరోగ్యవంతుడైన చిన్నారిని కుడితే ఆరోగ్యవంతుడైన చిన్నారికి వైరస్ సోకే అవకాశం ఉంది. కొన్ని గ్రామాలు లేదా ఒకే ప్రాంతం నుంచి కేసులు రావడం లేదు. వేర్వేరు ప్రాంతాల నుంచి వస్తున్నాయి.” అని ఆయన చెప్పారు.
" వ్యాధి సోకిన వారిలో 85 శాతం మంది చనిపోయే అవకాశం ఉంది. చాందీపుర వైరస్ సోకిన 100మంది చిన్నారుల్లో సగటున 15 మందిని మాత్రమే కాపాడవచ్చు" అని వ్యాధి తీవ్రత గురించి చెబుతూ డాక్టర్ ఆశిష్ జైన్ అన్నారు.
మట్టి ఇళ్లు, అపరిశుభ్ర వాతావరణంలో పెరుగుతున్న 9 నుంచి 14 ఏళ్ల లోపు పిల్లల్లో వ్యాధి నిరోధకశక్తి మిగతా వారి కంటే తక్కువగా ఉంటుంది. దీని వల్ల వీరు ఈ వైరస్ బారిన పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.

ఫొటో సోర్స్, ANKIT CHAUHAN
ఈ వ్యాధి లక్షణాలు ఏమిటి?
చాందీపుర వైరస్ సోకితే ఈ కింది లక్షణాలు కనిపించవచ్చు.
- తీవ్ర జ్వరం
- డయేరియా
- వాంతులు
- మూర్ఛ
- నిద్రలేమి
- తరచూ స్పృహ కోల్పోవడం
- కోమాలోకి వెళ్లడం
- శరీరం మీద మచ్చలు

ఫొటో సోర్స్, ANKIT CHAUHAN
చికిత్స ఏమిటి?
ఈ వైరస్‌కు ప్రత్యేకంగా చికిత్స అంటూ ఏదీ లేదని వైద్యులు చెబుతున్నారు. రోగి పరిస్థితి, లక్షణాలను బట్టి చికిత్స అందిస్తామని వైద్యులు చెబుతున్నారు. చాందీపుర వైరస్ నివారణకు ఇప్పటి వరకు వ్యాక్సీన్ ఏదీ కనిపెట్టలేదు.
" ఈ వైరస్ సోకిందని అనుమానిస్తున్న మొదటి రోగి మా ఆసుపత్రికి జూన్ 27న వచ్చాడు. ఆ బాలుడికి ఫ్లూ తరహా లక్షణాలు ఉన్నాయి. అతనికి మలేరియా లేదని వైద్య పరీక్షల్లో తేలింది. దీంతో అతనికి చాందీపుర వైరస్ సోకి ఉండవచ్చని మా ఆసుపత్రిలోని పిల్లల వైద్య నిపుణులు అనుమానించారు. ఆ పిల్లవాడి రక్త నమూనాలను పుణేలోని లేబొరేటరీకి పంపించాం. ఈ వ్యాధి గురించి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు సమాచారం అందించాం. వైరస్ ఇతరులకు వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలని కోరాం" అని హిమ్మత్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పరేష్ షిలాదరియా బీబీసీతో చెప్పారు.
"అర్వల్లీ జిల్లాలో తొలి కేసు జులై 3న నమోదైంది. భిలోడా తాలూకాలోని జ్వరంతో బాధ పడుతున్న ఓ చిన్నారిని షమ్లాజీలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకువచ్చారు" అని జిల్లా చీఫ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ ఎంఏ సిద్ధిఖీ బీబీసీతో చెప్పారు.
" హఠాత్తుగా ఆ పిల్లవాడికి మూర్ఛ వచ్చింది. దీంతో ఆ పిల్లవాడిని పరీక్షించిన డాక్టర్ వెంటనే అతన్ని హిమ్మత్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ ఆ బాలుడు చనిపోయాడు. ఆసుపత్రికి తీసుకొచ్చిన 48 గంటల్లో అంటే జులై 5న అతను చనిపోయాడు" అని డాక్టర్ సిద్ధిఖీ చెప్పారు.
"అర్వల్లీ జిల్లాలో ఇద్దరు పిల్లలు - భిలోడా జిల్లాలో ఒకరు మేఘ్‌రాజ్ తాలుకాలో ఒకరు చనిపోయారు. ఈ వ్యాధి వ్యాపించకుండా నిరోధించేందుకు చర్యలు తీసుకున్నాం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు గ్రామాల్లో పిల్లలకు పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఈగలు, దోమలు లాంటి వాటిని నిరోధించేందుకు క్రిమి సంహాకర మందులు చల్లుతున్నారు" అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, ANKIT CHAUHAN
ఎలాంటి చర్యలు తీసుకోవాలి?
- ఇంటి చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
- చెత్తను ఊరికి దూరంగా వేయాలి.
- నిద్ర పోయేటప్పుడు దోమ తెరలు వాడాలి
- ఇంట్లోని ఉపకరణాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి
- దోమలు, ఈగలను నివారించే చర్యలు తీసుకోవాలి.

ఫొటో సోర్స్, ANKIT CHAUHAN
గుజరాత్ ప్రభుత్వం ఏం చెబుతోంది?
చాందీపుర వైరస్ వ్యాప్తి గురించి ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేనప్పటికీ అప్రమత్తంగా ఉండాలని గుజరాత్ ఆరోగ్యశాఖమంత్రి రుషికేష్ పటేల్ చెప్పారు.
‘బ్రెయిన్ ఫీవర్ లక్షణాలతో ఉండే చాందీపుర వైరల్ ఎన్‌సెఫలైటిస్ వ్యాధికి సంబంధించిన కేసులు మహారాష్ట్రలోని చాందీపుర జిల్లాలో 1965లో గుర్తించారు. ఆ తర్వాత ఇలాంటి కేసులు ఆంధ్రప్రదేశ్, గుజరాత్‌లోనూ నమోదయ్యాయి" అని ఆయన చెప్పారు.
ఈ వైరస్ వెస్కులోవైరస్ అనే జాతికి చెందింది. ఈ వైరస్‌కు సంబంధించిన కేసులు గుజరాత్‌లో ఏటా నమోదవుతున్నాయి. ప్రత్యేకించి నార్త్ , సెంట్రల్ గుజరాత్‌లో ఈ కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. ఈ వ్యాధి సాధారణంగా వర్షాకాలంలో, ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాలలో కనిపిస్తుంది.
"ఇప్పటి వరకు రాష్ట్రంలో చాందీపుర వైరస్ సోకినట్లు భావిస్తున్న కేసులు 12 నమోదయ్యాయి. వీటిలో ఆరుగురు చనిపోయారు. మరో ఆరుగురికి చికిత్స అందిస్తున్నాం. సాబర్‌కాంటాలో నాలుగు, అర్వల్లీలో మూడు అనుమానిత కేసులు నమోదయ్యాయి. మహిసాగర్, ఖేడా జిల్లాల్లోనూ ఒక్కొక్క కేసు నమోదైంది.
"రాజస్థాన్ నుంచి ఇద్దరు, మధ్య ప్రదేశ్ నుంచి ఒక రోగి గుజరాత్‌లో చికిత్స తీసుకుంటున్నారు. వీరికి చాందీపుర వైరస్ సోకిందా లేదా అనేది పుణే ల్యాబ్ నుంచి రిపోర్టులు వచ్చిన తర్వాత తెలుస్తుంది" అని రుషికేష్ పటేల్ చెప్పారు.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














