అన్న క్యాంటీన్: బ్రేక్‌ఫాస్ట్ అయినా, భోజనమైనా 5 రూపాయలకే అందించే ఏపీ ప్రభుత్వ ఆహారశాలల్లో ఏమేం ఉంటాయి

- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ ‘అన్న’ క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా తొలిదశలో 100 క్యాంటీన్లను తెరిచారు.
ఆగస్ట్ 15న కృష్ణా జిల్లా గుడివాడలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ‘అన్న’ క్యాంటీన్ ప్రారంభించారు.
అనంతరం రాష్ట్రమంతా ఎమ్మెల్యేలు, ఎంపీల ఆధ్వర్యంలో క్యాంటీన్లు తెరచుకున్నాయి.
‘రాష్ట్రవ్యాప్తంగా 49 మున్సిపాలిటీలలో 100 ‘అన్న’ క్యాంటీన్లు ప్రారంభించాం. సెప్టెంబర్ నెలాఖరుకు 203 వరకు పెంచుతాం’’ అని ప్రారంభం సందర్భంగా సీఎం చంద్రబాబు తెలిపారు.
ఏజెన్సీలలో ప్రతి మండలంలో అన్న క్యాంటీన్ ఉండేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.


ఏదైనా 5 రూపాయలే
ఈ క్యాంటీన్లలో 5 రూపాయలకే టిఫిన్, భోజనం అందుబాటులో ఉంటాయి.
ఇడ్లీ, పూరీ, ఉప్మా, పొంగల్ వంటి ఐటమ్స్ బ్రేక్‌ఫాస్ట్‌లో ఇస్తున్నారు. మధ్యాహ్నం, రాత్రి భోజనంలో అన్నం, కూర, పచ్చడి, సాంబారు, పెరుగు ఇస్తున్నారు.
ఇడ్లీ, పూరీ అయితే 3 చొప్పున ఇస్తామని.. ఉప్మా లేదా పొంగల్ అయితే 250 గ్రాముల చొప్పున ఇస్తామని నిర్వాహకులు మెనూలో పేర్కొన్నారు.
ఉదయం 7.30 గంటల నుంచి 10 గంటల వరకు బ్రేక్ ఫాస్ట్ అందిస్తారు. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 3 గంటల వరకు భోజనం పెడతారు.
రాత్రి 7.30 గంటల నుంచి 9 గంటల వరకు క్యాంటీన్ తెరిచి ఉంటుంది.
‘అన్న’ క్యాంటీన్లకు ఆదివారం సెలవు. వారంలో ఒక రోజు స్పెషల్ రైస్ అందుబాటులో ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.
‘‘ప్రస్తుతం ప్రతి క్యాంటీన్ ద్వారా పూటకు 350 మందికి భోజనం పెడతాం. ఆ తరువాత రద్దీని బట్టి ఆ సంఖ్యను పెంచుతాం’’ అని చంద్రబాబు చెప్పారు.
తొలి దశ ప్రారంభించిన 100 క్యాంటీన్లలో పూటకు 35,000 మంది చొప్పున రోజుకు 1.05 లక్షల మందికి ఆహారం అందుతుంది.

ఖర్చు ఎంత?
‘అన్న’ క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతను ప్రస్తుతం ‘అక్షయపాత్ర’కు అప్పగించారు.
ఇస్కాన్ ఆధ్వర్యంలో నడిచే ఆ సంస్థకు చెందిన సెంట్రలైజ్డ్ కిచెన్‌ల నుంచి ఆహారం తయారుచేసి క్యాంటీన్లకు సరఫరా చేస్తారు.
అందుకోసం అక్షయపాత్ర తరఫున వివిధ క్యాంటీన్లలో సిబ్బందిని నియమించారు.
ప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారం, ఉదయం టిఫిన్‌కు 22 రూపాయలు, ఒక పూట భోజనానికి 34 రూపాయల చొప్పున ఖర్చు అవుతోంది. అంటే మూడు పూటలకు మొత్తం 90 రూపాయలు ఖర్చు కానుంది.
ఇందులో వినియోగదారుల నుంచి 15 రూపాయలు మాత్రమే వసూలు చేస్తారు. మిగిలిన 75 రూపాయలు ప్రభుత్వం రాయితీగా ఇవ్వడంతోపాటు చందాలు, దాతల ద్వారా సమకూర్చుతారు.

‘‘ప్రభుత్వానికి ఒక్క అన్న క్యాంటీన్‌లో రోజుకు 350 మందికి ఆహారం అంటే 26,250 రూపాయల ఖర్చు అవుతుంది. 100 క్యాంటీన్లకు 16 లక్షల 25 వేల రూపాయలు అవుతాయి. 203 క్యాంటీన్లు ప్రారంభించిన తరువాత రోజు ఖర్చు 53 లక్షల 28 వేల 750 రూపాయలకు చేరుతుంది’’ అని సీఎం చంద్రబాబు అన్నారు
‘‘రాష్ట్రవ్యాప్తంగా అన్ని అన్న క్యాంటీన్ల నిర్వహణకు ఏడాదికి 200 కోట్లు ఖర్చు అవుతుంది’’ అని ఆయన చెప్పారు.

చందాలు తీసుకోవడం
‘అన్న’ క్యాంటీన్ల నిర్వహణ వ్యయం భరించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తోంది.
ఖజానా మీద భారం పడకుండా దాతల సహాయంతో వాటిని నిర్వహించాలని యోచిస్తోంది. ఇప్పటికే దానికి అనుగుణంగా విరాళాలు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.
ఇందుకు ‘‘అన్నక్యాంటీన్ చారిటబుల్ ట్రస్ట్’’ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్యాంటీన్ల నిర్వహణకు సీఎం చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి కోటి రూపాయలు విరాళం ఇచ్చారు. అలాగే వ్యాపారవేత్తలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా విరాళాలు ప్రకటించారు.
"అందరూ తమ సంపాదనలో 5 శాతం విరాళంగా ఇవ్వాలి. పెళ్లి రోజు, పుట్టిన రోజు వంటి శుభకార్యాల్లో కొంత ఖర్చు తగ్గించుకుని పేదలకు పట్టెడన్నం పెట్టే కార్యక్రమానికి తోడ్పడాలి" అని సీఎం పిలుపునిచ్చారు.
క్యాంటీన్లు మళ్లీ తెరవడంపై అనేక మంది లబ్దిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
"బయట టిఫిన్ చేయాలంటే నాకు 50 రూపాయలు అవుతుంది. ఇక్కడ 5 రూపాయలకే టిఫిన్ అందించడం ఆనందంగా ఉంది. మాలాంటి సామాన్యులకు చాలా ఉపయోగం" అని విజయవాడకు చెందిన నాగేంద్ర కుమార్ బీబీసీతో అన్నారు.
"మేము దుర్గ గుడికి వచ్చాం. తిరిగి వెళ్లిపోతూ అన్న క్యాంటీన్‌లో భోజనం చేశాం. చాలా బాగుంది. పేదలకు ఉపయోగంగా ఉన్న వీటిని ఇలాగే కొనసాగించాలి" అంటూ విజయవాడ రూరల్‌కు చెందిన సుభద్ర బీబీసీతో అన్నారు.

2018లో ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారి 2016లో ‘‘అన్నా క్యాంటీన్’’ను వెలగపూడిలో పైలట్ ప్రాజెక్ట్‌గా చేపట్టారు. ఆ తరువాత 2018లో పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు.
మొత్తం 203 క్యాంటీన్లను తెరవగా రోజుకు లక్షా 40 వేల మందికి తిండి పెట్టామని చంద్రబాబు వెల్లడించారు. ఇందుకు 130 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని ఆయన చెప్పారు.
వైఎస్ జగన్ 2019లో ముఖ్యమంత్రి అయిన తరువాత ‘‘అన్న క్యాంటీన్లు’’ ఆగిపోయాయి. 2024లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మళ్లీ క్యాంటీన్లను తెరిచారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















