వయనాడ్: నిరాశ్రయులైన వారికి ఇళ్లు కట్టించేందుకు ఎవరెవరు ముందుకొచ్చారంటే..

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, బళ్ల సతీష్
- హోదా, బీబీసీ ప్రతినిధి
వయనాడ్ జిల్లాలో కొండచరియల ప్రమాద బాధితుల కోసం సురక్షితమైన ప్రాంతంలో కాలనీ నిర్మిస్తామని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. సాధ్యమైనంత తొందరగా వారికి పునరావాసం కల్పించే ఏర్పాట్లు చేస్తామన్నారు.
వారికి భూములను విరాళంగా ఇచ్చేందుకు, ఇళ్లు కట్టించి ఇచ్చేందుకు అనేకమంది దాతలు ముందుకొస్తున్నారని ముఖ్యమంత్రి చెప్పారు.
అలాంటి వారి నుంచి విరాళాలను సేకరించి, బాధితులకు అందించేందుకు ‘హెల్ప్ ఫర్ వయనాడ్’ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు.
కొండచరియల ప్రమాద ప్రభావిత పిల్లల చదువులకు అవరోధాలు కలగకుండా విద్యాశాఖ మంత్రి చర్యలు తీసుకుంటారన్నారు.
సీఎం డిజాస్టర్ రిలీఫ్ ఫండ్‌కు సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు సహా చాలామంది నుంచి విరాళాలు వస్తున్నాయని సీఎం తెలిపారు.


ఫొటో సోర్స్, Rahul Gandhi
రాహుల్ గాంధీ 100, కర్ణాటక ప్రభుత్వం మరో 100
కొండచరియల ప్రమాదంతో ఆశ్రయం కోల్పోయినవారి కోసం కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ 100 ఇళ్లు నిర్మించి ఇస్తానన్నారని కేరళ ప్రతిపక్ష నేత వీడీ సతీషన్ చెప్పారు. అందులో 25 ఇళ్ల నిర్మాణానికి తానే ఇన్‌ఛార్జిగా పనిచేస్తానని తెలిపారు.
మరో 100 ఇళ్లను తమ ప్రభుత్వం కట్టించి ఇస్తుందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రకటించారు. అందుకు స్పందించిన కేరళ సీఎం విజయన్, కర్ణాటక ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
అంతకుముందు వయనాడ్ కొండ చరియలు విరిగిపడిన ఘటనలో చనిపోయినవారి కుటుంబాలకు పీఎం ఎన్‌ఆర్‌ఎఫ్ కింద రూ.2 లక్షలు పరిహారం చెల్లించనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. గాయపడినవారికి రూ.50 వేలు అందించనున్నట్లు తెలిపింది.

‘100 కుటుంబాలకు ఇంటి స్థలం ఇస్తా’
భయంకరమైన విషాదాన్ని మిగిల్చిన ఈ ప్రకృతి విధ్వంసంలో బతికి బయటపడ్డవారిలో చాలా మందికి ఇప్పుడు నిలువ నీడ లేదు.
పునరావాస శిబిరాల్లో ఉంటున్న ఎందరో బాధితుల సొంత ఇళ్లు, అవి ఉండే స్థలాలు నామరూపాలు లేకుండా పోయాయి.
ఇలాంటి బాధితుల్లో వంద కుటుంబాలకు ఇంటి స్థలం దానం చేసేందుకు ముందుకు వచ్చారు బాబీ చెమ్మన్నూరు అనే వ్యాపారవేత్త.
వయనాడ్ బాధితులకు పెద్దయెత్తున దాతలు తమకు తోచిన సాయం అందించేందుకు ముందుకొస్తున్నారు.
బట్టలు, భోజనం వంటివి అందరూ పెడుతున్నారని, కానీ వారు జీవితకాలం కష్టపడి సంపాదించుకున్న ఇళ్ళు పోయాయి కాబట్టి తాను ఇంటి స్థలం ఉచితంగా ఇవ్వాలనుకుంటున్నట్లు బీబీసీతో చెప్పారు బాబీ చెమ్మన్నూరు.

‘‘అందరూ సహాయం చేస్తున్నారు. భోజనాలు అవీ పెడుతున్నారు. కానీ ఇప్పుడు బాధితులంతా అడిగేది ఒకటే.. మేం ఎక్కడికి పోవాలి ఇప్పుడు? మాకు ఇల్లులేదు, ఇప్పుడు మేం ఎక్కడికి పోవాలి? జీవిత కాలం సంపాదించినదంతా పెట్టి కట్టుకున్న ఇళ్లు తుడిచిపెట్టుకుపోయాయి అంటున్నారు.
అందుకే బోచే ఫాన్స్ చారిటబుల్ ట్రస్ట్ కింద మేం వంద కుటుంబాలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని నిర్ణయించాం. అంతేకాదు మిగిలిన దాతల సహాయంతో వారికి ఇళ్ళు కట్టించే ప్రయత్నం కూడా చేస్తాం. ముందుగా ప్రభుత్వం నుంచి బాధితుల జాబితా తీసుకుని, అర్హులైన వారికే సాయం అందే ఏర్పాటు చేస్తాం’’ అని బాబీ చెమ్మన్నూరు చెప్పారు.
భూమి దానం గురించి ఆయన ఇప్పటికే ప్రభుత్వ అధికారులను సంప్రదించారు. దానికి ప్రభుత్వం కూడా సమ్మతించడంతో, సహాయ కార్యక్రమాలు ముగిసిన వెంటనే ఆ పనులు మొదలుపెడతామని చెప్పారు.
బాధితులకు ఇంటి స్థలం కోసం దానంగా ఇవ్వనున్న భూములను ఆయన చూపించారు.
బంగారం వ్యాపారం చేసే కుటుంబం నుంచి వచ్చిన బాబీ చెమ్మన్నూరుకి చెమ్మన్నూర్ జువెలర్స్ షోరూమ్‌లతో పాటు వెయ్యి ఎకరాల టీ ఎస్టేట్ ఉంది.
బాధితులకు ఇళ్ల స్థలాల కోసం 10 నుంచి 15 ఎకరాల వరకూ అవసరం పడొచ్చనీ, అవసరమైతే అంతకంటే ఎక్కువ భూమినైనా ఇస్తానని, గతంలో కూడా తాను భూమిని దానం చేసినట్లు బీబీసీతో చెప్పారు.
స్థానికులు చెప్పిన దాని ప్రకారం.. ఆయన గతంలో గల్ఫ్ జైళ్లలో చిక్కుకున్న వాళ్లను విడిపించడంతోపాటు విపత్తుల సమయంలో భారీగా సహాయ కార్యక్రమాలు వంటివి చేస్తుంటారు.

ఫొటో సోర్స్, X/Mohanlal
రూ.3 కోట్ల విరాళం ప్రకటించిన మోహన్‌లాల్
వయనాడ్ బాధితులకు సినీ నటుడు మోహన్‌లాల్ ముందుకొచ్చారు. విశ్వశాంతి ఫౌండేషన్ ద్వారా రూ.3 కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఆయనే.
విపత్తు ప్రభావిత ప్రాంతాన్ని మోహన్‌లాల్ పరిశీలించారు. టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న ఆయన సైనిక దుస్తుల్లో వచ్చారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
అల్లు అర్జున్ విరాళం
తెలుగు నటుడు అల్లు అర్జున్ కూడా స్పందించారు. వయనాడ్ కొండచరియల బాధితులకు సాయంగా కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు 25 లక్షల రూపాయలు విరాళంగా ఇస్తున్నట్లు ‘ఎక్స్’ (ట్విటర్)లో తెలిపారు.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















