‘జాతి వివక్ష పోయిందనుకున్నాం, కానీ...’ బ్రిటీష్ ఏషియన్లకు 1970ల నాటి హింసను గుర్తు చేస్తున్న ఘర్షణలు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సీమా కొటెచా
- హోదా, బీబీసీ ప్రతినిధి
రాళ్లు, ఇటుకలతో మసీదులపై దాడి చేశారు. ‘‘మా దేశం మాకు తిరిగి కావాలి’’ అనే నినాదం చేస్తున్నారు. జాత్యహంకార దాడిలో ఒక వ్యక్తి తలపై గట్టిగా తన్నారు.
ఇంగ్లండ్, నార్తర్న్ ఐర్లాండ్‌లలో గత కొన్ని రోజులుగా కనిపిస్తున్న ఈ దృశ్యాలు ఇక్కడ 1970, 80లలో జాతీయవాదులు సాగించిన దాడులు, బాధితులుగా తాము అనుభవించిన బాధలను బ్రిటీష్ ఏషియన్లకు గుర్తు చేస్తున్నాయి.
ఈ ఘటనలు తన హృదయాన్ని ముక్కలు చేస్తున్నాయని హరీశ్ పటేల్ అన్నారు. ఈ దేశంలో జీవితం ఎలా ఉంటుందో తల్లిదండ్రులు, తాతముత్తాతల నుంచి టీనేజర్లు తెలుసుకోవాలని ఆయన అన్నారు.
‘‘ అప్పట్లో వాళ్లందరూ పోరాడారు. అంతా అయిపోయిందనుకున్నారు. కానీ, మళ్లీ ఇప్పుడు అవే అనుభవానికి వస్తున్నాయి.’’ అని హరీశ్ పటేల్ అన్నారు.
ఇంగ్లండ్ ఉత్తర ప్రాంతంలోని సముద్రతీర పట్టణం సౌత్‌పోర్ట్‌లో, ఒక డాన్స్ క్లాస్‌లో ముగ్గురు బాలికల హత్య యూకేలో దశాబ్దకాలంలో ఎన్నడూ లేనంతగా తీవ్ర హింసకు దారితీసింది.
జూలై 29న సౌత్‌పోర్ట్‌లో జరిగిన టేలర్ స్విఫ్ట్ థీమ్డ్ డాన్స్, యోగా పార్టీలో ఓ వ్యక్తి కత్తితో దాడి చేయడంతో బెబే కింగ్(6), ఎల్సీ డాట్ స్టాన్‌కోంబ్(7), ఎలైస్ డా సిల్వా అగ్వియర్(9) అనే చిన్నారులు చనిపోయారు. ఈ ఘటనలో 8 మంది పిల్లలతోపాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి.
దాడి జరిగిన కొద్దిసేపటికే ఒక వదంతి మొదలైంది. నిందితుడు 2023లో సముద్రమార్గం ద్వారా యూకేకి వచ్చిన శరణార్ధి అని, అతని పేరు ఇదీ అంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. దానితోపాటు నిందితుడు ముస్లిం అని కూడా వదంతులు వ్యాపించాయి.
ఇది అక్కడ నివసించే ఆసియన్లను, మైనారిటి కమ్యూనిటీలను భయభ్రాంతులకు గురి చేసింది.


ఫొటో సోర్స్, Getty Images
50 ఏళ్ల క్రితం కెన్యా నుంచి వచ్చిన ముంగ్రా అనే పెద్దావిడ, తాను లండన్‌కు వచ్చిన తొలి రోజులను గుర్తుకు చేసుకున్నారు.
హింస వల్ల వీధి చివరిన ఉన్న షాపుకు వెళ్లి పాల ప్యాకెట్ కూడా తెచ్చుకునేందుకు ఆమె భయపడేవారట.
ఆ రోజుల్లో వారు అనుభవించిన బాధ చాలా దారుణంగా ఉండేదని ఆమె గుర్తుకు చేసుకున్నారు.
యుద్ధానంతరం ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించే క్రమంలో 1950లలో యూకేలోని పబ్లిక్ సర్వీసులు, ఫ్యాక్టరీల్లో పనిచేసేందుకు వేలమంది దక్షిణాసియా ప్రజలు అక్కడికి తరలి వచ్చారు.
1970 కాలం ప్రారంభం నాటికి వారి జనాభా సుమారు 5 లక్షలకు చేరుకుంది.
అప్పట్లో వలస (ఇమ్మిగ్రేషన్) వ్యవహారం రాజకీయ అంశంగా మారింది. 1968లో కన్జర్వేటివ్ ఎంపీ ఈనాక్ పావెల్ ‘రివర్స్ ఆఫ్ బ్లడ్’గా ఫేమస్ అయిన ఒక ప్రసంగం ఇచ్చారు. ఈ స్పీచ్‌లో ఆయన వలసలపై తీవ్ర విమర్శలు చేశారు. సామూహిక వలసలను అనుమతించడం వల్ల, దేశం తన చితిని తానే పేర్చుకుంటోందని వ్యాఖ్యానించారు.
తీవ్ర మితవాద భావాలున్న నేషనల్ ఫ్రంట్ తరచూ ర్యాలీలు నిర్వహించేది. రైట్ వింగ్ కార్యకర్తలు ఆసియన్లను వేధించేవారు, పోలీసులు కూడా అమానుషంగా వ్యవహరించేవారు.
‘‘జాత్యహంకార వాతావరణం చాలా తీవ్రంగా ఉండేది. నేను భిన్నమైన రంగున్న వ్యక్తినన్న విషయం మర్చిపోవడం చాలా కష్టంగా ఉండేది.’’ అని ముంగ్రా చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
వీధిలో నడుచుకుంటూ వెళ్లేటప్పుడు కూడా తనను అసభ్యకరంగా (సెక్స్ వర్కర్ అనే అర్థం వచ్చే పదాలతో ) పిలిచేవారని ముంగ్రా తెలిపారు.
పశ్చిమ లండన్‌లోని ఆసియా ప్రజలు ఎక్కువగా నివసించే సౌతాల్‌లో జరిగిన దాడులకు ముంగ్రా సాక్షి.
స్థానిక సిక్కు వర్గానికి చెందిన యువకుడు గుర్దీప్ సింగ్‌ను హత్య చేశారు. ఆ తర్వాత మూడేళ్లకు 1979లో హింస చెలరేగింది.
సాధారణ ఎన్నికలకు కొన్ని వారాల ముందు, సౌతాల్ టౌన్ హాల్‌లో సమావేశం నిర్వహించాలని నేషనల్ ఫ్రంట్ నిర్ణయించింది.
వేలమంది ముఖ్యంగా ఆసియన్లు, జాతి వివక్ష వ్యతిరేకులు వీధుల్లోకి వచ్చి మితవాద వర్గాలు, పోలీసుల అమానుషాలపై నిరసనలు వ్యక్తం చేశారు.
ఈ నిరసనల్లో 40 మంది గాయపడ్డారు. వారిలో 21 మంది పోలీసులున్నారు. 300 మంది అరెస్ట్ అయ్యారు. ఒక టీచర్ మరణించారు.
‘‘ఆ కాలంలో నివసించిన వారికి అవి గడ్డు రోజులు. ఇవి వారి జీవితాంతం చేదు జ్ఞాపకాలను మిగిల్చాయి. మళ్లీ ఇప్పుడు జరుగుతున్న ఘర్షణలు నా చిన్ననాటి ఘటనలను గుర్తు చేస్తున్నాయి.’’ అని ముంగ్రా అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘మా ఇల్లు హాంప్‌షైర్‌లో ఉండేది. మా వీధిలో ఆసియన్లు ఉండటం మా చుట్టుపక్కల వారికి నచ్చేది కాదు. ఒకసారి మా పోస్టుబాక్సులో మండుతున్న బాణా సంచాను వేశారు.’’ అని ఆమె గుర్తు చేసుకున్నారు.
‘‘మా అన్న ఆగ్రహంతో వారివైపు వెళుతుంటే మా అమ్మ భయంతో వాడిని పట్టుకుని ఆపింది. ఆ ఘటన జరిగిన తర్వాత కొన్ని గంటల పాటు అమ్మ వణుకుతూనే ఉంది. ఆ క్షణంలో ఆమెంత భయపడ్డారో ఎప్పటికీ మర్చిపోలేదు.’’ అన్నారు ముంగ్రా.
ఇది జరిగిన నెలల తర్వాత మా గ్యారేజ్ డోర్ మీద అసభ్యకరమైన తిట్టు( సెక్స్ వర్కర్ అనే అర్ధంలో)ను రాశారు. అప్పట్లో మేం గుజరాతీ సంప్రదాయాలను ఆచరిస్తూ ఉండేవాళ్లం. అందుకే వాళ్లు మమ్మల్ని గుర్తించి నిందించేవారు. ఆ సమయంలో మా అమ్మానాన్నలు దయనీయ పరిస్థితులను ఎదుర్కొనే వాళ్లు.’’ అని హరీశ్ పటేల్ చెప్పారు.
దశాబ్దాల తర్వాత ఆసియన్లు ఇల్లు దాటి బయటికి రావడానికి భయపడుతున్న ఘటనలను మళ్లీ చూస్తున్నానని తెలిపారు.
తనకు చాలా భయం వేస్తోందని, తనని పిల్లలు కనీసం బయటికి కూడా వెళ్లనివ్వడం లేదని బోల్టన్‌కు చెందిన ఇక్బాల్ చెప్పారు. ఆయన వయసు 50 ఏళ్లు.
‘‘జాత్యాంహకారం ప్రదర్శించిన రోజులు పోయానని నేను అనుకున్నా’’ అని అన్నారాయన.

ఫొటో సోర్స్, Getty Images
ఏడు రోజుల అల్లర్లలో శరణార్థులు నడుపుతున్న హోటళ్లపై దాడులు జరిగాయి. మైనార్టీలు నడిపే వ్యాపారాలను దోచుకున్నారు.
కార్లు, భవంతులను తగలబెట్టారు. 400 మందికి పైగా అరెస్ట్ అయ్యారు. పోలీసు పెట్రోలింగ్ పెంచారు. కానీ, తమల్ని అధికారులు రక్షిస్తారని ఎలాంటి నమ్మకం లేదని కొందరు అంటున్నారు.
బుధవారం ఈ దాడులకు టర్నింగ్ పాయింట్ అయింది. ఈ అల్లర్లకు వ్యతిరేకంగా ఆగస్టు 7న వేలాది మంది ఒకచోటుకి చేరి ర్యాలీలు నిర్వహించారు.
దక్షిణ బెల్‌ఫాస్ట్‌లో వలస వ్యతిరేక నిరసనకారులు, జాత్యహంకార వ్యతిరేక నిరసనకారులు ప్రదర్శనకు దిగడంతో సిటీ హాల్ బయట ఉద్రిక్తత ఏర్పడింది.
లాంకషైర్‌లోని అక్రింగ్టన్‌లో స్థానిక మసీదును కాపాడేందుకు వెళ్లిన ముస్లిం నిరసనకారులను పబ్‌గోయిర్స్ హత్తుకుని ఐక్యతను చాటారు.
ఈ మితవాదుల దాడులను ఆపేందుకు తాము ఐక్యతను చూపాల్సి ఉందని హదీ మాలిక్ అనే ఫాసిజం వ్యతిరేక ఆందోళనకారుడు అన్నారు.
భద్రతా బలగాల కవాతుతో ప్రజల్లో కొంచెం ధైర్యం వచ్చింది. కానీ, బెదిరింపు భయాలు మాత్రం ఆగలేదు. నిజంగా ఈ దేశంలో తమల్ని అంగీకరిస్తున్నారా? అని కొందరు ఇంకా ఆలోచిస్తున్నారు.
ముంగ్రా ఈ నిరసనలను చూసిన తీవ్ర అసహనానికి గురయ్యారు.
‘‘అప్పటికీ ఇప్పటికీ పెద్దగా మారలేదని గతవారం నాకనిపించింది. రేసిజం ఇంకా ఇక్కడ ఎక్కువగానే ఉంది.’’ అని ఆమె అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)














