‘బుల్లెట్ గాయాలతో విద్యార్థులు వస్తూనే ఉన్నారు.. 6 గంటల్లో 30 సర్జరీలు చేశాం’

బంగ్లాదేేశ్

ఫొటో సోర్స్, BBC Bangla

ఫొటో క్యాప్షన్, గురువారం నుంచి శనివారం మధ్య చాలా హింస జరిగింది
    • రచయిత, సౌమిత్రా శువ్రా, తరేకుజ్మాన్ షిముల్, మరియం సుల్తానా
    • హోదా, బీబీసీ బంగ్లా, ఢాకా

బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు దేశవ్యాప్తంగా పోలీసులకు, యూనివర్సిటీ విద్యార్థులకు మధ్య ఘర్షణలకు దారి తీశాయి. 150మందికి పైగా చనిపోవడానికి కారణమయ్యాయి. ఈ రక్తపాతంలో చిక్కుకున్న కొందరు అసలు అక్కడ ఏం జరిగిందో బీబీసీకి వివరించారు.

నిరసనకారులు ఢాకాలో శాంతియుతంగా ర్యాలీ చేయాలని అనుకున్నారని ఒక విద్యార్థి చెప్పారు.

విద్యార్థులంతా ఒకచోటకు చేరుకుంటుండగా పోలీసులు దాడి చేశారని చెప్పారు.

పోలీసులమని చెప్తూ కొందరు తన కళ్లకు గంతలు కట్టి హింసించారని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఒక విద్యార్థి నాయకుడు చెప్పారు.

ఘర్షణలు తారాస్థాయికి చేరుకున్నప్పుడు, బుల్లెట్ గాయాలైన యువకులను పెద్ద సంఖ్యలో ఆసుపత్రికి తీసుకొచ్చారని.. చాలామంది రావడంతో తమకు ఊపిరి సలపలేదని అత్యవసర విభాగంలోని వైద్యుడొకరు తెలిపారు.

భద్రతా బలగాలు మితిమీరి ప్రవర్తిస్తున్నాయనే ఆరోపణలు వచ్చాయి. దేశంలో నెలకొన్న అశాంతికి విపక్షాలే కారణమంటూ ప్రభుత్వం విమర్శించింది.

గురువారం నుంచి దేశంలో ఇంటర్నెట్ సేవలు నిలిపేయడంతో సమాచార వ్యాప్తి నియంత్రణలోకి వచ్చింది. వేలాది మంది సైనికులతో అక్కడ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు.

బంగ్లాదేశ్‌లో వరుసగా నాలుగోసారి ప్రధానమంత్రి అయిన షేక్ హసీనా (76)కు ఈ హింస చాలా పెద్ద సవాలు.

హెచ్చరిక: ఈ కథనంలో హింసకు సంబంధించిన వివరాలు ఉంటాయి. కొంతమంది పాఠకులను ఇది కలచివేయవచ్చు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
బంగ్లాదేశ్

ఫొటో సోర్స్, Getty Images

బీఆర్‌ఏసీ అనే ప్రైవేట్ యూనివర్సిటీకి చెందిన రాయ (పేరు మార్చాం) అనే విద్యార్థి ఘర్షణల గురించి బీబీసీతో మాట్లాడారు.

జులై 17న తాను మొదటిసారిగా నిరసనల్లో పాల్గొన్నానని, ఆ తర్వాతి రోజు పోలీసులతో ఘర్షణలు భయంకర స్థాయికి చేరాయని ఆమె చెప్పారు.

‘‘ఉదయం 11:30 గంటలు దాటాక విద్యార్థులపై పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్‌ను విసిరారు. అప్పుడు, కొంతమంది విద్యార్థులు వాటిని తీసుకొని తిరిగి పోలీసు వైపే విసిరారు. తర్వాత పోలీసులు రబ్బరు బుల్లెట్లను కాల్చడం మొదలుపెట్టారు.

ఒక దశలో విద్యార్థులందరినీ క్యాంపస్‌లోనే బంధించారు. కనీసం తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి కూడా తీసుకెళ్లనివ్వలేదు. మధ్యాహ్నం అక్కడి నుంచి వెళ్లిపోవాలని మాకు చెప్పారు’’ అని వివరించారు.

ఆ రోజు తాము శాంతియుతంగా నిరసన చేయాలనుకున్నామని, తాము ఏం చేయకుండానే పోలీసులు వచ్చి అక్కడి వాతావరణాన్ని చెడగొట్టారని అన్నారు.

బంగ్లాదేశ్
ఫొటో క్యాప్షన్, ఆదివారం కొన్నిచోట్లా చెదురుమదురు ఘర్షణలు జరిగాయి

జులై 19న పరిస్థితులు మరింత దిగజారాయి. ఆ రోజే చాలామంది మరణించారు.

ఉదయం 10 గంటలకు రాంపురా సమీపంలోని నతున్ బజార్‌లో పోలీసులతో వందలాది మంది నిరసనకారులు పోరాడుతున్నారు. రాంపురా సాధారణంగా ఒక సురక్షితమైన జిల్లా. దీనికి సమీపంలోనే అనేక ఎంబసీలు ఉంటాయి. ఇప్పుడు అక్కడి వాతావరణం యుద్ధప్రాంతంలా కనిపిస్తోంది.

పోలీసులపై నిరసనకారులు ఇటుకలు, రాళ్లు రువ్వారు. షాట్‌గన్ ఫైర్, టియర్ గ్యాస్, గ్రనేడ్లతో పోలీసులు ప్రతిస్పందించారు. హెలికాప్టర్ నుంచి కూడా కాల్పులు జరిపారు.

బీబీసీ విలేఖరులకు ప్రతి చోట మంటలు.. వీధుల్లో ధ్వంసం చేసిన, తగులబెట్టిన వాహనాలు, బారికేడ్లు కనిపించాయి. రోడ్లపై చెట్ల కొమ్మలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.

తమ వద్ద ఉన్న సామగ్రి ఖాళీ కావడంతో అదనపు బలగాలు, మందుగుండు కావాలని పోలీసులు అడగడం కనిపించింది.

అప్పటికే నగరంలోని ఆసుపత్రులకు పెద్ద సంఖ్యలో గాయపడిన వారు రావడం మొదలైంది. రక్తంతో తడిసిన చాలామంది నడుస్తూ ఆసుపత్రులకు వచ్చారు.

స్వల్ప వ్యవధిలోనే వందల మంది క్షతగాత్రులు చేరడంతో ఆసుపత్రుల్లోని ఎమర్జెన్సీ వార్డులు నిండిపోయాయి.

‘‘ఇక్కడ చికిత్స చేసే పరిస్థితి లేనందున, తీవ్రంగా గాయపడిన రోగులను ఢాకా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి సిఫార్సు చేశాం. చాలామందికి రబ్బరు బుల్లెట్ గాయాలయ్యాయి’’ అని బీబీసీతో ఒక వైద్యుడు అన్నారు. ఆయన తన పేరు చెప్పడానికి ఇష్టపడలేదు.

ప్రతి నిమిషానికి ఒకరు గాయపడిన వారు వచ్చినట్లుగా అనిపించిందని ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన మరో వైద్యుడు అన్నారు. ఈ పరిస్థితి కొన్నిగంటల పాటు కొనసాగిందని చెప్పారు.

‘‘గురు, శుక్రవారాల్లో బుల్లెట్ గాయాలైన చాలామంది వచ్చారు. గురువారం ఆరు గంటల షిఫ్ట్‌లోమేం 30 సర్జరీలు చేశాం. ఇలాంటి స్థితిలో అనుభవజ్ఞులైన వైద్యులకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. గాయపడిన చాలామంది యువకులకు చికిత్స చేయడానికి నేను, నా సహచరులు ఆందోళన చెందాం’’ అని ఆయన పేర్కొన్నారు.

శుక్రవారం సాయంత్రం నాటికి పరిస్థితి మరింత ఘోరంగా మారింది. ప్రభుత్వం దేశవ్యాప్తంగా కర్ఫ్యూను ప్రకటించి, వీధుల్లో ఆర్మీని మోహరించింది అని చెప్పారాయన.

నహిద్

ఫొటో సోర్స్, BBC Bangla

ఫొటో క్యాప్షన్, నహీద్

శుక్రవారం నాటి హింస తర్వాత, విద్యార్థి నాయకుల్లో ఒకరైన నహీద్ ఇస్లామ్ కనిపించకుండా పోయారు.

శుక్రవారం అర్ధరాత్రి స్నేహితుని ఇంట్లో నుంచి నహీద్‌ను తీసుకెళ్లారని ఆయన తండ్రి చెప్పారు. 24 గంటల తర్వాతే మళ్లీ నహీద్‌ను చూశామని తెలిపారు.

డిటెక్టివ్‌లుగా చెప్పుకొంటూ వచ్చిన కొందరు తనను ఎలా తీసుకెళ్లారు? ఒక గదిలో ఉంచి విచారణ పేరుతో శారీరకంగా, మానసికంగా తనను ఎలా హింసించారో నహీద్ స్వయంగా వివరించారు.

తాను స్పృహ కోల్పోయానని, ఆదివారం తెల్లవారుజామున స్పృహలోకి వచ్చాక గాయాలతో ఇంటికి వచ్చానని చెప్పారు. రెండు భుజాలు, ఎడమ కాలిపై రక్తం గడ్డకట్టడంతో ఆసుపత్రికి వెళ్లానని తెలిపారు.

నహీద్ ఘటనపై విచారిస్తామని, ఎవరో పోలీసుల ప్రతిష్టను నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారని అనుమానంగా ఉందని బీబీసీతో బంగ్లా సమాచార మంత్రి మొహమ్మద్ అలీ అరాఫత్ చెప్పారు.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)