భారత్‌కు ఒలింపిక్ పతకం తీసుకురాగల అయిదుగురు అమ్మాయిలు వీళ్లే...

ఫొటో సోర్స్, ANI
- రచయిత, మనోజ్ చతుర్వేది
- హోదా, సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్, బీబీసీ కోసం
పారిస్ ఒలింపిక్స్‌లో పతకాలు సాధించే సత్తావున్న బలమైన పోటీదారుల్లో భారత జట్టు నుంచి అయిదుగురు క్రీడాకారిణులు ఉన్నారు.
నిజంగా చెప్పాలంటే, ఈసారి భారత్ పతకాల సాధనలో మహిళా శక్తి కీలకం కానుంది.
వారిలో వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను, గత రెండు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన పీవీ సింధు, బాక్సర్ నిఖత్ జరీన్, రెజ్లర్ అంతిమ్ పంఘాల్, షూటర్ సిఫత్ కౌర్ సామ్రా ఉన్నారు.


ఫొటో సోర్స్, Getty Images
మీరాబాయి చాను
ఈసారి ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న వెయిట్‌లిఫ్టర్లలో మీరాబాయి చాను కంటే మెరుగైన ప్రదర్శన చేసిన వెయిట్‌లిఫ్టర్ కేవలం ఒక్కరే ఉన్నారు. అందుకే, వరుసగా రెండోసారి ఒలింపిక్ పతకాన్ని కైవసం చేసుకునేందుకు ఆమె పోటీ పడుతోంది.
టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన మీరాబాయి, గాయం కారణంగా హంగ్జౌలో పతకం సాధించలేకపోయింది.
ఏషియన్ గేమ్స్ తర్వాత, దిల్లీ ఎయిర్‌పోర్టుకి వీల్‌చైర్‌లో వచ్చినప్పుడు ఆమెకు స్వాగతం పలికేందుకు అక్కడ ఎవరూ లేరు. పారిస్ ఒలింపిక్స్ నుంచి తిరిగి వచ్చేప్పుడు, తన మెడలో పతకం ఉండి తీరాలని అప్పుడే ఆమె నిర్ణయించుకుంది.
భారత్‌లో ఎక్కువ విజయాలు నమోదు చేసిన మహిళా వెయిట్‌లిఫ్టర్ కూడా మీరాబాయి చానూయే. ఒలింపిక్స్‌లో రజత పతకంతో పాటు వరల్డ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం, రజతం, కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించిందామె
తన గ్రూపులోని 12 మంది వెయిట్‌లిఫ్టర్లలో 200 కిలోల మార్కును అధిగమించింది మీరాబాయి ఒక్కరే.
స్నాచ్‌లో 90 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 115 కిలోలతో మొత్తం 205 కిలోలు లిఫ్ట్ చేస్తోంది మీరాబాయి. ఈ పెర్ఫార్మెన్స్‌తో పతకం ఖాయమనే చెప్పొచ్చు. స్నాచ్ ప్రదర్శనలో మరో 5 కేజీల మేర వెయిట్ పెంచుకోగలిగితే స్వర్ణ పతకం కూడా సాధించే అవకాశం ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
పీవీ సింధు
ఒలింపిక్స్‌లో భారత్‌కు రజతం, కాంస్య పతకాలు సాధించిపెట్టిన ఏకైక క్రీడాకారిణి పీవీ సింధు. ప్రతిష్టాత్మక టోర్నమెంట్లలో అత్యుత్తమంగా రాణించే క్రీడాకారిణిగా ఆమె గుర్తింపు తెచ్చుకుంది.
పీవీ సింధు ప్రస్తుతం తన బెస్ట్ ఫామ్‌లో లేదనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. కొద్దికాలంగా గాయాల బారినపడడమే అందుకు కారణం. అయితే, బీడబ్ల్యూఎఫ్ సర్క్యూట్‌లో మంచి ఫామ్‌లో ఉన్న సింధుకి ఒలింపిక్స్‌లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేయడం పెద్ద విషయం కాకపోవచ్చు.
2024లో సింధు విజయాల సగటు 62.5 శాతం. 2016లో జరిగిన రియో ఒలింపిక్స్‌లో, 21 ఏళ్ల వయసులో రజత పతకం సాధించిన మొదటి షట్లర్‌గా నిలిచింది పీవీ సింధు. ఆ ఏడాది కూడా ఆమె విజయాల సగటు 63 శాతం. అలాగే, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో ఆమె కాంస్య పతకం సాధించినప్పుడు, సగటు 62.1 శాతం.
సింధు వ్యూహాలకు పదునుపెడుతున్నట్లు ఆమెకు మెంటార్‌గా వ్యవహరిస్తున్న ప్రముఖ షట్లర్ ప్రకాశ్ పదుకొణె చెప్పారు.
ఏ సమయంలో, ఎలాంటి షాట్ ఆడాలనే దానిపైనే విజయం ఆధారపడి ఉంటుందని, ఎప్పుడు స్మాష్ ఆడాలి, ఎప్పుడు వాలీ చేయాలి, ఎప్పుడు డ్రాప్‌షాట్ ఆడాలి వంటి వాటిపై శిక్షణ ఇస్తున్నట్లు ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, FB/Antim Panghal
అంతిమ్ పంఘాల్
53 కేజీల విభాగంలో అయిదు చాంపియన్‌షిప్‌లలో మాత్రమే ఆడి, అన్నింటిలోనూ పతకాలు సాధించింది ఈ మహిళా రెజ్లర్. ఏషియన్ చాంపియన్‌షిప్‌లో రజతం, వరల్డ్ చాంపియన్‌షిప్, ఏషియన్ గేమ్స్‌లో కాంస్య పతకాలు కైవసం చేసుకుంది.
ఈ కేటగిరీ నుంచి వినేశ్ ఫోగట్ వంటి రెజ్లర్ తప్పుకోవాల్సి రావడంతో పాంఘల్ ఈ కేటగిరీలో ఆధిపత్యం కొనసాగిస్తున్నారు.
పారిస్‌లో స్వర్ణ పతకం గెలవాలంటే ఆమె జపాన్ రెజ్లర్ అకారి ఫుజీనామీని ఓడించాలి. అకారి 130కి పైగా బౌట్లలో అజేయంగా నిలిచింది.
అంతిమ్‌ను రెజ్లర్‌ను చేసేందుకు ఆమె తండ్రి రామ్‌నివాస్ తన భూమితో పాటు ట్రాక్టర్‌ను, కార్‌ను అమ్మేశారు. ఆమె కూడా తన తండ్రి త్యాగాన్ని వృథా పోనివ్వలేదు. అంతిమ్ డిఫెన్స్‌లో దిట్ట. తన ప్రత్యర్థికి పాయింట్లు ఇవ్వకుండా నిలువరిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
నిఖత్ జరీన్
నిఖత్ జరీన్‌కి ఇవి తొలి ఒలింపిక్స్. ట్రయల్స్‌లో మేరీ కోమ్‌పై ఓడిపోవడతో మూడేళ్ల కిందట జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనలేకపోయింది. గత మూడేళ్లలో దేశంలోనే నంబర్ వన్ బాక్సర్‌గా ఎదిగింది.
నిఖత్ ఇప్పటి వరకూ వరల్డ్ చాంపియన్‌షిప్‌లలో రెండు స్వర్ణ పతకాలు, కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణంతో పాటు ఏషియన్ గేమ్స్‌లో కాంస్య పతకం సాధించింది. ఒలింపిక్స్ లోటును కూడా ఆమె భర్తీ చేసే అవకాశం ఉంది.
2022 నుంచి నిఖత్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేస్తోంది. అప్పటి నుంచి, ఫ్లైవెయిట్ విభాగంలో కేవలం రెండు మ్యాచుల్లో మాత్రమే ఆమె ఓడిపోయింది. తన కల నెరవేర్చుకోవడానికి పారిస్‌కు వచ్చినట్లు నిఖత్ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది.
అమ్మాయిలను బాక్సింగ్ చేయించడానికి ఒప్పుకోని వాతావరణంలో పెరిగిన నిఖత్, తన తండ్రి ప్రోత్సాహంతో ఆటలో అత్యుత్తమంగా రాణిస్తోంది. విమర్శలను పట్టించుకోకుండా తన కుమార్తెను బాక్సర్‌గా చూసేందుకు ఆమె తండ్రి మహ్మద్ జమీల్ చేసిన ప్రయత్నం అభినందనీయం. ఆ ప్రయత్నమే ఇప్పుడు ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాలు సాధించిన బాక్సర్ల జాబితాలో చోటుదక్కించుకునేందుకు కారణమవుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
సిఫత్ కౌర్
గత టోక్యో ఒలింపిక్స్‌లో భారత షూటర్లు రాణించలేకపోయారు. అయితే, అది సిఫత్ కౌర్‌పై ప్రభావం చూపే అవకాశం లేదు. ఎందుకంటే ఆ జట్టులో ఆమె లేదు. గత ఏషియన్ గేమ్స్‌లో స్వర్ణ, రజత పతకాలు సాధించి సిఫత్ ముందుకు దూసుకొచ్చింది.
గత ఏడాది 50 మీటర్ల త్రీ పొజిషన్ రైఫిల్ ఈవెంట్‌లో 469.6 పాయింట్లతో బ్రిటన్‌కు చెందిన సియోనెడ్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టి సిఫత్ కౌర్ కొత్త రికార్డు సృష్టించింది. నీలింగ్‌లో 154.6, ప్రోన్‌లో 157.9, స్టాండింగ్ ఈవెంట్‌లో 157.1 పాయింట్లు సాధించింది.
సిఫత్ కౌర్ యాదృచ్చికంగా షూటింగ్‌లోకి వచ్చిందని అంటుంటారు. తన కజిన్ షీఖోన్ కూడా షూటర్. తొమ్మిదేళ్ల వయసు నుంచే తన కజిన్‌తో కలిసి షూటింగ్ రేంజ్‌కు వెళ్తుండేది. అలా క్రమంగా ఆమె షూటింగ్‌పై ఇష్టం పెంచుకుంది.
ఒకవైపు షూటింగ్ చేస్తూనే, డాక్టర్ కావాలనుకుంది సిఫత్. నీట్ పరీక్షలో పాసై ఫరీద్ కోట్‌లోని జీజీఎస్ మెడికల్ కాలేజీలో అడ్మిషన్ కూడా పొందింది. కానీ, షూటింగ్‌పై మరింత శ్రద్ధ పెట్టేందుకు వైద్య విద్యను వదిలేసి ఆటపైనే పూర్తిగా దృష్టి కేంద్రీకరించింది.
మెరుగ్గా రాణించాలంటే ఒత్తిడికి దూరంగా ఉండాలని సిఫత్ అంటోంది. "నేనెప్పుడూ ఒత్తిడిని దరిచేరనీయను. అందుకే మెరుగైన ఫలితాలు సాధించగలుగుతున్నా.'' అన్నదామె.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














