డోనల్డ్ ట్రంప్: హష్ మనీ కేసులో దోషిగా తేల్చిన కోర్ట్, జులై 11న శిక్ష ఖరారు

ఫొటో సోర్స్, Getty Images
హష్-మనీ కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌ను దోషిగా గుర్తిస్తూ న్యూయార్క్‌లోని న్యాయస్థానం తీర్పు చెప్పింది. జులై 11న ఆయనకు శిక్షను ఖరారు చేస్తారు.
తనతో సెక్స్‌లో పాల్గొన్న విషయం బయటపెట్డకుండా ఉండేందుకు 2016నాటి అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ఒక పోర్న్‌స్టార్‌కు ట్రంప్ డబ్బులు చెల్లించారని, అయితే ఆ చెల్లింపులను కప్పిపుచ్చేందుకు తన బిజినెస్ లెక్కల్లో తప్పుడు వివరాలు చూపించారని అభియోగాలు నమోదయ్యాయి.
ఈ కేసు తీర్పులో ఆయనను మొత్తం 34 ఆరోపణల కింద దోషిగా గుర్తించినట్లు న్యూయార్క్‌లోని మన్‌హటన్ క్రిమినల్ కోర్ట్ ప్రకటించింది.
సంచలనం సృష్టించిన ఈ తీర్పుతో ఒక నేరంలో దోషిగా తేలిన తొలి మాజీ అధ్యక్షుడిగా డోనల్డ్ ట్రంప్ రికార్డుల కెక్కారు.
అయితే, కోర్టు ఇచ్చిన ఈ తీర్పును డోనల్డ్ ట్రంప్ ‘సిగ్గుచేటు’గా అభివర్ణించారు. 12మంది జ్యూరర్(న్యాయమూర్తుల బృందం)లు రెండు రోజులపాటు తుది విచారణపై కసరత్తు చేసి ఏకాభిప్రాయంతో ఈ తీర్పును ప్రకటించారు. అయితే ఈ తీర్పునిచ్చిన జ్యూరీకి నాయకుడిగా వ్యవహరించిన జడ్జ్ మెర్ఖాన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు ట్రంప్.
ఈ కేసులో న్యాయస్థానం 22 మంది సాక్షులను విచారించింది. వీరిలో మనీ చెల్లింపులలో కీలకమైన వ్యక్తి అయిన మాజీ నటి స్టార్మీ డేనియల్స్ కూడా ఉన్నారు. ఆరు వారాలపాటు ఈ విచారణ సాగింది.
ఈ తీర్పుతో న్యాయం బతికే ఉందన్న విషయం అర్ధమైందని ట్రంప్ విమర్శకుడు, ఆయన ప్రత్యర్థి పార్టికి చెందిన చట్టసభ సభ్యుడు ఆడమ్ స్కిఫ్ తన ఎక్స్ అకౌంట్‌లో కామెంట్ చేశారు.
అయితే, బైడెన్ ప్రభుత్వం చేపట్టిన ఒక వేధింపు చర్యలో భాగమని, రాజకీయ ప్రేరేపితమని రిపబ్లికన్ పార్టీకి చెందిన కాంగ్రెస్ వుమన్ మార్జోరీ టేలర్ గ్రీన్ ఆరోపించారు.

ఫొటో సోర్స్, EPA
దోషిగా తేలిన మొదటి అధ్యక్షుడు
అమెరికా అధ్యక్షుడు లేదా మాజీ అధ్యక్షుల్లో ఒక నేరంలో దోషిగా తేలిన తొలి వ్యక్తి ఆయన. అలాగే, దోషిగా నిర్ధారితమైన ప్రధాన పార్టీకి చెందిన మొదటి అభ్యర్థి కూడా ఆయనే.
ట్రంప్ అప్పీల్‌కు వెళ్లాలని అనుకుంటున్నప్పటికీ, హష్ మనీ కేసులో జులై 11న శిక్ష విధించనున్నారు. ఆయనకు జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధించే అవకాశం ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికాలో రాజకీయ మార్పులను అంచనా వేయడం తొందరపాటేమీ కాదు. ఎందుకంటే ఇలాంటిది అమెరికాలో ఇంతకుముందెన్నడూ జరుగలేదు.
‘‘సాధారణంగా గతంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఏం జరుగనుందో అంచనా వేయడానికి మనం ప్రయత్నిస్తాం. కానీ, ఈ పరిస్థితికి దగ్గరగా కనిపించే ఎలాంటి ఘటన రికార్డుల్లో లేదు’’ అని సదరన్ మెథడిస్ట్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఫ్రెసిడెన్షియల్ హిస్టరీ డైరెక్టర్ జెఫ్రీ ఏంజెల్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
రాజకీయ పతనం మొదలైందా?
డోనల్డ్ ట్రంప్ ఈ ఏడాది మొదట్లోనే రిపబ్లిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా నామినేట్ అయ్యారు.
ఈ అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు డోనల్డ్ ట్రంప్ గట్టి పోటీనివ్వనున్నారని, ఎన్నికల ఫలితాలను నిర్ణయించే కొన్ని ప్రధాన రాష్ట్రాల్లో ట్రంప్ కాస్త మెరుగైన స్థితిలో ఉన్నట్లు సర్వేలు సూచిస్తున్నాయి. అయితే, ట్రంప్ దోషిగా తేలితే ఈ పరిస్థితి మారిపోతుందని ఆ సర్వేలు ఇప్పటికే సూచించాయి. ఇప్పుడు ఆయన దోషిగా తేలారు.
ట్రంప్‌పై నేరం రుజువైతే ఆయనకు ఓటు వేయబోమని ఇటీవల నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌లో పలువురు ఓటర్లు చెప్పారు.
ఆయన దోషిగా తేలితే తమ మద్దతు గురించి పునరాలోచిస్తామని ఏప్రిల్‌లో ఇప్సోస్, ఏబీసీ న్యూస్ చేసిన సర్వేలో ట్రంప్ మద్దతుదారుల్లో 16 శాతం మంది చెప్పారు.
‘‘ఈ తీర్పు సిగ్గుచేటు. నవంబర్ 5న ప్రజలు అసలైన తీర్పు ఇస్తారు’’ అని కోర్టు రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ట్రంప్ వ్యాఖ్యానించారు.

రిపబ్లికన్ల మద్దతు
ట్రంప్‌కు ఏమాత్రం ప్రజల మద్దతు తగ్గినా హోరాహోరీగా సాగే ఈ అధ్యక్ష ఎన్నికల్లో అది కీలకంగా మారొచ్చు. విస్కాన్సిన్, పెన్సిల్వేనియా వంటి ప్రధాన రాష్ట్రాల్లో ట్రంప్‌కు మద్దతిచ్చేవారిలో కొన్ని వేల మంది ఓటర్లు ఇళ్లకే పరిమితమైతే అది ఫలితాలపై చాలా తేడా చూపిస్తుంది.
‘‘అధ్యక్ష పదవి అభ్యర్థిగా ట్రంప్‌ను ఇది దెబ్బతీస్తుంది, పెద్ద ప్రభావం చూపిస్తుంది’’ అని రిపబ్లికన్ వుమెన్ ఫర్ ప్రోగ్రెస్ సహ వ్యవస్థాపకురాలు ఏరియల్ హిల్ డేవిస్ అన్నారు.
ట్రంప్ ప్రవర్తన, అతని పాలనా విధానం గురించి యువ ఓటర్లు, శివారు ప్రాంతాల్లో నివసించే విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని ఆమె చెప్పారు.
‘‘ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీ వైపు చూడటానికి ఈ యువ ఓటర్లు వెనుకాడుతున్నారు. ఇప్పుడు ఆయన దోషిగా తేలడం ఈ ఆందోళనలను మరింత పెంచుతుంది’’ అని ఆమె అభిప్రాయపడ్డారు.
కానీ, చాలామంది రిపబ్లికన్లు, ట్రంప్‌కు అండగా నిలిచారు.
అమెరికా చరిత్రలో ఇదొక అవమానకర దినం అని హౌజ్ స్పీకర్ మైక్ జాన్సన్ అన్నారు. ‘‘ఇది పూర్తిగా రాజకీయ క్రీడ, చట్టపరమైన చర్య కాదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
పలు ఆరోపణలు
ట్రంప్ రాజకీయ పతనం గురించి ఎనిమిదేళ్లుగా ఆయన ప్రత్యర్థులు, నిపుణులు అంచనా వేస్తున్నారు. కానీ, అలా జగలేదు. 2016లో ట్రంప్ అధ్యక్ష ఎన్నికల ప్రచారం సమయంలో ఆయనపై అనేక కుంభకోణాలకు సంబంధించిన ఆరోపణలు వచ్చాయి. ఒక రాజకీయ నాయకుడి జీవితాన్ని తారుమారు చేయగల అరోపణలు అవి. అయినప్పటికీ, ఆయన చెక్కు చెదరలేదు.
అధ్యక్షుడిగా ఆయన రెండు అభిశంసనలను ఎదుర్కొన్నప్పుడు, పదవి చివరి కాలంలో యూఎస్ క్యాపిటల్ భవనంపై ఆయన మద్దతుదారుల గుంపు దాడి చేసినప్పుడు కూడా పార్టీ ఆయన వెంటే నిలిచింది. ఈ ఘటనలేవీ ఆయనను మళ్లీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించలేదు.
అయితే, హష్ మనీ కేసులో దోషిగా తేలడం ఇప్పుడు భిన్నంగా ఉండొచ్చు. ఒకవేళ ట్రంప్ అప్పీల్ విఫలమైతే ఆయన జైలుకు కూడా వెళ్లొచ్చు.
అలా కాకపోతే, ఆయన ఎదుర్కొన్న చాలా ఆరోపణల్లో ఇది కూడా ఒకటిగా మిగిలిపోవచ్చు.
‘‘చరిత్ర పుస్తకాల్లో ఇది ఒక అపూర్వ, అసాధారణ ఘటనగా మిగిలిపోతుంది. అయితే, ఇప్పుడు తర్వాత ఏం జరుగుతుందనే దానిపై చాలా అంశాలు ఆధారపడి ఉంటాయి’’ అని అమెరికన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అలెన్ లిచ్‌మన్ అన్నారు.
ట్రంప్ దోషిగా తేలడం మీద అసలైన తీర్పు నవంబర్‌లో ఓటర్లు వెలువరిస్తారు. ఒకవేళ ఆయన ఓడిపోతే, అందుకు కారణంగా హష్ మనీ కేసులో దోషిగా తేలడాన్నిచూశారు. గెలిస్తే, ట్రంప్ రాజకీయ జీవితంలో మరో ఫుట్‌నోట్‌గా ఇది మిగిలిపోతుంది.
‘‘విజేతలే చరిత్రను రాశారనే సంగతి మనందరికీ తెలుసు’’ అని ఏంజెల్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ‘స్టార్ వార్ సినిమాలో చూపించినట్టు గాలి నుంచి నీటిని తయారు చేస్తున్నాం...’
- అంతరించి పోయిందనుకున్న ఈ ‘పర్వత రత్నం’ మళ్లీ కనిపించింది, ఎక్కడంటే..
- బెంగళూరు రేవ్ పార్టీ కేసు: పోలీసులు ఏం చెప్పారు? అసలు రేవ్ పార్టీ అంటే ఏంటి? అందులో ఏం చేస్తారు?
- ఓవర్సీస్ హైవే: సముద్రంలో 182 కిలోమీటర్ల రోడ్డు.. ప్రపంచంలో 8వ వింత ఇదేనా?
- #UnseenLives: వెనక 40 మంది పురుషులున్నా, నేను ఆ మరకను దాచుకోలేదు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














