శవంపై ఉన్న పచ్చబొట్టు సాయంతో హత్య మిస్టరీని ఎలా ఛేదించారంటే..

- రచయిత, భాగ్యశ్రీ రౌత్
- హోదా, బీబీసీ కోసం
ముంబయిలోని వర్లీ ప్రాంతంలో ఉన్న 'సాఫ్ట్ టచ్ స్పా' సెంటర్‌లో జులై 23- 24 మధ్య రాత్రి ఒక వ్యక్తి హత్య జరిగింది. మృతుడి శరీరంపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా నిందితుడిని పోలీసులు గుర్తించారు.
ఇప్పటి వరకు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. మరి, పోలీసులు నేరుగా నిందితుడిని గుర్తించగలిగేలా ఈ టాటూలో ఏముంది?
మృతుడి పేరు గురుసిదప్ప వాగ్మారె. నిందితుల పేర్లు ఫిరోజ్ అన్సారీ, షకీబ్ అన్సారీ.
ఈ హత్య చేయడానికి స్పా సెంటర్ యజమాని సంతోష్ షేర్కర్ సుపారీ ఇచ్చారని పోలీసులు గుర్తించారు.
గురుసిదప్ప వాగ్మారె జులై 23న తన ప్రియురాలి పుట్టినరోజు సందర్భంగా సాయన్‌లోని ఒక బార్‌కు వెళ్లారు. అక్కడ ఆయనతో పాటు స్పా సెంటర్‌కు చెందిన ఇద్దరు ఉద్యోగులు కూడా ఉన్నారు.
పార్టీ ముగిశాక అందరూ కలిసి రాత్రి 12:30 గంటలకు స్పా సెంటర్‌కు చేరుకున్నారు. ఇదే సమయంలో నిందితులు ఫిరోజ్, షకీబ్ అన్సారీలు ఇద్దరూ గురుసిదప్పను వెంబడించారు.
గురుసిదప్పతో పాటు వచ్చిన ఇద్దరు స్పా సెంటర్ ఉద్యోగులు వెళ్లిపోయిన తర్వాత, నిందితులిద్దరూ ఆయనను హత్య చేశారు. ఈ ఘటన అర్ధరాత్రి జరిగింది.
జులై 24న ఉదయం పోలీసులకు ఈ ఘటనపై సమాచారం అందింది. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు శవాన్ని పరిశీలించారు.


పచ్చబొట్టులో ఏముంది?
బహుశా తనకు ఏదైనా చెడు జరగవచ్చనే ఆలోచనతో గురుసిదప్ప ముందే తన శరీరంపై టాటూలు వేయించుకున్నారు.
పోస్ట్‌మార్టం చేస్తుండగా ఆయన రెండు తొడలపై పచ్చబొట్లు కనిపించాయి. ‘‘నా శత్రువుల పేర్లు డైరీలో రాశాను. వాటిపై దర్యాప్తు జరిపి విచారించండి’’ అనే వాక్యాలను ఆయన పచ్చబొట్లుగా వేసుకున్నారు.
అంతేకాకుండా, ఒక తొడ మీద 10 మంది పేర్లు, మరో తొడ మీద 12 మంది పేర్లను టాటూ వేసుకున్నారు. ఆ జాబితాలో గురుసిదప్ప హత్య జరిగిన స్పా సెంటర్ యజమాని సంతోష్ షేర్కర్ పేరు కూడా ఉంది.
ఈ క్లూ ఆధారంగా పోలీసులు దర్యాప్తు జరిపారు.
గురుసిదప్ప ఇంట్లో పోలీసులు సోదాలు చేయగా ఆకుపచ్చ, నీలం, ఎరుపు రంగుల్లో చాలా సమాచారం రాసి ఉన్న కొన్ని డైరీలు దొరికాయి.
వాటిలో చాలా వివరాలు ఉన్నాయి. దీంతో నిందితులను పట్టుకోవడం పోలీసులకు సులువైంది.

నిందితుడిని ఎలా అరెస్ట్ చేశారు?
గురుసిదప్ప శరీరంపై ఉన్న టాటూలో స్పా సెంటర్ యజమాని సంతోష్ షేర్కర్ పేరు కూడా ఉంది. ఈ టాటూ ఆధారంగా ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా అందులో ఫిరోజ్, షకీబ్ కనిపించారు.
హత్య తర్వాత వారిద్దరూ ద్విచక్ర వాహనంపై కాందివలీ వైపు వెళ్లారు.
ఫిరోజ్, నాలాసోపరాలోని తన ఇంటికి వెళ్లగా, షకీబ్ దిల్లీ రైలు ఎక్కారు. గురుసిదప్పను వెంబడించే సమయంలో వారిద్దరూ సాయన్‌లో పొగాకు కొనుగోలు చేసి ఆన్‌లైన్‌లో చెల్లింపు చేశారు. దీని ద్వారా నిందితుల నంబర్‌ను పోలీసులు కనిపెట్టారు.
నిందితులిద్దరి కోసం పోలీసులు గాలించగా, షకీబ్ రైలులో ఉన్నట్లు తెలిసింది. రాజస్థాన్‌లోని కోటాలో షకీబ్‌ను అరెస్టు చేశారు. ఫిరోజ్ అన్సారీని నాలాసోపారాలో అరెస్టు చేశారు.

గురుసిదప్పను ఎందుకు చంపారు?
ముంబయితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని స్పా సెంటర్ యజమానుల నుంచి గురుసిదప్ప డబ్బులు డిమాండ్ చేసేవారనే ఆరోపణలు ఉన్నాయి.
వర్లీలోని ‘సాఫ్ట్ టచ్ స్పా సెంటర్’ యజమాని సంతోష్ షేర్కర్ నుంచి కూడా గురుసిదప్ప డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయని పోలీసులు చెప్పారు.
‘‘గురుసిదప్ప తరచుగా డబ్బులివ్వమంటూ షేర్కర్‌ను ఒత్తిడి చేసేవారు. ఈ కారణంగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. గురుసిదప్ప వైఖరితో సంతోష్ షేర్కర్ విసిగిపోయారు. ఈ గొడవ కారణంగానే గురుసిదప్ప వాగ్మారె చంపేందుకు ఫిరోజ్ అన్సారీ, షకీబ్ అన్సారీలకు సుపారీ ఇచ్చారు సంతోష్ షేర్కర్’’ అని పోలీసులు తెలిపారు.
ఈ కేసులో సంతోష్ షేర్కర్, ఫిరోజ్, షకీబ్‌లను అరెస్ట్ చేసినట్లు బీబీసీతో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ దత్తా నలవాడే చెప్పారు.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














