లిఫ్టులో 42 గంటలపాటు ఇరుక్కు పోయిన వ్యక్తి, చివరకు ఎలా బయటపడ్డారంటే...

ఫొటో సోర్స్, MUZAFAR AV
- రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
మీరు ఎలివేటర్(లిఫ్ట్)లో ఇరుక్కుపోతే, అది కూడా ఏకంగా 42 గంటలు అందులోనే ఉండాల్సి వస్తే ఎలా ఉంటుంది? 59 ఏళ్ల రవీంద్రన్ నాయర్‌కు సరిగ్గా అదే జరిగింది.
గత శనివారం మధ్యాహ్నం నుంచి సోమవారం ఉదయం వరకు రవీంద్రన్ లిఫ్ట్‌లోనే ఇరుక్కుపోయారు.
రవీంద్రన్ నాయర్ కేరళలోని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) ఉల్లూరు ఇన్‌చార్జి. లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన రవీంద్రన్ అసలు ఏం జరిగిందో బీబీసీకి వివరించారు.
ఆయనేం చెప్పారో ఆయన మాటల్లోనే...
‘‘నాలుగు నెలల కిందట బాత్‌రూమ్‌లో పడిపోయినప్పటి నుంచి నాకు వెన్నునొప్పి ఉంది. దీని కోసం నేను, నా భార్య శ్రీలేఖ తిరువనంతపురం మెడికల్ కాలేజ్ హాస్పిటల్ రెండవ అంతస్తులో ఉన్న ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్‌ని కలుస్తున్నాం. నా భార్య అదే ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తోంది.
నా భార్య పది గంటలకు ఆఫీసుకు వెళ్ళాల్సి ఉన్నందున గత శనివారం మేం ఆ సమయానికి ఆసుపత్రికి చేరుకున్నాం. పోయిన వారం మేం కొల్లం వెళ్ళడం వల్ల నొప్పి ఎక్కువ కావడంతో నేను నా వీపును ఎక్స్ రే తీయించుకోవడానికి వెళ్ళాను.
ఎక్స్ రే చూసిన డాక్టర్ రక్తపరీక్ష రిపోర్టు కూడా చూపించమని అడిగారు. దాన్ని ఇంట్లోనే మర్చిపోయి వచ్చానని నా భార్య చెప్పింది. దీంతో నేను తిరిగి ఇంటికెళ్లి రిపోర్టు తెచ్చాను.
నా భార్య ఆసుపత్రిలోనే ఉద్యోగం చేస్తోంది కాబట్టి, రిపోర్ట్ తీసుకొచ్చాక స్టాఫ్ లిఫ్ట్‌ను ఉపయోగించుకోవాలనుకున్నాను.


ఫొటో సోర్స్, MUZAFAR AV
' బతకనని అనుకున్నా'
మధ్యాహ్నం 12:05కు లిఫ్ట్ నంబర్ 11లో ఎక్కిన తర్వాత, దానిలో అటెండర్ లేడని గుర్తించాను. సెకండ్ ఫ్లోర్‌కు వెళ్లడానికి బటన్ నొక్కాను.
లిఫ్ట్ రెండో అంతస్తు సమీపంలోకి చేరుకుని, పెద్ద చప్పుడుతో రెండు అంతస్తుల మధ్య ఆగిపోయింది. లిఫ్ట్‌లో ఉండే ఎమర్జెన్సీ నంబర్‌కి డయల్ చేసాను. అలారం మోగుతోంది, కానీ స్పందన లేదు.
సాయం కోసం నా భార్యతో సహా చాలామందికి కాల్ చేయడానికి ప్రయత్నించాను. కానీ నెట్‌వర్క్ సమస్య వల్ల అది కుదరలేదు.
దీంతో నాలో భయం పెరిగిపోయింది. నేను పెద్ద శబ్దంతో లిఫ్ట్‌ను గట్టిగా కొట్టడం ప్రారంభించాను. ఆ చీకట్లో నా ఫోన్ ఎక్కడో పడిపోయింది. అప్పటి నుంచి అదీ పని చేయడం మానేసింది.
నేను అరుస్తూ తలుపు తెరవడానికి ప్రయత్నించాను. భయపడి, లిఫ్ట్‌లో ఇటు అటు తిరగడం మొదలుపెట్టాను.
లిఫ్ట్‌లో వెలుతురు లేకున్నా, ఊపిరి ఆడడానికి మాత్రం కొన్ని రంధ్రాలు ఉన్నాయి.
ఎవరైనా నా అరుపులు విని సాయం చేస్తారనే ఆశతో నేను మళ్లీ మళ్లీ అలారం బెల్ మోగించాను.
అలా చాలా గంటలు గడిచాయి. అది రాత్రో పగలో నాకు అర్థం కాలేదు.
లోపల పూర్తిగా చీకటిగా ఉండడంతో, నేను చాలాసేపు అరిచి అరిచి అలసిపోయి నిద్రపోయాను.
ఇక నేను బతకనని భావించాను. నా భార్య పిల్లల గురించి ఆలోచించడం ప్రారంభించాను. మా అమ్మానాన్నలు, పూర్వీకుల గురించి కూడా ఆలోచించాను.
కానీ మెల్లమెల్లగా నాకు నేను ధైర్యం చెప్పుకుని, ఇతర విషయాలపై దృష్టిపెట్టి, అక్కడి నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచించాను.
నా జేబులో బ్లడ్ ప్రెషర్ మాత్రలు ఒకటో రెండో ఉన్నాయి. కానీ నీళ్లు లేకపోవడంతో వాటిని వేసుకోలేకపోయాను.
లిఫ్ట్ రిపేర్ చేయడానికి ఎవరో ఒకరు వస్తారని నా ఆశ.
లిఫ్ట్‌లో చిక్కుకుపోయిన దాదాపు 42 గంటలు గడిచిపోయాక సోమవారం ఉదయం 6 గంటల సమయంలో లిఫ్ట్ ఆపరేటర్ తలుపు తెరిచి, నన్ను కిందికి దూకమని అడిగాడు. నేను అప్పటికి బాగా అలసిపోయి, లిఫ్టులో పడుకుని ఉన్నాను.

ఫొటో సోర్స్, RAVINDRA'S FAMILY
‘మిస్సింగ్ కేసు పెట్టాం’
రవీంద్రన్ భార్య శ్రీలేఖ బీబీసీతో మాట్లాడుతూ, “నాకు ఏదో గుర్తు తెలియని నంబర్ నుంచి కాల్ వచ్చింది. అవతల రవీంద్రన్ ఉన్నారు. తాను లిఫ్ట్‌లో ఇరుక్కుపోయానని, వచ్చి ఇంటికి తీసుకెళ్లాలని అడిగారు.’’ అని వివరించారు.
అయితే, అప్పటికే శ్రీలేఖ, ఆమె ఇద్దరు కుమారులు రవీంద్రన్ తప్పిపోయాడని రిపోర్ట్ ఇచ్చారు. ఎందుకంటే వాళ్లు ఆయనకు కాల్ చేస్తుంటే, ఆయన ఫోన్ నెట్‌వర్క్ పరిధిలో లేదని వాళ్ళకు సమాధానం వస్తోంది.
రవీంద్రన్ కుమారుడు హరిశంకర్ మాట్లాడుతూ “చాలాసార్లు ఆయన ఆసుపత్రి నుంచి నేరుగా తన పనికి వెళ్లేవాడు. అందుకే మేం ఆదివారం ఉదయం వరకు వేచి ఉన్నాం. ఫోన్ పని చేయకపోవడంతో జీపీఎస్ సహాయంతో ఆయన ఎక్కడ ఉన్నాడో పోలీసులు కనిపెట్టలేకపోయారు.’’ అని చెప్పారు.
రవీంద్రన్ పరిస్థితి ఎలా ఉందన్న ప్రశ్నకు ఆయన భార్య శ్రీలేఖ “ఆయన ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు. కానీ జరిగిన సంఘటనపై ఆయన చాలా ఆగ్రహంగా ఉన్నారు. ‘ఇదే సంఘటన ఏ హృద్రోగికో, గర్భిణికో జరిగితే ఎలా ఉండేది’ అని ఆయన ప్రశ్నిస్తున్నారు.’’ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
'బాధ్యులపై కఠిన చర్యలు’
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రవీంద్రన్ నాయర్‌ను కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ మంగళవారం కలిశారు.
ఈ ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేస్తూ, దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. దీనికి సంబంధించి ముగ్గురు లిఫ్ట్ టెక్నీషియన్లను సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించింది.
ఈ ఘటనపై ఆసుపత్రి అధికారులు, ఆరోగ్య మంత్రి తనకు క్షమాపణలు చెప్పారని శ్రీలేఖ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
నియమాలు ఏం చెబుతున్నాయి?
ప్రతి రాష్ట్రంలో చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్ కింద పనిచేసే లిఫ్ట్ ఇన్‌స్పెక్టర్ ఉంటారు.
కేరళ లిఫ్ట్, ఎస్కలేటర్ చట్టం 2013 ప్రకారం, ఆ ఇన్‌స్పెక్టరే లిఫ్ట్‌లకు లైసెన్స్ ఇస్తారు.
అన్ని తనిఖీలు చేసాకే ఒక భవనంలో లిఫ్ట్ లేదా ఎస్కలేటర్ ఏర్పాటుకు ఇన్‌స్పెక్టర్లు లైసెన్స్ జారీ చేస్తారు. లిఫ్ట్‌లు లేదా ఎస్కలేటర్‌ల ఏర్పాటు, మరమ్మతులను సమర్థులైన వ్యక్తులకు అప్పగించాలి.
వార్షిక తనిఖీ, నిర్ణీత రుసుము చెల్లించిన తర్వాత లైసెన్స్‌ను పునరుద్ధరిస్తారు. చట్టంలోని నిబంధనలను ఉల్లంఘిస్తే, రూ.1,000 జరిమానా విధిస్తారు.
పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఒక రిటైర్డ్ పోలీసు అధికారి బీబీసీతో మాట్లాడుతూ, లిఫ్టుల పర్యవేక్షణకు చాలా తక్కువ మంది అధికారులు ఉండడంతో ప్రతి భవనాన్ని సందర్శించి, లిఫ్ట్‌లను పరిశీలించే అవకాశం లేదని అన్నారు.
"నేను ఇటీవల ఓ నాలుగు అంతస్తుల భవనంలోని మూడవ అంతస్తులో నివసిస్తున్న వారిని కలవడానికి వెళ్ళాను. లిఫ్ట్ అకస్మాత్తుగా రెండు, మూడు అంతస్తుల మధ్య ఆగిపోయింది. ఆ ఇరుకైన లిఫ్ట్‌లో ఇద్దరు మహిళలు ఉన్నారు. వాళ్లలో ఒకరు వెంటనే కుప్పకూలిపోగా, మరొకరు వాంతులు చేసుకోవడం ప్రారంభించారు. ఇద్దరూ షాక్‌కి గురయ్యారు.’’ అని వెల్లడించారు.
ఆ అధికారి అనుభవం ఒక ఉదాహరణ మాత్రమే. దాని నుంచి రవీంద్రన్ నాయర్ అనుభవం ఎలా ఉందో ఊహించుకోవచ్చు.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














