ఎ జర్నీ టు కాశీ: జీవితపు లోతులను తడిమే అద్వైతం

ఎ జర్నీ టు కాశీ

ఫొటో సోర్స్, katalyn_gowda/insta

    • రచయిత, ల.లి.త.
    • హోదా, బీబీసీ కోసం

దర్శకుడు మునికృష్ణ తీసిన ‘ఎ జర్నీ టు కాశీ’ సినిమా విభిన్నమైనది. తెలుగు సినిమాలో ఇలాంటి సబ్జెక్ట్, లోతైన ఆలోచనతో కూడిన నిరాడంబరమైన చిత్రీకరణ విధానం అరుదుగా కనిపిస్తాయి. ఇంతకీ ఈ సినిమా కథేంటి? ఎలా ఉంది? ఈ రివ్యూలో చూద్దాం.

కథేంటి?

కాశీ యాత్ర అనగానే ఆధ్యాత్మిక సినిమా కావొచ్చని కొందరు అనుకుంటారు. ఆ ప్రస్తావన ఉంటుంది. కానీ దానితో పాటు సెక్స్‌వర్కర్‌గా మారిన యువతి జీవితానుభవాలను ఈ సినిమా చూపిస్తుంది.

శ్వేత అనే సెక్స్‌వర్కర్‌, అద్వైత సిద్ధాంతం గురించి అధ్యయనం చేస్తున్న జాక్ వెబర్ అనే పాశ్చాత్యుడు, బియ్యం మిల్లులో గుమాస్తాగా పనిచేసే శివానంద....ఈ మూడు పాత్రల చుట్టూ ప్రధానంగా ఈ సినిమా తిరుగుతుంది. ఈ పాత్రల చుట్టు జరిగే సంఘటనలే ఈ సినిమా.

బీబీసీ వాట్సాప్ చానల్
ఎ జర్నీ టు కాశీ

ఫొటో సోర్స్, Sri Balaji Music/Screen grab

ఫొటో క్యాప్షన్, ఎ జర్నీ టు కాశీ సినిమాలో ఓ దృశ్యం

సినిమా ఎలా ఉంది?

హిందూమతంపై ఆసక్తితో అద్వైతాన్ని బోధించే గురువు అన్వేషణలో జాక్ చేసే కాశీయాత్ర, డబ్బు కోసం అతనికి తోడుగా ఉంటూ జీవిత పుటలను తిరగేస్తూ శ్వేత చేసే కాశీ యాత్ర, కాశీలో శివానంద మొదలెట్టిన ఆధ్యాత్మిక యాత్ర…ఈ మూడూ చివరకు ఏ పాయింట్ దగ్గర కలుసుకుంటాయో, విడిపోతాయో ఈ సినిమాలో మనం చూడొచ్చు.

ఈ సినిమాకు అంతస్సూత్రంగా ఉండే అద్వైత ఫిలాసఫీ గురించి చివరకు చెబుతారు. ఇది ఒకరికి వెదుకులాట అయితే, మరొకరికి జీవితాన్ని పణంగా పెట్టి నేర్చుకున్న పాఠం. ఇంకొకరికి జీవితాన్ని ఒక కుదుపు కుదిపి పాతాళానికి నెట్టేసిన పనికిరాని వేదాంతం.

ఎ జర్నీ టు కాశీ

ఫొటో సోర్స్, Sri Balaji Music/Screen grab

ఎవరెలా నటించారు?

కాశీ యాత్ర సినిమాలో నటీ నటులందరూ బాగా చేశారు. శ్వేతగా కేటిలిన్ గౌడ, శివానందగా చైతన్య రావు, జాక్‌గా అలెగ్జాండర్ సాల్నికోవ్, యశోదగా ప్రియా పాలువాయి ఈ సినిమాకు సగం బలం.

మునికృష్ణ స్క్రిప్ట్, మాటలు మరో సగం బలం. సినిమా అంతటా చిత్తూరు జిల్లా మాండలికం సొగసులు జాలువారే మాటలు వినిపిస్తాయి.

పల్లెటూరిలోని పాత ఇల్లు దిగువ మధ్యతరగతి సగటు జీవితానికి ప్రాచీన ఆధారంగా నిలుస్తే, మహా స్మశానంగా మంటలు ఆరని మణికర్ణికా ఘాట్, నిత్య చలనశీలమైన కాశీనగరం, ఆ మధ్యలో భాంగ్ పీల్చే సన్యాసులు ఒక కుటుంబం అల్లకల్లోలమైపోవడానికి ప్రత్యక్ష సాక్షులుగా నిలుస్తారు.

సంగీతాన్ని అందించిన ఫణి కళ్యాణ్‌కు ఇలాంటి సబ్జెక్ట్‌కు ఎలాంటి సంగీతం కావాలో తెలుసు. సౌండ్ డిజైన్ చేసిన సైందబ్ ముఖర్జీకి క్రెడిట్ ఇవ్వాలి. వీళ్ళిద్దరూ సంగీతం‌తో సినిమాకు కావలసిన సరైన మూడ్ సమకూర్చారు.

కానీ కొన్నిచోట్ల అనవసరమైన నేపథ్య సంగీతం కాస్త విసిగిస్తుంది. లోబడ్జెట్ సినిమాకి ఉండే ఎన్నో పరిమితుల గురించి ఆలోచిస్తే కాశీ యాత్ర సినిమాటోగ్రఫీ గురించి, ఎడిటింగ్ గురించి తక్కువే మాట్లాడగలం.

చివరి సన్నివేశం హడావుడిగా ముగించినట్టుగా అనిపిస్తుంది. సినిమాలో కొన్ని లోపాలున్నా దర్శకుడు మునికృష్ణ ప్రయత్నం మాత్రం మెచ్చుకోదగ్గదే.

(గమనిక - అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం. ఈ చిత్రం ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో ఉంది)