కొట్టుకుపోయిన తుంగభద్ర గేట్: కర్నూలు, అనంతపురం రైతులకు ఈ సీజన్లో తిప్పలు తప్పవా?

ఫొటో సోర్స్, S.Kinnureshwar
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
తుంగభద్ర డ్యామ్‌లో 19వ నంబరు గేటు కొట్టుకుపోయింది. శనివారం రాత్రి గేటు గొలుసు తెగి, మొత్తం గేటు కొట్టుకుపోయిందని అధికారులు చెప్పారు.
తుంగభద్ర నదిపై కర్ణాటక రాష్ట్రంలోని హోస్పేట దగ్గరలో ఈ డ్యామ్ ఉంటుంది. భారీ వర్షాలతో ప్రస్తుతం డ్యామ్ నిండుగా ఉంది. అయితే ఈ గేటు కొట్టుకుపోవడంతో ఇందులోంచి నీరు కిందకు వెళ్లిపోతోంది.
‘‘అప్పుడు మొత్తం ఒత్తిడి ఈ గేటు ఉన్న చోటే ఏర్పడుతుంది. అందుకే అధికారులు మిగతా గేట్లను కూడా ఎత్తేశారు’’ అని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ మీడియాతో చెప్పారు.
అంటే డ్యామ్‌ను దాదాపు ఖాళీ చేయబోతున్నారు. సుమారు 60 టీఎంసీల నీటిని కిందికి వదిలే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం పరిస్థితిని కర్ణాటక ప్రభుత్వం గమనిస్తోంది.


ఫొటో సోర్స్, S.Kinnureshwar
తుంగభద్ర నది కర్ణాటకలోని రాయచూరు మీద నుంచి మంత్రాలయం మీదుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దులోకి వస్తుంది. అక్కడ రెండు రాష్ట్రాల సరిహద్దుగా ఈ నది ఉంటుంది. కర్నూలు వరకూ వచ్చాక కృష్ణా నదిలో కలుస్తుంది.
తుంగభద్ర నదిపై ఈ ప్రాజెక్టును ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల ప్రయోజనం కోసం 1953లో పూర్తిచేసి, ప్రారంభించారు. అప్పటి మద్రాసు రాష్ట్రం, హైదరాబాద్ స్టేట్ దీని నిర్మాణంలో భాగస్వాములయ్యాయి.
సర్ ఆర్థర్ ప్రతిపాదించిన ప్రాజెక్టుల్లో ఇదీ ఒకటి. ఎన్నో ఏళ్లు బ్రిటిష్ ప్రభుత్వం దగ్గర నలిగి చివరకు సరిగ్గా స్వతంత్ర్యం వచ్చిన సమయంలో దీని నిర్మాణం ప్రారంభమైంది.
కర్ణాటకలోని ఈ డ్యామ్ పరిసర ప్రాంత రైతుల్లో కోస్తా ఆంధ్ర ప్రాంతం నుంచి వలస వెళ్లిన తెలుగు వారు పెద్ద ఎత్తున ఉన్నారు.
చట్ట ప్రకారం ఈ డ్యామ్ నీటిలో కర్ణాటకకు 138.99 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 73.01 టీఎంసీల చొప్పున వాటా ఉంది. ఈ డ్యామ్ నుంచి ఆంధ్రలోని అనంతపురం, కర్నూలుకు నీరు ఇవ్వడానికి లో లెవల్ కెనాల్, హై లెవెల్ కెనాల్ అనే రెండు కాలువలు ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
తాజా గేటు ఘటన సీమ రైతులకు మరో దెబ్బలా తాకింది. ఎందుకంటే, నిండుగా ఉన్న తుంగభద్ర డ్యామ్‌ను ఖాళీ చేస్తున్నారు. నీటి మట్టం తగ్గిన తరువాత ఈ గేటు స్థానంలో తాత్కాలికంగా నీరుకు అడ్డుకట్ట వేసే నిర్మాణం చేపడతారు. దానివల్ల భవిష్యత్తులో వచ్చే నీటిని ఆ డ్యామ్‌లో నుంచి కిందకు పోకుండా నిల్వ చేసుకోవచ్చు.
అయితే, సాధారణంగా తుంగభద్ర డ్యామ్ నిండడం చాలా కష్టం. కారణం దానిపైన ఉన్న తుంగ, భద్ర నదులపై ఇప్పటికే కర్ణాటక ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ రెండూ నిండిన తరువాత, మళ్లీ భద్రా నదిపై కర్ణాటక నిర్మించిన లిఫ్టుల్లోకి నీరు తీసుకున్న తరువాతే తుంగభద్ర డ్యామ్ నిండాలి. అలా నిండాకే, ఆ నీరు హెచ్ఎల్సీ, ఎల్ఎల్సీ కాలువల ద్వారా ఆంధ్ర పరిధిలోని పెన్నా అహోబిళం, మిడ్ పెన్నార్లకు వచ్చి పంటచేలకు అందాలి.
‘‘ఇప్పుడు తుంగభద్ర డ్యామ్ పూర్తిగా నిండి ఉంది. కాబట్టి ఈ సారి కొద్దో గొప్పో నీళ్లు అనంతపురం, కర్నూలు జిల్లాలకు వస్తాయి అనుకున్న సమయంలో ఈ గేటు తెగిపోయింది. ఇప్పుడు మళ్లీ ఆ డ్యామ్ ఖాళీ అయి, రిపేర్లు అయి, మళ్లీ పైన వర్షాలు నిరంతరం కురిసి, ఆ వరద నీరు తుంగభద్ర డ్యామ్‌లో పూర్తిగా నిల్వ అయితే తప్ప కర్ణాటక వారు ఆంధ్రా కాలువలకు నీరు వదలరు. దీంతో ఈ సీజనులో ఆంధ్రాకు రావాల్సిన రెండు కాలువల నీరు రావడం అనుమానమే. ఎందుకంటే కర్ణాటక వారు నీరు ఆపుకోవడానికి ఈ డ్యామే చివరి అవకాశం కదా.. అది మళ్లీ నిండాలి. మనకు రావాలి’’ అని బీబీసీకి వివరించారు రాయలసీమ నీటి అధ్యయన వేదిక సభ్యులు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ నీరు అంతా సముద్రంలోకే..
ప్రస్తుతం తుంగభద్ర నుంచి నీటిని వదులుతున్నారు. ఆ నీరు కర్నూలు దగ్గరలో కృష్ణా నదిలో కలసి, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీల మీదుగా బంగాళాఖాతంలోకి వెళ్లాల్సిందే. ఇప్పటికే శ్రీశైలం, సాగర్ నిండి ఉండడం వల్ల కొత్తగా అక్కడ నీరు నిలవచేసే పరిస్థితి లేదు. పోతిరెడ్డిపాడు ద్వారా ఇప్పటికే నీరు తోడుతున్నారు. ఈ నీటి వల్ల అదనంగా ఏమీ లాభం లేదు. నీరు స్థిరంగా ప్రతిరోజూ వస్తే అప్పుడు రాయలసీమలోని చిన్న ప్రాజెక్టులను నింపవచ్చు. మొత్తానికి ఈసారి నికరంగా రావాల్సిన నీటికి గండిపడగా, మళ్లీ డ్యామ్ నిండితే తప్ప రాయలసీమకు నీరు రాని పరిస్థితి ఏర్పడింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














