గ్రాహమ్ థోర్ప్‌ది ఆత్మహత్యే - ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మరణంపై భార్య అమండా ఏం చెప్పారంటే?

ఫొటో సోర్స్, Getty Images
ఇంగ్లండ్ మాజీ బ్యాటర్ గ్రాహమ్ థోర్ప్ (55) గత వారం మరణించారు.
థోర్ప్ ఆత్మహత్య చేసుకున్నారని ఆయన భార్య తాజాగా వెల్లడించారు.
థోర్ప్ గత కొన్నేళ్లుగా డిప్రెషన్‌తో బాధపడుతున్నారని ‘టైమ్స్’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన భార్య అమండా వెల్లడించారు.
"భార్య, ప్రేమించే ఇద్దరు కూతుళ్లు ఉన్నప్పటికీ థోర్ప్ పరిస్థితి మెరుగుపడలేదు. ఆయన ఇటీవల చాలా అనారోగ్యానికి గురయ్యారు. ఇక కుటుంబానికి తన అవసరం లేదని భావించారు. ఆయన చర్యతో మేం నిరాశపడ్డాం" అని ఆమె అన్నారు.
2022 మేలో కూడా థోర్ప్ ఆత్మహత్యకు ప్రయత్నించారని, చాలా రోజులు ఐసీయూలో ఉన్నారని అమండా చెప్పారు.
గ్రాహమ్ థోర్ప్ భారతీయ క్రికెట్ అభిమానులకూ పరిచయమే. కాదంటే, ఈ తరం టీ20 క్రీడాభిమానులకు కాకుండా 20 ఏళ్ల కిందట టెస్ట్ క్రికెట్‌ను ఆస్వాదించిన వారికి థోర్ప్ సుపరిచితుడు.
ఆ తరంలోని అత్యుత్తమ బ్యాటర్లలో ఒకరుగా ఈ లెఫ్ట్ హ్యాండర్ గుర్తుండిపోతాడు. 1993, 2005 మధ్య 100 ఇంటర్నేషనల్ టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన థోర్ప్ అప్పటి ఇంగ్లండ్ జట్టులో కీలక ఆటగాడు.
తలకు హెడ్‌బ్యాండ్‌తో కనిపించే థోర్ప్ మైదానంలో గొప్ప బౌలర్లను ఎదుర్కొంటూ బంతులను బౌండరీకి తరలించడంలో దిట్ట.
ఆటగాడిగా, కోచ్‌గా తన కెరీర్‌లో థోర్ప్ సుమారు 30 ఏళ్ల పాటు ఇంగ్లండ్ జట్టు కూర్పులో కీలక పాత్ర పోషించారు.


ఫొటో సోర్స్, Getty Images
స్పిన్ బౌలింగ్ ఆడగలిగే నేర్పరి
సర్రే మైదానాలలో మొదలైన ఆయన క్రికెట్ కెరీర్ సుదీర్ఘకాలం సాగింది.
1988లో సర్రే కౌంటీకి ఆడడం ప్రారంభించిన థోర్ప్ 2005లో తన ఇంటర్నేషనల్ కెరీర్ ముగించేవరకు కూడా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో సర్రేకు ఆడాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో థోర్ప్ తొలి టెస్ట్‌లోనే సెంచరీ సాధించాడు. 1993లో ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్ ఆడిన థోర్ప్ ఆ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో 114 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
మొత్తం 100 ఇంటర్నేషనల్ టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన థోర్ప్ 16 సెంచరీలతో 6,744 పరుగులు సాధించాడు.
2002లో న్యూజీలాండ్‌పై 231 బంతుల్లో సాధించిన 200 పరుగులు అతని కెరీర్‌లో అత్యుత్తమ స్కోర్.
అప్పట్లో ఇంగ్లండ్ జట్టులో స్పిన్ బౌలింగ్‌ను ఆడగలిగే నేర్పరుల్లో ఒకరిగా థోర్ప్‌కు పేరుంది.
అదే సమయంలో పేస్ బౌలింగ్‌నూ ఎలాంటి భయంలేకుండా ఎదుర్కొంటూ బంతులను బౌండరీలకు తరలించడంలోనూ థోర్ప్ దిట్ట.
స్వదేశంలో 45.17, ఆసియాలో 47.85, ఆస్ట్రేలియాలో 48.18 సగటు ఉన్న థోర్ప్ అన్ని రకాల పిచ్ పరిస్థితులపై సత్తా చాటాడు.
థోర్ప్ 82 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడి 2,380 పరుగులు చేశాడు.
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్, ఆ కాలంలోని ఇంగ్లండ్ బెస్ట్ బ్యాటర్లలో థోర్ప్ ముందు వరుసలో ఉంటారని చెప్పాడు.
‘‘ఇంగ్లండ్ జట్టులోని గొప్ప ఆటగాళ్లను గుర్తు చేసుకునేటప్పుడు ప్రజల మనసుల్లో ఆయన స్థానం లేకపోవచ్చేమో కానీ ఇంగ్లండ్ జట్టు సంక్షోభంలో ఉన్న కాలంలో నిత్యం యుద్ధానికి సిద్ధమైన ఆటగాడు ఆయన’ అంటూ నాసిర్ హుస్సేన్ గుర్తు చేసుకున్నారు.
ఇంగ్లండ్ జట్టు సాధించిన గొప్ప విజయాల్లో ఒకటిగా చెప్పే 2000 సంవత్సరంలోని కరాచీ టెస్ట్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై థోర్ప్ అజేయంగా 64 పరుగులు సాధించాడు. ఆ మ్యాచ్ ఇంగ్లండ్ గెలవడంలో అదే కీలకమైంది.
థోర్ప్ మంచి బ్యాటరే కాదు మంచి ఫీల్డర్ కూడా. ప్రత్యేకంగా స్లిప్స్‌లో ఆయన అద్భుతమైన ఫీల్డర్.

ఫొటో సోర్స్, Getty Images
అభిమానుల స్టాండింగ్ ఒవేషన్
అయితే, థోర్ప్ తన కెరీర్‌లో కొన్ని ఒడుదొడుకులు కూడా ఎదుర్కొన్నాడు. వ్యక్తిగత జీవితంలో ఎదురైన సవాళ్ల కారణంగా ఆయన కొన్ని టూర్లను మిస్సవ్వాల్సి వచ్చింది. 2002లో ఆయన మొదటి భార్యతో విడిపోయిన సమయంలో ఇబ్బందులు పడ్డాడు.
ఆ తరువాత ఆయన క్రికెట్ నుంచి విరామం తీసుకున్నాడు. ఆ తరువాత మళ్లీ ఆట ప్రారంభించినా 2002-03 యాషెస్ సిరీస్‌కు ఆయన్ను ఎంపిక చేయలేదు.
ఏడాది కాలానికి పైగా విరామం వచ్చినా ఆయన తన పునరాగమనంలో మునుపటి ఆటతీరుతో సత్తా చాటాడు. 2003లో దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో ఓవల్‌లో జరిగిన చివరి మ్యాచ్‌కు ఆయన్ను జట్టులోకి తీసుకున్నారు.
ఆ మ్యాచ్‌లో థోర్ప్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 124 పరుగులు చేశాడు. ఈ సెంచరీ తరువాత ఆయన తనదైన శైలిలో చేతులు పైకెత్తి గాల్లోకి పంచ్‌లు విసిరాడు. స్టాండ్స్‌లోని అభిమానులు ఆ క్షణంలో ఉద్వేగంగా స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు.
మ్యాచ్ తరువాత థోర్ప్ మాట్లాడుతూ... ‘‘నేను మళ్లీ క్రికెట్ ఆడుతాను అనుకోలేదు. గత ఏడాది నేను క్రికెట్ నుంచి నిష్క్రమించిన తీరును కూడా నా మనసులోంచి తుడిచేయాల్సి వచ్చింది’ అంటూ థోర్ప్ భావోద్వేగానికి గురయ్యాడు.
‘నేను క్రికెట్‌ను అలా వదిలేయాలనుకోలేదు. ఇప్పుడు స్వదేశంలో తిరిగి సెంచరీ సాధించడం బాగుంది’ అన్నాడు థోర్ప్.

ఫొటో సోర్స్, Getty Images
ఆ ఇన్నింగ్స్ తరువాత థోర్ప్ మళ్లీ మునుపటి ఫామ్ కొనసాగించాడు. జట్టులోకి మళ్లీ వచ్చిన తరువాత ఆయన 56.57 సగటుతో 1,635 పరుగులు చేశాడు. అందులో అయిదు సెంచరీలున్నాయి.
అందులో వెస్టిండీస్‌పై సాధించిన సెంచరీ మరీ స్పెషల్. ఆ మ్యాచ్‌లో చేతి వేలు విరిగిపోయినా కూడా బ్యాటింగ్ కొనసాగించి సెంచరీ చేశాడు థోర్ప్.
2005లో థోర్ప్ తన 100వ టెస్ట్ మ్యాచ్ బంగ్లాదేశ్‌తో ఆడాడు. అదే అతడి చివరి టెస్ట్ మ్యాచ్.
ఇయాన్ బెల్, కెవిన్ పీటర్సన్ వంటి యువ ఆటగాళ్ల రాకతో ప్రాధామ్యాలు మారిపోయి థోర్ప్‌కి అవకాశాలు రాలేదు.
దాంతో 2005లో రిటైర్మెంట్ ప్రకటించిన థోర్ప్ ఆ తరువాత ఆస్ట్రేలియాలో న్యూ సౌత్ వేల్స్ జట్టుకు కోచ్‌గా పనిచేశాడు.
ఆ తరువాత సర్రే జట్టుకు పనిచేశారు. 2010లో ఇంగ్లండ్ ‘ఎ’ జట్టు బ్యాటింగ్ కోచ్‌గా పనిచేశాడు థోర్ప్. ఆ తరువాత సీనియర్ టీమ్‌కు సహాయ కోచ్‌గానూ పనిచేశాడు. అయితే, 2012లో యాషెస్ సిరీస్‌ను ఇంగ్లండ్ ఓడిపోయిన తరువాత ఆ పదవికి రాజీనామా చేశాడు.
కానీ ఇంగ్లండ్ వన్డే జట్టు బ్యాక్‌రూమ్ టీంలో పనిచేశాడు. 2019లో ఇంగ్లండ్ వన్డే ప్రపంచ కప్ గెలిచేటప్పటికి ఆయన జట్టు బ్యాక్ రూమ్ టీంలో ఉన్నాడు.
అనంతరం 2022 మార్చ్‌లో అఫ్గానిస్తాన్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు.. కానీ, వెంటనే అనారోగ్యం బారిన పడటంతో ఆయన సేవలు కొనసాగలేదు. రెండేళ్లుగా ఆయన అనారోగ్యంతోనే ఉన్నాడు. అయితే, అనారోగ్యానికి కారణమేంటనేది క్రికెట్ ఇంగ్లండ్ వెల్లడించలేదు.
బ్యాటింగ్ కానీ, కోచింగ్ కానీ 30 ఏళ్లుగా క్రికెట్‌లో థోర్ప్ పేరు వినిపిస్తూనే ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
సచిన్, లక్ష్మణ్‌ల సంతాపం
థోర్ప్ మృతిపై ఇండియన్ క్రికెట్ సచిన్ తెండూల్కర్ సహా అనేక మంది క్రికెటర్లు గతవారం సంతాపం ప్రకటించారు.
‘‘థోర్ప్‌తో మనతో లేడన్న విషయం తెలిసి చాలా బాధగా ఉంది. సహజసిద్ధంగా, స్వేచ్ఛగా ఆడే బ్యాటర్‌గా ఆయనకున్న గుర్తింపు, నిర్భయమైన ఆయన ఆటతీరు ఎల్లప్పుడూ ప్రత్యేకమే. ఆయన కుటుంబసభ్యులకు నా సానుభూతి’ అంటూ సచిన్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
‘థోర్ప్ మృతి బాధాకరం. అన్ని జట్లపైనా ప్రతిభ చూపిన అద్భుతమైన ఎడమ చేతి వాటం ఆటగాడు. క్యారక్టర్‌పరంగా కూడా అందరికీ ఇష్టమైన ఆటగాడు’ అంటూ వీవీఎస్ లక్ష్మణ్ అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
వసీం అక్రం, వకార్ యూనిస్ వంటి అప్పటి పాకిస్తాన్ బౌలర్లు కూడా థోర్ప్ మృతికి సంతాపం ప్రకటించారు.
తాను బౌలింగ్ చేసిన గొప్ప లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లలో థోర్ప్ ఒకరని వసీం అక్రం గుర్తు చేసుకున్నారు. థోర్ప్ తనకు తమ్ముడిలాంటివాడంటూ వకార్ యూనిస్ ‘ఎక్స్’లో రాసుకొచ్చారు.
శ్రీలంక క్రికెటర్లు కుమార సంగక్కర, చమిందా వాస్, భారత క్రికెటర్లు యువరాజ్ సింగ్, ఇతర దేశాల క్రికెటర్లు తమ సంతాపం తెలిపారు.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














