మన మెదడు వయసును నియంత్రించవచ్చా?

మానవ మెదడు
    • రచయిత, లారా లెవింగ్టన్,
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మన జీవనశైలి మనల్ని ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుందని చాలాకాలంగా మనకు తెలుసు. అయితే కొత్త సాంకేతిక మన మెదడు వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదింపచేయడానికి ఏమైనా సహాయపడుతుందా? అని శాస్త్రవేత్తలు పరిశోధిస్తున్నారు.

అమెరికాలోని లాస్ ఏంజలస్‌కు గంట ప్రయాణ దూరంలో ఉన్న లోమా లిండాలోని తమ ఇంటికి రావాల్సిందిగా డచ్‌లో జన్మించిన 76 ఏళ్ళ మరిజ్కే, ఆమె భర్త టామ్ నన్ను ఆహ్వానించారు.

లోమా లిండా ప్రపంచంలోని బ్లూ జోన్‌లలో ఒకటి.

బ్లూజోన్‌ అంటే, ప్రజలు సగటు జీవితకాలం కంటే ఎక్కువకాలం జీవించే ప్రదేశం.

లోమా లిండాలో ఉన్న వాళ్లు సెవెంత్-డే అడ్వెంటిస్ట్ చర్చ్ సంఘం సభ్యులు.

వీళ్లు సాధారణంగా ఆల్కహాల్ లేదా కెఫీన్ తీసుకోరు.శాకాహారానికి లేదంటే వీగన్ డైట్‌‌కు కట్టుబడి ఉంటారు. ఇదే వారి ఆరోగ్య సందేశం. దీని కారణంగానే వాళ్లు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నారు.

ఇక్కడ ఉండేవాళ్లు ఎక్కువ కాలం ఎలా జీవిస్తారనే దానిపై దశాబ్దాలుగా పరిశోధన జరుగుతోంది.

లోమా లిండా విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ గ్యారీ ఫ్రేజర్ సెవెంత్-డే అడ్వెంటిస్ట్ కమ్యూనిటీ సభ్యులు. ఆయన లోమా లిండాలో ఎక్కువ కాలం జీవించడమే కాకుండా, మంచి ఆరోగ్యంతో గడిపే సమయం మహిళలైతే నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు, పురుషులైతే ఏడు సంవత్సరాలు పెరుగుతుందని తెలిపారు.

లోమా లిండాలో పెద్ద రహస్యమేమీ లేదు.

దాని పౌరులు నిజంగా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతున్నారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు.

తమ మతం బోధించినట్లు తమ ఇరుగుపొరుగువారిని గౌరవిస్తారు.

అక్కడ ఆరోగ్యకరమైన జీవనం, సంగీత సమావేశాలు, వ్యాయామ తరగతులపై ఉపన్యాసాలు ఉంటాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
లారా లెవింగ్టన్
ఫొటో క్యాప్షన్, లోమా లిండాలో మారిజ్కే, టామ్‌లతో లారా లెవింగ్టన్‌

మెదడు వయసు అంచనా వేసి..

లోమా లిండాలో మరో 112 మందితో కలిసి ఒక సహాయక జీవన కేంద్రంలో నివసిస్తున్న జూడీతో మాట్లాడాను. అక్కడ ఎప్పుడైనా "మనసు విప్పి ఇతరులతో మాట్లాడొచ్చు" అని ఆమె చెప్పారు.

"మన మెదడుకు సామాజికీకరణ ఎంత ముఖ్యమో నేను గ్రహించలేకపోయాను, అది లేకుంటే మెదడు కుంచించుకుపోయి, మన నుంచి విడిపోయినట్లు అనిపిస్తుంది" అని జూడీ అన్నారు.

పరస్పర సామాజిక చర్యల ప్రయోజనాలను, ఒంటరితనాన్ని నివారిస్తే కలిగే లాభాలను సైన్స్ చాలాకాలం క్రితమే గుర్తించింది.

అయితే ఇప్పుడు ఎవరి మెదడుకు త్వరగా వృద్ధాప్యం వస్తుందో గుర్తించి, భవిష్యత్తులో వారికి మెరుగైన చికిత్స అందించవచ్చు.

ఆరోగ్యానికి సంబంధించిన అన్ని రంగాలలో ముందస్తు రోగ నిర్ధరణ చాలా కీలకం. ప్రస్తుతం ఈ విషయంలో కృత్రిమ మేధస్సు, బిగ్ డేటాలు చాలా సహకరిస్తున్నాయి.

మన మెదడు వయస్సు ఎలా ఉందో అంచనా వేసి, దాని క్షీణతను అంచనా వేసే కంప్యూటర్ నమూనాలను సదరన్ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో జెరోంటాలజీ, కంప్యూటేషనల్ బయాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ ఆండ్రీ ఇరిమియా నాతో పంచుకున్నారు.

ఆయన ఎమ్ఆర్ఐ స్కాన్‌లు, 15,000 మెదళ్లకు సంబంధించిన డేటాను, కృత్రిమ మేధస్సును ఉపయోగించి, సాధారణ మెదడు, డిమెన్షియా వంటి వ్యాధి ఉన్న మెదడును అర్థం చేసుకోవడానికి కంప్యూటర్ నమూనాలను సృష్టించారు.

"గతంలో మనం ఈ నమూనాలను పరిశీలించలేకపోయేవాళ్లం, కానీ కృత్రిమ మేథస్సు అల్గారిథం వాటిని గుర్తిస్తుంది" అని ఆయన చెప్పారు.

లారా లెవింగ్టన్
ఫొటో క్యాప్షన్, తన మెదడు 3డీ ప్రింటెడ్ నమూనాతో లారా లెవింగ్టన్

ఎంఆర్‌ఐలు మరింత సులభం..

ప్రొఫెసర్ ఇరిమియా, నా మెదడునూ పరిశీలించారు.

ఆయనను కలవడానికి ముందు నేను ఎమ్ఆర్ఐ స్కాన్ చేయించుకొని వెళ్లాను.

దాని ఫలితాలను విశ్లేషించిన ప్రొఫెసర్ ఇరిమియా నా మెదడు వయసు నా శారీరక వయసు కంటే ఎనిమిది నెలలు పెద్దదని చెప్పారు.

అయితే, ఫలితాలలో రెండేళ్ల పొరబాటు జరిగే అవకాశం (ఎర్రర్ మార్జిన్‌) ఉండవచ్చని ఆయన అన్నారు.

ప్రస్తుతం ప్రైవేట్ కంపెనీలు కూడా ఈ సాంకేతికత రంగంలోకి ప్రవేశించాయి.

బ్రెయిన్‌కీ అనే ఒక సంస్థ ప్రపంచవ్యాప్తంగా వివిధ క్లినిక్‌లలో ఈ సేవలను అందిస్తోంది. దీని వ్యవస్థాపకుడు ఓవెన్ ఫిలిప్స్ భవిష్యత్తులో, ఎమ్‌ఆర్ఐలు పొందడం సులభతరం అవుతుందని చెప్పారు.

"ప్రజలు ఎమ్‌ఆర్ఐ స్కాన్ పొందడం మరింత అందుబాటులోకి వస్తోంది. వాటి నుంచి వచ్చే చిత్రాలు మరింత మెరుగవుతున్నాయి" అని ఆయన చెప్పారు.

“సాంకేతికత భవిష్యత్తును చూడగలిగే స్థితికి చేరుకుంటోంది. దీని వల్ల ఒక రోగి మెదడులో ఏమి జరుగుతుందో మనం కచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. కృత్రిమ మేధస్సుతో, మనం వాళ్లకు సహాయ పడవచ్చు’’ అని అన్నారు.

ప్రొఫెసర్ ఇరిమియా విశ్లేషించిన దానికి విరుద్ధంగా, నా మెదడు వయస్సు జీవసంబంధమైన వయస్సుకన్నా ఒక ఏడాది తక్కువ ఉందని బ్రెయిన్‌కీ అంచనా వేసింది. నా మెదడు 3డీ-ప్రింటెడ్ నమూనాను సైతం నాకు అందజేశారు.

గత 200 సంవత్సరాలలో మనుషుల ఆయుర్దాయం పెరగడం వల్ల వయసుకు సంబంధించిన అనేక వ్యాధులు వస్తున్నాయి. మనుషులు ఎక్కువ కాలం జీవిస్తే, వాళ్లు డిమెన్షియా బారిన పడతారేమో అని నాకు అనిపించింది.

ప్రొఫెసర్ ఇరామియా, ఈ సిద్ధాంతాన్ని ఇంతవరకూ ఎవరూ నిరూపించకున్నా, చాలామంది దీనిని పరిశోధించారని, డిమెన్షియాను వెనక్కి నెట్టడానికి ఒక దారిని కనిపెట్టాలని అన్నారు.

ఇవ్వన్నీ మనలను తిరిగి మన మొదటి పాయింట్‌ దగ్గరకే తీసుకువస్తాయి. ప్రతి శాస్త్రవేత్త, వైద్యుడు, అలాగే ఆ బ్లూ జోన్‌లో ఉన్న వ్యక్తులు - జీవనశైలి కీలకం అని అంటారు. మంచి ఆహారం, చురుగ్గా ఉంచడం, మానసికంగా ఉత్తేజంగా, సంతోషంగా ఉండటం మన మెదడు వృద్ధాప్య ప్రక్రియలో కీలకమైనవి.

‘కంటి నిండా నిద్రపోవడమే మేలు’

మానవ మెదడు

ఫొటో సోర్స్, Getty Images

బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని న్యూరోసైన్స్, సైకాలజీ ప్రొఫెసర్, అత్యధికంగా అమ్ముడైన పుస్తకం ‘వై వి స్లీప్’ రచయిత మాథ్యూ వాకర్ ప్రకారం, దీనికి మరొక ముఖ్య కారణం ఉంది.

"మీ మెదడు, శరీర ఆరోగ్యాన్ని రీసెట్ చేయడానికి మీరు ప్రతిరోజూ చేయగలిగిన ఏకైక అత్యంత ప్రభావవంతమైన పని - నిద్ర," అని ఆయన అన్నారు. "మీరు నిద్రపోతున్నప్పుడు మీ మనస్సు అద్భుతంగా మెరుగుపడుతుంది, అలాగే తగినంత నిద్ర లేనప్పుడు అది మిమ్మల్ని బలహీన పరుస్తుంది. మనం నిద్ర పోతున్నప్పుడు పనిచేసే మన మెదడు బీటా-అమిలాయిడ్, టౌప్రొటీన్‌లను తొలగిస్తుంది’’ అని ఆయన వివరించారు.

అవి “అల్జీమర్స్‌కు రెండు ప్రధాన కారణాలు” అని చెప్పారు.

నిద్రపోయే విధానాలలో మార్పులకు డిమెన్షియాతో సంబంధం ఉంటుంది. ఇది 60లు లేదా 70లలో మాత్రమే కాదు, 30 ఏళ్ళలోనూ ఎలా ప్రారంభమవుతుందో ప్రొఫెసర్ వాకర్ వివరించారు. కాబట్టి, స్లీప్ ట్రాకింగ్ ద్వారా ఆ మార్పులను గుర్తించి దానిని సరిదిద్దుకోవచ్చు.

శాన్‌ ఫ్రాన్సిస్కో శివార్లలోని బయోటెక్ కంపెనీ ఫౌనా బయో, ఉడతలు నిద్రాణస్థితిలో ఉన్నప్పుడు, ఆ తర్వాత డేటాను సేకరిస్తోంది. టార్పోర్ అని పిలిచే ఈ స్థితిలో, ఉడతల శరీర ఉష్ణోగ్రత పడిపోయి, వాటి జీవక్రియ రేటు సాధారణంలో 1 శాతానికి పడిపోతుంది.

ఈ సమయంలో, వాటి న్యూరాన్‌లు తిరిగి పెరుగుతాయి, వాటి మెదడు కోల్పోయిన కనెక్షన్‌లను మళ్లీ కనెక్ట్ చేసుకుంటుంది. ఈ ప్రక్రియను మానవులలో పునరావృతం చేయడానికి ఔషధాలను తయారు చేయడం ఈ కంపెనీ లక్ష్యం.

చికిత్స చేయని డిప్రెషన్, డిమెన్షియా ప్రమాదాన్ని కూడా పెంచుతుందని పరిశోధనల్లో తేలింది. స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ లియాన్ విలియమ్స్, ఎమ్ఆర్ఐ స్కాన్‌ను ఉపయోగించి మెదడులోని కొన్ని రకాల డిప్రెషన్‌లను "కనుగొనే’’ పద్ధతిని గుర్తించారు, తద్వారా చికిత్స పని చేసిందో లేదో తెలుసుకోవచ్చు.

డిప్రెషన్ వంటి మానసిక ఆరోగ్య పరిస్థితుల మూల కారణాల గురించి శాస్త్రవేత్తలు మరింత అర్థం చేసుకోవడంలో ఇది సహాయపడవచ్చు, అలాగే రోగికి చికిత్స ఎలా జరుగుతుందో పరిశీలించవచ్చు.

టెక్ వ్యవస్థాపకుడు బ్రయాన్ జాన్సన్ డజన్ల కొద్దీ సప్లిమెంట్‌లు, రోజుకు 19 గంటల ఉపవాసం, వర్కవుట్‌లు, కొన్ని వివాదాస్పద చికిత్సలతో జీవ గడియారాన్ని వెనక్కి తిప్పాలని అనుకుంటున్నారు.

లోమా లిండాలో నేను 103 ఏళ్ల మిల్డ్రెడ్‌ను కలిశాను. ఆమె తన రహస్యాన్ని చెప్పారు. ఆరోగ్యకరమైన అలవాట్లు ముఖ్యమైనవి అయినప్పటికీ, అవి ఆనందం సంతృప్తిని పణంగా పెట్టకూడదని చెప్పారు. హాయిగా జీవించడం, సరదాగా ఉండటం తనపై తాను ఎక్కువ కఠినంగా ఉండకపోవడం చాలా ముఖ్యమని ఆమె నమ్ముతున్నారు.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)