అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన అభ్యర్థిత్వానికి అంగీకరించిన కమలా హారిస్‌

కమలా హారిస్

ఫొటో సోర్స్, @KamalaHarris

    • రచయిత, ఆంథోనీ జర్చర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అమెరికా అధ్యక్ష ఎన్నికలలో అధికారికంగా తన అభ్యర్థిత్వానికి అంగీకరిస్తూ ఆ దేశ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పత్రాలపై సంతకం చేశారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ ద్వారా వెల్లడించారు.

ప్రతి ఒక్క ఓటును సంపాదించేందుకు కష్టపడతానని తెలిపారు. నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తామని ఆశించారు.

ఎన్నికల పోటీ నుంచి ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు, డెమొక్రాట్ల అభ్యర్థి జో బైడెన్ తప్పుకోవడంతో, కమలా హారిస్ ఈ పోటీకి సిద్ధమయ్యారు.

డెమొక్రటిక్ అభ్యర్థిగా కమలా హారిస్‌ను బరిలోకి దింపేందుకు తాను మద్దతు ఇస్తున్నట్లు జో బైడెన్ చెప్పారు. అయితే, ఆమె అభ్యర్థిత్వ నామినేషన్‌ను వచ్చే నెలలో చికాగోలో జరిగే డెమొక్రటిక్ నేషనల్ కన్వెన్షన్‌(డీఎన్‌సీ)లో ఆమోదించాల్సి ఉంది.

డెమొక్రటిక్ పార్టీ తరఫున చేసే అభ్యర్థుల నుంచి కమలా హారిస్‌కు మెజార్టీ సపోర్టు లభిస్తోంది.

తొలి రౌండ్ ఓటింగ్‌లో నామినేషన్ గెలుపొందేందుకు అవసరమైన 1,976 మంది డెలిగేట్స్ కంటే ఎక్కువ ఎండార్స్‌మెంట్లే ఆమెకు లభించాయని అసోసియేటెడ్ ప్రెస్ సర్వే తెలిపింది.

మరోవైపు, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన భార్య మిషెల్ ఒబామాలు కమలా హారిస్‌కు ఫోన్ చేసి తమ మద్దతు ప్రకటించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

బీబీసీ వాట్సాప్ చానల్
కమలా హారిస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కమలా హారిస్

కఠిన పరీక్ష

ఆమె డెమొక్రాట్ల తరఫున అధ్యక్ష అభ్యర్ధి అయితే, నవంబర్‌లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనల్డ్ ట్రంప్‌ను ఓడించడం అన్న అతి పెద్ద సవాలును ఆమె ఎదుర్కొనాల్సి ఉంది.

పోటీలో ఆమె అగ్రస్థానానికి ఎగబాకడం డెమొక్రాట్‌లకు కొత్త బలాన్ని ఇచ్చింది. అదే సమయంలో బైడెన్‌ విషయంలో లేని కొన్ని బలహీనతలు ఆమె విషయంలో చర్చకు వస్తున్నాయి.

ఇటీవలి సర్వేల ప్రకారం, హారిస్ మాజీ అధ్యక్షుడి కంటే కొంచెం వెనుకబడి ఉన్నారు. అది దాదాపు బైడెన్ తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు చేసిన చరిత్రాత్మక ప్రకటనకు ముందున్న స్థితికి సమానం.

ఇటీవలి కాలంలో అధ్యక్షుడి ఫిట్‌నెస్, ఆయన ప్రచార సామర్థ్యంపై అనేక విమర్శలు ఎదుర్కొన్న డెమొక్రాట్లు ఇప్పుడు కొంచెం ఉత్సాహంగా కనిపిస్తున్నారు.

అత్యంత ప్రభావవంతమైన హౌస్ మాజీ స్పీకర్ నాన్సీ పెలోసితో సహా, డెముక్రటిక్ పార్టీలోని హారిస్ ప్రత్యర్థులంతా ఇప్పుడామె అభ్యర్థిత్వాన్ని ఆమోదించారు.

దీంతో నవంబర్‌లో గట్టి పోటీ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇది అమెరికా రాజకీయాల్లోని భిన్నమైన కోణాలను, అధ్యక్ష అభ్యర్థిగా ట్రంప్ పట్ల చాలామంది ఓటర్లకు ఉన్న విముఖతను ప్రతిబింబిస్తోంది.

ట్రంప్ పట్ల ప్రజల్లో ఉన్న అయిష్టాన్ని ఓట్లుగా మార్చుకోవడం, కీలకమైన స్వింగ్ రాష్ట్రాల్లో అటుఇటుగా ఉన్న ఓటర్లను ఆకర్షించడం, గత కొన్ని వారాలుగా నిరాశలో మునిగిన డెమొక్రటిక్ స్థావరాన్ని శక్తిమంతం చేయడం హారిస్ ముందున్న మొదటి సవాలు.

అమెరికా

ఫొటో సోర్స్, Getty Images

హారిస్‌కు నిధుల వెల్లువ

అధ్యక్ష అభ్యర్థిత్వ ప్రచారానికి, ఇటీవల వెల్లువెత్తిన నిధులతో డెమొక్రాటిక్ పార్టీలో కళ వచ్చింది. బైడెన్ తన నిర్ణయాన్ని ప్రకటించిన 24 గంటల్లోనే వైస్ ప్రెసిడెంట్‌కు సుమారు 8 కోట్ల డాలర్లు ( సుమారు రూ. 670 కోట్లు ) విరాళంగా వచ్చాయి.

ఈ ఎన్నికల ప్రచారంలో ఇప్పటివరకు ఏ అభ్యర్థికీ ఒకే రోజు ఇంత పెద్ద ఎత్తున విరాళాలు రాలేదు. దీనితో పాటు, బైడెన్-హారిస్ ఫండ్ రైజింగ్‌తో లభించిన దాదాపు 10 కోట్ల డాలర్లు (సుమారు రూ. 840 కోట్లు) రాబోయే ప్రచారంలో ఆమెకు గట్టి ఆర్థిక పునాదిగా మారతాయి.

హారిస్ కనుక డెమొక్రటిక్ నామినీ అయితే, రిపబ్లికన్లు ఇప్పటివరకు తమ ప్రత్యర్థి వయసుపై చేస్తూ వచ్చిన దాడులు నిర్వీర్యం అవుతాయి. నెలల తరబడి ట్రంప్ ప్రచారంలో బైడెన్‌ను బలహీనుడిగా, గందరగోళపు వ్యక్తిగా పేర్కొంటూ వచ్చారు.

నాలుగు వారాల కిందట ప్రెసిడెన్షియల్ డిబేట్‌లో బైడెన్ ఆగి ఆగి సమాధానాలు ఇవ్వడం జరిగాక, ఈ లక్షణాలు మరింత తరచుగా కనిపించడం ప్రారంభించాయి.

ఇందుకు భిన్నంగా 59 సంవత్సరాల వయసున్న కమలా హారిస్‌కు మరింత శక్తిమంతంగా ప్రచారం చేయగల సామర్థ్యం ఉంది. 78 ఏళ్ల ట్రంప్ వయస్సును ఆమె ఇప్పుడు తన ప్రచారంలో ఆయుధంగా ఉపయోగించుకోవచ్చు.

హారిస్ నల్లజాతి ఓటర్ల మద్దతునూ కూడగట్టుకునే అవకాశం కూడా ఉంది. ఇటీవలి కాలంలో వాళ్లు బైడెన్‌కు దూరం అయినట్లు సర్వేలు సూచిస్తున్నాయి.

2008, 2012లలో బరాక్ ఒబామా నల్ల జాతి ఓటర్లతో పాటు మైనారిటీలు, యువ ఓటర్ల మద్దతును పొందినట్లుగానే, ఆమె సైతం వీరి మద్దతును పొందితే, ఈ సంవత్సరం ఎన్నికల ఫలితాలను నిర్ణయించే కొన్ని స్వింగ్‌ స్టేట్స్‌లో ట్రంప్‌కు వ్యతిరేకంగా ఆమె ప్రాబల్యం పెరగవచ్చు.

డోనల్డ్ ట్రంప్ వర్సెస్ కమలా హారిస్

ఫొటో సోర్స్, Getty Images

హారిస్ నేపథ్యం

ప్రాసిక్యూటర్‌గా ఆమె నేపథ్యం, నేరాల పట్ల ఆమె కఠినంగా ఉంటారన్న అభిప్రాయాన్ని కలిగించవచ్చు. 2019లో డెమొక్రాటిక్ ప్రెసిడెన్షియల్ నామినేషన్ కోసం పోటీ పడ్డప్పుడు - "కమలా ఈజ్ ఎ కాప్"(కమలా ఒక పోలీస్) అన్న ప్రచారం ఆమెకు వ్యతిరేకంగా మారగా, ఈసారి ట్రంప్‌కు వ్యతిరేకంగా చేసే ప్రచారంలో ఇది ఆమెకు సహాయపడవచ్చు.

అబార్షన్‌పైనా ఆమె పార్టీ గొంతుకను చాలా బలంగా వినిపించే వ్యక్తిగా భావిస్తున్నారు.

"దేశవ్యాప్తంగా ఉన్న సబర్బన్ మహిళలకు, ముఖ్యంగా బ్యాటిల్ గ్రౌండ్ రాష్ట్రాలలో, పునరుత్పత్తి హక్కులు ఎంత ప్రమాదంలో ఉన్నాయో ఆమె గుర్తు చేస్తుందని నేను భావిస్తున్నాను," అని డెమోక్రటిక్ కాంగ్రెషనల్ ప్రచార కమిటీకి నేతృత్వం వహిస్తున్న న్యూయార్క్ మాజీ కాంగ్రెస్ సభ్యుడు స్టీవ్ ఇజ్రాయెల్ బీబీసీ అమెరికా పాడ్‌కాస్ట్‌తో అన్నారు.

అధ్యక్ష ఎన్నికలు

ఫొటో సోర్స్, Getty Images

బలహీనతలు

హారిస్‌కు ఎన్ని బలాలు ఉన్నా, కొంతమంది డెమొక్రాట్లు మొదట్లో బైడెన్‌ను పక్కకు తప్పించడంలో విముఖత చూపడానికి కారణం ఉంది.

అబార్షన్ విషయంలో డెమొక్రటిక్ పార్టీలో ఉత్సాహాన్ని సృష్టించినా, వైస్ ప్రెసిడెంట్‌గా హారిస్ రికార్డు మిశ్రమంగా ఉంది. పరిపాలన ప్రారంభ సమయంలో, ఆమె అమెరికా-మెక్సికో సరిహద్దుల దగ్గర వలస సంక్షోభానికి మూల కారణాలను పరిష్కరించే పనిని చేపట్టారు.

ఈ క్రమంలో ఆమె ఇచ్చిన పలు ఇంటర్వ్యూలు, చేసిన ప్రకటనలతో ఆమెపై అనేక అపోహలు ఏర్పడ్డాయి. ఆమెపై సంప్రదాయవాదులు దాడులు చేసేందుకు అవకాశాన్ని ఇచ్చాయి.

రిపబ్లికన్లు ఇప్పటికే బైడెన్ పాలనలో అసమగ్ర ఇమ్మిగ్రేషన్ విధానాలకు ఆమెనే కారకురాలిగా చూపించడానికి ప్రయత్నిస్తున్నారు.

"బ్యాటిల్ గ్రౌండ్ రాష్ట్రాలలో వలస సమస్య డెమొక్రాట్లకు చాలా సున్నితమైన అంశం." అని స్టీవ్ ఇజ్రాయెల్ అన్నారు.

“సక్రమంగానో, అక్రమంగానో ఆ శివారు ప్రాంతాల్లో నివసిస్తున్న ఓటర్లకు ఇది చాలా ముఖ్యమైన సమస్య. మా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను సమర్థంగా నిర్వహించడం లేదని వాళ్లు భావిస్తున్నారు.’’ అన్నారాయన.

హారిస్‌కు సంబంధించిన మరో బలహీనత - అభ్యర్థిగా ఆమె ట్రాక్ రికార్డ్. 2020 డెమొక్రాటిక్ ప్రెసిడెన్షియల్ నామినేషన్ కోసం ఆమె పోటీ చాలా అవమానకర రీతిలో ముగిసింది. ఆమె ప్రారంభంలో దూసుకుపోయినా, ఇంటర్వ్యూలలో తడబాటు, స్పష్టంగా వివరించలేకపోవడం, పేలవమైన ప్రచారం కారణంగా ఆమె ప్రాథమిక పోటీలకు ముందే తప్పుకున్నారు.

జోబైడెన్, కమలా హారిస్

ఫొటో సోర్స్, Getty Images

ఫస్ట్ ఇంప్రెషన్

బహుశా హారిస్‌కు అతిపెద్ద సవాలు, అధ్యక్షుడిలా కాకుండా, ఆమె ప్రస్తుతం పదవిలో లేరు. ఓటర్లకు ఆమె గురించి ఎక్కువ వివరాలు తెలియవు.

అందువల్ల హారిస్‌కు పెద్దగా అనుభవం లేదని, ఆమె అధ్యక్షురాలిగా ఉండటం చాలా ప్రమాదకరమని చిత్రీకరించడానికి రిపబ్లికన్‌లు తీవ్రంగా ప్రయత్నించవచ్చు. ట్రంప్‌ను పాలనా అనుభవం ఉన్న వ్యక్తిగా వాళ్లు చెప్పుకోవచ్చు.

రాబోయే రోజుల్లో ఉపాధ్యక్షురాలు, అమెరికన్ ప్రజల మీద తన మొదటి ముద్ర వేయడానికి అవకాశం ఉంది. ఆమేగనుక మొదటే తప్పుటడుగు వేస్తే, అది ఆగస్టు చివరిలో జరిగే డెమొక్రాట్ల జాతీయ సమావేశంలో అధికార పోరాటానికి తలుపులు తెరిచే అవకాశం ఉంది. అప్పుడు పార్టీ వేరొక అభ్యర్థిని అయినా నిలబెట్టవచ్చు లేదా అభ్యర్థి ఎన్నికపై పార్టీ చీలిపోవచ్చు.

గత నాలుగు వారాలలో జరిగిన సంఘటనలను చూస్తే, వైట్ హౌస్ రేసులో అదృష్ట దురదృష్టాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. అమెరికన్ రాజకీయాలలో అతి పెద్ద పదవికి పోటీ పడుతున్న కమలా హారిస్, ఇప్పుడు తాను ప్రత్యర్థులతో తలపడగలను అని నిరూపించుకోవాల్సి ఉంది.

వీడియో క్యాప్షన్, ట్రంప్‌ను ఆమె ఎలా ఎదుర్కొంటారనే దానిపై ఆసక్తి

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)