తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ డ్యాముల్లో నీటి నిల్వ సామర్థ్యం తగ్గడానికి కారణమదేనా, ఇక వరి పండించడం కష్టమేనా?

ఫొటో సోర్స్, Harish
- రచయిత, ప్రవీణ్ శుభం
- హోదా, బీబీసీ కోసం
“వరి పొట్ట దశలో ఆయకట్టు చివరి గ్రామాలకు కడం ప్రాజెక్ట్ నీరు అందడం గగనం అయింది. మేమైతే రబీలో వరి బదులు మొక్కజొన్న పంట వేస్తున్నాం’’ అని మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేటకు చెందిన రైతు మ్యాడ దయాకర్ చెప్పారు.
పూడిక కారణంగా కడం ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతూ వస్తోంది. దీనివల్ల ఆయకట్టు భూములకు సరిపడా నీరందక కొన్ని ప్రాంతాల్లో రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్ళుతున్నారు.
అందుకే దయాకర్ లాంటి రైతులు ప్రత్యామ్నాయ పంటలవైపు దృష్టి సారిస్తున్నారు.
‘‘గతంలో వరి పండించేవారం. ఇప్పుడు నాలుగు ఎకరాల్లో వరి వేస్తే రెండు ఎకరాలు ఎండిపోతోంది. అందుకే మొక్కజొన్న పంటవైపు మళ్ళాం. మరికొన్ని గ్రామాల్లో రైతులు పత్తి పంట వేస్తున్నారు” అని దయాకర్ అన్నారు.
ప్రాజెక్టులో పూడిక వల్ల నీటి లభ్యత తగ్గడం సమస్యగా మారుతోంది.
పూడిక వల్ల తుంగభద్ర డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం కూడా తగ్గుతూ వస్తోంది.
ఆ డ్యామ్ గేటు ఇటీవల కొట్టుకుపోయింది.
1953లో దాన్ని నిర్మించగా 2008 నాటికి 23.87 శాతం నీటి నిల్వ సామర్థ్యాన్ని కోల్పోయిందని కేంద్ర జల సంఘం హైడ్రోగ్రాఫిక్ సర్వే నివేదిక చెబుతోంది.
తుంగభద్రకు బాలెన్సింగ్‌గా మరొక రిజర్వాయర్‌ను కట్టాలని కర్ణాటక ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
‘‘ తుంగభద్ర డ్యామ్ పూడిక వల్ల దాదాపు 30 టీఎంసీల నిల్వ సామర్థ్యాన్నికోల్పోయింది’’ అని ఇటీవల కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ చెప్పారు.
సుమారు 131 టీఎంసీల సామర్థ్యంతో తుంగభద్ర ప్రాజెక్టును నిర్మించగా, ఇప్పుడు దాదాపు 100 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వచేయగలుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లోని అనేక డ్యామ్‌ల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
సెంట్రల్ వాటర్ కమిషన్ రిపోర్ట్ -2020 ప్రకారం శ్రీశైలం డ్యామ్ 29.96శాతం, నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ 23.52శాతం, నిజాం సాగర్ 60.47 శాతం, శ్రీరాం సాగర్ 28.49 శాతం నీటి నిల్వ సామర్థ్యాన్ని కోల్పోయాయి.



ఫొటో సోర్స్, Telangana Irrigation
‘పూడికపై శ్రద్ధ పెట్టాలి’
ఏళ్ల తరబడి పేరుకుపోతున్న పూడికవల్ల రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యం ఏటేటా తగ్గిపోతోంది.
నీటి ప్రాజెక్టుల విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య కనిపిస్తోంది.
‘ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ లార్జ్డ్యామ్స్’ (ICOLD) ఇచ్చిన నివేదిక ప్రకారం 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద డ్యామ్‌ల నిల్వ సామర్థ్యం సగానికి పడిపోనుంది.
ప్రపంచంలోనే అత్యధిక జనాభాతో పాటు పెద్ద సంఖ్యలో డ్యామ్‌లను కలిగి, ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన భారత్ వంటి దేశాల్లో పారిశ్రామిక ప్రగతి, రక్షిత తాగు నీరు, విద్యుత్, ఆహార భద్రత వంటి అంశాలతో రిజర్వాయర్ల నీటి నిల్వ అంశం పరోక్షంగా ముడిపడి ఉంది. అందుకే డ్యామ్ పూడిక నిర్వహణపై అత్యధిక శ్రద్ధ వహించాలని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) భావిస్తోంది.
‘నేషనల్ రిజిస్టర్ ఆఫ్ లార్జ్డ్యామ్స్-2023 ప్రకారం ప్రస్తుతం దేశంలోని డ్యామ్‌ల సంఖ్య 6138. వీటిల్లో 234 డ్యామ్‌లు వందేళ్ల పూర్వం నిర్మించినవి.
వీటిలో ఆంధ్రప్రదేశ్‌లో 6, తెలంగాణలో 27 ఉన్నాయి.
తెలంగాణలో మొత్తంగా 161, ఏపీలో 140 డ్యామ్‌లున్నాయి.

ఫొటో సోర్స్, PRAVEEN SUBHAM/BBC
పూడిక ఎలా చేరుతుంది?
నదీ పరీవాహక ప్రాంతాల్లోని నేల, రాయి, ఖనిజాలు, వృక్ష, జంతు అవక్షేప కణాలతో పూడిక ఏర్పడుతుంది. ఇది నీరు, మంచు, గాలి ద్వారా తరలి వచ్చి నీటి వనరుల్లో చేరుతుంది. ప్రకృతిలో ఇదొక సహజసిద్ద ప్రక్రియ.
పూడిక ఏర్పడే స్థాయి (రేటు) ఆయా నదుల పరీవాహక ప్రాంత నేల రకం, క్యాచ్మెంట్ ఏరియాలోని అడవుల విస్తీర్ణంపై ఆధారపడి ఉంటుంది.
నల్లరేగడి, ఒండ్రుమట్టి ప్రాంతాల్లో పూడిక రేటు ఎక్కువగా ఉంటుంది.
నీటి ప్రవాహం రిజర్వాయర్లకు చేరుకున్నాక ప్రవాహ వేగం తగ్గినప్పుడు పూడిక స్థిరపడుతుంది.
పెరుగుతున్న జనాభా, పట్టణీకరణ, నీటి వనరుల ఆక్రమణ పూడిక ఏర్పడడటం వెనుక ఉన్న మానవ ప్రేరేపిత కారణాలు.
ఇది సామాజిక, ఆర్థిక, పర్యావరణ పరంగా ప్రతికూల ప్రభావాలతో విపత్తులకు దారితీస్తుందని కేంద్ర జల సంఘం ఒక నివేదికలో తెలిపింది.

ఫొటో సోర్స్, PRAVEEN SUBHAM/BBC
పూడికతో నష్టాలు
పూడికతో నదుల ఆకృతి, ప్రవాహంలో మార్పు వస్తుంది. లోతు తగ్గడంతో పాటు నీటి నాణ్యత పడిపోతుంది. ఇది అక్కడి జలచరాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. నదీ తీరం వెంబడి కోతకు కారణమవుతుంది.
ప్రాజెక్టు గేట్లు, కాంక్రీట్ నిర్మాణం దెబ్బతినడానికి కారణం అవుతుందని సీడబ్ల్యూసీ నివేదిక చెప్పింది.
నిల్వ సామర్థ్యం క్రమంగా కోల్పోవడం వల్ల గతంలో వేసిన అంచనాకు మించి ఎగువ ప్రాంతాల్లో వరద స్థాయి త్వరగా పెరుగుతుంది. దీంతో వరద నీటిని దిగువకు వదిలే చర్యలు ప్రాజెక్టును ప్రమాదకర పరిస్థితుల్లోకి నెట్టే అవకాశాలుంటాయి.
తెలంగాణలోని కడం ప్రాజెక్ట్ విషయంలో ఇటీవల కాలంలో ఈ అంశాన్ని గమనించవచ్చు.

ఫొటో సోర్స్, Pillamarri Srinivas
తాగు, సాగు నీటిపై ప్రభావం
ఆయా ప్రాజెక్టుల ఆయకట్టు కింద సాగు విస్తీర్ణం తగ్గిపోవడానికి పూడిక కారణం అవుతుంది.
ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యంతో ముడిపడిన పరిశ్రమలు, రక్షిత తాగునీటి పథకాలపై ప్రభావం చూపుతుంది.
కడం ప్రాజెక్ట్ పూర్తినిల్వ సామర్థ్యం 7.20 టీఎంసీలు కాగా పూడిక చేరడంతో అది 4.7 టీఎంసీలకు తగ్గింది.
ఈ ప్రాజెక్ట్ ఆయకట్టు కింద 68 వేల ఎకరాలకు నీరందాల్సి ఉండగా 41,868 ఎకరాలకు మాత్రమే నీరందుతోందని తెలంగాణ ఇరిగేషన్ శాఖ (2018 మార్చిలో విడుదల చేసిన జీవోఎంఎస్ నంబర్ 18లో) పేర్కొంది.
కడం ప్రాజెక్ట్ నిల్వ సామర్థ్యం పెంచాలన్న డిమాండ్ దీర్ఘకాలంగా ఉన్నా ఆ ప్రాజెక్ట్ పరీవాహక ప్రాంతంలో దట్టమైన అడవులు ముంపునకు గురయ్యే అవకాశం ఉండటంతో అది సాధ్యం కాలేదు.
దీంతో కడంకు ఎగువన 5.2 టీఎంసీ సామర్థ్యంతో కుప్టి ప్రాజెక్ట్ నిర్మించి, గతంలో మాదిరి 68 వేల ఎకరాలను స్థిరీకరించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.
‘’కడం ప్రాజెక్ట్ సగం పూడికతో నిండిపోయింది. ఈ ప్రాంతంలో ప్రధానంగా వరి సాగుచేస్తారు. ఇక్కడి భూములు ఎత్తుపల్లాలతో కూడి ఉంటాయి. రైతుల నీటి యాజమాన్య పద్ధతులు కూడా అభివృద్ది చెందలేదు. దీంతో డెల్టా ప్రాంతంతో పోలిస్తే వరి సాగుకు ఎక్కువ నీరు అవసరం అవుతుంది'' అని తెలంగాణ జల సాధన కమిటీ కన్వీనర్ నైనాల గోవర్థన్ బీబీసీతో అన్నారు.
‘‘68 వేల ఎకరాల వరిసాగుకు నీరందించాలంటే కడం రిజర్వాయర్‌ను కనీసం మూడుసార్లు నింపి, కాల్వల ద్వారా నీరందించాలి. అది సాధ్యం కాదు. టెయిల్ ఎండ్ వరకు నీరు అందదు. దీంతో రైతులు ఆహార పంటలకు బదులు వాణిజ్య పంటల వైపు మళ్లుతున్నారు’’ అని గోవర్థన్ చెప్పారు.

ఫొటో సోర్స్, Harish
శ్రీరాంసాగర్ సామర్థ్యమూ తగ్గింది
తెలంగాణలోని ప్రధాన ప్రాజెక్టుల్లో ఒకటైన శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ వినియోగంలోకి వచ్చిన 40 ఏళ్ల కాలంలో పూడిక కారణంగా దాదాపు పావు వంతు నీటి నిల్వ సామర్థ్యాన్ని కోల్పోయింది.
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ (ఎస్సారెస్పీ)నిర్మాణం 112 టీఎంసీల సామర్థ్యంతో 1963లో ప్రారంభమైంది.
1983లో మొదటిసారి పూర్తిస్థాయిలో నీరు నిల్వ చేశారు.
ప్రస్తుతం ఈ ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలని నీటిపారుదల శాఖ గణాంకాలు చెబుతున్నాయి. అంటే గడిచిన 40 ఏళ్ల కాలంలో పూడికవల్ల 32 టీఎంసీల నిల్వ సామర్థ్యం కోల్పోయింది.
‘’2022-23లో నీటిపారుదల శాఖ ఈఎన్సీ చేసిన సర్వేలో ప్రాజెక్ట్ నిల్వ సామర్థ్యం తగ్గినట్టుగా తేలింది. ఈ నీటి సంవత్సరం నుంచి (జూన్ 1 నుంచి) ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యాన్ని 80.5 టీఎంసీలుగా లెక్కగడుతున్నాం’’ అని ఎస్సారెస్పీ అసిస్టెంట్ ఎగ్జిక్యుటివ్ ఇంజనీర్ కొత్త రవి బీబీసీతో చెప్పారు.
ఎస్సారెస్పీలో పేరుకుపోతున్న పూడిక స్థాయిలు అంచనా వేసేందుకు 1984 నుంచి 2014 మధ్య నాలుగు సార్లు హైడ్రోగ్రాఫిక్ సర్వేలు నిర్వహించారు.
సాగునీటి ప్రాజెక్టుల కాలపరిమితి 100 ఏళ్లయితే, హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుల కాలపరిమితి 70 ఏళ్లని నీటి పారుదల నిపుణులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, PRAVEEN SUBHAM/BBC
పరిష్కారం ఉందా?
రిజర్వాయర్లలో పూడిక అంచనా, దాని నిర్వహణ పై కేంద్ర జల సంఘం పలు సూచనలు చేస్తూ 2019 లో మార్గదర్శకాలు విడుదల చేసింది.
సాధారణంగా నీటి ప్రాజెక్టుల నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో ఉంటుంది.
ప్రాజెక్టుల్లో పూడిక రాకుండా చూడటం, పూడిక తొలగింపునకు క్యాచ్మెంట్ ఏరియా ట్రీట్మెంట్, ఫిజికల్ రిహాబిలిటేషన్ విధానాలను రాష్ట్రాలకు సీడబ్లూసీ సూచించింది.
దీనికి అవసరమయ్యే ఆర్థిక, సాంకేతిక సహకారాలను ‘డ్యామ్ రిహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్ట్(DRIP) కింద కేంద్ర జలశక్తి శాఖ రాష్ట్రాలకు అందిస్తుంది.
‘డ్రిప్’ ప్రాజెక్ట్ కింద జలవనరుల మరమ్మతు, పునర్నిర్మాణం, పునరుద్ధరణ కార్యక్రమాలు చేపడతారు. తద్వారా కోల్పోయిన నిల్వ సామర్థ్యాలను తిరిగి రాబట్టడం, సాగు విస్తీర్ణం పెంచడం, స్థిరమైన నీటి సంరక్షణ విధానాలను అవలంబించడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం.
గతంలో దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 237 రిజర్వాయర్లలో పేరుకున్న పూడిక స్థాయులను కేంద్ర జల సంఘం హైడ్రోగ్రాఫిక్, రిమోట్ సెన్సింగ్ పద్దతుల్లో సేకరించి ఆయా రాష్ట్రాలకు అందించింది.
క్యాచ్మెంట్ ఏరియా ట్రీట్మెంట్‌లో భాగంగా నదులు, రిజర్వాయర్లలో పూడిక పదార్థాలు.. చేరకుండా పరీవాహక ప్రాంతంలో భారీగా చెట్ల పెంపకం, చెక్ డ్యామ్‌ల నిర్మాణం చేపట్టాలని సూచించింది.
ఫిజికల్ రీహాబిలిటేషన్ విధానంలో రిజర్వాయర్లలో ఆప్పటికే స్థిరపడ్డ పూడికను దిగువ ప్రవాహంలోకి పంపేందుకు ప్రెషర్ ఫ్లషింగ్, స్ల్యూయిజింగ్, డైవర్షన్ టన్నెల్, ట్రాప్స్‌లను సూచించింది.
ఈ విధానాలన్నీ అవలంబించిన తర్వాతే చివరి పరిష్కారంగా డ్రెడ్జింగ్ ప్రక్రియను (యంత్రాల సహాయంతో పూడిక తొలగింపు) ఎంచుకోవాలని కేంద్ర జలసంఘం తన మార్గదర్శకాల్లో పేర్కొంది.
‘’డ్యామ్ స్లుయిజ్ గేట్ల ద్వారా వరద నీటితో పాటే పూడిక బయటకు పంపవచ్చు. అయితే పాత పెద్ద డ్యామ్‌లలో అవి ఒకసారి తెరిస్తే మూయడం చాలా కష్టం. అవి మూసుకోకపోతే రిజర్వాయర్ ఖాళీ అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే ఇంజనీర్లు ఆ సాహసం చేయరు’’ అని తెలంగాణ నీటి పారుదల శాఖ రిటైర్డ్ సీనియర్ ఇంజనీర్ శ్రీధర్ రావ్ దేశ్ పాండే బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, Pillamarri Srinivas
డ్రిప్-ఫేజ్2, ఫేజ్ 3 (2021-2031) లో భాగంగా కేంద్ర జలశక్తి శాఖ రాబోయే కాలంలో దేశవ్యాప్తంగా 736 డ్యామ్‌లలో క్యాచ్మెంట్ ఏరియా ట్రీట్మెంట్, డీసిల్టేషన్ లక్ష్యంగా పెట్టుకుంది.
‘’ప్రాజెక్టుల్లో పూర్తిగా పూడిక తీయడం దాదాపుగా ఆసాధ్యం. చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఇది నా సర్వీస్‌లో ఎప్పుడూ చూడలేదు. గతంలో ఎస్సారెస్పీ ప్రాజెక్టులో సర్వే జరిపినా పనులు జరగలేదు. కాల పరిమితికి దగ్గరైన ప్రాజెక్టుల్లో పూడిక తీసినా లాభం లేదు. బదులుగా ప్రత్యామ్నాయ డ్యామ్ నిర్మాణంపై దృష్టి పెట్టాలి’’ అని తన వివరాలు వెల్లడించడానికి ఇష్టపడని తెలంగాణ నీటి పారుదల శాఖ సీనియర్ ఇంజనీర్ ఒకరు బీబీసీతో చెప్పారు.
ఇక నుంచి కొత్త ప్రాజెక్టుల నిర్మాణ ప్రణాళికల్లో అంతర్భాగంగానే పూడిక తొలగింపు విధానం ఉండాలని, ఇతర అవకాశాలు లేనప్పుడే నదీజలం, అందులోని జీవజాతులకు ఎలాంటి నష్టం లేకుండా డ్రెడ్జింగ్‌ను ఎంచుకోవాలని సీడబ్లూసీ స్పష్టం చేసింది.
‘’ప్రాజెక్ట్ ల నిర్మాణానికి అనుమతులిచ్చేటప్పుడే పూడిక నివారణా చర్యలను కేంద్రం సూచిస్తుంది. అయితే రాష్ట్రాలు దీనిపై శ్రద్ద పెట్టవు. మానవ తప్పిదాల వల్లే పూడిక సమస్య తలెత్తుతోంది. సహజ అడవులను కాపాడుకోవాలి, హరితహారం వంటి కార్యక్రమాలు కొనసాగాలి. కాలం తీరిన ప్రాజెక్టులను వినియోగంలో నుంచి (డీకమీషనింగ్) తప్పించాలి. ఇప్పటికే ఈ ప్రక్రియ అమెరికా, యూరోప్, చైనాలలో మొదలైంది’’ అని శ్రీధర్ రావ్ దేశ్ పాండే బీబీసీకి చెప్పారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














