బంగ్లాదేశ్: విద్యార్థి సంఘాలు కర్రలు, రాళ్ళతో పరస్పరం ఎందుకు దాడులు చేసుకుంటున్నాయి, అక్కడేం జరుగుతోంది?

బంగ్లాదేశ్

ఫొటో సోర్స్, MAMUNUR RASHID/NURPHOTO VIA GETTY IMAGES

    • రచయిత, అక్బర్ హుస్సేన్, అన్బరసన్ ఎథిరాజన్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

ప్రభుత్వ ఉద్యోగాలలో కోటాపై జరుగుతున్న నిరసనలు, ఆందోళనల్లో ఆరుగురు మరణించడంతో బంగ్లాదేశ్ వ్యాప్తంగా స్కూళ్ళు, యూనివర్సిటీలు నిరవధికంగా మూతపడ్డాయి. తిరిగి ఉత్తర్వులు జారీ అయ్యేవరకూ విద్యాసంస్థల మూసివేత కొనసాగుతుంది.

పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విముక్తి కోసం 1971లో యుద్ధంలో పోరాడిన వారి పిల్లలకు ప్రభుత్వ రంగ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించే విధానాన్ని వ్యతిరేకిస్తూ యూనివర్సిటీ విద్యార్థులు చాలా రోజులుగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.

1971నాటి బంగ్లా విముక్తి పోరాటంలో పాల్గొన్న వారిని ఇక్కడ యుద్ధవీరులుగా పేర్కొంటారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మూడింట ఒక వంతు ఈ యుద్ధవీరుల పిల్లలకు రిజర్వ్ చేశారు.

మరికొన్ని ఉద్యోగాలు మహిళలు, మైనారిటీలు, వికలాంగులకు రిజర్వ్ అయి ఉంటాయి.

యుద్ధవీరుల పిల్లల కోసం మూడింట ఒకవంతు పోస్ట్‌లు కేటాయించడం వివక్షతో కూడుకున్నదని, ప్రతిభ ఆధారంగానే రిక్రూట్‌మెంట్‌ జరగాలని కొందరు విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
షేక్ హసీనా

ఫొటో సోర్స్, KAZI SALAHUDDIN RAZU/NURPHOTO VIA GETTY IMAGES

ప్రభుత్వ ఉద్యోగాలకు క్రేజ్

రాజధాని ఢాకా సహా దేశంలోని అనేక నగరాల్లో, రిజర్వేషన్ కోటా అనుకూల, వ్యతిరేక ఆందోళనకారుల మధ్య ఘర్షణలు జరిగాయి.

ముఖ్యంగా బంగ్లాదేశ్ ఛత్ర లీగ్ (బీసీఎల్) అనే అధికార అవామీ లీగ్ పార్టీ విద్యార్థి విభాగం ఈ ఆందోళనల్లో పాల్గొంది

విద్యార్ధి సంఘాలు ఒకరిపై ఒకరు రాళ్ళు, కర్రలతో దాడులు చేసుకున్నాయి. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించారు.

ఈ దాడులలో వందలాది విద్యార్థులు గాయపడ్డారని స్టూడెంట్ యాక్టివిస్ట్‌లు చెప్పారు.

“ఈ హింసకు బీసీఎల్ సభ్యులే కారణం. వాళ్ళు నిరసనకారులను చంపారు. విద్యార్థులను రక్షించేందుకు పోలీసులు ముందుకు రాలేదు.” అని కోటా వ్యతిరేక ఉద్యమం కో-ఆర్డినేటర్లలో ఒకరైన అబ్దుల్లా సలేహిన్ అయోన్ బీబీసీతో చెప్పారు.

బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాలకు క్రేజ్ ఉంది. మంచి జీతం వస్తుంది. అందుకే ఈ ఉద్యోగాల కోసం చాలామంది పోటీ పడుతుంటారు. అయితే, మొత్తం ఉద్యోగాలలో సగానికి పైగా ఉద్యోగాలు కొన్ని నిర్దిష్ట గ్రూపులకు రిజర్వ్ అయి ఉన్నాయి.

ఈ ఏడాది జనవరిలో వరుసగా నాలుగోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన షేక్ హసీనాకు మద్దతు ఇస్తున్న ప్రభుత్వ అనుకూల గ్రూపుల పిల్లలకు ఈ రిజర్వేషన్ వల్ల అధిక ప్రయోజనం చేకూరుతోందని, ఇది అన్యాయమని విమర్శకులు అంటున్నారు.

గతంలో హసీనా ప్రభుత్వం, అప్పటి నిరసనల నేపథ్యంలో 2018లో రిజర్వేషన్లను రద్దు చేసింది.

కానీ, కోటాను పునరుద్ధరించాలని జూన్ ప్రారంభంలో ఓ కోర్టు ఇచ్చిన తీర్పు తాజా ఆందోళనలకు దారితీసింది.

ఈ ఆందోళనల్లో దక్షిణాది నగరమైన చిట్టగాంగ్‌లో ముగ్గురు, ఢాకాలో ఇద్దరు మరణించగా, రంగ్‌పూర్‌లో ఒక విద్యార్థి బుల్లెట్‌ తగిలి మరణించినట్లు అధికారులు తెలిపారు.

షేక్ హసీనా

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, ప్రధాని షేక్ హసీనా

‘ప్రతిపక్షాలే కారణం’

హింసకు ప్రతిపక్షాలే కారణమని ప్రభుత్వం ఆరోపిస్తోంది.

“ప్రతిపక్ష జమాతే ఇస్లామీ, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) విద్యార్థి సంఘాలు ఈ కోటా వ్యతిరేక ఉద్యమంలోకి చొరబడ్డాయి. హింసకు నాంది పలికింది వాళ్లే.” అని న్యాయ మంత్రి అనిసుల్ హక్ బీబీసీతో అన్నారు.

బంగ్లాదేశ్ అత్యున్నత న్యాయస్థానం గతవారం ప్రస్తుత రిజర్వేషన్ల వ్యవస్థను నిలిపి వేసింది. కానీ, దానిని శాశ్వతంగా తొలగించే వరకు నిరసనలు కొనసాగొచ్చని భావిస్తున్నారు.

“ఆగస్టు 7న ఈ కేసును విచారణ జాబితాలో చేర్చారు. విద్యార్థులు తమ వాదనలను కోర్టులో సమర్పించేందుకు అవకాశం కల్పించారు.” అని హక్ చెప్పారు.

హింసాత్మక ఘర్షణల తరువాత మంగళవారం అర్థరాత్రి జరిగిన ఆపరేషన్‌లో, ఢాకాలోని ప్రధాన ప్రతిపక్ష బీఎన్‌పీ ప్రధాన కార్యాలయంపై పోలీసులు దాడి చేశారు.

ఈ దాడి ఒక డ్రామా అని, విద్యార్థులు ఆందోళనలు మానేసి ఇళ్లకు వెళ్ళాలని చెప్పేందుకు ఇదొక సందేశమని బీఎన్‌పీ సీనియర్ నాయకుడు రుహుల్ కబీర్ రిజ్వీ అన్నారు.

బంగ్లాదేశ్

ఫొటో సోర్స్, MUNIR UZ ZAMAN/AFP VIA GETTY IMAGES

‘రజాకార్ల’ పోలికతో రగడ

ఉద్యోగ కోటాలను వ్యతిరేకించే వారిని రజాకార్లుగా అభివర్ణిస్తూ, ప్రధాని హసీనా ఇటీవల చేసిన వ్యాఖ్యలు తమకు కోపం తెప్పించాయని విద్యార్థి నాయకులు తెలిపారు.

1971 యుద్ధ సమయంలో పాకిస్తాన్ సైన్యానికి సహకరించిన వారిని రజాకార్‌ అని పిలిచేవారు.

ప్రధాని హసీనా తమను రజాకార్లతో పోల్చి అవమానించారని పలువురు విద్యార్థి నాయకులు అన్నారు. ఈ పోలిక బీసీఎల్ సభ్యులను తమపై దాడికి పురికొల్పిందని వారు అన్నారు.

“నియంతృత్వంతో వారు మా గొంతు నొక్కాలనుకుంటున్నారు. ఈరోజు మేం నిరసన తెలపకపోతే రేపు మమ్మల్ని కొడతారు కూడా. అందుకే నేను వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతున్నాను.’’ అని ఢాకా యూనివర్శిటీ విద్యార్థిని రూపయ్యా షెర్‌స్తా బీబీసీతో అన్నారు.

అయితే ప్రధాని హసీనా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, ఆమె విద్యార్థులను రజాకార్లని అనలేదని మంత్రులు అంటున్నారు.

అధికార అవామీ లీగ్ పార్టీ విద్యార్థి విభాగం హింసను ప్రేరేపించిందన్న ఆరోపణలను సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి మహ్మద్ అలీ అరాఫత్ ఖండించారు.

కోటా వ్యతిరేక విద్యార్థులు ఢాకాలోని ఓ హాలులో ఉన్నవారిని బెదిరించడంతో ఈ సమస్య మొదలైందని ఆయన అన్నారు.

“యూనివర్శిటీ గందరగోళంగా ఉండాలని ప్రభుత్వం కోరుకోదు. మేం శాంతిని కోరుకుంటున్నాం.” అని అరాఫత్ బీబీసీకి చెప్పారు.

"బెదిరింపులు, హింస ఏ రూపంలో ఉన్నా, వాటి నుంచి ఉద్యమకారులను రక్షించాలి.’’ అని యుఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రాస్ అధికార ప్రతినిధి స్టెఫాన్ డుజారిక్ ప్రభుత్వానికి సూచించారు.

తమ డిమాండ్లు నెరవేరే వరకు నిరసనలు కొనసాగిస్తామని విద్యార్థులు అంటున్నారు.

ఢాకా, చిట్టగాంగ్‌తో సహా ఐదు ప్రధాన నగరాల్లో పారామిలటరీ, బోర్డర్ గార్డ్స్‌ను రంగంలోకి దింపడం ద్వారా బంగ్లాదేశ్ ప్రభుత్వం భద్రతను పటిష్టం చేసింది.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)