‘రాజకీయ నేతల హత్యకు కుట్ర’ - పాకిస్తానీని అరెస్టు చేసిన అమెరికా

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నడీన్ యూసుఫ్
- హోదా, బీబీసీ న్యూస్
అమెరికాకు చెందిన పలువురు రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులను హతమార్చేందుకు కుట్రపన్నారన్న ఆరోపణలపై పాకిస్తాన్‌కు చెందిన ఓ వ్యక్తిని అమెరికా అరెస్టు చేసింది. అతనికి ఇరాన్‌తోనూ సంబంధాలున్నాయి.
ఇది ''ప్రమాదకరమైన హత్యకు, ఇరానియన్ ప్లేబుక్ నుంచి నేరుగా వచ్చిన కిరాయి కుట్ర''గా ఎఫ్‌బీఐ డైరెక్టర్ క్రిస్టోఫర్ రే అభివర్ణించారు.
అమెరికన్ అధికారులను హతమార్చేందుకు 46 ఏళ్ల ఆసిఫ్ మర్చంట్ న్యూయార్క్‌లో కిరాయి హంతకుల కోసం ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఆయన హత్య చేయించాలనుకున్న వారి జాబితాలో డోనల్డ్ ట్రంప్ కూడా ఉన్నట్లు సమాచారం ఉందని బీబీసీ న్యూస్ పార్టనర్ సీబీఎస్ పేర్కొంది.
రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థిని హతమార్చేందుకు ఇరాన్ కుట్ర పన్నినట్లు తెలిసిన తర్వాత జూన్‌లో ఆయనకు భద్రతను పెంచారు.

‘అమెరికాలో ఎవరైనా ప్రభుత్వ అధికారిని కానీ అమెరికన్ పౌరుడిని కానీ చంపేందుకు విదేశీ కుట్ర జరగడం జాతీయ భద్రతకు ముప్పు. అలా జరగకుండా ఎఫ్‌బీఐ శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తుంది'' అని రే మంగళవారం చెప్పారు.
జులైలోనే ఆసిఫ్ మర్చంట్‌ను అరెస్టు చేసిన అధికారులు ఆయన్ను న్యూయార్క్‌లో ఉంచారు.
నేరాభియోగపత్రంలో న్యాయ శాఖ పేర్కొన్న దాని ప్రకారం, ఆసిఫ్ మర్చంట్ ఏప్రిల్‌లో అమెరికాకు వచ్చారు. దానికి ముందు కొద్దికాలం ఆయన ఇరాన్‌లో గడిపారు.
అమెరికా వచ్చిన తర్వాత, ఈ హత్యలో సహకరిస్తారని భావించి ఒకరితో ఈ కుట్ర గురించి ఆసిఫ్ చర్చించారు. అయితే, ఆ వ్యక్తే ఈ కుట్ర గురించి పోలీసులకు సమాచారం అందించారు.
ఆ విషయం మాట్లాడుతున్నప్పుడు మర్చంట్ తన చేతిని ''ఫింగర్ గన్''లా గురిపెట్టారు.
''ఈ డీల్ కేవలం ఈ ఒక్కదానికికే పరిమితం కాదు, ముందుముందు కూడా కొనసాగుతుంది'' అని ఆసిఫ్ చెప్పినట్లు అభియోగపత్రంలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, US Department of Justice
ఈ హత్యలు జరగానికి ముందే తాను అమెరికా నుంచి వెళ్లిపోయేలా ప్లాన్ చేశానని, ఆ తర్వాత కోడ్ భాష ద్వారా తాను కాంటాక్ట్‌లో ఉంటానని కిరాయి కోసం మాట్లాడుకున్న వ్యక్తితో ఆసిఫ్ చెప్పినట్లు అభియోగంలో రాశారు.
హత్య చేయాలనుకుంటున్న వ్యక్తులను పరిచయం చేయాల్సిందిగా కిరాయి మాట్లాడుకున్న వ్యక్తిని ఆసిఫ్ కోరారు. కానీ, పోలీసులకు సమాచారం అందించిన ఆ వ్యక్తి .. ఎఫ్‌బీఐ ఏజెంటునే కిరాయి హంతకుడిగా పరిచయం చేశారు.
టార్గెట్ చేసిన వ్యక్తుల ఇళ్ల నుంచి కొన్ని పత్రాలు దొంగిలించాలని, రాజకీయ ర్యాలీల్లో నిరసనలు చేయించాలని, ఒక రాజకీయ నాయకుడిని హత్య చేయాలంటూ ఎఫ్‌బీఐ ఏజెంట్‌కే నేరుగా చెప్పేశారు ఆసిఫ్.
ఆగస్టు చివరి వారంలో లేదా సెప్టెంబర్ మొదటి వారంలో టార్గెట్ ఎవరనేది తెలియజేస్తానని చెప్పినట్లు ఆ ఆరోపణల్లో పేర్కొన్నారు.
నేరాభియోగాపత్రంలో ట్రంప్ పేరును ప్రస్తావించనప్పటికీ, మాజీ అధ్యక్షుడు కూడా వారి టార్గెట్‌లలో ఒకరని సీబీఎస్ తెలిపింది.
జులై 13న పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో జరిగిన ర్యాలీలో మాజీ అధ్యక్షుడిపై హత్యాయత్నం చేసి, సీక్రెట్ సర్వీస్ స్నైపర్ల చేతిలో చనిపోయిన 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్‌కి, ఈ కుట్రకు సంబంధం లేదు.
2020లో ఇరాక్‌లో, ఇరాన్ ఖుద్స్ ఫోర్స్ కమాండర్ ఖాసిమ్ సులేమానీని డ్రోన్లతో దాడి చేసి హతమార్చాలని ఆదేశించినప్పటి నుంచి ట్రంప్, అప్పటి విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియోతో సహా కొంతమంది అధికారులు ఇరాన్ నుంచి బెదిరింపులు ఎదుర్కొంటున్నారు.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














