ఒలింపిక్స్‌లో సెమీస్‌కు చేరిన భారత పురుషుల హాకీ జట్టు - మహిళల బాక్సింగ్‌లో లవ్లీనా ఓటమి

ఒలింపిక్స్

ఫొటో సోర్స్, Getty Images

పారిస్ ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు సెమీస్‌కు చేరింది.

ఆదివారం బ్రిటన్ జట్టుతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది.

మ్యాచ్ తొలుత 1-1తో టై కాగా షూటవుట్‌లో భారత జట్టు 4-2 తేడాతో గెలిచింది.

మ్యాచ్ మొదటి క్వార్టర్‌లో భారత్, బ్రిటన్ జట్లు రెండూ గోల్స్ ఏమీ చేయలేదు.

తరువాత ఆట 22వ నిమిషంలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్ ద్వారా గోల్ సాధించడంతో భారత్ ఆధిక్యంలోకి వచ్చింది.

బీబీసీ న్యూస్ తెలుగు
ఒలింపిక్స్

ఫొటో సోర్స్, Getty Images

27వ నిమిషంలో బ్రిటన్ ఆటగాడు మోర్టన్ లీ గోల్ చేయడంతో రెండు 1-1తో స్కోర్ సమం అయింది.

ఆట ముగిసే సమయానికి రెండు జట్లూ మరో గోల్ చేయకపోవడంతో మ్యాచ్ టై అయింది.

దీంతో షూటవుట్ తప్పనిసరి అయింది.

షూటవుట్‌లో భారత్ 4-2తో విజయం సాధించింది.

ఒలింపిక్స్

ఫొటో సోర్స్, Getty Images

పది మందితో ఆడిన భారత జట్టు

మ్యాచ్‌ రెండో క్వార్టర్ ప్రారంభమైన రెండో నిమిషంలో అమిత్ రోహిదాస్ మిడ్ ఫీల్డ్‌లో డ్రిబ్లింగ్ చేశాడు. ఆ సమయంలో తన హాకీ స్టిక్ ప్రత్యర్థి జట్టు ఆటగాడు విల్ కాల్నన్ ముఖానికి తగిలింది.

దీంతో అమిత్‌కి రెడ్ కార్డు చూపించడంతో గ్రౌండ్‌ను వీడాల్సి వచ్చింది. ఆ తర్వాత భారత జట్టు 10 మంది ఆటగాళ్లతోనే మ్యాచ్‌ను కొనసాగించింది.

క్వార్టర్ ఫైనల్స్‌లో విజయం సాధించిన భారత జట్టుకు ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ అభినందనలు తెలిపింది.

ఫెడరేషన్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో, ''కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, గోల్‌కీపర్ శ్రేజేష్ అద్భుతమైన ఆటతీరుకు అభినందనలు. భారత జట్టు 10 మంది ఆటగాళ్లలో గ్రేట్ బ్రిటన్‌ను షూటౌట్‌లో ఓడించి సెమీ ఫైనల్స్‌కు చేరింది'' అని రాసింది.

హాకీ

ఫొటో సోర్స్, Michael Reaves/Getty Images

ఫొటో క్యాప్షన్, భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్

ఈ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సింగ్, లలిత్ ఉపాధ్యాయ్, సుఖ్‌జీత్ సింగ్, అభిషేక్, రాజ్‌కుమార్ పాల్ భారత్ తరఫున పెనాల్టీ షూటౌట్‌‌కి వెళ్లారు.

ప్రత్యర్థి బ్రిటన్ జట్టు నుంచి ఒలివర్ పేన్, జేమ్స్ ఆల్బరీ, జాచరీ వాలెస్, కానర్ విలియమ్స్, ఫిల్ రోపర్ షూటౌట్ చేశారు.

ఈ షూటౌట్‌లో బ్రిటన్ ఆటగాళ్లు జేమ్స్ అల్బరీ, జాచరీ వాలెస్ గోల్స్ చేశారు. భారత గోల్ కీపర్ శ్రీజేష్ మిగిలిన మూడు బంతులను అడ్డుకున్నారు.

భారత్ నుంచి హర్మన్‌ప్రీత్ సింగ్, సుఖ్‌జీత్ సింగ్, లలిత్ ఉపాధ్యాయ్, రాజ్‌కుమార్ పాల్ గోల్స్ చేశారు.

దీంతో 4-2 తేడాతో బ్రిటన్‌పై భారత్ విజయం సాధించింది.

Lovlina Borgohain

ఫొటో సోర్స్, Getty Images

క్వార్టర్స్‌లో ఓడిపోయిన లవ్లీనా

కాగా ఒలింపిక్స్‌లో ఈ రోజు భారత్‌ అభిమానులు దృష్టి సారించిన మరో కీలక ఈవెంట్ 75 కిలోల విభాగంలో మహిళల బాక్సింగ్.

భారత్‌కు చెందిన మహిళా బాక్సర్ లవ్లీనా బోర్గోహెయిన్ ఈ విభాగంలో క్వార్టర్ ఫైనల్‌లో ఓటమి పాలయ్యారు.

క్వార్టర్స్‌లో ఆమె చైనా బాక్సర్ క్వియాన్ చేతిలో 1-4 తేడాతో ఓడిపోయారు.

ఈ మ్యాచ్‌లో లవ్లీనా విజయం సాధించి ఉంటే భారత్‌కు మరో పతకం ఖాయమయ్యేది.

2020 టోక్యో ఒలింపిక్స్‌లో లవ్లీనా 69 కేజీల విభాగంలో కాంస్యం సాధించింది.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)