స్కైవాకర్స్-ఎ లవ్ స్టోరీ: మృత్యువును ఎదిరించే ఈ జంట విన్యాసాలు చూస్తేనే ఒళ్లు జలదరిస్తుంది....

ఫొటో సోర్స్, Netflix
- రచయిత, ఎమ్మా జోన్స్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఒక యువ జంట ఉదయాన సూర్యకాంతిలో ఒకరి ఎదురుగా ఒకరు నిలుచుని ఉన్నారు. ఆ యువకుడు యువతిని పైకెత్తడానికి కదిలారు. కానీ ఆమె సంకోచించారు.
డర్టీ డ్యాన్సింగ్ చిత్రంలో మాదిరి, ఒక ఫేమస్ భంగిమలో ఆ యువకుడు ఆమెను తన తలపైకి ఎత్తుకుని, ‘భయపడొద్దు, నేనున్నాను’ అంటూ ఆమెకు భరోసా ఇచ్చారు.
ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన డాక్యుమెంటరీ ‘స్కైవాకర్స్: ఎ లవ్ స్టోరీ’లోని దృశ్యాలివి. 678.9 మీటర్ల ఎత్తయిన టవర్ పైభాగంలో, కేవలం 1.8మీ వెడల్పు ఉన్న పలక మీద వీరిద్దరూ ఇలా విన్యాసాలు చేస్తుంటే వీక్షకులు ఊపిరి బిగబట్టుకుంటారు.
ఈ డాక్యుమెంటరీలో ఈ రష్యన్ ‘రూఫ్‌టాపర్స్’ (సేఫ్టీ పరికరాలు లేకుండా పెద్ద పెద్ద భవనాలు, నిర్మాణాలను అధిరోహించే వాళ్లు) జంట చేసే సాహసాలు ప్రేక్షకులను వాళ్లతో లీనమయ్యేలా చేస్తున్నాయి.
ఏంజెలా నికొలాయ్, ఇవాన్ బీర్కస్‌లు మలేషియాలో ఉన్న ప్రపంచంలోనే రెండో అతి ఎత్తయిన టవర్‌ను అధిరోహించారు.వాస్తవానికి దానిని అలా అధిరోహించడం చట్టవిరుద్ధం.
డిసెంబర్ 2022లో మెర్డెకా 118 అనే టవర్ పైకి ఎక్కాక వీరిద్దరూ మరింత ఫేమస్ అయ్యారు.


ఫొటో సోర్స్, Netflix
ఇది ఒక కళ అంటున్న సాహసికులు
‘స్కైవాకర్స్’ డాక్యుమెంటరీ ఆకాశహర్మ్యాలను అధిరోహించే వీరిద్దరి సాహసానికి సంబంధించినది. కానీ మధ్యమధ్యలో వీళ్లిద్దరూ కళాత్మకమైన దృశ్యాలను ప్రదర్శిస్తూ, రిస్కులంటే తమకున్న పిచ్చిని ప్రదర్శిస్తారు.
అందుకే ‘ఎక్స్‌ట్రీమ్ సినిమాటోగ్రఫీ’ అంటూ డాక్యుమెంటరీలో వీరికి క్రెడిట్ ఇచ్చారు. అందులోని డ్రోన్ ఫుటేజ్‌లో ఎక్కువ భాగం వీరిదే.
అమెరికాకు చెందిన జెఫ్ జింబాలిస్ట్, రష్యాకు చెందిన మరియా బుఖోనినా సహదర్శకత్వం వహించిన ఈ డాక్యుమెంటరీ, ఈ జంట ఎందుకు ఇలా ఎత్తయిన భవనాలను, కట్టడాలను ఎక్కడం మొదలుపెట్టారు అన్న దగ్గరి నుంచి ప్రారంభమవుతుంది.
‘రూఫ్‌టాపింగ్’ అనేది 1990ల నుంచి ప్రారంభమైంది. 2010లలో మాస్కోలో అనేకమంది దీనిని ప్రాక్టీస్ చేస్తున్నపుడు ఇవాన్ బీర్కస్‌కు కూడా దానిపై ఆసక్తి కలిగింది.
"నేను ఎంత ఎత్తుకు వెళితే, ఊపిరి పీల్చుకోవడం అంత తేలికవుతుంది. ఇది నాకు స్ఫూర్తిని ఇస్తుంది. బతకడానికి ప్రేరణ ఇస్తుంది." అని బీర్కస్ ఈ డాక్యుమెంటరీలో అంటారు.
ఇక ఏంజెలా నికొలాయ్ తండ్రి ఒక సర్కస్ ప్రదర్శకుడు. ఆమె ఆర్ట్ స్కూల్‌కు వెళ్లేవారు.
2010, 2020లలో రూఫ్‌టాపర్‌లు ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్‌లో వీడియోలను పోస్ట్ చేయడం ద్వారా డబ్బు సంపాదించేవారు. అయితే తాము కేవలం ‘లైక్’ల కోసమే ఈ పని చేయడం లేదని ఆమె అన్నారు.
‘నా వరకు రూఫ్‌టాపింగ్ అంటే ఒక ఆర్ట్’ అని ఆమె బీబీసీకి చెప్పారు. ‘‘ఆర్ట్స్‌లో ఏదైనా కొత్తగా చేయాలని ఉంటుంది. మేము సెటప్ చేసిన ప్రతిసారీ, దానినో కళగా భావించి, డెవలప్ చేస్తాం. ఏ రంగులు వాడాలి, ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలి అన్నది నేను నిర్ణయిస్తాను. డ్రోన్‌లు ఎక్కడ ఎగరాలి, ఎలా చిత్రీకరించాలి అన్న దానిని ఇవాన్ నిర్ణయిస్తాడు.’’ అని నికోలాయ్ చెప్పారు.

ఫొటో సోర్స్, Netflix
‘స్కైవాకర్స్: ఎ లవ్ స్టోరీ’లో ఒక హిట్ సినిమాకు కావాల్సిన అంశాలన్నీ ఉన్నాయి. ఇది న్యూయార్క్‌లోని ట్విన్ టవర్స్ మధ్య బిగించిన వైర్‌పై విన్యాసాలు చేస్తూ, ఫిలిప్ పెటిట్ 1974లో చేసిన స్టంట్‌ను, జేమ్స్ మార్ష్ 2008 డాక్యుమెంటరీ ‘మ్యాన్ ఆన్ వైర్’ను మనకు గుర్తు చేస్తుంది.
"మేం పైకి ఎక్కుతుంటే అనేక భావోద్వేగాలను అనుభవిస్తాం. మా చిత్రం ప్రేక్షకులకు అలాంటి భావోద్వేగాలను అందిస్తుందని భావిస్తున్నాం.’’ అని నికొలాయ్ అన్నారు.
స్కైవాకర్స్ దర్శకులు తమ సినిమాలో భావోద్వేగాలు చాలా ముఖ్యమైనవని పేర్కొన్నారు. ఇది ఎత్తుల నుంచి పడిపోతామనే భయానికి సంబంధించిన కథ కాదని, ప్రేమలో పడతామనే భయం గురించి అని వాళ్లు పేర్కొన్నారు. నికొలాయ్ చిన్నపిల్లగా ఉన్నప్పుడే తండ్రి ఆమెను వదిలివెళ్లారు. అందుకే ఆమె తరచూ బీర్కస్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తుంటారు.

ఫొటో సోర్స్, Netflix
'విమర్శలతోనే మరిన్ని వ్యూస్’
ప్రేమలో పడ్డాక ఈ జంట రష్యాను వదిలి పెట్టింది. దీనికి కారణం యుక్రెయిన్‌పై దాడి సమయంలో సోషల్ మీడియాపై రష్యా ఆంక్షలు పెట్టడమే. ఈ ఆంక్షలతో వీరి ఆదాయ మార్గాలు మూసుకుపోయాయి. కోవిడ్ మహమ్మారితో టూరిస్ట్ పరిశ్రమ దెబ్బ తినడంతో వాళ్లకు స్పాన్సర్‌లు కూడా కరువయ్యారు. చివరికి మెర్డెకా 118 ను అధిరోహించిన తర్వాత వాళ్ల కష్టాలు గట్టెక్కాయి.
మెర్డెకాను అధిరోహించడం కోసం థాయ్‌లాండ్‌లో శిక్షణ పొందుతున్నప్పుడు, నికొలాయ్ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తనకు కాళ్లు చేతులు పడిపోయినట్లుగా అనిపించిందని ఆమె అన్నారు.
అయితే మెర్డెకాను అధిరోహించాక వీళ్లిద్దరూ నకిలీ ఫోటోలను ఉపయోగించారని కొందరు ఆరోపించారు. అయితే, ఇవన్నీ పనిలేని వాళ్లు చేసే విమర్శలని నికొలాయ్ కొట్టి పారేశారు.
"నిజానికి ఇలాంటి విమర్శల వల్ల మాకు ఎక్కువ వ్యూస్ వస్తాయి. అది ఆన్‌లైన్‌లో ఎక్కువ మంది వ్యక్తులు చూసేలా చేస్తుంది. ఇప్పుడు మేం చేసేది జిమ్మిక్కని కొందరు మమ్మల్ని విమర్శిస్తుంటే వినడానికి సంతోషంగా ఉంది." అని అన్నారామె.

ఫొటో సోర్స్, Netflix
ఈ డాక్యుమెంటరీలో మెర్డెకా 118లోకి ప్రవేశించడంతోపాటు, ఈ జంట చేసిన అనేక పనులు చాలావరకు చట్టవిరుద్ధమైనవి. డాక్యుమెంటరీలో వాళ్లు దాదాపు 30 గంటలపాటు భవనంలో గడిపినట్లు, నిర్మాణ కార్మికులకు కనిపించకుండా దాక్కున్నట్లు చూపించారు.
కొత్త అవకాశాల కోసం ఈ జంట ఇటీవల న్యూయార్క్‌కు వెళ్లారు. ఇది ఆకాశహర్మ్యాల నగరం. కానీ వాళ్లు వాటిని కూడా అధిరోహించాలనుకున్నారా?
దీనిపై బీర్కస్ మాట్లాడుతూ, ‘‘ఈ చిత్రం అంతర్జాతీయంగా విడుదల అయితే చాలామంది మాతో కలిసి పని చేయడానికి ముందుకొస్తారని అనుకుంటున్నాం." అన్నారు.
ఈ చిత్రంలో వాళ్లు తీవ్రమైన ఒత్తిడితోనే అత్యంత ఎత్తైన భవనాలు, నిర్మాణాలపై విన్యాసాలు చేయడం ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తుంది. అదే సమయంలో అంత ఎత్తున, కింద ఏమీ లేకుండా కొన్ని షాట్‌లను అద్భుతంగా చిత్రీకరించాలన్న బీర్కస్ దృఢ నిశ్చయాన్నీ తెలియజేస్తుంది.
నికొలాయ్‌ను గాల్లోకి ఎత్తే సన్నివేశాన్ని వివరిస్తూ బీర్కస్ ఇలా అన్నారు: "అది ఎప్పుడో ఒకసారిగానీ రాని అవకాశం. నేను ఆమెను వదిలిపెట్టనని నాకు తెలుసు. మేము అక్కడికి వెళ్లిన పనిని పూర్తి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నికొలాయ్‌ను గాల్లోకి ఎత్తినప్పుడు, ఆ నిశ్శబ్దం నాకు గుర్తుంది. నాకప్పుడు ఏమీ వినిపించలేదు. కేవలం నేనూ ఈ విశాల విశ్వంలో ఒక భాగం అనిపించింది.’’ అన్నారు బీర్కస్.
‘స్కైవాకర్స్: ఎ లవ్ స్టోరీ' 19 జూలై 2024 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














