షేక్ హసీనా కుమారుడు ‘బీబీసీ’తో ఏం చెప్పారు? ఆమె ఇక రాజకీయాల్లోకి రారని ఎందుకన్నారు

ఫొటో సోర్స్, facebook/Sajeeb Wazed
బంగ్లాదేశ్ ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా దిల్లీ సమీపంలోని గాజియాబాద్ వద్ద ఉన్న హిండన్ ఎయిర్‌బేస్‌కు చేరుకున్నారు.
తొలుత ఢాకా నుంచి త్రిపురలోని అగర్తలకు వచ్చిన ఆమె అక్కడి నుంచి సీ-130 ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో హిండన్ ఎయిర్‌బేస్‌కు చేరుకున్నారని ఏఎన్ఐ వార్తాసంస్థ తెలిపింది.
ఆమె దిల్లీలో ఉంటారా, లేదంటే లండన్ వెళ్తారా అనేది ఇంకా స్పష్టం కాలేదు.
అయితే, దిల్లీలోని చాణక్యపురిలో ఉన్న బంగ్లాదేశ్ హై కమిషన్ వద్ద భద్రత పెంచారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
కాగా బంగ్లాదేశ్ ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి దేశాన్ని విడిచి భారత్ బయలుదేరారని ఇంతకుముందు ‘బీబీసీ బంగ్లా’ ధ్రువీకరించింది.
హసీనాతో పాటు ఆమె సోదరి కూడా దేశాన్ని వీడారు.
బంగ్లాదేశ్‌లో పోలీసులు, ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు మధ్య గత కొన్నాళ్లుగా ఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలో తాజా పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలలో కోటా రద్దు చేయాలన్న డిమాండ్‌తో గత నెలలో మొదలైన ఈ నిరసనలు క్రమంగా విస్తృత రూపం దాల్చుతూ ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంగా మారాయి.
ప్రధాని పదవికి హసీనా రాజీనామా చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.
విద్యార్థి సంఘాలు, కార్యకర్తలు పిలుపునిచ్చిన ‘పూర్ణ్ అసహయోగ్ ఆందోళన్’ ఢాకాతో సహా దేశంలో వివిధ ప్రాంతాలకు విస్తరించింది.
జులైలో ఈ ఆందోళనలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 280 మందికి పైగా మరణించారు.


ఫొటో సోర్స్, ANI
భారత్‌కు హసీనా
హసీనా భారత్ వెళుతున్నట్లు బీబీసీ బంగ్లా తెలిపింది. ఆమె తన సోదరితో కలిసి ఢాకా నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరారు.

ఫొటో సోర్స్, Channel 24
ప్రధాని నివాసంలోకి చొరబడిన ఆందోళనకారులు
ఢాకాలోని ప్రధానమంత్రి నివాసంలోకి ఆందోళనకారుల గుంపు ప్రవేశించిందని బీబీసీ బంగ్లా రిపోర్ట్ చేసింది.
నిరసనకారులు చొరబడి లూటీ చేస్తున్న దృశ్యాలు బయటకొచ్చాయి.
ప్రదర్శనకారులు కొందరు అక్కడి కుర్చీలు, సోఫాలు మోసుకెళ్తుండటం ఆ వీడియోలలో కనిపిస్తోంది.
"బంగ్లాదేశ్‌లో సామూహిక తిరుగుబాటును చూస్తున్నాం, వేలాది మంది వీధుల్లోకి వచ్చారు. ప్రధాన మంత్రి షేక్ హసీనా అకస్మాత్తుగా అధికారిక నివాసం నుంచి బయలుదేరినట్లు వార్త వచ్చింది" అని బంగ్లాదేశ్ రాజధాని నుంచి బీబీసీ బంగ్లా ప్రతినిధి అక్బర్ హొస్సేన్ తెలిపారు.

ఫొటో సోర్స్, bbc bangla
దేశంలో మధ్యంతర ప్రభుత్వం: ఆర్మీ చీఫ్
బంగ్లాదేశ్‌లో మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటు కానుందని ఆర్మీ చీఫ్ వాకర్-ఉజ్-జమాన్ చెప్పారు. ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి టెలివిజన్ ప్రసంగం చేశారు.
బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్‌ను కలవబోతున్నానని, ఈ రోజు రాత్రి సరికి పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు.
దేశంలోని ప్రతిపక్ష రాజకీయ పార్టీలతో ఇప్పటికే మాట్లాడినట్లు ఆర్మీ చీఫ్ తెలిపారు.
బాధితులకు న్యాయం చేస్తామని వాకర్-ఉజ్-జమాన్ హామీ ఇచ్చారు.
అయితే, ప్రభుత్వానికి ఎవరు సారథ్యం వహిస్తారనే దానిపై స్పష్టత లేదు.
బంగ్లాదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ ముజిబుర్ రెహ్మాన్ కూతురు అయిన షేక్ హసీనా, ప్రపంచంలో అత్యంత ఎక్కువ కాలం ప్రభుత్వ అధినేతగా వ్యవహరించిన మహిళగా పేరొందారు.

ఫొటో సోర్స్, facebook/Sajeeb Wazed
నా తల్లి బాధపడ్డారు: హసీనా కుమారుడు
షేక్ హసీనా ఆదివారం నుంచి రాజీనామా చేయాలనే ఆలోచనలో ఉన్నారని ఆమె కుమారుడు సాజీబ్ వాజెద్ జాయ్ బీబీసీ వరల్డ్ సర్వీస్ ‘న్యూస్ అవర్’కు తెలిపారు.
సాజీబ్ సోమవారం వరకు ప్రధానమంత్రికి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సలహాదారుగా వ్యవహరించారు.
కుటుంబం ఒత్తిడి చేయడంతో భద్రత కారణాల దృష్ట్యా హసీనా దేశం విడిచి వెళ్లారని సాజీబ్ చెప్పారు. ప్రధానిగా హసీనా పనితీరును ఆయన సమర్థించారు.
"ఆమె గత 15 ఏళ్లలో బంగ్లాదేశ్‌ను చాలా ముందుకు నడిపించారు. ఆమె అధికారం చేపట్టినప్పుడు బంగ్లాదేశ్ పేద దేశం. నేటి వరకు ఇది ఆసియాలో అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఒకటి" అని అన్నారు.
నిరసనకారులతో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు.
"నిన్ననే 13 మంది పోలీసులను చంపేశారు. గుంపులుగా వచ్చి ప్రజలను కొట్టి చంపుతున్నప్పుడు పోలీసులు ఏం చేయాలని మీరు భావిస్తున్నారు?" అని సాజీబ్ ప్రశ్నించారు.
హసీనా తదుపరి రాజకీయ జీవితంపై ఆయన బీబీసీతో 'ఆమె 70లలో ఉన్నారు, చాలా నిరాశకు లోనయ్యారు. ఆమె చేయాల్సింది చేశారనుకుంటున్నా. ఇక నేను, నా కుటుంబం చేయాల్సిందేం లేదు' అని అన్నారు.
ఆమె ఇక రాజకీయాల్లోకి రాకపోవచ్చని సాజీబ్ అన్నారు.

ప్రధాని అధికారిక నివాసమైన గణభవన్‌లో ఉన్న షేక్ ముజిబుర్ రెహ్మాన్ విగ్రహం పైకి ఎక్కి నిరసనకారులు ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు.
ముజిబుర్ రెహ్మాన్ షేక్ హసీనా తండ్రి. ఆయనను బంగ్లాదేశ్ స్వాతంత్య్ర పితామహుడిగా పిలుచుకుంటారు. 1971లో పాకిస్తాన్ నుంచి స్వాతంత్య్రం కోసం షేక్ ముజిబుర్ నాయకత్వంలో బంగ్లాదేశ్ పోరాడింది.
ముజిబుర్ రెహ్మాన్ విగ్రహాన్ని నిరసనకారులు ధ్వంసం చేస్తున్నారని ఒక నిరసనకారుడు బీబీసీకి తెలిపారు.















