బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘర్షణల తర్వాత రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

బంగ్లాదేశ్ నిరసనలు

ఫొటో సోర్స్, Getty Images

బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదలైన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో ఆ దేశ సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. 93 శాతం ప్రభుత్వ ఉద్యోగాలనూ మెరిట్ ఆధారంగానే భర్తీ చేయాలని ఆదేశించింది.

రిజర్వేషన్లపై గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసింది.

బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కొన్ని రోజులుగా హింసాత్మక ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు 115 మంది మరణించారని నివేదికలు వస్తున్నాయని బీబీసీ బంగ్లా సర్వీస్ తెలిపింది. శుక్రవారం ఒక్కరోజే 50 మందికి పైగా చనిపోయారు.

హింసాత్మక ఘర్షణల దృష్ట్యా, ప్రభుత్వం శుక్రవారం రాత్రి నుంచి దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది. ప్రధాన నగరాలు, పట్టణాల్లో భారీగా బలగాలను మోహరించారు.

ఆదివారం కూడా అక్కడక్కడా ఘర్షణలు జరిగాయి.

ఈ తరుణంలో రిజర్వేషన్ల విధానంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

బంగ్లాదేశ్ నిరసనలు

ఫొటో సోర్స్, Getty Images

కోర్టు తీర్పును స్వాగతించిన ప్రభుత్వం

రిజర్వేషన్ విధానంపై సుప్రీంకోర్టు నిర్ణయాన్ని బంగ్లాదేశ్ ప్రభుత్వం స్వాగతించింది.

కోర్టు తీర్పు అనంతరం బంగ్లాదేశ్ న్యాయశాఖ మంత్రి అనిసుల్ హక్ బీబీసీ న్యూస్ అవర్ కార్యక్రమంలో మాట్లాడుతూ కోర్టు నిర్ణయాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పారు.

ఈ తీర్పును స్వాగతిస్తున్నామని, ప్రభుత్వం వీలైనంత త్వరగా దీనికి సంబంధించి నోటిఫికేషన్‌ విడుదల చేస్తుందని ఆయన తెలిపారు.

బంగ్లాదేశ్ నిరసనలు
ఫొటో క్యాప్షన్, ఆదివారం ఢాకాలోని కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు ఘర్షణలు జరిగాయి

ఆందోళనలకు కారణం ఏంటి?

పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విముక్తి కోసం 1971లో జరిగిన యుద్ధంలో పోరాడిన వారి పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించే విధానాన్ని వ్యతిరేకిస్తూ యూనివర్సిటీ విద్యార్థులు చాలా రోజులుగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం వివక్ష పూరితంగా వ్యవహరిస్తోందని వారు ఆరోపిస్తున్నారు.

1971 నాటి బంగ్లా విముక్తి పోరాటంలో పాల్గొన్న వారిని ఇక్కడ యుద్ధవీరులుగా పేర్కొంటారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మూడింట ఒక వంతు వారి పిల్లలకు రిజర్వ్ చేశారు.

మరికొన్ని ఉద్యోగాలు మహిళలు, మైనారిటీలు, వికలాంగులకు రిజర్వ్ అయి ఉంటాయి.

యుద్ధవీరుల పిల్లల కోసం మూడింట ఒకవంతు పోస్ట్‌లు కేటాయించడం వివక్షతో కూడుకున్నదని, ప్రతిభ ఆధారంగానే రిక్రూట్‌మెంట్‌ జరగాలని కొందరు విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

బంగ్లాదేశ్‌లో ఆందోళనలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బంగ్లాదేశ్‌లో శుక్రవారం అనేక చోట్ల హింతసాత్మక ఘటనలు జరిగాయి

అంతకంతకూ పెరిగిన ఆందోళనలు..

ఆందోళనలను కట్టడి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. గురువారం ఇంటర్నెట్, మొబైల్ సేవలను నిలిపివేసింది. స్కూళ్ళు, యూనివర్సిటీలు నిరవధికంగా మూతపడ్డాయి. అయినా, ఆందోళనలు ఆగలేదు. మరింత తీవ్రమయ్యాయి.

బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాలకు క్రేజ్ ఉంది. ఈ ఉద్యోగాల కోసం చాలామంది పోటీ పడుతుంటారు. అయితే, మొత్తం ఉద్యోగాలలో సగానికి పైగా ఉద్యోగాలు కొన్ని నిర్దిష్ట గ్రూపులకు రిజర్వ్ అయి ఉన్నాయి.

ఈ ఏడాది జనవరిలో వరుసగా నాలుగోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన షేక్ హసీనాకు మద్దతు ఇస్తున్న ప్రభుత్వ అనుకూల వర్గాల పిల్లలకు ఈ రిజర్వేషన్ వల్ల అధిక ప్రయోజనం చేకూరుతోందని, ఇది అన్యాయమని విమర్శకులు అంటున్నారు.

బంగ్లాదేశ్ నిరసనలు

ఫొటో సోర్స్, EPA

2018లో నిరసనలు వెల్లువెత్తడంతో షేక్ హసీనా ప్రభుత్వం ఈ రిజర్వేషన్లను రద్దు చేసింది. కానీ, ఆ కోటాను పునరుద్ధరించాలని 2024 జూన్ ప్రారంభంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు తాజా ఆందోళనలకు దారితీసింది.

హైకోర్టు ఇచ్చిన ఆ ఆదేశాలను రద్దు చేయాలని అటార్నీ జనరల్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో, తాజా విచారణ అనంతరం హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

93 శాతం ఉద్యోగాలను మెరిట్ ఆధారంగా ఇవ్వాలని, స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలకు 5 శాతం, మైనార్టీలకు 1 శాతం, వికలాంగులు, థర్డ్ జెండర్‌లకు 1 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పింది.

బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌కు వచ్చిన విద్యార్థులు

ఫొటో సోర్స్, PINAKI DAS

ఫొటో క్యాప్షన్, బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌కు వస్తున్న విద్యార్థులు

4,500 భారతీయులు స్వదేశానికి

బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘర్షణల భయంతో ఆక్కడ ఉంటున్న 4,500 మందికి పైగా భారతీయ విద్యార్థులు స్వదేశానికి వచ్చారని భారత విదేశాంగ శాఖ తెలిపింది. నేపాల్‌కు చెందిన 500 మంది, భూటాన్‌కు చెందిన 38 మంది విద్యార్థులతో పాటు మాల్దీవులకు చెందిన ఒక విద్యార్థి కూడా భారత్‌కు వచ్చారని వెల్లడించింది.

ఇప్పటికీ బంగ్లాదేశ్‌లో చిక్కుకుపోయిన భారతీయులు సరిహద్దు పాయింట్ల వద్దకు సురక్షితంగా చేరుకునేందుకు అవసరమైన రక్షణ కల్పించేందుకు అక్కడి భారత హైకమిషన్ ఏర్పాట్లు చేస్తోందని భారత విదేశాంగ శాఖ తెలిపింది.