హమాస్‌లో ఇస్మాయిల్ హనియె స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు?

- రచయిత, రష్దీ అబుఅలౌఫ్, కస్రానజీ
- హోదా, బీబీసీ ప్రతినిధులు
హమాస్ నాయకత్వంలో వారసుడి ఎంపిక ప్రక్రియ కొంత సమస్యాత్మకంగా ఉండవచ్చు. అది కూడా త్వరగా జరక్కపోవచ్చు. హమాస్‌ను నడిపించేందుకు ఇరాన్ సానుకూల అతివాదులకు మార్గం కల్పించవచ్చు.
హనియె తర్వాత ఎవరనే ప్రశ్నకు యెహియా సిన్వార్ సమాధానంగా కనిపిస్తున్నారు. గాజాస్ట్రిప్‌లో ప్రస్తుతం హమాస్‌కు ఆయన నాయకత్వం వహిస్తున్నారు. గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్ మీద హమాస్ ఫైటర్ల దాడుల వెనుక మాస్టర్ మైండ్ అతనే అని అంటారు.
హనియె స్థానంలోకి వచ్చేందుకు మరో ఇద్దరు హమాస్ సీనియర్ అధికారులు పోటీలో ఉన్నారు.
మితవాదిగా గుర్తింపు పొందిన ఖాలేద్ మెషాల్, సంస్థను నడిపించేందుకు పోటీ పడుతున్నారు. హనియెకు ముందు చాలాకాలం ఆయనే నడిపించారు. అయితే ఆయనకు ఇరాన్‌తో అంత మంచి సంబంధాలు లేవు.
మరో సమర్థుడైన నాయకుడిగా జహెర్ జబరీన్. ప్రస్తుతం పాలస్తీనా ఖైదీలు ఇజ్రాయెల్ జైళ్లలో ఉండటానికి ఈయనే కారణం. ఇజ్రాయెల్ బందీలతో పాలస్తీనీయన్ ఖైదీల మార్పిడికి జరుగుతున్న చర్చల్లో జబరీన్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఈ ముగ్గురు కూడా హనియెకు డిప్యూటీలుగా పని చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇరాన్ ఎలా స్పందిస్తుంది?
హనియె మరణం తర్వాత హమాస్ నాయకత్వంతో పాటు ఇరాన్ ఇప్పుడు ఎలా స్పందిస్తుందనేది ఆలోచించాల్సి అంశం.
ఏప్రిల్‌లో సిరియా రాజధాని డమాస్కస్‌లోని ఇరాన్ కాన్సులేట్ కార్యాలయం మీద జరిగిన వైమానిక దాడిలో ఇద్దరు కుడ్స్ దళం కమాండర్లతో పాటు ఆరుగురు రివల్యూషనరీ గార్డ్స్ చనిపోయారు. ఈ దాడి ఇజ్రాయెల్ చేసిందని ఆరోపిస్తూ ఇరాన్ ఇజ్రాయెల్ భూభాగం మీదకు 300 మిస్సైళ్లు, డ్రోన్లను ప్రయోగించింది.
ఇప్పుడు కూడా ఇరాన్ ఇలాగే స్పందించే అవకాశాలు ఉన్నాయి.
తాను దాడి చేయడంతో పాటు తన సహచర మిలీషియాలను కూడా ఇజ్రాయెల్ మీద దాడి చెయ్యాలని ఇరాన్ అడగవచ్చు. ఇజ్రాయెల్ మీద దాడులు చెయ్యడానికి హిజ్బొల్లా సిద్ధంగా ఉంది.
గోలన్ హైట్స్ మీద హిజ్బుల్లా రాకెట్ దాడి తర్వాత ఇజ్రాయెల్ - లెబనాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఊహించని రీతిలో పెరిగాయి.
ఈ ప్రాంతంలో మరో పెద్ద యుద్ధం ప్రారంభం కానుందా? అంటే ఇప్పటికిప్పుడు సమాధానం చెప్పడం కష్టం. ఇప్పుడున్న పరిస్థితుల్లో యుద్ధం చెయ్యాలని ఎవరూ కోరుకోరు. కానీ యుద్ధం చేసే వాళ్లు ఎప్పుడూ ప్రమాదాల్ని లెక్కలు వేసుకుని రంగంలోకి దిగరు అనేది చరిత్ర చెబుతున్న వాస్తం.

పాలస్తీనీయుల ఆందోళనలు
హనియె మరణం తర్వాత రమల్లాలో పాలస్తీనీయులు వీధుల్లోకి వచ్చి ఆగ్రహం వ్యక్తం చేశారు. దుకాణాలను మూసివేశారు. పాలస్తీనియన్ అథారిటీ నాయకత్వంలో ఉన్న రమల్లా హమాస్‌కు బాగా పట్టున్న నగరం. ఆందోళనలో కొద్దిమంది మాత్రమే పాల్గొన్నారు.
కొద్దిమందే అయినప్పటికీ వారిలో ఉన్న ఆగ్రహం, ఆవేశం చాలా అధికంగా కనిపించింది. ఆందోళనల్లో పాల్గొన్న వారంతా పాలస్తీనా జెండాలను పక్కన పెట్టి హమాస్ జెండాలను పట్టుకున్నారు. తండ్రుల భుజాల మీద కూర్చున్న పిల్లలు బొమ్మ తుపాకులను పట్టుకుని ప్రదర్శనలో పాల్గొన్నారు.
యుద్ధం గాజా నుంచి వెస్ట్‌బ్యాంక్‌కు కూడా విస్తరించవచ్చని పాలస్తీనీయులు ఆందోళన చెందుతున్నారు. ఇజ్రాయెల్‌లో నెతన్యాహు ప్రభుత్వం కోరుకుంటున్నది ఇదేనని వారికి తెలుసు.
"ఇజ్రాయెల్ ప్రభుత్వం తన జీవితంలో అతి పెద్ద తప్పు చేసింది" అని మాజీ అధ్యక్ష అభ్యర్థి ముస్తపా బర్గౌటీ బీబీసీతో చెప్పారు. ఆయన కూడా ఆందోళకారులతో కలిసి నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు.
"ఇది రాజకీయ, నేరపూరిత చర్య, ఈ హత్యను పాలస్తీనీయులు ప్రతిఘటిస్తారు. ఇది చాలా తప్పు" అని ఆయన అన్నారు.
హనియె హత్య గురించి హమాస్ సీనియర్ అధికారులను బీబీసీ ప్రతినిధి రష్దీ అబుఅలౌఫ్ ప్రశ్నించినప్పుడు తామంతా షాక్‌లో ఉన్నామనిచెప్పారు.
వాళ్లంతా రకరకాలుగా స్పందించారు. కొంతమంది అయోమయంలో ఉన్నామని అన్నారు. ఇరాన్ రాజధాని తెహ్రాన్‌లో ఇలా జరగడం ఏంటని ఒకరు ప్రశ్నించారు.
హనియె తెహ్రాన్ వెళ్లడం ఇదేమీ తొలిసారి కాదు. గతంలో ఆయన అనేక సార్లు ఈ నగరానికి వెళ్లారు. అక్కడకు వెళ్లడాన్ని ప్రమాదంగా ఆయన ఏనాడూ భావించలేదని హమాస్ సీనియర్ అధికారి ఒకరు బీబీసీతో చెప్పారు.
ఇస్మాయిల్ హనియె మృతికి తెహ్రాన్‌లో సంతాప సభ నిర్వహించనున్నట్లు హమాస్ ప్రకటించింది. ఆ తర్వాత ఆయన మృత దేహాన్ని ఖతార్ రాజధాని దోహాకు తరలిస్తారు. ఆగష్టు 2న ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. లుసైల్‌లో ఆయన మృతదేహాన్ని ఖననం చేస్తారు.

ఫొటో సోర్స్, Reuters
కాల్పుల విరమణ చర్చల పరిస్థితి ఏంటి?
ఇజ్రాయెల్ గాజా యుద్దంలో అత్యంత కీలకమైన కాల్పుల విరమణ ఒప్పందం, బందీల విడుదలపై జరుగుతున్న చర్చల మీద హనియె హత్య ప్రభావం విస్తృతంగా ఉంటుంది.
గతేడాది డిసెంబర్‌లో లెబనాన్ రాజధాని బేరూత్‌లో హనియె డిప్యూటీని ఇజ్రాయెల్ చంపినందుకు నిరసనగా హమాస్ చర్చల ప్రక్రియను బహిష్కరించింది.
తెహ్రాన్‌లో జరిగిన తాజా హత్యతో ఇజ్రాయెల్- గాజా యుద్ధంలో శాంతి ఏర్పడే పరిస్థితులు దాదాపుగా క్షీణించాయి. హమాస్ కొత్త నాయకుడుని ఎన్నుకోవడం, అతను చర్చల్లో పాల్గొనడం లాంటివన్నీ ఇప్పటికిప్పుడు సాధ్యం కాకపోవచ్చు.
చర్చల ప్రక్రియలో భాగస్వామిని చంపితే అది ముందుకెలా వెళుతుందని కాల్పుల విరమణ చర్చలకు నాయకత్వం వహిస్తున్న ఖతార్ ప్రశ్నించింది. ఇస్మాయిల్ హనియె చర్చల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని, ఆయన హత్య వల్ల చర్చల ప్రక్రియ అర్థంతరంగా ఆగిపోవచ్చని ఖతార్ తెలిపింది.
అయితే చర్చల ప్రక్రియను కొనసాగిస్తామని అమెరికా విదేశాంగమంత్రి ఆంటోనీ బ్లింకెన్ చెప్పారు.
దీనిపై బ్లింకెన్‌తో పాటు ఖతార్ ప్రధానమంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రహమాన్ అల్ తహ్ని ఈ అంశం గురించి మాట్లాడారు.
కాల్పుల విరమణ చర్చలకు తాము కట్టుబడి ఉన్నామని, అయితే అంతకు ముందు బందీలను విడుదల చేయాలని ఇజ్రాయెల్ ప్రభుత్వ ప్రతినిధి చెప్పారు.
హనియె హత్య ఇరాన్‌లో భద్రతా ప్రమాణాలకు సవాలు విసురుతోంది. ఉత్తర తెహ్రాన్‌లోని ఓ గెస్ట్ హౌస్ దగ్గర హనియె, ఆయన బాడీగార్డుని స్థానిక కాలమానం ప్రకారం రెండు గంటల సమయంలో మిసైల్ ప్రయోగించి చంపేశారని ఇరాన్ తెలిపింది.
ఈ దాడి ఇరాన్ భద్రతా వ్యవస్థల సామర్థ్యంపై ప్రశ్నలను లేవనెత్తింది.
ఇజ్రాయెల్ గత పదేళ్లలో అనేకమంది ఇరాన్ అణు శాస్త్రవేత్తలను హతమార్చినప్పటికీ రాజకీయ నాయకులను ఎప్పుడూ లక్ష్యంగా చేసుకోలేదు.
ఇరాన్‌లో ఇజ్రాయెల్ ఎంత దూరమైనా చొచ్చుకురాగలదని అధికారులు తమ జీవితాల గురించి నిరంతరం భయపడుతూ ఉంటారని మూడేళ్ల క్రితం ఇరాన్ నిఘా మంత్రి అలి యునెస్సీ చెప్పారు.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














