హార్లీ డేవిడ్‌సన్: ఈ బైక్ విషయంలో భారత్‌పై డోనల్డ్ ట్రంప్ చేసిన విమర్శలేంటి, ఎన్నికల్లో గెలవకముందే టార్గెట్ చేస్తున్నారా?

డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, GETTY IMAGES

డోనల్డ్ ట్రంప్ మొదటిసారి 2016లో అమెరికా అధ్యక్షుడు అయినప్పుడు, భారత్‌కు సంబంధించిన అనేక విధానాలపై తన అభ్యంతరాలను వ్యక్తం చేశారు.

ట్రంప్ ఇప్పుడు మరోసారి అధ్యక్ష పదవికి పోటీపడుతున్నారు. భారత్‌లోని కొన్ని హిందూ గ్రూపులు ట్రంప్ గురించి ఉత్సాహంగా ఉన్నాయి. అది వేరే సంగతి.

రిపబ్లికన్ పార్టీ తరపున మరోసారి అమెరికా అధ్యక్ష పీఠానికి పోటీపడుతున్న ట్రంప్ ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు.

కిందటివారం మిషిగన్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ట్రంప్ చైనా గురించి మాట్లాడుతూ భారత్ ఆర్థిక విధానాలను కూడా విమర్శించారు.

‘‘మీరు చైనాలో ఏదైనా తయారుచేయాలనుకుంటే, వారు ఇక్కడే వాటిని తయారుచేసి, అక్కడకు పంపమంటారు. తరువాత వాటిపై 250 శాతం దిగుమతి సుంకం విధిస్తారు. దాంతో మనకు ఉపయోగం ఉండదు. తరువాత, మీరే మా దేశం వచ్చి ప్లాంట్ పెట్టమని అడుగుతారు. అప్పుడు ఇక్కడి కంపెనీలు అక్కడికి వెళ్లిపోతాయి.’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

దీని తరువాత ట్రంప్ భారత్ గురించి ప్రస్తావించారు. ‘‘ఇండియా కూడా హార్లీ డేవిడ్‌సన్‌ విషయంలో ఇలాగే చేసింది. హార్లీ డేవిడ్‌సన్ తన బైకులను అక్కడ అమ్ముకోలేదు. ఎందుకంటే వాటిపై భారత్ 200 శాతం దిగుమతి సుంకం విధించింది.’’ అని చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
హార్లీ డేవిడ్‌సన్ బైక్

ఇంకా ఏం చెప్పారు?

‘‘హార్లీ డేవిడ్‌సన్ హెడ్ నన్ను వైట్‌హౌస్‌లో కలిశారు. నేను చాలా నిరుత్సాహపడ్డాను.’’ అని ట్రంప్ ఎన్నికల ర్యాలీలో చెప్పారు.

హార్లీ-డేవిడ్‌సన్ ప్రపంచంలోనే చాలా పేరున్న టూ వీలర్ కంపెనీ. ఈ కంపెనీ బైకుల ధరలన్నీ లక్షల రూపాయల్లోనే ఉంటాయి. ఈ కంపెనీకి చెందిన సూపర్‌బైక్ బాగా డబ్బున్న వర్గాలవారి దగ్గర ఎక్కువగా కనిపిస్తుంది.

ఆ కంపెనీ 2018లో రూ. 5 లక్షల నుంచి రూ. 50 లక్షల రేంజ్‌ ఉన్న బైకులను ఇండియాకు తెచ్చింది.

‘‘భారతదేశంలో మీ కంపెనీ వ్యాపారం ఎలా సాగుతోందని నేను హార్లీ-డేవిడ్‌సన్‌ హెడ్‌ను అడిగాను. అంత బాగాలేదని సమాధానం వచ్చింది. మనమెందుకు 200శాతం దిగుమతి సుంకం చెల్లించాలి. మనం బైకులు అమ్ముతాం. వాళ్లు మనపై భారీగా సుంకాలు విధిస్తారు.’’ అని ట్రంప్ అన్నారు.

‘‘200 శాతం పన్నులు ఉంటే మీరు బైకులు అమ్మలేరు అని నేను వారికి చెప్పాను. కానీ తమ దేశంలో ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని హార్లీ డేవిడ్‌సన్‌ను ఇండియా ఆహ్వానించింది. ఆ కంపెనీ కూడా అక్కడకు వెళ్లింది. బహుశా ఆ కంపెనీ అక్కడో ప్లాంట్‌ను ఏర్పాటు చేయవచ్చు. ఆ దేశాలు అలా వ్యవహరిస్తున్నాయి. నేను దీనికి ఇండియాదే బాధ్యత అనను. ఇలా జరిగేందుకు అవకాశమిచ్చినందుకు నేనే బాధ్యత తీసుకుంటాను. ఇకపై ఇలా జరగనివ్వను.’’ అని అన్నారు ట్రంప్.

డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, GETTY IMAGES

200 శాతం పన్ను నిజమేనా?

మనం ఒకసారి ట్రంప్ పాత ప్రకటనలను చూస్తే ఆయన 2017 నుంచి 2024 మధ్యన వివిధ పన్నుల గురించి మాట్లాడారు.

ఈ విషయాన్ని మొదట ట్రంప్ యూఎస్ కాంగ్రెస్‌ ఎదుట 2017లో లేవనెత్తారు.

2018లో ఇండియా బైకులపై 60-75% దిగుమతి పన్ను విధించడం తప్పు అని చెప్పారు. నరేంద్ర మోదీ దానిని 50 శాతానికి తగ్గించారు.

2019లో కూడా ఇండియా అమెరికా మోటారుసైకిళ్ళపై 100శాతం సుంకాన్ని 50శాతానికి తగ్గించిందని చెప్పిన ట్రంప్, ఆ పన్ను కూడా ఎక్కువేనంటూ దానిని తాము ఆమోదించలేం అన్నారు.

‘‘మనమేమీ తెలివి తక్కువవాళ్లం కాము. భారత్ వంక చూడండి. నరేంద్ర మోదీ నాకు మంచి స్నేహితుడు. ఆయనేం చేశారో చూడండి. మోటారు సైకిళ్ళపై ఆయన 100శాతం పన్ను విధించారు. కానీ మనం వారిపై ఎటువంటి పన్నులు వేయం. నేను ఫోన్ చేయగానే మోదీ ఆ పన్నును 50శాతానికి తగ్గించారు. కానీ అది కూడా ఆమోదనీయం కాదు. భారత్ ఇంకా దాని గురించి ఆలోచిస్తోంది.’’ అని చెప్పారు.

ఎకనామిక్ టైమ్స్ 2018 నాటి కథనంలో హార్లీ డేవిడ్‌సన్‌కు భారత్ మార్కెట్ అవసరం ఉందని చాలా ఉందని పేర్కొంది. అనేక దేశాలలో హార్లే డేవిడ్‌సన్ బైక్స్ అమ్మకాలు తగ్గిపోతున్నాయని తెలిపింది.

ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో భారత్‌లో హార్లీ డేవిడ్‌సన్ అమ్మకాలు తగ్గిపోయాయి. 2013లో భారత్‌లో విలాస వస్తువుల రంగంలో డేవిడ్‌సన్ వాటా 92శాతంగా ఉంది. 2018లో అది 56 శాతానికి తగ్గిపోయింది.

అయితే 2018లో ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు భారత విదేశాంగమంత్రిత్వశాఖ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. ట్రంప్, మోదీ గురించిన చర్చలకు సంబంధించి జారీ చేసిన ప్రకటనలో కూడా హార్లీ డేవిడ్‌సన్ ప్రస్తావనేమీ రాలేదు.

డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఇండియా గురించి ఏమన్నారు?

ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యాక 2020లో భారత్‌కు వచ్చారు. అప్పుడు ఆయనకు స్వాగతం పలికేందుకు గుజరాత్‌లోని మోటేరా స్టేడియంలో ‘నమస్తే ట్రంప్’ పేరుతో ఓ కార్యక్రమం నిర్వహించారు.

తరువాత ప్రధాని మోదీ అమెరికా వెళ్ళారు. భారత సంతతి ప్రజలతో కార్యక్రమంలో మోదీతోపాటు ట్రంప్ కూడా పాల్గొన్నారు.

ఆ కార్యక్రమానికి హౌడీ మోదీ అనే పేరు పెట్టారు.

అయితే ట్రంప్ ఇండియా గురించి వివిధ సందర్భాలలో తన మూడ్‌ను బట్టి మాట్లాడారు.

నవంబర్‌ 2019లో భారత్‌లోని కాలుష్యంపై ట్రంప్ విమర్శలు చేశారు.

‘‘ఇండియా, చైనా, రష్యా నుంచి చెత్త ప్రవహించి లాస్‌ఏంజిల్స్ చేరుకుంటోంది. మనకో సమస్య ఉంది. చైనా, రష్యా, భారత్‌లు కాలుష్యాన్ని తగ్గించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. వారు చెత్తంతా సముద్రంలో పడేస్తున్నారు. అది లాస్‌ఏంజెల్స్‌కు కొట్టుకొస్తోంది’’ అని ట్రంప్ అన్నారు.

ఇక ట్రంప్ అధ్యక్షుడు కాగానే పాకిస్తాన్ ‘తీవ్రవాదానికి మద్దతు ఇస్తోంది.’’ అని ఆరోపించారు. భారత్ కూడా ఈ విషయాన్నే చెబుతోంది.

గల్వాన్‌ లోయలో ఘర్షణ తరువాత భారత్, చైనాల మధ్య మధ్యవర్తిత్వం వహిస్తానని ట్రంప్ అన్నారు. కానీ భారత్ తిరస్కరించింది. ఆ విషయంలో ట్రంప్ చైనాకు మద్దతు పలికారు.

తన పదవీకాలం పూర్తి అయ్యే ముందు హెచ్1బీ వీసా విధానంలో అనేక మార్పులు చేస్తామని ట్రంప్ ప్రకటించారు.

ట్రంప్ నిర్ణయం అనేకమంది భారతీయులపై ప్రభావం చూపింది.

భారత్ వైఖరి ఏమిటి?

ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపడితే భారత విదేశాంగ విధానంలో కొన్ని సవాళ్లు ఎదుర్కొంటుందని ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ న్యూస్ పేపర్‌కు రాసిన వ్యాసంలో అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడు సి. రాజామోహన్ వ్యాఖ్యానించారు.

అమెరికా, భారత్ సంబంధాల విషయానికి వస్తే వాణిజ్యం, భద్రత, ప్రజాస్వామ్యం, వలసలు, వాతావరణం లాంటి అంశాలలో కొన్ని సానుకూల విషయాలు ఉన్నప్పటికీ సవాళ్లు కూడా పెరుగుతాయని రాజమోహన్ అభిప్రాయపడ్డారు.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)