స్మితా సభర్వాల్: ఆలిండియా సర్వీసుల్లో వికలాంగులకు కోటా ఎందుకంటూ ట్వీట్, ఈ వ్యాఖ్యలపై ఎవరేమన్నారు?

స్మితా సభర్వాల్

ఫొటో సోర్స్, Twitter/smitha sabharwal

ఆలిండియా సర్వీసుల్లో వికలాంగుల కోటా అవసరమా అంటూ ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్ చేసిన ట్వీట్‌పై దుమారం చెలరేగింది.

ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఓఎస్ వంటి అత్యున్నత సర్వీసుల్లో వికలాంగుల కోటా ఎందుకు ఉండాలంటూ ఆమె తన వ్యక్తిగత ఎక్స్ (ట్విటర్) ఖాతా నుంచి ఆదివారం ట్వీట్ చేశారు.

వికలాంగుల శక్తి, సామర్థ్యాలను తక్కువ చేసేలా, వారిని అవమానించేలా స్మితా సభర్వాల్ వ్యాఖ్యలు ఉన్నాయంటూ పలువురు సామాజిక మాధ్యమాల్లో విమర్శిస్తున్నారు.

ఇలా విమర్శించిన వారిలో సుప్రీం కోర్టు సీనియర్ అడ్వొకేట్ నుంచి, రాజ్యసభ ఎంపీ, వికలాంగుల సంఘాల సభ్యులు వరకూ ఉన్నారు.

ఈ విమర్శలపై కూడా ఆమె స్పందించారు. పాలనకు సంబంధించిన సమస్యలపై బ్యూరోక్రాట్లు స్పందించకపోతే ఇంకెవరు స్పందిస్తారంటూ ప్రశ్నించారు. ఆలిండియా సర్వీసు ఉద్యోగినిగా 24 ఏళ్ల సుదీర్ఘ అనుభవంతో తన ఆలోచనలను, ఆందోళనలను వెల్లడిస్తున్నానని ఆమె మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఐపీఎస్/ఐఎఫ్‌ఓఎస్ ఉద్యోగాలతో పాటు రక్షణ రంగాల్లో ఈ కోటాను ఎందుకు అమలు చేయట్లేదో హక్కుల కార్యకర్తలు ఒకసారి పరిశీలించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఐఏఎస్‌లు వీటికి అతీతం కాదనేదే తన పాయింట్ అని నొక్కి చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
స్మితా సభర్వాల్

ఫొటో సోర్స్, FB/smitha sabharwal

స్మితా సభర్వాల్ ట్వీట్‌లో ఏముంది?

వికలాంగ కోటాలో ఐఏఎస్‌గా ఎంపికైన మహారాష్ట్ర ట్రైనీ అధికారి ఫూజ ఖేద్కర్‌పై యూపీఎస్సీ చర్యలు, ఆ తర్వాత యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనీ రాజీనామాతో ఆలిండియా సర్వీసుల్లో ఏం జరుగుతోందనే చర్చ మొదలైంది.

దీనిపై స్మితా సభర్వాల్ ఆదివారం ట్వీట్ చేశారు.

‘‘ఈ అంశంపై చర్చ పెరుగుతున్నందున, వికలాంగులను గౌరవిస్తూనే, ఒక విమానయాన సంస్థ వారిని పైలట్‌గా నియమిస్తుందా? వైకల్యం ఉన్నసర్జన్‌పై మీరు భరోసా ఉంచుతారా?

ఆలిండియా సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఓఎస్‌లు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సి ఉంటుంది. సుదీర్ఘ గంటల పాటు పనిచేయాల్సి ఉంటుంది. ప్రజల సమస్యల్ని ఓపికగా వినాల్సి ఉంటుంది. ఈ పనులన్నీ చేయాలంటే శారీరకంగా దృఢంగా ఉండాలి.

ఈ అత్యున్నత సర్వీసుల్లో వికలాంగుల కోటా ఎందుకు ఉండాలి? జస్ట్ ఆస్కింగ్ ’’ అంటూ ఆమె ట్వీట్‌ చేయడంతో నెటిజన్లు స్పందించడం మొదలుపెట్టారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

స్మితా సభర్వాల్

ఫొటో సోర్స్, Twitter/smitha sabharwal

స్మితాపై విమర్శలు

స్మితా చేసిన ట్వీట్లు వికలాంగుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని, వారిపట్ల ఆమెకున్న చులకనభావాన్ని చూపుతున్నాయని అఖిల భారత దివ్యాంగుల సంఘం తరఫున ఒక ప్రకటన విడుదలైంది.

అలాగే మాజీ అధికారి, వికలాంగురాలు, సీఎస్‌బీ ఐఏఎస్ అకాడమీ చైర్మన్ మల్లవరపు బాలలత కూడా స్మితా ట్వీట్లను ఖండించారు.

స్మితా సభర్వాల్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విచారకరమని ఆమె అన్నారు. ప్రీమియర్ పోస్టులకు వికలాంగులు అనర్హులని ఆమె ఎలా చెప్తారని ప్రశ్నించారు. ఇలాంటి వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి స్పందించి చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.

24 ఏళ్ల అనుభవం ఉన్న ఒక అధికారి ఇలాంటి వ్యాఖ్యలు చేయొచ్చా? అని ఆమె అన్నారు.

ఒక ఐఏఎస్ అధికారికి వికలాంగుల పట్ల అవగాహన లేకపోవడం చిత్రంగా ఉందని సుప్రీం కోర్టు సీనియర్ అడ్వొకేట్ ఎన్. కరుణ ట్వీట్ చేశారు.

‘‘చాలా వైకల్యాలు ఒక వ్యక్తి తెలివి తేటలు, శక్తి మీద ప్రభావం చూపవు. జ్ఞానోదయం చాలా అవసరమని మీ ట్వీట్ ద్వారా అర్థం అవుతోంది.’’ అని ఆమె ట్వీట్‌లో పేర్కొన్నారు.

కరుణ ట్వీట్‌కు స్మితా బదులిచ్చారు

‘‘మేడమ్, నాకు ఈ ఉద్యోగంలోని ప్రాథమిక అవసరాల గురించి బాగా తెలుసు. ఇక్కడ సమస్య, క్షేత్ర స్థాయిలో పనిచేయడంలోని అనుకూలత గురించి. డెస్కుల్లో, లేదా థింక్‌ట్యాంక్ స్వభావం ఉన్న ప్రభుత్వ ఆఫీసుల్లోని ఉద్యోగాలు కూడా వారికి సరిపోతాయనేది నా గట్టి నమ్మకం.’’ అని స్మితా సమాధానమిచ్చారు.

బ్యూరోక్రాట్లు తమ పరిమిత ఆలోచనలను, అధికారాలను ఎలా బయటపెడుతున్నారో చూడటం చాలా ఆసక్తికరంగా ఉందని రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేదీ ట్వీట్ చేశారు.

దీనికి సమాధానంగా, పాలనలోని సమస్యలపై బ్యూరోక్రాట్లు కాకుండా ఇంకెవరు మాట్లాతారన్న స్మితా, మిగతా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలతో పోలిస్తే ఆలిండియా సర్వీసుల అవసరాలు వేరుగా ఉంటాయని ట్వీట్ చేశారు. తన వ్యాఖ్యల్ని సరిగా అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. ప్రతిభావంతులైన వికలాంగులకు గొప్ప అవకాశాలు కచ్చితంగా దొరుకుతాయని బదులిచ్చారు.

పూజ ఖేద్కర్

ఫొటో సోర్స్, @ANI_DIGITAL

ఫొటో క్యాప్షన్, పూజ ఖేద్కర్

వివాదం ఎక్కడ మొదలైంది?

అధికార దుర్వినియోగం ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్‌పై యూపీఎస్సీ క్రిమినల్ చర్యలు తీసుకోవడం, వ్యక్తిగత కారణాలతో అయిదేళ్ల ముందుగానే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) చైర్మన్ మనోజ్ సోనీ శనివారం రాజీనామా చేయడం నేపథ్యంలో స్మితా సభర్వాల్ ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

2022 సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన పూజ మనోరమ దిలీప్ ఖేద్కర్‌పై చేపట్టిన దర్యాప్తులో ఆమె అనేక అక్రమాలకు పాల్పడినట్లు తేలిందని జులై 19న యూపీఎస్సీ ఒక ప్రకటనను విడుదల చేసింది.

పూజా ఖేద్కర్ 2023 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఆమె అంతకుముందు వైద్యురాలు. 2022లో మల్టీ డిజబిలిటీ కేటగిరీలో ఐఏఎస్‌గా ఎంపికయ్యారు. ఆమె వైకల్య ధ్రువీకరణ పత్రానికి సంబంధించి అనేక అనుమనాలు వ్యక్తమయ్యాయి.

పూజ తన పేరు, తల్లిదండ్రుల పేర్లు, ఫోటో, సంతకం, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్, చిరునామా వంటివి మార్చడం ద్వారా నిబంధనలకు విరుద్ధంగా నిర్ణీత పరిమితికి మించి సివిల్స్ పరీక్షకు హాజరయ్యారని యూపీఎస్సీ వెల్లడించింది.

దీంతో ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి పోలీసులతో క్రిమినల్ విచారణకు ఆదేశించినట్లు తెలిపింది. అంతేకాకుండా సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2022 నుంచి ఆమె అభ్యర్థిత్వాన్ని ఎందుకు రద్దు చేయకూడదో, భవిష్యత్‌లో ఆమె మళ్లీ పరీక్షలకు హాజరు కాకుండా ఎందుకు నిషేధించకూడదో వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు ప్రకటనలో పేర్కొంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

యూపీఎస్సీ

ఫొటో సోర్స్, Getty Images

పూజా ఖేద్కర్‌పై యూపీఎస్సీ వేగంగా, సరైన చర్యలు తీసుకుందంటూ స్మితా సభర్వాల్ ట్వీట్ చేశారు. ఈ చర్య వల్ల యూపీఎస్సీపై లక్షలాది మంది విద్యార్థుల నమ్మకం నిలబడుతుందంటూ పేర్కొన్నారు. ఇక్కడితోనే ఆపకుండా, ఇప్పటికే సేవలందిస్తున్న అధికారుల (సర్వింగ్ ఆఫీసర్స్) ధ్రువపత్రాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించాలని ఆమె కోరారు.

తమ దగ్గర దాచాల్సిన అంశాలేవీ లేకుంటే, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ సంస్థ చేసే ఏ తనిఖీలకైనా మెజారిటీ అధికారులు అంగీకరిస్తారని తనకు నమ్మకముందని స్మితా పేర్కొన్నారు.

ఈ పరిణామాల తర్వాత శనివారం యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనీ రాజీనామా చేసినట్లు వార్తలు వచ్చాయి. వ్యక్తిగత కారణాలతో, మరో అయిదేళ్ల పదవీకాలం మిగిలి ఉండగానే మనోజ్ సోనీ తన పదవికి రాజీనామా చేశారు.

ఆయన రాజీనామాపై స్మితా సభర్వాల్ ట్వీట్ చేస్తూ, ‘‘ఇది బాధ్యతల నుంచి తప్పించుకోవడం. ఇది ఎంత వరకు సమంజసం. ఎవరి ప్రమేయమైనా ఉందా లేక పొరపాటు జరిగిందా? ఏదో ఒకటి కచ్చితంగా నిర్ధరించాలి.’’ అని అన్నారు.

యూపీఎస్సీ చైర్మన్ రాజీనామాను స్మితా నిలదీయడంపై జీతూ సాల్వి అనే యూజర్ హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రశ్నలు వేయడానికి ధైర్యం కావాలని ప్రశంసించారు.

యూపీఎస్సీ

ఫొటో సోర్స్, UPSC

పూజ ఖేద్కర్‌ ఏ రిజర్వేషన్ ప్రకారం ఐఏఎస్ అయ్యారు?

2023 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి పూజ ఖేద్కర్, ఓబీసీ కమ్యూనిటీ పీడబ్ల్యూబీడీ-5 కేటగిరీలో ఉద్యోగ రిజర్వేషన్ పొందారు. పీడబ్ల్యూబీడీ-5 అంటే బహుళ వైకల్యం ఉన్నట్లు లెక్క.

వికలాంగులు వివక్షకు గురికాకుండా, ఉపాధి, పదోన్నతిలో సమాన అవకాశాలను కల్పించడం కోసం 2016లో వికలాంగుల హక్కుల చట్టాన్ని అమల్లోకి తెచ్చారు.

ఈ చట్టంలోని సెక్షన్ 34 ప్రకారం, మొత్తం పోస్టుల్లో కనీసం 4 శాతం వికలాంగులకు కేటాయించాలి. ఇందుకోసం ‘బెంచ్‌మార్క్ డిజబిలిటీ’ అనే పదాన్ని ఉపయోగించారు. అంటే 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న వ్యక్తులు బెంచ్‌మార్క్ డిజబిలిటీ కింద ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో అయిదు కేటగిరీలు ఉన్నాయి.

ఎ. అంధత్వం, దృష్టిలోపం

బి. చెవుడు, వినికిడి లోపం

సి. సెరిబ్రల్ పాల్సీ, నయం కాగల కుష్టు వ్యాధి, కుంటితనం, యాసిడ్ దాడి బాధితులు, కండరాల బలహీనతతో సహా పరిమితంగా శారీరక శ్రమ చేయగలిగేవారు

డి. ఆటిజం, మేథో వైకల్యం, కొన్ని రకాల అభ్యాస వైకల్యాలు, మానసిక అనారోగ్యం

ఇ. పైన పేర్కొన్న వాటిలో ఒకటి కంటే ఎక్కువ వైకల్యాలు ఉంటే ఈ కేటగిరీ కింద పరిగణిస్తారు.

సెక్షన్ 34 (ఇ)లోని బహుళ వైకల్యాలున్న వ్యక్తులకు 1 శాతం రిజర్వేషన్ ఉంది. పూజ ఈ కేటగరీ కిందే ఐఏఎస్ అయ్యారు. ఆమె సివిల్స్ పరీక్షలో 821 ర్యాంకును సాధించారు.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)