కేటీఆర్, రేవంత్ రెడ్డి.. మధ్యలో రాజీవ్ గాంధీ - హైదరాబాద్‌లో ఏమిటీ పాలిటిక్స్

కేటీఆర్, రాజీవ్ గాంధీ, రేవంత్ రెడ్డి

ఫొటో సోర్స్, Getty Images/facebook/ktr/revanthreddy

    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తెలంగాణలో ‘విగ్రహ’ రాజకీయం నడుస్తోంది. సచివాలయం ఎదురుగా ఉన్న ప్రాంతంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించడాన్ని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది.

ఆ ప్రదేశంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపాదించినట్లు బీఆర్ఎస్ చెబుతోంది.

ఇప్పుడు అదే ప్రాంతంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆవిష్కరించాలనుకుంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం.

అదే సమయంలో తెలంగాణ తల్లి విగ్రహం కాకుండా రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడంపై బీఆర్ఎస్ సహా తెలంగాణలోని ప్రజాసంఘాలు, మేధావులు, కవులు, కళాకారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఈ వ్యవహారం అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలతోపాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ మధ్య వ్యక్తిగత ఆరోపణలకు దారితీసింది.

ప్రస్తుతానికి రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమం వాయిదా వేసుకోగా, తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసే ప్రదేశాన్ని మార్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది.

వాట్సాప్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
సచివాలయం
ఫొటో క్యాప్షన్, తెలంగాణ ప్రభుత్వం సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి, ఆవిష్కరించాలనుకుంటోంది.

వివాదం ఎక్కడ మొదలైంది?

తెలంగాణ సచివాలయం ఎదురుగా, అమరవీరుల స్మారక స్తూపం మధ్య కొంత ఖాళీ ప్రదేశం ఉంది. అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే విగ్రహాన్ని అక్కడ ఏర్పాటుచేసింది, కానీ, ఆవిష్కరించలేదు.

అయితే, తెలంగాణ ఉద్యమంతో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ సంబంధం లేని రాజీవ్ గాంధీ విగ్రహం సచివాలయం ఎదురుగా పెట్టడం ఏమిటంటూ బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది.

దీనిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.

‘‘ఆ ప్రదేశంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మేం అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపాదించాం. సచివాలయంలో కూర్చుని పాలించే ప్రతి పాలకుడికి తెలంగాణ అమరవీరుల త్యాగాలని స్ఫూర్తిని జ్వలింపజేసేలా అమరుల స్మారకాన్ని నిర్మించాం. తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి ప్రతీకైన తెలంగాణ తల్లిని అక్కడే ప్రతిష్ఠించాలన్న ఉద్దేశంతో ఒక ఐలాండ్‌ని సచివాలయం ఎదురుగా తయారు చేశాం. అలాంటి చోట తెలంగాణ తల్లి విగ్రహం బదులుగా రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడమంటే.. తెలంగాణ ప్రజలు, అమరవీరులను అవమానించడమే. నాలుగేళ్ల తర్వాత మేం అధికారంలోకి వస్తాం. అధికారంలోకి వచ్చిన మొదటి రోజే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సకల మర్యాదలతో కాంగ్రెస్ పార్టీ కోరుకున్న చోటుకే పంపిస్తాం’’ అని కేటీఆర్ అన్నారు.

రాహుల్ గాంధీ దగ్గర మార్కులు కొట్టేయాలంటే గాంధీభవన్‌లోనో, రేవంత్ రెడ్డి ఇంట్లోనో రాజీవ్ విగ్రహం ఏర్పాటుచేసుకోవాలని కేటీఆర్ సూచించారు.

బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తెలంగాణలోని ఓ మహనీయుడి పేరును శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి పెడతామని చెప్పారు.

‘‘ఒకప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన అంజయ్య పేరుతో లుంబినీ పార్కు ఏర్పాటైంది. అంజయ్య పేరుతో ఉన్న పార్కు ఎదురుగా, ఆయనను అవమానించిన రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్నారు’’ అని కేటీఆర్ అన్నారు.

అంజయ్య విగ్రహం
ఫొటో క్యాప్షన్, అంజయ్య విగ్రహం

కవులు, కళాకారులు, ప్రజాసంఘాల లేఖ

రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటుపై తెలంగాణకు చెందిన పలువురు కవులు, కళాకారులు, ప్రజాసంఘాల నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈ విషయంపై లోక్‌సభలో కాంగ్రెస్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారు.

‘‘సెక్రటేరియట్ ఎదురుగా తెలంగాణ తల్లిని పెట్టాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టాలనే ప్రభుత్వ ఆలోచనపై మాకు అభ్యంతరాలున్నాయి. నగరంలో రాజీవ్ విగ్రహం పెట్టాలనే ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వ ఆలోచనపై మాకేమీ అభ్యంతరం లేదు. అయితే, సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి ఉండవలసిన చోట కాకుండా మరెక్కడైనా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

తెలంగాణ చరిత్రతో గానీ, పరిణామాలతో గానీ ప్రత్యక్ష సంబంధం లేని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అక్కడ పెట్టి తెలంగాణ భావోద్వేగాలను గాయపర్చవద్దని కోరుతున్నాం’’ అంటూ ప్రొఫెసర్ హరగోపాల్, టంకశాల అశోక్, అల్లం నారాయణ, గోరెటి వెంకన్న, మల్లేపల్లి లక్ష్మయ్య, నందిని సిధారెడ్డి, అయాచితం శ్రీధర్, పరాంకుశం వేణుగోపాల స్వామి, నాళేశ్వరం శంకరం, దేశపతి శ్రీనివాస్, ఘంటా చక్రపాణి సహా పలువురు లేఖ రాశారు.

 రేవంత్, భట్టి విక్రమార్క

ఫొటో సోర్స్, X/Revanth_anumula

ఫొటో క్యాప్షన్, సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు ప్రదేశం పరిశీలిస్తున్న రేవంత్, భట్టి విక్రమార్క.

సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం

ఆగస్టు 20వ తేదీన జరిగిన రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఈ మొత్తం వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు.

ఆ సమయంలో మాజీ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లను ఉద్దేశించి రేవంత్ వ్యక్తిగత విమర్శలు చేశారు.

ఇక్కడ రాయడానికి వీల్లేని కొన్ని మాటలు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

‘‘తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ భర్త, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సచివాలయం ముందు పెడితే తొలగిస్తామని కొంతమంది….. మాట్లాడుతున్నారు. సచివాలయం ముందు కోట్లాది ప్రజలకు స్ఫూర్తిగా అమరవీరుల స్థూపం పక్కన దేశం కోసం అమరుడైన రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం సముచితం’’ అని రేవంత్ రెడ్డి అన్నారు .

‘‘ అధికారంలోకి వస్తే రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తామని అంటున్నారు. ఎవరైనా చేతనైతే రాజీవ్ గాంధీ విగ్రహం మీద చేయి పెట్టండి చూద్దాం. మీకు అధికారం కలలో కూడా రాదు’’ అని చెప్పారు.

పదేళ్లు అధికారంలో ఉన్నా తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు ఎందుకు గుర్తుకు రాలేదని కేటీఆర్‌ను రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

‘‘2024 డిసెంబరు 9 నాడు సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసే బాధ్యత మేం తీసుకుంటాం’’ అని సీఎం ప్రకటించారు.

సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించే ప్రదేశాన్ని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి సీఎం రేవంత్ పరిశీలించారు.

గతంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహంలో కొన్ని మార్పులు చేసి కొత్త విగ్రహాన్ని సచివాలయం లోపల ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోంది.

నాయకులు వాడుతున్న భాష విషయంపై ప్రముఖ కవి నందిని సిధారెడ్డి బీబీసీతో మాట్లాడారు.

‘‘ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలోనే తెలంగాణ అస్తిత్వానికి చిహ్నంగా తెలంగాణ తల్లిని తీసుకున్నాం. అదే విధంగా భాష కూడా అస్తిత్వానికి ఒక చిహ్నం. ఇవన్నీ కలిస్తేనే సంస్కృతి అవుతుంది. ప్రాథమికంగా మన సంస్కృతిని గౌరవించుకోవాలి. ఆ కోవలోనే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని అడిగాం. జాతీయత కోణం వచ్చినప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడంలో అభ్యంతరం లేదు. ఇక భాష విషయానికి వస్తే.. తెలంగాణ భాషలోనే మర్యాదపూర్వకంగా సంస్కారంగా మాట్లాడుకోవడం ఉంది. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వ్యక్తి అలా వ్యక్తిగత విమర్శలు చేస్తూ మాట్లాడటం సరికాదు. ఆలోచనపరులైతే ఆయన స్థాయిని తక్కువగా అంచనా వేస్తారు. ఆలోచన లేని వాళ్లు అయితే ఆ మాటలను తీసుకుని.. వారు అలా మాట్లాడే అవకాశం ఉంది.’’ అని సిధారెడ్డి అన్నారు.

కేటీఆర్

ఫొటో సోర్స్, Facebook/KTR

ఫొటో క్యాప్షన్, మాజీ మంత్రి కేటీఆర్

కేటీఆర్ వ్యాఖ్యలపై వివాదం

రేవంత్ రెడ్డి చేసిన వ్యక్తిగత విమర్శలపై సోషల్ మీడియా ఎక్స్ హ్యాండిల్‌లో కేటీఆర్ స్పందించారు.

‘‘నా మాటలు గుర్తుపెట్టుకో చీప్ మినిస్టర్. అధికారంలోకి వచ్చిన తొలిరోజే బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయం పరిసరాల్లోని చెత్తను తొలగిస్తాం. నీలాంటి దిల్లీ గులాం (బానిస) తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణను అర్థం చేసుకోలేరు. స్కూల్ పిల్లల ముందు చెత్త మాటలు మాట్లాడిన రేవంత్ వ్యక్తిత్వం ఏంటో తెలుస్తోంది’’ అని పేర్కొన్నారు.

రేవంత్ రెడ్డిని ‘చీప్ మినిస్టర్’, దిల్లీకి గులాం అనడంపై కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ సైఫాబాద్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఎంపీ అనిల్ కుమార్ యాదవ్

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్న ఎంపీ అనిల్ కుమార్ యాదవ్

రాజీవ్ విగ్రహం ఆవిష్కరణ ఉంటుందా?

సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుచేసింది. దానిపై నల్ల పరదాలు కప్పి ఉంచారు. ఇంకా ఆవిష్కరించలేదు.

విగ్రహం ముందు ఉన్న ప్రాంతంలో పార్కును అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం మొక్కలు నాటే పనులు జరుగుతున్నాయి.

విగ్రహాన్ని ఆగస్టు 20వ తేదీన ఆవిష్కరించాలని భావించినా.. ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, కవులు, కళాకారులు, పాత్రికేయుల నుంచి వ్యతిరేకత రావడంతో ఆవిష్కరణ కార్యక్రమాన్ని తాత్కాలికంగా విరమించుకున్నారు.

సచివాలయం లోపల ముందుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసి, తర్వాత ప్రభుత్వం రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటును పరిశీలించనుందని కాంగ్రెస్ పార్టీ నాయకుడొకరు బీబీసీకి చెప్పారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)