‘మెదడును తినే ప్రాణాంతక అమీబా’ బారినపడ్డ ఈ 14 ఏళ్ల బాలుడు ఎలా కోలుకున్నాడు?

తల్లిదండ్రులతో అఫ్నాన్

ఫొటో సోర్స్, SIDDIQUI

ఫొటో క్యాప్షన్, తల్లిదండ్రులతో అఫ్నాన్
    • రచయిత, ఇమ్రాన్ ఖురేషి
    • హోదా, బీబీసీ కోసం

కేరళకు చెందిన 14 ఏళ్ల బాలుడు మెదడును తినే ప్రాణాంతక అమీబా బారినపడి కోలుకున్నాడు. దీని నుంచి కోలుకున్నవారిలో ప్రపంచంలోనే తొమ్మిదవ వ్యక్తిగా ఈ బాలుడు నిలిచాడు.

ఈ వ్యాధిని ముందుగానే గుర్తించడంతో అఫ్నాన్ జస్సిమ్ 22 రోజుల పాటు కోజికోడ్‌ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుని కోలుకున్నాడు.

మిగిలిన ఎనిమిది మంది కూడా ఈ ప్రాణాంతక వ్యాధి నుంచి కోలుకోవడానికి ప్రధాన కారణం, దీని లక్షణాలను ముందుగా గుర్తించడమే.

'ప్రైమరీ అమీబిక్ మెనింగోయిన్సెఫాలైటిస్(పీఏఎం)' అనేది మెదడును తినేసే అమీబా అయిన 'నెగ్లేరియా ఫౌలెరి' వల్ల కలిగే ఇన్ఫెక్షన్.

ఈ వ్యాధి బారినపడ్డవారిలో మరణాల రేటు సుమారు 97 శాతంగా ఉంది.

అమెరికన్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) చెప్పిన వివరాల ప్రకారం, 1971 నుంచి 2023 మధ్య కాలంలో ఆస్ట్రేలియా, అమెరికా, మెక్సికో, పాకిస్తాన్ దేశాల్లో ఈ ప్రాణాంతక వ్యాధి నుంచి కేవలం ఎనిమిది మంది మాత్రమే కోలుకున్నారు.

ఈ అమీబా సోకిన తర్వాత 9 గంటల నుంచి 5 రోజుల్లో గుర్తిస్తేనే కోలుకునేందుకు వీలుంటుందని నిపుణులు చెబుతున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్

తీవ్ర తలనొప్పి తర్వాత, అఫ్నాన్‌కు మూర్ఛ వచ్చింది. దీంతో ఆ బాలుడి కుటుంబం బాగా కంగారుపడింది.

‘‘అఫ్నాన్‌ను ఆస్పత్రిలో చేర్చినప్పుడు, అప్పటికే కేరళలో ఈ అమీబా బారినపడి ముగ్గురు చనిపోయారు. వారిలో ఇద్దర్ని చాలా ఆలస్యంగా ఆస్పత్రిలో చేర్చారు. ఆ తర్వాత మేం ఇది ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన సమస్య అని, ప్రజల్లో దీనిపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వానికి తెలియజేశాం’’ అని కోజికోడ్‌లోని బేబీ మెమోరియల్ హాస్పిటల్‌లో పనిచేసే పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ కన్సల్టెంట్ డాక్టర్ అబ్దుల్ రవూఫ్ బీబీసీకి చెప్పారు.

అఫ్నాన్‌ తండ్రి ఎంకే సిద్దిఖీ తొందరగా జాగ్రత్తపడటం వల్లే, ఈ బాలుడికి సరైన సమయంలో చికిత్స చేయగలిగామని డాక్టర్ రవూఫ్ తెలిపారు.

కొన్ని రోజుల క్రితం కోజికోడ్ జిల్లాలోని పయ్యోలి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న తిక్కోటి గ్రామంలో ఒక చెరువులో తన కొడుకు ఈతకు వెళ్లాడని అఫ్నాన్ తండ్రి సిద్దిఖీ చెప్పారు.

‘‘సోషల్ మీడియాలో నిఫా వైరస్ గురించి చదివాను. అప్పుడే నాకు అమీబా గురించి తెలిసింది. ఈ ఇన్‌ఫెక్షన్ వల్ల మూర్ఛ వస్తుందని చదివాను. అఫ్నాన్‌కు మూర్ఛ రాగానే, స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లాను. మార్పు కనిపించకపోవడంతో మరో ఆస్పత్రికి తీసుకెళ్లాను. కానీ, అక్కడ న్యూరాలజిస్ట్ లేరు. వారు అఫ్నాన్‌ను బేబీ మెమోరియల్ హాస్పిటల్‌కు వెళ్లాలని సూచించారు’’ అని సిద్దిఖీ తెలిపారు.

‘‘అంతకుముందు ఎప్పుడూ లేకుండా ఇప్పుడెందుకు అఫ్నాన్‌కు మూర్ఛ వస్తుంది? అని నేను వైద్యుని ద్వారా తెలుసుకోవాలనుకున్నా. మా అబ్బాయి ఐదు రోజుల క్రితం ఈతకు వెళ్లాడని, ఆ తర్వాత తలనొప్పి, జ్వరం వచ్చాయని డాక్టర్‌కు చెప్పాను’’ అని అఫ్నాన్ తండ్రి వివరించారు.

నెగ్లేరియా ఫౌలెరి

ఫొటో సోర్స్, CDC/IMAGE POINT FR/BSIP/UNIVERSAL IMAGES GROUP VIA GETTY IMAGES

అమీబా మెదడులోకి ఎలా వెళ్తుంది?

నెగ్లేరియా ఫౌలెరి అమీబా అనేది ఏక కణ జీవి అని, వెచ్చగా ఉండే మంచినీటి సరస్సులు, నదుల్లో ఇది కనిపిస్తుందని సీడీసీ చెబుతోంది.

సరస్సులు, నదులు, అపరిశుభ్రంగా ఉండే స్విమ్మింగ్‌‌ పూల్స్‌లో ఇది ఉంటుంది. అలాంటి ప్రదేశాల్లో స్నానం చేసేప్పుడు ఈ అమీబా ముక్కు ద్వారా కొందరి శరీరంలోకి చొరబడుతుందని సీడీసీ తెలిపింది.

ఈ అమీబా ముక్కులో నుంచి మెదడుకు చేరుతుంది.

‘‘ఇది పరాన్నజీవి. వివిధ రకాల రసాయనాలను విడుదల చేసి, మెదడును దెబ్బతీస్తుంది’’ అని డాక్టర్ రవూఫ్ చెప్పారు.

అమీబా

ఫొటో సోర్స్, Getty Images

‘మెదడును తినే అమీబా’ వ్యాధి లక్షణాలు..

మెదడు తినే అమీబా ఇన్ఫెక్షన్‌కు గురైనప్పుడు మొదట తలనొప్పి, జ్వరం, వికారం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

అమీబా వేగంగా వృద్ధి చెందడంతో, వ్యాధి లక్షణాలు కనిపించిన మొదటి రోజు నుంచి 18 రోజుల్లోపు బాధితులు చనిపోయే అవకాశం ఉంది.

సీడీసీ వెల్లడించిన వివరాల ప్రకారం, సాధారణంగా ఇన్ఫెక్షన్ సోకిన 5 రోజుల తర్వాత కోమాలోకి వెళ్లడం, ఆ తర్వాత మరణం సంభవించవచ్చు.

శరీరంలో అమీబా వృద్ధి చెందిన తర్వాత మెడ బిగుసుకుపోవడం, చుట్టూ ఏం జరుగుతుందో గ్రహించలేకపోవడం, బ్యాలెన్స్ తప్పిపోవడం, మనోభ్రాంతి వంటి సమస్యలు తలెత్తుతాయని సీడీసీ పేర్కొంది.

ఇది చాలా అరుదైన ఇన్ఫెక్షన్ కావడంతో సాధారణ వైద్య పరీక్షల ద్వారా గుర్తించడం కష్టం. ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తి మరణించిన తర్వాతే ఈ ఇన్ఫెక్షన్ నిర్థరణ అయ్యే పరిస్థితి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.

‘‘నీటి సరస్సుల్లో దీన్ని గుర్తించవచ్చు. ముఖ్యంగా వేడి నీటి సరస్సుల్లో ఉంటాయి. ప్రజలు నీటిలోకి దూకకూడదని లేదా మునగ కూడదని గుర్తుంచుకోవాలి. ఒకవేళ నీరు కలుషితమైనది అయితే, ముక్కు ద్వారా శరీరంలోకి ఈ అమీబా ప్రవేశిస్తుంది. కలుషితమైన జలాలు, స్విమ్మింగ్ పూల్స్‌లో ఈత కొట్టకుండా ఉంటే మంచిది. స్విమ్మర్లు తమ మూతిని నీటికి పైన ఉంచేలా చూసుకోవాలి. నీటిని క్లోరిన్‌తో శుద్ధి చేయడం చాలా ముఖ్యం’’ అని డాక్టర్ రవూఫ్ చెప్పారు.

స్నానం చేసే నీరు కూడా ఈ వ్యాధి సోకేందుకు ఒక మార్గంగా మారుతుందని కర్ణాటకలోని మంగళూరులో ఉన్న కస్తూర్బా మెడికల్ కాలేజీ రీసెర్చ్ పేపర్‌లో ప్రచురితమైంది.

అమీబా

ఫొటో సోర్స్, Getty Images

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

చాలా మంది చెరువులు, నదుల్లో స్నానాలు చేసేందుకు ఇష్టపడతారు. కొంతమంది స్విమ్మింగ్ పూల్‌కి వెళ్లాలని అనుకుంటారు. అలాంటప్పుడు ఏం చేయాలి?

ఈ అమీబా ఇన్ఫెక్షన్ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి కోజికోడ్‌లోని ఆ ప్రైవేట్ ఆసుపత్రి పీడియాట్రిక్ ఆంకాలజిస్ట్ అబ్దుల్ రౌబ్ అంతకుముందు కొన్ని సూచనలు చేశారు. అవి..

  • తక్కువ నీరు ఉన్న, నిర్వహణ సరిగ్గా లేని స్విమ్మింగ్ పూల్స్‌కు వెళ్లకుండా ఉండడం మంచిది.
  • కలుషిత చెరువులు, నదుల్లో స్నానం చేయకూడదు.
  • స్విమ్మింగ్‌ పూల్స్‌‌లో క్లోరినేషన్ చేయాలి.
  • ఈ అమీబా ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది కాబట్టి, తల కిందికి పెట్టి నీటిలో దూకడం, డైవింగ్ వంటివి చేయకుండా తల పైకి ఉండేలా చూసుకోవాలి.
రోగి పక్కన వైద్యులు అబ్దుల్ రవూఫ్

ఫొటో సోర్స్, MEMORIAL HOSPITAL, MUMBAI

ఫొటో క్యాప్షన్, రోగి పక్కన వైద్యులు అబ్దుల్ రవూఫ్

చికిత్స ఏంటి?

‘‘ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా పీఏఎం కేసులు 400 నమోదయ్యాయి. భారత్‌లో 30 రికార్డయ్యాయి. 2018 నుంచి 2020 మధ్యన కేరళలో ప్రతి ఏడాది ఒక కేసు నమోదైంది. ఈ ఏడాది ఏకంగా ఐదు కేసులో రిపోర్టు అయ్యాయి’’ అని డాక్టర్ రవూఫ్ అన్నారు.

అఫ్నాన్ కేసులో డాక్టర్లు లంబార్ చికిత్సను వాడారు. లక్షణాలు కనిపించిన 24 గంటల లోపల యాంటీమైక్రోబయాల్ డ్రగ్స్(యాంఫోటెరిసిన్ బీ, రిఫాంపిన్, అజిత్రోమైసిన్) కాంబినేషన్‌ను ఉపయోగించాం.

రోగి సెరెబ్రోస్పైనల్ ఫ్లూయడ్(సీఎస్ఎఫ్)లో 'నెగ్లేరియా ఫౌలెరి' గుర్తించేందుకు పీసీఆర్(పాలీమెరేస్ చైన్ రియాక్షన్)ను చేపట్టామని డాక్టర్ రవూఫ్ చెప్పారు.

‘‘మిల్టెఫోసిన్ ఇచ్చాం. అంతకుముందు ఈ మందు చాలా కష్టంగా దొరికేది. ఈ కేసులు భారత్‌లో నమోదవడం ప్రారంభమైనప్పటి నుంచి జర్మనీ దేశం నుంచి ప్రభుత్వం ఈ ఔషధాన్ని దిగుమతి చేసుకుంది. అత్యంత అరుదైన వ్యాధుల చికిత్సకు భారత్‌లో ఈ మందును వాడతారు’’ అని తెలిపారు.

‘‘మూర్ఛల వల్ల తొలి రోజు రోగి స్పృహలో లేడు. మూడు రోజుల్లో, అఫ్నాన్ పరిస్థితి కాస్త కుదుట పడటం ప్రారంభమైంది. వారం తర్వాత మళ్లీ పరీక్షించాం. శాంపిల్‌లో నెగిటివ్ అని వచ్చింది. ఆ తర్వాత రూమ్‌కి మార్చి, చికిత్సను కొనసాగించాం’’ అని డాక్టర్ రవూఫ్ తెలిపారు.

తర్వాత నెల పాటు అఫ్నాన్ మెడికేషన్ తీసుకున్నాడు. ప్రస్తుతం ఈ బాలుడు డిశ్చార్జ్ అయి, ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నాడు. తన 10వ తరగతి చదువును కొనసాగించాలని ఆశిస్తున్నాడు.

తన కొడుకు ఈ ప్రాణాంతక అమీబా బారి నుంచి ఎలా కోలుకున్నాడో తండ్రి సిద్దిఖీ బీబీసీకి వివరించారు.

‘‘భవిష్యత్‌లో ఏం చదవాలనుకుంటున్నావు? అని వైద్యులు నా కొడుకుని అడిగారు. నర్సింగ్‌లో డిగ్రీ చేయాలనుకుంటున్నా అని చెప్పాడు. ఆస్పత్రుల్లో నర్సుల పనిని చూసి నా కొడుకు చాలా స్ఫూర్తి పొందాడు. రోగుల కోసం వారెంతో కష్టపడతారని డాక్టర్లతో అనేవాడు’’ అని సిద్దిఖీ బీబీసీకి చెప్పారు.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)