అమెరికా అధ్యక్ష ఎన్నికలు: కమలా హారిస్‌ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎవరిని ఎంచుకుంటారు

జోష్ షాపిరో, వైట్‌మర్, కెల్లీ

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, జోష్ షాపిరో, వైట్‌మర్, కెల్లీ
    • రచయిత, అనా ఫాగుయ్, మాడెలైన్ హాల్పెర్ట్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

జో బైడెన్ అమెరికా అధ్యక్ష ఎన్నికల పోటీ నుంచి తప్పుకొని తన స్థానంలో కమలా హారిస్‌ను అభ్యర్థిగా తీసుకోవాలని సూచించారు.

ఒకవేళ కమలా హారిస్ డెమొక్రాట్ల తరఫున అధ్యక్ష అభ్యర్థి అయితే వచ్చే నెలలో షికాగోలో జరగనున్న సమావేశంలో ప్రతినిధులు ఓటు వేసే సమయానికి ఆమె తన రన్నింగ్ మేట్‌ (ఉపాధ్యక్ష అభ్యర్థి)ని ఎంచుకోవాల్సి ఉంటుంది.

వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా సాధారణంగా అధ్యక్ష అభ్యర్థి ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లేలా, వారికి ఉపయోగపడేలా ఉండే వారిని ఎంపిక చేసుకుంటుంటారు.

అందుకే స్వింగ్ స్టేట్స్ (ఏదో ఒక పార్టీకి పట్టున్న రాష్ట్రాలు కాకుండా రెండు పార్టీల మధ్య పోటాపోటీ ఉన్న రాష్ట్రాలు) నుంచి శ్వేతజాతీయులను ఎన్నుకోవచ్చని భావిస్తున్నారు.

మరి కమలా హారిస్ ఎవరిని తన ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంచుకునే అవకాశం ఉంది? వారు ఎవరో చూద్దాం..

వాట్సాప్
జోష్ షాపిరో

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జోష్ షాపిరో, పెన్సిల్వేనియా గవర్నర్

జోష్ షాపిరో, పెన్సిల్వేనియా గవర్నర్

కమలా హారిస్ రన్నింగ్ మేట్‌గా జోష్ షాపిరోకు ఎక్కువగా మద్దతు లభిస్తోంది. జోష్ 2022లో పెన్సిల్వేనియా గవర్నర్‌గా ఎన్నికయ్యారు. ఆయన గతంలో స్టేట్ అటార్నీ జనరల్‌గా పనిచేశారు. గవర్నర్‌గా ఉన్న సమయంలో రెండు పార్టీలతో కలిసి పనిచేశారు.

గత సంవత్సరం ఫిలడెల్ఫియా హైవేపై కూలిపోయిన ఒక ప్రధాన వంతెనను త్వరగా పునర్నిర్మించే పనిలో అమెరికా దృష్టిని ఆకర్షించారు. దానిని కొత్త గవర్నర్‌కు పెద్ద విజయంగా భావించారు.

2028లో అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి షాపిరో బలమైన వ్యక్తి అనే చర్చ కూడా జరిగింది.

ఆధునిక చరిత్రలో అత్యంత ముఖ్యమైన అధ్యక్షులలో బైడెన్‌ ఒకరని షాపిరో ప్రశంసించారు.

"కమలా హారిస్‌ని అమెరికా 47వ అధ్యక్షురాలిగా ఎన్నుకోవడానికి చేయగలిగినదంతా చేస్తాను" అని ఆయన స్పష్టం చేశారు.

ఆండీ బెషీర్

ఫొటో సోర్స్, Getty Images

ఆండీ బెషీర్, కెంటకీ గవర్నర్

ఆండీ బెషీర్ రిపబ్లికన్ల ప్రాబల్యం ఉన్న కెంటకీ రాష్ట్రంలో డెమొక్రటిక్ నాయకుడిగా దూసుకెళుతున్నారు. ఆయన 2019లో మొదటిసారి గవర్నర్‌గా గెలిచారు, 2023లో తిరిగి ఎన్నికయ్యారు.

ప్రభుత్వ విద్యకు మద్దతు ఇవ్వడం, పునరుత్పత్తి హక్కుల రక్షణ వంటి ముఖ్యమైన పార్టీ విధానాలపై ఆయన దృష్టి సారించారు.

కెంటకీలో బెషీర్‌కు ఉన్న ప్రజాదరణ చాలా ముఖ్యం. ఎందుకంటే 2020లో కెంటకీ రాష్ట్రంలో ట్రంప్‌ ఎక్కువ ఆధిక్యం కనబర్చారు.

46 ఏళ్ల బెషీర్ దేశంలో చిన్న వయస్సులో గవర్నర్ అయినవారిలో ఒకరు.

2028 అధ్యక్ష ఎన్నికల్లో పార్టీని నడిపించే సత్తా ఉన్న నాయకుడిగా ఆయనను పరిగణిస్తున్నారు. కానీ ఇప్పుడు బైడెన్ పోటీ నుంచి తప్పుకోవడంతో బెషీర్ వైట్‌హౌస్‌కు పోటీ పడే అవకాశం త్వరగానే రావచ్చు.

మార్క్ కెల్లీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మార్క్ కెల్లీ

మార్క్ కెల్లీ, అరిజోనా సెనేటర్

మార్క్ కెల్లీ మాజీ వ్యోమగామి. కీలక 'స్వింగ్ స్టేట్' అయిన అరిజోనాలో ఆయన పాపులారిటీ సంపాదించుకున్నారు. 2022 మధ్యంతర ఎన్నికల్లోనూ కెల్లీ గెలిచారు.

అరిజోనా పోల్స్‌లో ట్రంప్ లీడింగ్‌లో ఉన్నారు. ఇలాంటి క్లిష్టమైన సమయంలో కెల్లీని ఎంచుకుంటే డెమొక్రాట్ పార్టీకి మద్దతును పెంచడంలో సహాయపడతారు.

2011లో అరిజోనాలో జరిగిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన మాజీ హౌస్ రిప్రజెంటేటివ్ గాబీ గిఫోర్డ్స్‌ను కెల్లీ వివాహం చేసుకున్నారు.

గన్ వయలెన్స్ డెమొక్రాట్లకు ప్రచారంలో కీలకాంశం కావడంతో కెల్లీ వ్యక్తిగత జీవితం ఓటర్లకు కనెక్ట్ కావచ్చు.

మిషిగన్ గవర్నర్ గ్రెట్చెన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, విట్మర్

గ్రెషన్ విట్మర్, మిషిగన్ గవర్నర్

మిషిగన్ రాష్ట్రానికి గ్రెషన్ విట్మర్ రెండు సార్లు గవర్నర్. మధ్య పశ్చిమ ప్రాంతానికి చెందిన ప్రముఖ డెమొక్రాట్ నేత కూడా.

2028లో ఆమె అధ్యక్ష పదవికి పోటీ చేస్తారని చాలామంది భావిస్తున్నారు. ఆమె ఇంతకుముందు బైడెన్ కోసం ప్రచారం చేశారు. రాజకీయ ఆకాంక్షలనూ ఆమె వ్యక్తం చేశారు.

2028లో జనరేషన్ X అధ్యక్షుడిని చూడాలనుకుంటున్నట్లు న్యూయార్క్ టైమ్స్‌తో చెప్పారు, కానీ పోటీలో ఉంటానని మాత్రం ఆమె చెప్పలేదు.

2022లో మిషిగన్ స్టేట్ శాసనసభ, గవర్నర్ కార్యాలయాలపై డెమొక్రాట్లకు నియంత్రణ ఆమె నాయకత్వంలోనే సాధ్యమైంది.

ఈ చర్యలు మిషిగన్‌లో అబార్షన్ హక్కుల రక్షణ, తుపాకీ వినియోగాన్ని నియంత్రించడం వంటి విధానాలను అమలు చేయడానికి దోహదపడింది.

బైడెన్ తాను పోటీ చేయబోనని ప్రకటించిన తర్వాత డెమొక్రాట్‌లను ఎన్నుకోవడానికి డోనల్డ్ ట్రంప్‌ను ఆపడానికి చేయగలిగినదంతా చేస్తానని ఆమె చెప్పారు.

గవిన్ న్యూసోమ్, కాలిఫోర్నియా గవర్నర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గవిన్ న్యూసోమ్

గవిన్ న్యూసోమ్, కాలిఫోర్నియా గవర్నర్

కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసోమ్ బైడెన్ ప్రభుత్వానికి బలమైన మద్దతుదారు. ఆయనను తరచుగా 2028 అధ్యక్ష అభ్యర్థిగా పేర్కొంటారు, అయితే కొంతమంది డెమొక్రాటిక్ వ్యవహారాల నిపుణులు బైడెన్ స్థానంలోనే గవిన్ పోటీ చేయవచ్చని భావించారు.

గత సంవత్సరం ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్‌తో డిబేట్, కన్జర్వేటివ్ మీడియాలో మాట్లాడటం ద్వారా జాతీయ స్థాయిలో పాపులర్ అయ్యారు.

బైడెన్ ప్రకటనకు ముందు న్యూసోమ్ బైడెన్‌కు మద్దతుగా ఉన్నారు. ట్రంప్‌ను ఎదుర్కోవడానికి కమలా హారిస్‌కు మద్దతు ఇస్తున్నట్లు గవిన్ ప్రకటించారు.

రాయ్ కూపర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రాయ్ కూపర్, నార్త్ కరోలినా గవర్నర్

రాయ్ కూపర్, నార్త్ కరోలినా గవర్నర్

ట్రంప్‌కు ఓటు వేసిన నార్త్ కరోలినాలో 2016 , 2020 ఎన్నికలు రెండింటిలోనూ కూపర్ విజయవంతమైన డెమొక్రాట్. నార్త్ కరోలినా డెమొక్రాట్‌లకు ముఖ్యమైన రాష్ట్రంగా పరిగణిస్తారు. ఎందుకంటే షార్లెట్, రాలీ వంటి నగరాల్లో జనాభా వేగంగా పెరుగుతోంది. హారిస్ తన పార్టీకి మద్దతునిచ్చేందుకు ఈ ఏడాది అనేకసార్లు రాష్ట్రాన్ని సందర్శించారు.

కూపర్ అనుభవజ్ఞుడు. 1987 నుంచి పబ్లిక్ ఆఫీస్‌లో పని చేస్తున్నారు. ఆయన హౌస్, సెనేట్ రెండింటిలోనూ పనిచేశారు. అంతేకాదు కూపర్ 16 సంవత్సరాలు అటార్నీ జనరల్‌గా పనిచేశారు, 2017 నుంచి నార్త్ కరోలినా గవర్నర్‌గా ఉన్నారు, 2020లో మరోసారి ఎన్నికలో గెలిచారు. అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్‌కు కూపర్ బహిరంగంగా మద్దతు ఇచ్చారు.

"నాకు ఉపాధ్యక్షురాలు అటార్నీ జనరల్‌గా ఉన్న రోజుల నుంచి తెలుసు, డోనల్డ్ ట్రంప్‌ను ఓడించే సామర్థ్యం ఆమెకు ఉంది" అని ఆయన సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

పీట్ బుట్టిగీగ్‌

ఫొటో సోర్స్, Getty Images

పీట్ బుట్టిగీగ్‌, రవాణా మంత్రి

పీట్ బుట్టిగీగ్‌కు అమెరికా అధ్యక్ష పదవిపై ఆశలున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన 2020లో పోటీ చేశారు, బైడెన్ ప్రభుత్వంలో మంచి కమ్యూనికేటర్‌గా పేరు పొందారు.

పీట్ రవాణా మంత్రిగా ఉన్న సమయంలో ఒహియోలో తూర్పు పాలస్తీనా రైలు పట్టాలు తప్పడం, బాల్టిమోర్ వంతెన కూలిపోవడం, 2022లో సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ షెడ్యూలింగ్ సంక్షోభం వంటి వాటిని ధీటుగా ఎదుర్కొన్నారు.

అమెరికా తదుపరి అధ్యక్షురాలిగా కమలా హారిస్‌ను ఎన్నుకోవడానికి చేయగలిగినదంతా చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

జేబీ ప్రిష్కర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జేబీ ప్రిష్కర్, ఇల్లినాయిస్ గవర్నర్

జేబీ ప్రిష్కర్, ఇల్లినాయిస్ గవర్నర్

డోనల్డ్ ట్రంప్‌ను విమర్శించడం, బైడెన్‌కు మద్దతు ఇవ్వడం ద్వారా ఇల్లినాయిస్ గవర్నర్ జేబీ ప్రిష్కర్ పాపులర్ అయ్యారు. ఆయన ఒక వ్యాపార వేత్త, బిలియనీర్. తరచుగా సోషల్ మీడియాలో ట్రంప్‌పై విమర్శలను పోస్ట్ చేస్తుంటారు.

గవర్నర్ విట్మెర్ మాదిరే ప్రిష్కర్ కూడా అబార్షన్ హక్కుల రక్షణ, తుపాకీ వినియోగాన్ని నియంత్రించడం వంటి వాటికి మద్దతుగా నిర్ణయాలు తీసుకున్నారు. ఈయన కూడా అమెరికా అధ్యక్ష పదవికి కమలా హారిస్‌ అభ్యర్థిత్వాన్ని ఆమోదించారు.

బైడెన్ తప్పుకోవడం ఆశ్చర్యం కలిగించిందని ప్రిష్కర్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ట్రంప్‌ను ఓడించేందుకు కమలా హారిస్ ఉత్తమ అభ్యర్థి అని ఆయన అభిప్రాయపడ్డారు. దేశాన్ని నడిపించేందుకు, అమెరికన్ల జీవితాలను మెరుగుపరిచే నైపుణ్యాలు, బలం ఆమెకు ఉన్నాయని అన్నారు.

బాల్టిమోర్‌లోని ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జ్ కూలిపోయిన తర్వాత పలువురి దృష్టిని ఆకర్షించిన మేరీల్యాండ్ గవర్నర్ వెస్ మూర్, సెనేటర్‌లు అమీ క్లోబుచార్, కోరీ బుకర్‌, జార్జియా సెనేటర్ రాఫెల్ వార్నాక్‌లు డెమొక్రటిక్ టిక్కెట్ కోసం రేసులో ఉన్నారు.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)