ఈ తల్లిదండ్రులు తమ కొడుకుకు కారుణ్య మరణాన్ని ఎందుకు కోరుతున్నారు?

- రచయిత, కీర్తి దుబే
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఈ తల్లిదండ్రులు తమ కొడుకు కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలంటూ కోర్టును అభ్యర్థిస్తున్నారు. వారి బాధను, ఆవేదనను అర్థం చేసుకోవడం చాలా కష్టం.
63 ఏళ్ల అశోక్ రాణా, 60 ఏళ్ల నిర్మల కొడుకు హరీశ్ రాణా. ఆయన 11 ఏళ్లుగా మంచంపైనే కదల్లేని పరిస్థితుల్లో ఉన్నారు. ప్రస్తుతం హరీశ్‌కు 30 ఏళ్లుంటాయి.
హరీశ్ కనీసం మాట్లాడలేరు. దేనికీ స్పందించలేరు. వైద్య పరిభాషలో దీన్ని ‘వెజిటేటివ్ స్టేట్’ అంటారు. ఈ సమస్యతో బాధపడేవారికి నిరంతరం వైద్య సంరక్షణ అవసరం.
ఏదో ఒక రోజు తన కొడుకు ఆరోగ్యం బాగవుతుందని నిర్మలా రాణా అనుకునేవారు. కానీ, రోజులు, నెలలు గడుస్తున్నాయి కానీ, ఆయనలో ఎలాంటి కదలిక లేదు. పదకొండు ఏళ్లు గడిచాయి. నిర్మలా కోరుకున్న రోజు మాత్రం రాలేదు. తన కొడుకు బాగవుతాడనే ఆశను నిర్మలా రాణా వదులుకున్నారు.

ఈ పరిస్థితిని చూసిన నిర్మలా రాణా, అశోక్ రాణాలు తమ కొడుకు కారుణ్య మరణానికి (యూథనేషియా) అనుమతి ఇవ్వాలంటూ దిల్లీ హైకోర్టులో దరఖాస్తు చేసుకున్నారు.
ఏడాది కాలంగా సాగిన లీగల్ ప్రొసీడింగ్స్ అనంతరం, జులై 2న కోర్టు తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఏ మిషన్ సాయంతోనూ హరీష్ రాణా బతకడం లేదని, ఎలాంటి సాయం లేకుండానే ఆయన సొంతంగా గాలి పీల్చుకుంటున్నారని, ఏ లైఫ్ సపోర్టు సిస్టమ్‌పై కూడా ఆధారపడటం లేదని కోర్టు పేర్కొంది.
‘‘ఈ మరణ అభ్యర్థన బాధ నుంచి విముక్తి కలిగించే ఉద్దేశమైనా, ఇలాంటి కేసులో మెడిసిన్ ఇచ్చి వారిని చంపేందుకు ఫిజిషియన్‌కు అనుమతి ఉండదు’’ అని తెలిపింది.
హరీశ్ రాణా 2013లో చండీగఢ్ యూనివర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్ చదివేవారు. ఆ ఏడాది ఆగస్టు 3న సాయంత్రం 7 గంటలకు చండీగఢ్ నుంచి తండ్రి అశోక్ రాణాకు ఫోన్ వచ్చింది. హరీశ్ కింద పడిపోయి, గాయాలపాలయ్యారని చెప్పారు.
హరీశ్ తాను ఉంటున్న పేయింగ్ గెస్ట్ భవనంలోని నాలుగో అంతస్తు నుంచి పడిపోవడంతో అలా అయ్యింది.
తొలుత హరీశ్‌కు చండీగఢ్‌లోని ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఆ తర్వాత దిల్లీలోని ఎయిమ్స్‌కు, వివిధ ప్రైవేట్ ఆస్పత్రులకు తిప్పారు. కానీ, హరీశ్ పరిస్థితిలో ఏం మార్పు కనిపించలేదు.

ఆయనకు ఎందుకలా అయ్యింది?
‘‘హరీశ్ బ్రెయిన్ నరాలు పూర్తిగా దెబ్బతిన్నాయని డాక్టర్ మాకు చెప్పారు. చాలా ఆస్పత్రులకు తిప్పాం. కానీ, మా కొడుకు కోలుకోలేదు. వార్తాపత్రికల్లో అద్భుతాల గురించి ఎన్నో చదివాం. విన్నాం. కానీ, ఎలాంటి ప్రార్థనలు కానీ, మందులు కానీ మా కొడుకుకు పనిచేయలేదు’’ అని తండ్రి అశోక్ రాణా కన్నీళ్లు పెట్టుకున్నారు.
కొడుకు చికిత్స కోసం దిల్లీలోని ద్వారకాలో ఉన్న తమ ఇంటిని కూడా అమ్మేశారు. 1988 నుంచి వారు ఆ ఇంట్లోనే ఉండేవారు. ప్రస్తుతం వారు ఘాజియాబాద్‌లోని రెండు గదుల ఇంట్లో ఉంటున్నారు.
కొడుకు చికిత్స కోసం అయ్యే ఖర్చులను భరించడం ఆ కుటుంబానికి కష్టంగా మారింది. తాజ్ కేటరింగ్‌లో అశోక్ రాణా పనిచేసే వారు. పదవీ విరమణ తర్వాత, ప్రతి నెలా ఆయనకు రూ.3,600 పెన్షన్ వస్తోంది.
కొడుకు చికిత్సకు, ఇంట్లో ఖర్చుల కోసం శని, ఆదివారాల్లో ఘాజియాబాద్‌లోని క్రికెట్ గ్రౌండ్‌లో బర్గర్లను, శాండ్‌విచ్‌లను ఆయన అమ్ముతున్నారు.
‘‘మా కొడుకును చూసుకునేందుకు రెండు నెలల పాటు నర్సును పెట్టాం. కానీ, నెలకు రూ.22 వేలు తీసుకునేవారు. ఆమెకు అంత డబ్బు చెల్లించలేకపోయాం’’ అని ఆయన తెలిపారు.
‘‘కొడుకు మరణం కోసం ఎవరు అడుగుతారు చెప్పండి? నేను దీని గురించి ఆలోచించినప్పుడు, రాత్రి నిద్రపట్టేది కాదు. కానీ, నేనిప్పుడు ఏం చేయాలి? ఎంత కాలం నేను ఇలా చేయగలను’’ అని కన్నీటితో చెప్పారు.
నిర్మల తన కొడుకును కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. మేం ఆమెను కలిసినప్పుడు మధ్యాహ్నం 1 అవుతోంది. అప్పటి వరకు ఆమె ఏమీ తినలేదు. ఎందుకంటే, రోజులో సగం పూట కొడుకు బట్టలు ఉతకడానికి, బెడ్డు మార్చడానికి, శుభ్రం చేసేందుకే సరిపోతుందని ఆమె చెప్పారు.
అంతేకాక ఎన్నో ఏళ్లుగా మంచంపైనే నిర్జీవ స్థితిలో ఉండటంతో హరీశ్ వెనుకవైపు గాయాలు అయ్యాయి. వాటికి ఎప్పటికప్పుడు డ్రెస్సింగ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఆమెనే చేస్తారు.

కొడుకు కారుణ్య మరణం అడగడం తల్లికి ఎంత కష్టం?
ఈ ప్రశ్న అడిగినప్పుడు ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు.
‘‘మాకు ఏదైతే జరిగిందో, మరెవరికీ జరగకుండా దేవుడు చూసుకోవాలి. నేను అలసిపోయాను. నాకేమైనా అయితే, హరీశ్‌ను ఎవరు చూసుకుంటారు. ఆయన అవయవాలు దానం చేయాలనుకున్నారు. ఆయనకు ఉపయోగపడని అవయవాలను వేరే వాళ్లకు ఇస్తే, కనీసం వారిల్లో అయినా మా కొడుకును చూసుకుంటాం. ఆయనకు మోక్షం కావాలి’’ అని అన్నారు.
హరీశ్‌కు పైప్ ద్వారానే ఆహారం అందిస్తున్నారు. ఎండోస్కోపీ ద్వారా కడుపులోకి ఈ పైప్‌ను పంపుతారు. దీని ధర రూ.15 వేల దాకా ఉంటుంది. హరీశ్ వైద్య ఖర్చులు నెలకు రూ.25 నుంచి రూ.30 వేలు అవుతుంటాయని తల్లిదండ్రులు చెప్పారు.
మధ్యాహ్నం మూడవుతోంది. నిర్మలా పెసర పప్పు, కూరగాయలతో ఆహారాన్ని సిద్ధం చేస్తున్నారు. దీన్ని ఫుడ్ పైప్ ద్వారా హరీశ్‌కు ఇవ్వాలి.
ఆ ఆహారంలో నల్లమిరియాలు, నెయ్యి కలుపుతున్నారు. అవి ఎందుకు కలుపుతున్నారని అడగగా? రుచి కోసం అని చెప్పారు.
కానీ, ఎన్నో ఏళ్ల క్రితం హరీశ్ తన రుచిని కోల్పోయారు కదా? ఈ ఆహారం కూడా పైప్ ద్వారా అందిస్తున్నారు కదా? అని అడగగా..
‘‘అవును, కానీ, ఇప్పటికీ నేనలా అనుకోవడం లేదు’’ అని నిర్మలా అన్నారు.
కారుణ్య మరణం అనేది ఎన్నో సామాజిక, నైతిక అంశాలతో ముడిపడిన విషయం. దీనిపై ఏ నిర్ణయమైనా కోర్టుకు అది అతిపెద్ద సవాలే.

కారుణ్య మరణం అంటే ఏంటి?
కారుణ్య మరణాలపై ఒక ఎన్‌జీఓ వేసిన పిటిషన్‌పై వాదనలు విన్న తర్వాత 2018లో సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని ప్రకటించింది. గౌరవంతో చనిపోవడం ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు అని, పాసివ్ యూథనేషియా(కారుణ్య మరణం) దేశంలో చట్టబద్ధమైనదిగా చేస్తున్నట్టు తెలిపింది.
పాసివ్ యూథనేషియా అంటే ఎన్నో ఏళ్లుగా రోగి మంచం పాలై, కోమాలో ఉండటం. కోలుకునేందుకు ఎలాంటి అవకాశం లేకపోవడం. కేవలం లైఫ్ సపోర్టు సిస్టమ్‌పైనే బతకడం. దీంతో లైఫ్ సపోర్టు సిస్టమ్‌ను తొలగించి ‘మంచి’ చావుకు అనుమతించవచ్చు.
అయితే, రోగి తల్లిదండ్రుల, భాగస్వామి లేదా ఇతర సమీప బంధువుల అనుమతితోనే ఇలా చేయాల్సి ఉంటుంది. అంతేకాక, హైకోర్టు అనుమతి అవసరం. తల్లిదండ్రులు లేదా భాగస్వామి లేదా సమీప బంధువులు లేకపోతే, రోగి స్నేహితుల సమ్మతి అయినా దీనికి తీసుకోవాలి.
కానీ, యాక్టివ్ యూథనేషియా విధానంలో రోగిని చంపేసేందుకు తల్లిదండ్రులే మెడికేషన్ ఇస్తారు. ఇది దేశంలో చట్టవిరుద్ధం.
ప్రపంచంలో కేవలం కొన్ని దేశాలలోనే స్విట్జర్లాండ్, ఆస్ట్రియా, బెల్జియం, నెదర్లాండ్స్, స్పెయిన్, కెనడా, కొలంబియా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, అమెరికాలోని 11 రాష్ట్రాల్లో యూథనేషియాకు అమనుతి ఉంది.
చాలా దేశాలలో ఇది చట్టవిరుద్ధం. బ్రిటన్ వంటి అభివృద్ధి చెందిన దేశాలలో యూథనేషియా చట్టవిరుద్ధం.
ముంబయిలోని కింగ్ ఎడ్వర్డ్స్ మెమోరియల్ హాస్పిటల్‌లోని నర్సు అరుణా షాన్‌బాగ్ కేసు సమయంలో సుప్రీంకోర్టు మెడికల్ ప్యానల్‌ను ఏర్పాటు చేసినప్పుడు 2011లో కారుణ్య మరణం వెలుగులోకి వచ్చింది.

ఫొటో సోర్స్, SPL
కారుణ్య మరణంపై ఎన్నో ఏళ్లుగా చర్చ
కారుణ్య మరణాలపై ఎన్నో ఏళ్లుగా చర్చలు నడుస్తున్నాయి.
‘‘దేవుడు జీవితాన్ని ఇచ్చాడు. దానిని తీసుకుని వెళ్లే హక్కు ఆయనకే ఉంటుందని ప్రజలు నమ్ముతారు. ఈ విషయంలో అనిశ్చితికరమైన పరిస్థితులూ ఉన్నాయి. ఈ రోజు స్పృహ కోల్పోయిన వారు, రేపు స్పృహలోకి రావొచ్చు. ఒకవేళ వారిని ఈ రోజే చంపితే, వారు కోలుకునే అవకాశాన్ని మనం తీసేసినట్టే. ఈ విషయంలో హైకోర్టు తీసుకున్న నిర్ణయాలతో నేను అంగీకరించను’’ అని ఆర్ఆర్ కిశోర్ అన్నారు.
ఆయన వైద్యుడు, న్యాయవాది కూడా. సుప్రీంకోర్టులో న్యాయవాది. ఇండియన్ సొసైటీ ఫర్ హెల్త్ అండ్ లా ఎథిక్స్‌కు ప్రెసిడెంట్.
‘‘లైఫ్ సపోర్టు సిస్టమ్ తొలగించాలా లేదా అన్న విషయాన్ని నిర్ణయిచేందుకు అవసరమైన పలు అంశాలను పరిశీలించేందుకు కార్డియాలజిస్టులు, ఫిజియాలజిస్టులు, జనరల్ ఫిజిషియన్లతో మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలన్నది నా అభిప్రాయం. రోగి వైద్య పరిస్థితిని ప్రాథమికంగా కోర్టు అంచనా వేయలేదనేది ప్రాథమిక ప్రశ్న’’ అని అన్నారు.
యూథనేషియా కోసం చట్టాన్ని రూపొందించడం భారత్ లాంటి దేశాల్లో చాలా సవాలుతో కూడుకున్న విషయమని కిశోర్ అంటున్నారు. ఎందుకంటే, చాలా సార్లు కుటుంబ సభ్యులే తమ సొంత ప్రయోజనాల కోసం దీన్ని దుర్వినియోగం చేస్తారని ఆయన అన్నారు.
హరీశ్ ఇంజనీర్ కావాలనుకున్నారు. బాడీ బిల్డింగ్‌పై ఆయనకు ఆసక్తి ఉండేది. ఆ దంపతులకు ఆయనే పెద్ద కొడుకు. ఎన్నో ఆశలు, బాధ్యతలు ఉండేవి. కానీ, ఇప్పుడు హరీశ్ కుటుంబం ఎలాంటి ఆశ లేకుండా ఉంది. కేవలం కొన్ని జ్ఞాపకాలు మాత్రమే వారి వద్ద ఉన్నాయి.
హరీశ్ బెడ్ పక్కనే ఉన్న గోడకు గడియారం ఉంది. క్యాలెండర్ కూడా అక్కడే దగ్గర్లో ఉంది. గడియారం ముళ్లు, క్యాలెండర్‌లో పేజీలు మారుతున్నాయే తప్ప 11 ఏళ్లుగా ఆ ఇంట్లో కాలం మాత్రం అక్కడే ఆగిపోయింది.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














