జ్యోతి యర్రాజీ: పారిస్ ఒలింపిక్స్ 100 మీ. హర్డిల్స్‌లో పోటీపడుతున్న మొదటి భారత అథ్లెట్

జ్యోతి యర్రాజీ

ఫొటో సోర్స్, Suresh Yerraji

ఫొటో క్యాప్షన్, జ్యోతి యర్రాజీ
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

విశాఖపట్నం ద్వారకా నగర్‌లోని ఓ కమర్షియల్ కాంప్లెక్స్‌లో సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తుంటారు సూర్యనారాయణ. ఆయన, ఆయన భార్య కుమారి రోజూ పారిస్ ఒలింపిక్స్‌‌కు సంబంధించిన సమాచారాన్నితెలుసుకుంటూ ఉంటారు.

వీళ్లు ఒలింపిక్స్‌లో ఆగస్టు 7న జరగనున్న ఈవెంట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. అందులో తమ కుమార్తె పతకం సాధిస్తుందని వారు గట్టి నమ్మకంతో ఉన్నారు.

ఒలింపిక్స్‌లో 100 మీటర్ల హర్డిల్స్‌లో పోటీపడనున్న జ్యోతి యర్రాజీ తల్లిదండ్రులే వీళ్లు.

విశాఖపట్నానికి చెందిన 25 ఏళ్ల జ్యోతి యర్రాజీ ఒలింపిక్స్‌ 100 మీటర్ల హర్డిల్స్ ఈవెంట్‌లో పోటీపడుతున్న మొట్టమొదటి భారత అథ్లెట్ కూడా.

వాట్సాప్
జ్యోతి యర్రాజీ

ఫొటో సోర్స్, Suresh Yerraji

ఫొటో క్యాప్షన్, జ్యోతి యర్రాజీ

జ్యోతి యర్రాజీ కుటుంబం కైలాసపురంలో కొండవాలు ప్రాంతంలో నివాసం ఉంటోంది. కొండచరియలు పడిపోతాయనే ఆందోళన ఆ ప్రాంతంలో తరచూ కనిపిస్తుంటుంది.

జ్యోతి ఇంటికి వెళ్లాలంటే మూడు నిమిషాల పాటు మెట్లదారి ఉన్న కొండపైకి నడవాల్సిందే. జ్యోతి సోదరుడు సురేశ్ విశాఖ పోర్టులో కాంట్రాక్ట్ డ్రైవరుగా పని చేస్తున్నారు.

జ్యోతి తండ్రి సూర్యనారాయణ
ఫొటో క్యాప్షన్, జ్యోతి తండ్రి సూర్యనారాయణ

‘నా బిడ్డ ఏ దేశం వెళ్లిందో కూడా తెలియదు’

జ్యోతి యర్రాజీ తండ్రి సూర్యనారాయణ గత 10 ఏళ్లుగా సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నారు. అంతకుముందు భవన నిర్మాణ కూలీగా చేసేవారు. ఒక భవనం వద్ద పని చేస్తుండగా పైనుంచి పడిపోవడంతో కాళ్లకు తీవ్రమైన గాయాలయ్యాయి. దాంతో కుటుంబ పోషణకు సెక్యూరిటీ గార్డుగా మారారు.

జ్యోతి తల్లి కూడా రెండేళ్ల క్రితం వరకు ఒక హోటల్‌లో వంటపని, పాత్రలు శుభ్రపరిచే పని చేసేవారు. భర్తకు ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆమె పనులకు వెళ్లడం మానేశారు.

నైట్ సెక్యూరిటీ గార్డుగా పని చేసే సూర్యనారాయణను కలిసేందుకు ఆయన విధులు నిర్వహిస్తున్న కమర్షియల్ కాంప్లెక్స్‌కు బీబీసీ వెళ్లింది. కూతురు జ్యోతి గురించి చెప్పమని ఆయన్ని అడిగితే...

“నా బిడ్డ ఏ దేశం వెళ్లిందో తెలియదు. ఏం ఆడుతుందో తెలియదు. ఎందుకంటే నాకు పెద్దగా చదువు లేదు. వాళ్లమ్మకే కాస్త తెలుసు. ఇప్పుడు జ్యోతి ప్రపంచంలోని అన్నీ ఆటలు ఆడే చోటకు వెళ్లిందట. కచ్చితంగా బంగారు పతకం గెలుస్తుంది. మా ఇంట్లో జ్యోతి గెలిచిన ఎన్నో మెడల్స్ ఉన్నాయి.” అని సూర్యనారాయణ అన్నారు.

జ్యోతి తండ్రి సూర్యనారాయణ

‘’నేను సెక్యూరిటీ గార్డును, నాకు రూ. 6 వేలు జీతం వస్తుంది. జ్యోతికి కూడా రైల్వేలో ఉద్యోగం వచ్చింది. కొడుకు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. మా ఆవిడ మా బాగోగులు చూసుకుంటూ ఇంట్లోనే ఉంటోంది. ఇప్పుడు మెడల్ సాధిస్తే జ్యోతి కల నెరవేరినట్లే. సెక్యూరిటీ గార్డు కూతురు సాధించిందంటే గర్వంగానే ఉంటుంది కదా.’’ అని సూర్యనారాయణ బీబీసీతో చెప్పారు.

జ్యోతి తల్లి కుమారి
ఫొటో క్యాప్షన్, జ్యోతి తల్లి కుమారి

‘మొదట్లో ఆటలకు వద్దనుకున్నాం’

జ్యోతి విశాఖపట్నం డీఎల్‌బీ (డాక్ లేబర్ బోర్డు) పాఠశాలలో చదివారు. అక్కడి పీటీ ఉపాధ్యాయులు శ్రీనివాసరెడ్డి జ్యోతి ప్రతిభను గుర్తించారు. జ్యోతిని క్రీడల్లో ప్రొత్సహిస్తే బాగుంటుందని తల్లిదండ్రులకు సూచించారు.

“ఆడపిల్ల అని మొదట్లో ఆటల్లో ప్రొత్సహించేందుకు ఇష్టపడలేదు. కానీ జ్యోతి ఆసక్తిని గమనించి పంపించాం. ఒలింపిక్స్ వరకు వెళ్తుందని మాత్రం ఊహించలేదు.” అని తల్లిదండ్రులు చెప్పారు.

“ఆడపిల్లను ఆటలు ఆడేందుకు పంపిస్తావా అంటూ చుట్టుపక్కల వాళ్లు అనేవారు. ఆ మాటలను మేం పట్టించుకోలేదు. ఇప్పుడు ఒలింపిక్స్‌కు వెళ్లిందంటే వాళ్లే మమ్మల్ని పొగుడుతున్నారు. నేను హోటల్‌లో వంట పని చేస్తూ జ్యోతిని పెంచిన రోజులు గుర్తుకొస్తున్నాయి.” అని జ్యోతి తల్లి కుమారి బీబీసీతో చెప్పారు.

జ్యోతి కుటుంబం
ఫొటో క్యాప్షన్, కుటుంబ సభ్యులతో జ్యోతి (మధ్యలో)

‘’జ్యోతికి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. కానీ ఒలింపిక్‌లో పతకం సాధించిన తర్వాతే పెళ్లి గురించి ఆలోచిస్తానని జ్యోతి చెప్పింది. రెండేళ్ల క్రితం జరిగిన తన అన్న పెళ్లికి కూడా రాకుండా ప్రాక్టీస్ చేసింది. మూడేళ్లలో ఒక్కసారే ఇంటికి వచ్చి వెళ్లింది. నా కూతురు పడ్డ కష్టానికి ఒలింపిక్‌లో బంగారు పతకం వస్తుందని నమ్ముతున్నాను.’’ అని కుమారి చెప్పారు.

“జ్యోతి ఒలింపిక్ మెడల్ సాధిస్తుందని మా చుట్టుపక్కల వాళ్లంతా నమ్మకంతో ఉన్నారు. మా ఊరి పిల్ల ఒలింపిక్స్‌లో ఆడుతుందని అందరితోనూ చెబుతున్నారు. ఇది మాకు చాలా సంతోషంగా అనిపిస్తోంది.” అని కుమారి అన్నారు.

జ్యోతి యర్రాజీ

ఫొటో సోర్స్, Twitter/SAI Media

ఆ కోచింగ్ మలుపు తిప్పింది: జ్యోతి యర్రాజీ

జ్యోతి యర్రాజీ బ్యాంకాక్‌లో జ‌రిగిన 25వ ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్ రేసులో గోల్డ్ మెడల్ సాధించారు.

50 ఏళ్ల ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ చరిత్రలో 100 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయ అథ్లెట్‌గా జ్యోతి యర్రాజీ నిలిచారు. ఆ సందర్భంలో ఆమె బీబీసీతో మాట్లాడారు. తన క్రీడా ప్రస్థానాన్ని వివరిస్తూ అప్పుడు ఏమన్నారంటే...

భువనేశ్వర్‌‌లోని ఒడిశా రిలయన్స్ అథ్లెటిక్స్ హై-పెర్ఫార్మెన్స్ సెంటర్‌లో ఇంగ్లండ్‌కు చెందిన కోచ్ జేమ్స్ హిల్లర్ ఆధ్వర్యంలో శిక్షణ పొందాను. ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాను.

ఇప్పటికీ మా నాన్న సెక్యూరిటీ గార్డుగానే పని చేస్తున్నారు. సెక్యూరిటీ గార్డు కూతురిగా ఫీల్డ్‌లోకి అడుగుపెట్టి, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తుండటం గర్వంగా ఫీలవుతున్నాను.

మా అమ్మ, నాన్నలకు క్రీడలంటే పెద్దగా తెలియదు. వాటిపై ఆసక్తి కూడా లేదు. అయితే నా చదువు సాగిన డీఎల్‌బీ పాఠశాలలో పీటీ సర్ ఆటలపై నాకున్న ఉత్సాహన్ని గుర్తించారు. ఆయనే పాఠశాలలో జరిగే క్రీడల్లో నన్ను ప్రోత్సహించేవారు. 2015లో నేను పదో తరగతి పూర్తి చేశాను. ఆ తర్వాత నాకు డిస్ట్రిక్ట్ అథ్లెటిక్స్ అసోసియేషన్ నుంచి మద్దతు లభించింది.

జ్యోతి యర్రాజీ

ఫొటో సోర్స్, Suresh Yerraji

2015లో ఆంధ్రప్రదేశ్ అంతర్ జిల్లాల మీట్‌లో బంగారు పతకాన్ని గెల్చుకున్నాను.

ఆ తర్వాత మెరుగైన శిక్షణ కోసం హైదరాబాద్‌లోని శాయ్ (స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) సెంటర్‌కు వెళ్లాను. అక్కడ ఉండగానే గుంటూరు నాగార్జున యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ ఎక్సలెన్స్‌లో చేరే అవకాశం వచ్చింది. అయితే కొన్ని రోజుల శిక్షణ తర్వాత అది మూతపడింది.

విశాఖపట్నంలో పూర్తి స్థాయి శిక్షణా కేంద్రాలు లేవు. పైగా నాకు ఆర్థిక సమస్యలున్నాయి. ఆ సమయంలోనే అంటే 2019లో రిలయన్స్ ఆధ్వర్యంలో ఒడిశాలోని భువనేశ్వర్‌లో నడిచే అథ్లెటిక్స్ హై-పెర్ఫార్మెన్స్ సెంటర్ నుంచి నాకు పిలుపు వచ్చింది.

అక్కడ నాకు ఇంగ్లండ్‌కు చెందిన జేమ్స్ హిల్లర్ కోచింగ్ ఇచ్చారు. ఇది నాకు ఎంతో ఉపయోగపడంది. ఆ శిక్షణతోనే నా వేగం మెరుగుపడింది.

జ్యోతి యర్రాజీ

ఫొటో సోర్స్, M Narayana rao

ఫొటో క్యాప్షన్, 50 ఏళ్ల ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ చరిత్రలో 100 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయ అథ్లెట్‌గా జ్యోతి యర్రాజీ నిలిచారు

'నా రికార్డులను నేనే తిరగరాశా'

భువనేశ్వర్ హై-పెర్ఫార్మెన్స్ సెంటర్‌లో కోచింగ్ తర్వాత నా ప్రతిభ అందరికీ తెలిసింది. కర్ణాటకలో జరిగిన ఆలిండియా ఇంటర్-యూనివర్శిటీ అథ్లెటిక్స్ మీట్‌లో 13.03 సెకన్లతో స్వర్ణం గెల్చుకున్నాను.

2020 ఫిబ్రవరిలో జరిగిన ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌లో మరో స్వర్ణం వచ్చింది. ఆ తర్వాత సంవత్సరం అంతర్జాతీయ ఈవెంట్లకు సిద్ధమయ్యాను.

కోవిడ్ మహమ్మారి కారణంగా 2021 వృథాగా పోయింది. ఆ తర్వాత 2022లో భువనేశ్వర్‌లో జరిగిన ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ మీట్‌తో మళ్లీ నా కెరీర్ ఊపందుకుంది.

2022 సెప్టెంబర్‌లో గుజరాత్‌లో జరిగిన జాతీయ పోటీల్లో 12.79 సెకన్లతో నా సమయం మెరుగుపడింది. 13 సెకన్ల కంటే తక్కువ సమయంలో రేసును పూర్తి చేసిన మొదటి భారతీయ మహిళగా నాకు గుర్తింపు లభించింది. 2022 మే నుంచి ఇప్పటివరకు అనేక సార్లు నా రికార్డును నేనే తిరగరాశాను. ఇది కూడా నాకు సంతోషాన్నిచ్చే అంశమే’’ అని అన్నారు జ్యోతి.

జ్యోతి ఇప్పటికే చాలాసార్లు జాతీయ రికార్డుల్ని బద్దలు కొట్టారు. ఇప్పటికీ 100మీ. హర్డిల్స్‌లో జాతీయ రికార్డు (12.78 సెకన్లు) ఆమె పేరు మీదనే ఉంది.

గతేడాది ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణాన్ని సాధించారు. తర్వాతి ఆసియా క్రీడల్లో రజతం, ప్రపంచ యూనివర్సిటీ గేమ్స్‌లో కాంస్యాన్ని సాధించారు. ఆమె ఇప్పటి వరకు మూడుసార్లు జాతీయ చాంపియన్‌గా నిలిచారు.

ప్రస్తుతం పారిస్ ఒలింపిక్స్‌లో పతకం సాధించడంపైనే దృష్టి పెట్టానని, ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు పారిస్ వెళ్లే ముందు తమతో జ్యోతి చెప్పిందని ఆమె తల్లిదండ్రులు బీబీసీతో చెప్పారు.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)