వయనాడ్‌లో ఇంత భారీగా కొండచరియలు విరిగిపడటానికి కారణమేంటి? ఈ ప్రాంతంపై కేరళ, కర్ణాటక చెబుతున్నదేమిటి?

ఫొటో సోర్స్, Getty Images
జులై 30.. అర్ధరాత్రి.. కేరళలోని వయనాడ్ జిల్లా ముండక్కె గ్రామంలో భారీ శబ్దానికి సేల్స్‌మెన్ అజయ్‌ఘోష్ ఉలిక్కిపడి లేచారు.
ఆ భారీ శబ్దం ఏమిటనేది వారికి కొంతసేపు అర్థం కాలేదు. కాసేపటి తరువాత భారీవర్షంతోపాటు పెద్ద ఎత్తున బురద ప్రవాహం మొదలైంది.
వయనాడ్ జిల్లాలోని ముండక్కె, చూరల్మలైతోపాటు నిలంబుర్ మలప్పురం జిల్లాలోని నీలాంబుర్ అటవీప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో 308 మంది మృతి చనిపోయారు. ఇంకా కొందరి ఆచూకీ తెలియాల్సి ఉంది.
అర్ధరాత్రి 2 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల మధ్యన రెండుసార్లు కొండచరియలు భారీగా విరిగిపడ్డాయి. ఇవి ఏ స్థాయిలో పడ్డాయంటే 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న మల్లప్పురం జిల్లాలోని అటవీప్రాంతం కూడా దీని ప్రభావానికి లోనైంది.
ఈ ప్రాంతాలన్నింటినీ సున్నిత పర్యావరణ ప్రాంతాలుగా మాధవ్ గాడ్గిల్ నివేదికలో పేర్కొన్నారు. ఆ నివేదిక పశ్చిమ కనుమల పర్యావరణానికి సంబంధించినది.
అత్యంత సున్నితమైనవి, తక్కువ సున్నితనమైనవి, అంతగా సున్నితం కాని ప్రాంతాల సమాచారాన్ని ఆ నివేదిక తెలియజేస్తుంది.
ఈ నివేదికను అన్ని రాజకీయ పక్షాలు, కేరళ, కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
ఇటీవలి కాలంలో ఈ ప్రాంతాలలో మొక్కల పెంపకమే కాకుండా మరికొన్ని ఇతర కార్యకలాపాలకు కూడా కేరళ ప్రభుత్వం అనుమతిచ్చింది.


ఫొటో సోర్స్, Getty Images
సహాయక శిబిరాలలో బాధితులు
వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ప్రమాదంలో బాధితులుగా మారిన వందల మంది ప్రజలను సహాయక శిబిరాలకు తరలిస్తున్నారు. ఈ సహాయక శిబిరాలను చూరల్మలై టీ తోటలు, ముందక్కెలోని యాలకుల తోటల పరిసరాలలో ఏర్పాటు చేశారు.
ముండక్కెకు చెందిన సేల్స్‌మెన్ అజయ్‌ఘోష్ బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘పెద్ద శబ్దం విని నిద్రలేచాం. ఎక్కడ చూసినా భారీగా బురద ప్రవహిస్తోందని గ్రహించాం. కొండచరియలు తీవ్ర ప్రభావం చూపిన ప్రాంతానికి నేను కేవలం అరకిలోమీటరు దూరంలోనే ఉన్నాను’’ అని చెప్పారు.
తీవ్రంగా కలతచెందినట్టు కనపడుతున్న ఘోష్ మాట్లాడుతూ.. కొండచరియల ప్రమాదంలో తమ కుటుంబ సభ్యులకు ఏమీ కాలేదని, కానీ తమ ఇంటికి సమీపంలో 40 మంది మరణించారని చెప్పారు.
అనేకమంది మృతి చెందిన ప్రాంతానికి ఈ ప్రదేశం అరకిలోమీటరు కంటే తక్కువ దూరంలోనే ఉంది.
ముండక్కె ఓ చిన్న ఊరు. ఇక్కడ తేయాకు తోటలు ఉంటాయి. పశ్చిమ బెంగాల్, అస్సాం నుంచి ఇక్కడి టీ తోటల్లో పనిచేయడానికి కార్మికులు వస్తుంటారు.
కొండచరియలు విరిగిపడి చూరల్మలై, ముండక్కె మధ్య వంతెన ధ్వంసం కావడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది.
ఇక హోంమంత్రి అమిత్ షా బుధవారం నాడు రాజ్యసభలో మాట్లాడుతూ.. ఈ ముప్పు గురించి చాలా ముందుగా జులై 23నే కేరళ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశామని చెప్పారు.
అయితే, కేంద్ర ప్రభుత్వం పంపిన సమాచారం వయనాడ్‌లో విధ్వంసం జరిగిన కొన్ని గంటల తరువాత తమకు చేరిందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు.
మరింత మెరుగైన వ్యవస్థ ఉండి ఉంటే, ప్రజలు ఇలా చనిపోకుండా ఉండేవారని ప్రతిపక్షాలకు చెందిన ఎంపీలు ఆరోపించారు.

ఫొటో సోర్స్, Getty Images
51 సార్లు విరిగిపడ్డ కొండచరియలు
వయనాడ్ జిల్లాలోని ఈ కొండప్రాంతంలో కొండచరియలు విరిగిపడటం మామూలే. ఇందుకు సంబంధించిన సమాచారం గాడ్గిల్ నివేదికలో కూడా ఉంది.
చూరల్మలై ముండక్కెకు 10 కిలోమీటర్ల దూరంలోని ప్రాంతంలో 2019లో 17 మంది మరణించారు.
రాతి తవ్వకాలే కొండచరియలు విరిగిపడటానికి కారణమని కేరళ ఫారెస్ట్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (కేఎఫ్‌ఆర్ఐ) పేర్కొంది.
2018, 2019 సంవత్సరాలలో 51సార్లు కొండచరియలు విరిగిపడ్డాయి. ఆ సమయంలో పుతుమాల, నిలాంబర్‌లో 34 సెంటిమీటర్ల వర్షం కురిసింది.
కొచ్చి యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలోని అడ్వాన్స్ డ్ సెంటర్ ఫర్ అట్మాస్ఫియరిక్ రాడార్ రీసెర్చ్ డైరక్టర్ అభిలాష్ ఎస్. బీబీసీతో మాట్లాడుతూ.. ‘గత రెండువారాలుగా కురిసిన భారీ వర్షాల తరువాత, ఈ మంగళవారం మరోసారి అత్యంత భారీ వర్షం కురిసింది. దానిని మీరు ప్రధాన కారణంగా పరిగణించక్కరలేదు కానీ, కచ్చితంగా అదో పెద్ద కారణమే’’ అని చెప్పారు.

పర్యాటకం పెరిగింది
కేరళ అటవీ పరిశోధనా సంస్థ (కేఎప్ఆర్ఐ) శాస్త్రవేత్త డాక్టర్ టీవీ సంజీవ్ మ్యాప్‌ల సహాయంతో చూరల్మలై నుంచి 4.65 కిలోమీటర్లు, ముందక్కె నుంచి 5.9 కిలోమీటర్ల దూరంలో మైనింగ్ జరుగుతోందని చెప్పారు.
‘‘గనులలో పేలుళ్ళు ప్రకంపనలు పుట్టిస్తాయి. దాని ప్రభావం గ్రానైట్ ద్వారా చాలా దూరం వ్యాపిస్తుంది. ఈ మొత్తం ప్రాంతం చాలా పెళుసైనది. ఈ ప్రాంతంలో సాధారణంగా కనిపించేది వృక్షసంపద. అంటే చెట్లు, మొక్కలు’’ అని తెలిపారు.
‘‘తోటల పెంపకానికి అనుమతించిన ప్రాంతాలలో కొంత భాగాన్ని ఇతర కార్యకలాపాలకు వినియోగించవచ్చని ఇటీవల ఓ కొత్త చట్టం తీసుకువచ్చారు. దీని ఫలితంగా ప్లాంటేషన్ యజమానులు పర్యాటక రంగంవైపు దృష్టి సారించారు. తదనుగుణంగా ఇక్కడ పెద్ద భవంతులు కట్టడం మొదలుపెట్టారు. ఇందుకోసం నేలను చదును చేయాల్సి ఉంటుంది’’ అని చెప్పారు.
నాలుగేళ్ల కిందట వయనాడ్‌లో 20కు పైగా పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని, వాటిని 25,000 మంది విదేశీ పర్యాటకులు, 1,00,000 మంది స్వదేశీ పర్యాటకులు వస్తుంటారని నాలుగేళ్ళ కిందట ఆ సంస్థ తమ నివేదికలలో ఒకదానిలో పేర్కొంది.
‘‘సున్నితమైన భూభాగాలను ఎలా చూడాలనే విషయాన్ని పేర్కొన్న గాడ్గిల్ నివేదికను తిరగేయడం మాకు చాలా ముఖ్యం. ఆ నివేదికలో అత్యంత సున్నితమైన ప్రాంతాలు, సాధారణ సున్నితమైన ప్రాంతాలు, తక్కువ సున్నితమైన ప్రాంతాల గురించి తెలిపారు. కానీ మొత్తం రాజకీయ పక్షాలన్నీ వీటిని వ్యతిరేకించడం విషాదం’’ అని డాక్టర్ సంజీవ్ చెప్పారు.
‘‘ఇక్కడి భూమి చాలా బలహీనంగా ఉండటం వల్ల ఈ సమస్య ముందుముందు మరింత పెరుగుతుంది. ఇక్కడ లోతైన లోయలు ఉన్నాయి. భారీవర్షాలను తట్టుకోలేనంత పెళుసుగా ఇక్కడి భూమి మారింది. దీనిని పరిష్కరించుకోవాలంటే అసలు మన పర్యావరణ వ్యవస్థ నిజంగా ఆరోగ్యకరంగా ఉందో లేదో నిర్థరించుకోవాలి. ఒకవేళ ఆరోగ్యంగా ఉంటే.. అప్పుడు ఎటువంటి వాతావరణ మార్పులైనా ఎదుర్కోగలదు’’ అని తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
కొండ ప్రాంతాలే ఎక్కువ
డాక్టర్ సంజీవ్ 2017లో ఓ అకడమిక్ పేపర్ కోసం గ్రానైట్ క్వారీలను గుర్తించారు. రెండేళ్ళ తరువాత కొండచరియలు విరిగిపడే ప్రాంతాలను కూడా గుర్తించారు.
కొండచరియలు విరిగిపడే 31 ప్రాంతాలను మాధవ్ గాడ్గిల్ బృందం, అదేవిధంగా డాక్టర్ కస్తూరి రంగన్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి వర్కింగ్ గ్రూప్ కూడా గుర్తించింది.
పశ్చిమ కనుమల కిందకు వచ్చే వయనాడ్ ఓ కొండ ప్రాంతం.
ఇక్కడ అనేక తెగలు కనిపిస్తాయి.
కర్ణాటకలోని కొడుగు, మైసూరు జిల్లాలు వయనాడ్‌కు ఉత్తరాన సరిహద్దుగా ఉన్నాయి. ఈశాన్యాన తమిళనాడు హద్దుగా ఉంది.
దక్షిణాన మలప్పురం, నైరుతి దిశలో కోజికోడ్, వాయవ్యంలో కన్నూరు ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
పశ్చిమ కనుమలు ఏ రాష్ట్రంలో ఎంతెంత...
- గుజరాత్‌లో 449 చదరపు కిలోమీటర్లు
- మహారాష్ట్రలో 17,348 చదరపు కిలోమీటర్లు
- గోవాలో 1,461 చదరపు కిలోమీటర్లు
- కర్ణాటకలో 20,668 చదరపు కిలోమీటర్లు
- తమిళనాడులో 6,914 చదరపు కిలోమీటర్లు
- కేరళలో 9,993 చదరపు కిలోమీటర్లు
మొత్తం 56 వేల 825 చదరపు కిలోమీటర్ల మేర పశ్చిమ కనుమలు వ్యాపించి ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
13 ఏళ్ళ నిరీక్షణ
పర్యావరణం పరంగా పశ్చిమ కనుమలు సున్నితమైన ప్రాంతాలుగా గాడ్గిల్ నివేదిక పేర్కొని 13 ఏళ్ళు గడిచాయి.
ఈ విషయం తెలుసుకున్న తరువాత ప్రాణాంతక మానవ కార్యకలాపాలను ఆపేయాల్సిన అవసరం ఉంది.
కేంద్రప్రభుత్వం 2014 మార్చి నుంచి ఐదు ముసాయిదా నోటిఫికెషన్లు జారీచేసింది.కానీ ఇంకా తుది నోఫికేషన్ జారీ కాలేదు.
దీనికి ప్రధాన కారణం పొరుగు రాష్టాలైన కేరళ, కర్ణాటక రాష్ట్రాల వ్యతిరేకత. ఇది ప్రజల జీవనోపాధిని ప్రభావితం చేస్తుందనే కారణంతో ముసాయిదా నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకోవాలని కర్ణాటక కోరుతోంది.
ఈ విషయంలో ఉదాసీనత కారణంగా చెట్ల నరికివేత, మైనింగ్, భవనాల నిర్మాణం వంటి పర్యావరణానికి హాని కలిగించే మానవ కార్యకలాపాలు పెరిగాయి.
దీంతో భూమి కుంగిపోయి కొండలు అస్థిరంగా మారడానికి కారణమైంది. కొండచరియలు విరిగిపడటానికి ఇదే ప్రధాన కారణమని డాక్టర్ సంజీవ్ నమ్ముతున్నారు
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















