ఇంట్లో ఎవరో చొరబడ్డారని ఫిర్యాదు చేసిన మహిళనే కాల్చి చంపిన పోలీసులు...అసలేం జరిగింది?

అమెరికాలో కాల్పులు

ఫొటో సోర్స్, CBS

ఇల్లినాయిస్ పోలీసులు ఓ మహిళను ఆమె ఇంట్లోనే కాల్చి చంపిన వీడియోను విడుదల చేశారు. బాడీక్యామ్ ద్వారా ఈ వీడియో రికార్డయింది.

తన ఇంట్లో ఎవరో చొరబడ్డారని చెప్పడానికి ఆ మహిళ 911కి కాల్ చేశారు. అయితే, ఆమె ఇంటికి వచ్చిన పోలీసులు, చివరకు ఆమెనే కాల్చి చంపారు.

ఈ విషయాలన్నీ బాడీక్యామ్ వీడియోలు కనిపించాయి. ఈ హత్యకు ముందు జరిగిన గందరగోళ పరిస్థితిని ఈ వీడియో తెలిజేస్తోంది.

ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తాయి. అధ్యక్షుడు జోబైడెన్ కూడా ఈ ఘటనను ఖండించారు.

బీబీసీ వాట్సాప్ చానల్

జులై మొదటి వారాంతంలో జరిగిన సంఘటన ఇది. 36 ఏళ్ల సోనియా మాస్సే హత్యతో ఆమె ఇచ్చిన ఫిర్యాదు, పరిశీలించడానికి వచ్చిన ఒక పోలీసు అధికారిపై నేరారోపణకు దారి తీసింది.

తన అధికార పరిధికి విరుద్ధంగా ప్రవర్తించడంతోపాటు, హత్యకు పాల్పడడంతో సంగమోన్ కౌంటీ షెరీఫ్ డిప్యూటీ సీన్ గ్రేసన్‌ను పోలీసు డిపార్ట్‌మెంట్ నుండి తొలగించారు. అయితే, తాను నిర్దోషినని ఆయన అంటున్నారు.

పోలీసులు మాస్సే వైపు తుపాకీ ఎక్కుపెట్టి, ఆమె చేతిలో ఉన్న వేడినీటి గిన్నెను కింద పెట్టమని చెబుతుండటం సోమవారం నాడు విడుదల చేసిన వీడియోలో కనిపిస్తుంది.

ఎవరో తన ఇంట్లో చొరబడి, తన సామాను విరగ్గొట్టారని జులై 6 వ తేదీన మాస్సే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆమె ఇల్లు దక్షిణ షికాగోకి 320 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్ప్రింగ్ ఫీల్డ్‌లో ఉంది.

పోలీసులు అక్కడికి చేరుకున్నాక మాస్సే తలుపుతెరిచారు. పోలీసులు ఆమెను అనుసరించి లోపలికి వెళ్లారు.

అమెరికా

ఫొటో సోర్స్, Illinois police Department

ఆపై ఆమె తన ఐడెంటిటీ కార్డ్ కోసం వెతుకుతుండగా పోలీసులు ఆమెను గమనిస్తూనే ఉన్నారు.

తర్వాత పొయ్యి మీద పెట్టిన గిన్నెలో నీళ్లు మరుగుతున్న విషయం గుర్తొచ్చి, ఇప్పుడు మంటతో ఏం పనిలేదని చమత్కరిస్తూ మాస్సే స్టౌ ఆఫ్ చేయడానికి వెళ్లారు.

పోలీస్ అధికారి గ్రేసన్ కూడా ఆమె నవ్వుతో జత కలిపారు. ఇంతలోనే ఆమె మరుగుతున్న వేడినీటి గిన్నెను పట్టుకుని పోలీసులను తిట్టడం మొదలు పెట్టారు.

దీంతో వెంటనే పోలీస్ అధికారి గ్రేసన్ ఆ వేడినీళ్లు ఉన్న గిన్నెను కిందపెట్టాలని, లేదంటే కాల్చేస్తానని గట్టిగా అరిచారు.

‘సరే, నన్ను క్షమించండి’ అని తుపాకీతో కాల్చడానికి ముందు మాస్సే అన్నారు. అవే ఆమె చివరి మాటలు.

అమెరికాలో కాల్పులు

ఫొటో సోర్స్, Illinois police Department

పోలీసులు ఏం చేశారు?

వేడి నీళ్ల గిన్నెతో మాస్సే వస్తున్నట్లు కనిపించడంతో గ్రేసన్ ఆమెపై కాల్పులు జరిపారు.

‘‘మనమేం చేయాలి మరి? ఆ వేడినీళ్లు మన ముఖాల మీద పోయించుకోవాలా? అది నా వల్ల కాదు.’’ అని గ్రేసన్ అంటుండటం వీడియోలో వినిపించింది.

ఆమెకు ఫస్ట్ ఎయిడ్ చేద్దామని సహచర పోలీసులు అనగా, ఆ అవసరం ఉండకపోవచ్చని గ్రేసన్ అన్నారు.

తర్వాత గ్రేసన్ తన మెడికల్ కిట్ కోసం బయటకు వెళ్లారు. కనీసం రక్తస్రావం ఆపగలిగి ఉండేవాళ్లమని గ్రేసన్ సహచర పోలీసాఫీసర్ వ్యాఖ్యానించారు.

తాను ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చిందో గ్రేసన్ వివరించలేకపోయారని సంగమోన్ కౌంటీ అటార్నీఆఫీసు ఒక ప్రకటనలో వెల్లడించింది.

ప్రెసిడెంట్ బైడెన్ ఒక ప్రకటనలో మాస్సే కుటుంబానికి తన సంతాపాన్ని తెలియజేశారు.

"ఈ దుర్ఘటన జరిగి ఉండకపోతే ఒక తల్లి,స్నేహితురాలు, కుమార్తె , నల్లజాతి యువతి అయిన సోనియా మాస్సే ఈ రోజు సజీవంగా ఉండేది." అని ఆయన అన్నారు.

అనాలోచితంగా ప్రవర్తించారంటూ మాస్సే కుటుంబం తరపున న్యాయవాదులు పోలీస్ అధికారి గ్రేసన్‌పై ఫిర్యాదు చేశారు.

‘‘ఈ ఫుటేజీ అమెరికన్‌లను షాక్‌కు గురి చేసింది’’ అని లాయర్ బెంజమిన్ క్రంప్ అన్నారు.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)