బంగ్లాదేశ్: ఆగని ఘర్షణలు, దేశవ్యాప్తంగా కర్ఫ్యూ, అక్కడి భారతీయుల పరిస్థితి ఏంటి?

- రచయిత, అన్బరసన్ ఎతిరాజన్, యోగిత లిమయి
- హోదా, బీబీసీ న్యూస్, దిల్లీ, లండన్
బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘర్షణలు కొనసాగుతున్నాయి. దీంతో, దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ‘రిజర్వేషన్ల’కు వ్యతిరేకంగా ఇటీవల మొదలైన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి.
శనివారం జరిగిన ఘర్షణల్లో ఐదుగురు చనిపోయారని బీబీసీ బంగ్లా సర్వీస్ తెలిపింది.
మంగళవారం నుంచి జరిగిన ఘర్షణల్లో వంద మంది దాకా మరణించారని, శుక్రవారం (జులై 19) ఒక్క రోజే 56 మంది ప్రాణాలు కోల్పోయినట్లు నివేదికలు వస్తున్నాయని బీబీసీ బంగ్లా సర్వీస్ తెలిపింది.
ప్రభుత్వ రంగ ఉద్యోగాల్లో మూడో వంతు 1971లో పాకిస్తాన్‌తో యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికుల బంధువులకు ఇచ్చేలా ఉన్న రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు.
హింసాత్మక ఘర్షణలు తీవ్రం కావడంతో ప్రభుత్వం దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది. రాజధాని ఢాకాతో సహా ప్రధాన నగరాలు, పట్టణాల్లో భద్రతా బలగాలు కవాతు నిర్వహించాయి.

ఫొటో సోర్స్, Reuters
అక్కడున్న భారతీయుల పరిస్థితి ఏంటి?
బంగ్లాదేశ్‌కు వెళ్లి అక్కడ చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులకు అవసరమైన భద్రత కల్పించేందుకు బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని స్థానిక అధికారులతో భారత రాయబార కార్యాలయం చర్చలు జరుపుతోంది.
బంగ్లాదేశ్‌లో ఉన్న భారతీయ విద్యార్థుల్లో ఇప్పటి వరకు 778 మంది వివిధ పోర్టుల ద్వారా స్వదేశానికి చేరుకున్నారని, మరో 200 మంది విమానాల్లో వచ్చారని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇంకా 4,000 మందికి పైగా భారత విద్యార్థులు బంగ్లాదేశ్‌లోని వివిధ విశ్వవిద్యాలయాల్లో తెలిపింది.
బంగ్లాదేశ్‌లో చిక్కుకుపోయిన విద్యార్థులు అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం ఈ కింది నంబర్లను సంప్రదించాలని భారత విదేశాంగ శాఖ సూచించింది.
- భారత హై కమిషన్, ఢాకా: +880-1937400591
- అసిస్టెంట్ హై కమిషన్, చిట్టగాంగ్: +880-1814654797 / +880-1814654799
- అసిస్టెంట్ హై కమిషన్, సిల్హెట్: +880-1313076411, +880-1313076417
- అసిస్టెంట్ హై కమిషన్, రాజ్‌షాహి: +880-1788148696
- అసిస్టెంట్ హై కమిషన్, ఖుల్నా: +880-1812817799


ఫొటో సోర్స్, EPA
భారత్, బంగ్లాదేశ్ మధ్యలో ఉన్న సరిహద్దు క్రాసింగ్స్ బెనపోల్-పెట్రాపోల్, గెడే-దర్శనా, అఖౌరా-అగర్తలను భారతీయ విద్యార్థులు, పౌరులు స్వదేశానికి తిరిగి రావడానికి తెరిచి ఉంచారు.
భారత పౌరులకు అవసరమైన సాయాన్ని అందించేందుకు ఢాకాలోని భారత రాయబార కార్యాలయం, బంగ్లాదేశ్‌లోని ఇతర అనుబంధ భారత రాయబార కార్యాలయాలు అందుబాటులో ఉన్నాయి.
పోలీసులు, విద్యార్థుల మధ్య హింసాత్మక ఘర్షణలు పెరగడంతో బంగ్లాదేశ్ అంతటా హై సెక్యూరిటీ అలర్ట్ జారీ చేశారు. దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు అధికారులు.

ఫొటో సోర్స్, EPA
నర్సింగ్డి జైలుపై శుక్రవారం దాడి చేసిన ఆందోళనకారులు, వందల మంది ఖైదీలను విడిచిపెట్టారు. ఈ దాడి తర్వాత దేశవ్యాప్తంగా కర్ఫ్యూను విధిస్తున్నట్టు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది.
శాంతి భద్రతలను పునరుద్ధరించేందుకు సైన్యాన్ని మోహరించినట్లు గవర్నమెంట్ ప్రెస్ సెక్రటరీ నయీమూల్ ఇస్లాం ఖాన్ చెప్పారు.
ప్రభుత్వ, పోలీసు అధికారులకు సాయం చేసేందుకు సైన్యాన్ని మోహరించాలని, కర్ఫ్యూను విధించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆయన ప్రకటించారు.
ఈ హింసాత్మక ఘర్షణలు చెలరేగిన తర్వాత ఇప్పటి వరకు 67 మంది చనిపోయినట్లు న్యూ ఏజ్ పత్రిక వెల్లడించింది. అయితే, ఈ మూడు రోజుల్లో 100 మందికి పైగా మరణించారని స్థానిక మీడియా రిపోర్టు చేసింది. కచ్చితంగా ఎంత మంది చనిపోయారో చెప్పడం కష్టంగా మారింది. ఎందుకంటే, మొబైల్ ఇంటర్నెట్, టెలిఫోన్ లైన్లు నిలిచిపోవడంతో కమ్యూనికేషన్ పూర్తిగా షట్‌డౌన్ అయింది.
బస్సు, రైలు సర్వీసులు నిలిచిపోయాయి. తదుపరి నోటీసులు వచ్చేంత వరకు స్కూల్స్, యూనివర్సిటీలు మూసివేసే ఉంచనున్నారు.
‘‘మెరిట్, మెరిట్’’ అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. ప్రభుత్వం వివక్ష పూరితంగా వ్యవహరిస్తోందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో నియామకాలు ప్రతిభ ఆధారంగా జరగాలనేది వారి వాదన.

ఫొటో సోర్స్, BBC Bangla
జనవరిలో జరిగిన ఎన్నికల్లో వరసగా నాలుగోసారి అధికారాన్ని దక్కించుకున్న షేక్ హసీనా ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన వర్గాల కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చేలా ఈ వ్యవస్థ పని చేస్తుందని విమర్శకులు ఆరోపించారు.
అయితే, అందరూ ప్రశాంతంగా ఉండాలని ఆ దేశ ప్రధానమంత్రి షేక్ హసీనా విజ్ఞప్తి చేశారు.
ఇస్లామిస్ట్ పార్టీలు నిర్వహిస్తున్న మార్చ్‌ను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లు, స్టన్ గ్రెనైడ్స్ ప్రయోగించారు.
ప్రధాన ప్రతిపక్షం బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ ఈ ఆందోళనలకు పిలుపునిచ్చింది. తమ సీనియర్ నేతలలో ఒకరు రుహుల్ కబీర్ రిజ్వి అహ్మద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు పార్టీ తెలిపింది.
అయితే, రిజ్వి అరెస్ట్‌పై పోలీసులు ఎలాంటి కారణాలను తెలుపలేదు. నిరసనలు ఆపేందుకు జరిపిన చర్చలు అన్ని విఫలమయ్యాయి.
ఈ సమస్యలపై మాట్లాడేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ‘‘వారు కూడా చర్చలు వెళ్లాలా? వద్దా? అనే దానిపై చర్చించుకుంటున్నారని నేను అనుకుంటున్నా’’ అని న్యాయశాఖ మంత్రి అనిసుల్ హాక్ తెలిపారు.
అయితే, ప్రస్తుతం తాము ఎలాంటి చర్చలలో పాల్గొనమని విద్యార్థి నహిద్ ఇక్బాల్ బీబీసీకి చెప్పారు.
ఆ రోజు ప్రభుత్వం చాలా మందిని చంపేసిందని, ప్రస్తుత పరిస్థితుల్లో తాము ఎలాంటి చర్చలలో పాల్గొనమని స్పష్టం చేశారు.
గురువారం వందమంది అధికారులకు గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ప్రభుత్వ భవనాల వెలుపల పార్కు చేసిన పలు వాహనాలను ఆందోళనకారులు తగలబెట్టేశారని ఓ మంత్రి చెప్పారు.
ఈ ఆందోళనలు కేవలం ఢాకాకు మాత్రమే పరిమితం కాలేదు, 26 జిల్లాలకు విస్తరించాయి.
గురువారం సాయంత్రం వేల మంది నిరసన కారులు బంగ్లాదేశ్ అధికారిక టీవీ ఛానల్ ‘బీ టీవీ’ ఆఫీసుపై దాడి చేశారు. సామగ్రిని ధ్వంసం చేశారు. అద్దాలు, లైట్లు పగల గొట్టారు. ఆఫీసుకి నిప్పు పెట్టారు.
బీ టీవీ ప్రసారాలను నిలిపివేశామని, ఉద్యోగుల్లో అనేకమంది భవనం నుంచి బయటకు వెళ్లారని బంగ్లాదేశ్ సమాచార, ప్రసార శాఖమంత్రి బీబీసీతో చెప్పారు.
అంతకు ముందు ఆఫీసు భవనం లోపల అనేక మంది ఉండిపోయారని, మంటల నుంచి వారిని కాపాడాలని అగ్నిమాపక శాఖను కోరుతూ బీ టీవీ అధికారిక ఫేస్‌బుక్ పేజ్‌లో ఒక మెసేజ్ పోస్ట్ చేశారు.
"పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్లడం మినహా మాకు మరో దారి లేదు. నా తోటి ఉద్యోగులు కొంతమంది లోపల చిక్కుకుపోయారు. వాళ్లకు ఏమైందో నాకు తెలియదు" అని పేరు చెప్పడానికి ఇష్టపడని బీ టీవీ సీనియర్ జర్నలిస్ట్ ఒకరు బీబీసీతో చెప్పారు.
ప్రభుత్వ రంగ ఉద్యోగాల్లో మూడో వంతు 1971లో పాకిస్తాన్‌తో యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికుల బంధువులకు ఇచ్చేలా ఉన్న రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














