వయనాడ్ విధ్వంసంపై రాజకీయ వివాదం, అమిత్ షా వాదనలను కేరళ సీఎం ఎందుకు తప్పుబట్టారు?

ఫొటో సోర్స్, Arun Chandra Bose
కేరళలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడిన ప్రమాదాల్లో ఇప్పటి వరకూ 150 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య పెరుగుతుండడంతో రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం కూడా ముదురుతోంది.
'ముందస్తు హెచ్చరిక'లు చేసి ఉంటే, రాష్ట్రానికి సకాలంలో సమాచారం అందించి ఉంటే, మరణాలను నివారించే అవకాశం ఉండేదని ప్రతిపక్షాలు అంటున్నాయి.
ఈ విషయంపై బుధవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజ్యసభలో మాట్లాడుతూ.. ''ఎర్లీ వార్నింగ్ (ముందస్తు హెచ్చరిక).. ఎర్లీ వార్నింగ్.. ఎర్లీ వార్నింగ్.. అంటూనే ఉన్నారు. ఇంగ్లిష్‌లోని తీవ్రమైన పదాలన్నింటినీ మీ ప్రసంగాల్లో వాడారు. నేను ఈ సభ సాక్షిగా ఒకటి స్పష్టం చేయాలనుకుంటున్నా. కేరళ ప్రభుత్వానికి జూలై 23న భారత ప్రభుత్వం ముందస్తు హెచ్చరిక చేసింది'' అన్నారు.
అయితే, అదే రోజు సాయంత్రానికి అమిత్ షా వ్యాఖ్యలపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందించారు.

వయనాడ్‌లో విధ్వంసం జరిగిన కొన్ని గంటల తర్వాత కేంద్రం నుంచి సమాచారం అందిందని విజయన్ చెప్పారు.
నిజానికి, ఇంతకంటే మెరుగైన వ్యవస్థ ఉండి ఉంటే ప్రజలు ఈ ప్రమాదం బారినపడకుండా కాపాడగలిగేవాళ్లమని ప్రతిపక్ష పార్టీ ఎంపీలు అంటున్నారు.
దీనిపై హోం మంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రకటన చేశారు. వర్షాలు, వేడిగాలులు, తుఫానులు, పిడుగులు వంటి వాటి గురించి ముందస్తు హెచ్చరికలు చేసే వ్యవస్థ భారత్‌కు ఉందని అమిత్ షా చెప్పారు.
ఈ ముందస్తు హెచ్చరికల వ్యవస్థ కోసం 2014 నుంచి ప్రభుత్వం 2 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని అమిత్ షా చెప్పారు.

ఫొటో సోర్స్, ANI/GETTY
కేరళ ముఖ్యమంత్రి ఏమన్నారు?
జూలై 24, జూలై 25 తేదీల్లో కేరళకు సమాచారం అందించామని, జూలై 26న భారీ వర్షాలతో పాటు కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని చెప్పినట్లు అమిత్ షా తెలిపారు.
అమిత్ షా ప్రకటన తర్వాత, బుధవారం సాయంత్రం కేరళ సీఎం పినరయి విజయన్ విలేఖరులతో మాట్లాడుతూ, వయనాడ్‌లో విధ్వంసం జరిగిన కొద్ది గంటల తర్వాత కేంద్రం నుంచి రెడ్ అలెర్ట్ సమాచారం వచ్చిందన్నారు.
అమిత్ షా చెప్పిన ప్రతి విషయంపై కేరళ సీఎం విజయన్ తిరువనంతపురంలో జరిగిన మీడియా సమావేశంలో స్పందించారని బీబీసీ అసోసియేట్ జర్నలిస్ట్ ఇమ్రాన్ ఖురేషీ రిపోర్ట్ చేశారు.
అమిత్ షా ప్రకటనలో నిజం లేదని విజయన్ అన్నారు.
జూలై 23 నుంచి జూలై 30 మధ్య కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేయలేదని విజయన్ తెలిపారు.
''వయనాడ్‌కు జూలై 29 మధ్యాహ్నం ఒంటిగంటకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. కొండచరియలు విరిగిపడిన తర్వాత, జూలై 30న, ఉదయం 6 గంటలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ రెడ్ అలెర్జ్ జారీ అయింది'' అని కేరళ సీఎం అన్నారు.
విజయన్ చెప్పిన దాని ప్రకారం, వాతావరణ శాఖ చేసిన అలెర్ట్ ప్రకారం వయనాడ్‌లో 115 మిల్లీమీటర్ల నుంచి 204 మిల్లీమీటర్ల మధ్య వర్షం కురిసే అవకాశం ఉంది, కానీ వయనాడ్‌లో 48 గంటల్లో 572 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది ప్రాథమిక అంచనాల కంటే చాలా ఎక్కువ.

ఫొటో సోర్స్, Getty Images
రాజ్యసభలో అమిత్ షా ప్రకటన చేస్తున్న సమయంలో విపక్ష ఎంపీలు మాట్లాడేందుకు ప్రయత్నించారు. అప్పుడు అమిత్ షా ప్రతిపక్ష సభ్యులను ఉద్దేశిస్తూ ముందు పూర్తిగా చదవండి అన్నారు.
ఇలాంటి ముందస్తు సమాచారాన్ని ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి 7 రోజుల ముందే పంపుతామని, మా (వాతావరణ శాఖ) వెబ్‌సైట్‌లో అది అందరికీ అందుబాటులో ఉంటుందన్నారు అమిత్ షా. అయితే, కొంతమంది ఇక్కడి వెబ్‌సైట్ చూడరని, కేవలం విదేశీ వెబ్‌సైట్‌లే చూస్తారని అమిత్ షా అన్నారు.
వయనాడ్ విధ్వంసంపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ రాజ్యసభలో మాట్లాడుతూ, ఆర్మీ, నేవీ హెలికాప్టర్లు, సెర్చ్ డాగ్స్ సాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వానికి రూ.145 కోట్లు పంపామని, రాత్రీపగలూ తేడా లేకుండా వయనాడ్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని నిత్యానంద రాయ్ తెలిపారు.
అయితే, కేంద్రం పంపించామని చెబుతున్న సాయంపై కేరళకు చెందిన సీపీఐ(ఎం) మాజీ రాజ్యసభ ఎంపీ జాన్ బిట్రాస్ ఆరోపణలు చేశారు.
2018లో కేరళలో వరదలు వచ్చినప్పుడు కూడా కేంద్రం సాయం పంపిందని, ఆ తర్వాత తిరిగి చెల్లించాలంటూ కేరళ ప్రభుత్వాన్ని డబ్బులు డిమాండ్ చేసిందని ఆయన ఆరోపించారు.

ఫొటో సోర్స్, YEARS
రాహుల్ గాంధీపై తేజస్వి సూర్య విమర్శలు
వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ప్రమాద ఘటనపై వయనాడ్ మాజీ ఎంపీ రాహుల్ గాంధీ కూడా పార్లమెంట్‌లో మాట్లాడారు.
''వయనాడ్‌లో భారీ ప్రమాదం జరిగింది. అక్కడ భారత సైన్యం బాగా పనిచేస్తోంది. ఇలాంటి కష్టకాలంలో వయనాడ్ ప్రజలకు సాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా'' అని రాహుల్ గాంధీ అన్నారు.
ఐదేళ్ల కిందట కూడా వయనాడ్‌లో ఇలాంటి ఘటన జరిగిందని, ఈ ప్రాంతంలో సహజసిద్ధంగానే సమస్య ఉందని అర్థమవుతోందని రాహుల్ అన్నారు.
దీనిపై రాహుల్ గాంధీని ఇరుకునపెట్టేందుకు బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ప్రయత్నించారు.
వయనాడ్ ఎంపీగా ఉన్న 1800 రోజుల్లో కొండచరియలు విరిగిపడడం, వరదల గురించి ఒక్కసారి కూడా అసెంబ్లీలో కానీ, పార్లమెంట్‌లో కానీ రాహుల్ గాంధీ ప్రస్తావించలేదన్నారు.
వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతాల నుంచి 4000 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని 2020లో కేరళ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ)సూచించిందని సూర్య చెప్పారు. కానీ, ఇప్పటివరకూ ఆ దిశగా ఎలాంటి చర్యలూ తీసుకోలేదని ఆయన అన్నారు.
సోమవారం, మంగళవారం రాత్రి ఒంటిగంట నుంచి తెల్లవారుజామున 4 గంటల మధ్య మూడు కొండచరియలు విరిగిపడడంతో వయనాడ్‌లోని చూర్లమలై, ముండక్కె వంటి ప్రాంతాల్లో భారీ విధ్వంసం జరిగింది.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














